కమ్యూనిస్టుల నుం‘చైనా’ కదనమేదీ?

1
42

చైనా దుశ్చర్యపై కామ్రేడ్ల చిటపటలేవీ?
అమరుల త్యాగాలు ‘చైనా బంధం’ ముందు చిన్నవేనా?
వామపక్ష మేధావుల మెదళ్లు మొద్దుబారాయా?
కోమట్లపై కంచ ఐలయ్య ఇప్పుడేమంటారో?
కల్నల్ భౌతికకాయం వద్దకు కేసీఆర్ వెళ్లలేదేం?
హరికృష్ణ, రామానాయుడు కంటే సంతోష్ త్యాగం తక్కువనా?
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ప్రశ్నాస్త్రాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశ సరిహద్దులో భారత జవాన్ల కుత్తుకలు తెగనరికి.. లోయలోకి అమానుషంగా తోసి, సైనికులపై మేకులు అమర్చిన ఇనుకరాడ్లతో రాక్షసచర్యలకు దిగిన చైనా దాష్టీకాన్ని.. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రతి ఒక్క గొంతు నిరసించింది. బదులుకు బదులు తీర్చుకోవాలని గళమెత్తింది. మజ్లిస్ నేత అసదుద్దీన్ సహా, బీజేపీని వ్యతిరేకించే అన్ని రాజకీయపార్టీలూ, చైనా మూకల కిరాతకాన్ని ఒక్క గొంతుకతో ఖండించాయి. చైనా హంతకుల చేతిలో నిహతులైన భారత జవాన్లకు దేశం నీరాజనాలర్పించింది. వీర విక్రమ ధీర దిగ్గజ దేశభక్త వామపక్ష పార్టీలు  తప్ప! ఒక ఏచూరి, ఇంకో కరత్, మరో నారాయణ వంటి కమ్యూనిస్టు విప్లవ నేతలు తప్ప!!

రోడ్డెక్కిన  ప్రతీకారేచ్ఛ..

సరిహద్దులో చైనా సైనికుల దాదాగిరిని అడ్డుకునే క్రమంలో, భారత సైనికులు 20 మంది అశువులు బాసిన వైనం దేశాన్ని దిగ్భ్రమ పరిచింది. ఈ చర్యను సీరియస్‌గా తీసుకున్న కేంద్రం చైనా ఉత్పత్తులపై నిషేధం దిశగా అడుగులేస్తోంది. ఇప్పటికే ఆ దేశంతో కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోగా, చైనీస్ రెస్టారెంట్లు, చైనాబజార్‌లో దొరికే  వస్తువులను నిషేధించే పనిలో ఉన్నాయి. చివరకు హైదరాబాద్ బేగంబజార్ వ్యాపార సంఘాలయితే, చైనా వస్తువులేవీ కొనకూడదని తీర్మానించాయి. కరోనా సమయంలో కూడా, వివిధ సంస్థలు చైనాకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించాయి. ప్రతి ఒక్కరి రక్తం ఉడికి, చైనాపై ప్రతీకారేచ్ఛతో రగిలింది.

‘ఎర్ర’రక్తం.. చైనా కణాలతో కలసిందా..?

కానీ..దేశంలో ఏ చిన్న సంఘటన జరిగినా గొంతుపగిలేలా.. రక్తనాళాలు చిట్లి, రక్తం ఉప్పొంగేలా మాట్లాడే పేరు గొప్ప కమ్యూనిస్టు పార్టీల నుంచి మాత్రం, చిన్నపాటి నిరసన స్వరం కూడా వినిపించకపోవడం విస్మయం,  సోషల్ మీడియాలో వారిపై విమర్శలకు కారణమయింది. దేశంలోని యూనివర్శిటీల్లో జరిగే కార్యకలాపాలు, ఢిల్లీ నిరసన ప్రదర్శనలకు కొమ్ము కాసి, బంగ్లాదేశీయులకు పశ్చిమ బెంగాల్‌లో బార్లా గేట్లు తెరిచే కామ్రేడ్లు.. సరిహద్దులో చైనా చేతిలో 20 మంది భారత జవాన్లు తలలువాలిస్తే, కనీసం ఖండించని వైనం విభ్రమగొలిపింది. బహుశా.. చైనాపై భక్తితో, అనురక్తితో దశాబ్దాల నుంచి ‘ఎర్రరక్తం’లో పెనవేసుకున్న వారి అనుబంధం-ఆప్యాయత ముందు.. 20 మంది భారత జవాన్ల త్యాగం తక్కువేమో?! కామ్రేడ్ల  భావజాలానికి కలాలు-గళాలతో పహారా కాసి, వామపక్ష వెలుగును..  కొవ్వుత్తులు, నూనె పోసి వెలిగించేందుకు సర్వవేళలా శ్రమదానం చేసే వామపక్ష మేధావులు గానీ.. అడ్డగోలు వాదనలతో టీవీ చర్చలలో కూర్చుని, వాంతులు చేసుకునే వారి ప్రతినిధుల స్వరం నుంచి గానీ.. వీరికి జతగాళ్లయిన మానవహక్కుల మేధావుల నుంచి గానీ..  ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలకపోవడం జాతి జనులను ఖిన్నులను చేసింది. నేతిబీరకాయలో నెయ్యి ఉంటుందనేది ఎంత నిజమో.. కమ్యూనిజంలో కూడా,  ‘నిజం’ అంతే ఉంటుందన్నది ఈ ఘటన మరోసారి చాటింది.

మన కామ్రేడ్ల గొంతులు పెగలవేం?

నిజానికి పక్క దేశమైన చైనా కామ్రేడ్లు పాల్పడిన  ఈ రాక్షసకాండను,  మన దేశ కామ్రేడ్లు ఖండిస్తారనుకుంటే అది అమాయకత్వమే. అంత పుంసత్వాన్ని ఆశించడమూ అత్యాశనే అవుతుంది. చైనాలో వర్షం వస్తే ఢిల్లీలో గొడుగులు పట్టే మన వీరవిక్రమ, పరాక్రమ, ధీర దిగ్గజ  విప్లవయోధుల నుంచి.. అలాంటి ప్రతిఘటన, ప్రతిస్పందన ఆశించడమే అవివేకం. మోదీ సర్కారు చైనా ఎఫ్‌డీఐల నియంత్రణలను ఆమోదించేందుకు ఈ కామ్రేడ్లే మోకాలడ్డుతారు. 1962లో భారత్‌పై దాడికి దిగిన ఇదే చైనా చర్యను తప్పుపట్టేందుకు సాహసించని కామ్రేడ్లు… చైనా ఎఫ్‌డిఐలను నియంత్రించేందుకు సర్కారు చేసిన ప్రయత్నాలను స్వాగతిస్తారనుకోవడం వెర్రితనమే.
పాక్ ముష్కరుల చర్యలను కత్తులు,కటార్లతో ఖండించడంలో  ముందుండే మన కామ్రేడ్లు.. తమ వేలు విడిచిన సోదర పార్టీ పాలించే, చైనా కుయుక్తులను ఖండించాలంటే మాత్రం చొక్కా,లాగూలు తడిసిముద్దయిపోతాయి. గొంతు మూగబోతుంది. అసలు చైనా మన దేశంపై దాడి చేసినా, ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడి మన జవాన్లను హత్య చేసినా… అప్పటినుంచి మన కామ్రేడ్లు ఎవరికీ కనిపించరు. మీడియా గొట్టాలకు దొరకరు. ఒకవేళ దొరికితే..  చైనా దాడిపై తమ వైఖరేమిటో చెప్పాలి కదా? అద్గదీ సంగతి! ఏదేమైనా ఆరు దశాబ్దాల తర్వాత కూడా.. మన కామ్రేడ్ల చైనా బానిసత్వ భావజాలాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నందుకు, ప్రతి భారతీయుడూ వారి దేశభక్తిని మెచ్చుకోవలసిందే. లేకపోతే దేశద్రోహుల కిందే లెక్క!!

ఐలయ్య గారూ.. ఇప్పుడు  మీకర్ధమవుతోందా..?

‘కోమట్లు ఫక్తు వ్యాపారస్తులు. సామాజిక స్మగ్లర్లు.  వాళ్లకు వ్యాపారం తప్ప త్యాగం తెలియదు. వాళ్లు సైన్యంలో ఉన్నారా?’ అని మరో మేధావి ప్రొఫెసర్ కంచ ఐలయ్య  అప్పుడెప్పుడో ప్రశ్నించారు.  చైనా సైనికుల దాడిలో దారుణమారణకాండకు గురైన, మన తెలుగు కల్నల్, తెగువకు మారుపేరైన తెలంగాణ బిడ్డ సంతోష్ అసలు సిసలు.. అదే ఐలయ్య చెప్పిన ఆర్యవైశ్యుడే!  మరి.. వైశ్యులు త్యాగం చేయరని, సైన్యంలో ఎంతమంది ఉన్నారని గర్జించిన ఐలయ్య కలం, ఇప్పుడు సిగ్గుతో చితికి చచ్చిపోతుందా? కల్నల్ సంతోష్ మరణించింది వ్యాపారం కోసం కాదు కదా? ఏ షాపు కేటాయింపుల కోసమో జరిగిన దొమ్మీలో కాదు కదా ప్రాణాలు విడిచింది?
దేశ సరిహద్దులో ప్రాణాలు పణంగా పెట్టి.. మనల్ని, మన భూభాగాన్ని రక్షించడం కోసమే కదా సంతోష్ తన ప్రాణాలు బలి ఇచ్చింది? సంతోష్  లాంటి వాళ్లు కూడా.. కిరాణాషాపులు పెట్టుకునో, ఐలయ్య మాదిరిగా పుస్తకాలు అమ్ముకునే వ్యాపారం పెట్టుకుంటేనో, సరిహద్దులకు కాపలా కాసేదెవరు? విగతజీవులైన వారి కులాలు ప్రస్తావించడం నైతికంగా తప్పయినప్పటికీ.. గతంలో ఆ కులం వారి త్యాగాన్ని, తక్కువ చేసి మాట్లాడిన ఐలయ్య వంటి మేధావుల విమర్శలను, ఈ సందర్భంగా గుర్తు చేయకతప్పదు. ఇప్పుడు సోషల్ మీడియా కూడా.. నాటి ఐలయ్య మాటలను సంతోష్  శవపేటిక వైపు చూపిస్తూ, చూపుడు వేళ్లతో ప్రశ్నిస్తోంది. మీకు అర్ధమవుతోందా ఐలయ్య గారూ..?

కల్నల్ త్యాగం.. కేసీఆర్‌కు ముఖ్యం కాదా..?

దేశం కోసం తనువు చాలించిన తెలంగాణ బిడ్డ కల్నల్ సంతోష్ భౌతికకాయం తెలంగాణ గడ్డలో దిగిన వెంటనే… గవర్నర్ తమిళసై, కేటీఆర్, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్,  సహా అంతా అమరుడయిన సంతోష్‌కు నివాళులర్పించారు. ఆయన త్యాగాన్ని కొనియాడారు. కానీ, సీఎ, కేసీఆర్ మాత్రం భౌతికకాయం వద్దకు వెళ్లకపోవడాన్ని తెలంగాణ సమాజం తప్పు పడుతోంది. సోషల్ మీడియా శరపరంపరగా నిరసన ధ్వనులతో ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి హరికృష్ణ చనిపోతే, అక్కడికి వెళ్లి జూనియర్ ఎన్టీఆర్‌ను పొదివి పట్టుకుని ఓదార్చిన కేసీఆర్.. చైనా దాడిలో అమరుడైన నిఖార్సయిన తెలంగాణ బిడ్డ, సూర్యాపేట సంతోష్ భౌతికకాయం వద్దకు ఎందుకు వెళ్లలేదని నిలదీస్తోంది. పరిటాల తనయుడి పెళ్లికి వెళ్లి, అక్కడ వెంకటాపురంలో ఉన్న పరిటాల రవి సమాధిని సందర్శించిన కేసీఆర్‌కు… తెలంగాణ బిడ్డయిన సంతోష్ భౌతికకాయం వద్దకు వెళ్లేందుకు సమయం ఎందుకు లేదని ప్రశ్నిస్తోంది. ఆంధ్రా నిర్మాత రామానాయుడు మృతి చెందితే, అక్కడికి వెళ్లి ఆయన కుటుంబసభ్యులను ఓదార్చిన కేసీఆర్.. తెలంగాణ బిడ్డ సంతోష్ కుటుంబానికి ఆ ఓదార్పు ఎందుకు ఇవ్వలేదని నిలదీస్తోంది.

ఆంధ్రా విద్యావ్యాపారి నారాయణ కుమారుడు ఒళ్లు మరిచి తప్ప తాగి, వాయువేగంతో డ్రైవింగ్ చేసి, అర్ధరాత్రి ఫ్లైఓవర్ పిల్లర్‌ను ఢీకొట్టి చనిపోతే ఆగమేఘాలపై అక్కడికి మంత్రులను పంపి,  అన్ని ఏర్పాట్లు చేసిన కేసీఆర్‌కు.. సూర్యాపేట మద్దుబిడ్డ కల్నల్ సంతోష్  భౌతికకాయం వద్దకు వెళ్లి, నివాళి అర్పించాలని ఎందుకు అనిపించలేదు సారూ అంటూ తెలంగాణ పౌరులు సంధిస్తున్న ప్రశ్నాస్త్రాలతో, సోషల్ మీడియా గుండె  కూడా వేడెక్కుతోంది. సంతోష్ కర్మకాండలను దగ్గరుండి మరీ పర్యవేక్షించిన మంత్రి జగదీష్‌రెడ్డి పర్యవేక్షిస్తే, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి  అంతిమయాత్రలో పాల్గొనడం అభినందనీయం. కేసీఆర్ కూడా కల్నల్ సాబ్‌కు వందనమరిస్త్తే.. మరణించిన ఆ మేరునగధీరుడికి తెలంగాణ సమాజం ఘన నీరాజనార్పించిందన్న సంకేతం వెళ్లేది.

1 COMMENT

  1. […] చైనా హంతకుల చేతిలో నిహతుడైన తెలంగాణ బిడ్డ.. కల్నల్ సంతోష్ భౌతికకాయం సందర్శనకు వెళ్లని తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ  వెంటనే, నష్టనివారణకు  దిగిన కేసీఆర్ తీసుకున్న చర్యలు అభినందనలు అందుకుంటున్నాయి. పార్టీ-ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సందర్భాల్లో మెరుపు నిర్ణయాలు తీసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టే కేసీఆర్.. కల్నల్ సంతోష్ మృతి అనంతర ఘటనలోనూ అదే పద్ధతి పాటించి, విమర్శకుల నోళ్లు మూయించారు. ఇది కూడా చదవండి.. కమ్యూనిస్టుల నుం‘చైనా’ కదనమేదీ? […]