కల్నల్ కుటుంబానికి కేసీఆర్ ఐదుకోట్ల సాయం

166

భార్యకు ఉద్యోగం, ఇంటి స్థలం
స్వయంగా ఇంటికి వెళ్లాలని నిర్ణయం
‘పరామర్శ’ విమర్శలపై దిద్దుబాట
హేట్సాఫ్..  కేసీఆర్
(మార్తి సుబ్రహ్మణ్యం)

చైనా హంతకుల చేతిలో నిహతుడైన తెలంగాణ బిడ్డ.. కల్నల్ సంతోష్ భౌతికకాయం సందర్శనకు వెళ్లని తెలంగాణ సీఎం కేసీఆర్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే.. ఆ  వెంటనే, నష్టనివారణకు  దిగిన కేసీఆర్ తీసుకున్న చర్యలు అభినందనలు అందుకుంటున్నాయి. పార్టీ-ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తిన సందర్భాల్లో మెరుపు నిర్ణయాలు తీసుకుని, దిద్దుబాటు చర్యలు చేపట్టే కేసీఆర్.. కల్నల్ సంతోష్ మృతి అనంతర ఘటనలోనూ అదే పద్ధతి పాటించి, విమర్శకుల నోళ్లు మూయించారు. ఇది కూడా చదవండి.. కమ్యూనిస్టుల నుం‘చైనా’ కదనమేదీ?

కల్నల్ సంతోష్ భౌతికకాయం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు.. గవర్నర్ మంత్రి కేటీఆర్ సహా ప్రముఖులంతా కదలివచ్చి, అమరుడి నివాళులర్పించారు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రం రాకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. విపక్ష నేతలు వేలెత్తి చూపించారు. దానితో ఈ వ్యవహారం తెలంగాణ సమాజంలో ఒక చర్చలా మారింది. దీనితో పరిస్థితి గమనించిన కేసీఆర్.. మెరుపు వేగంతో కొన్ని నిర్ణయాలు తీసుకుని, దిద్దుబాటకు దిగారు. ఫలితంగా, విమర్శించిన వారే ప్రశంసలు కురిపించే పరిస్థితి ఏర్పడింది.

ఆ ప్రకారంగా.. కల్నల్ కుటుంబానికి 5 కోట్ల రూపాయల నగదు ఇవ్వాలని కేసీఆర్ తీసుకున్న నిర్ణయం, విమర్శలను సైతం మెప్పించింది. ఇదే ఘటనలో మృతి చెందిన పళని అనే జవానుకు.. తమిళనాడు ప్రభుత్వం 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియో, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది. కల్నల్ సంతోష్ కుటుంబానికి 2 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియో, ఆయన భార్యకు గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఎవరూ ఊహించని విధంగా కేసీఆర్ కల్నల్ కుటుంబానికి 5 కోట్ల రూపాయలు ఎక్స్‌గ్రేషియో, భార్యకు గ్రూప్ 1 ఉద్యోగంతోపాటు.. ఇంటి స్థలం కూడా ఇస్తామని ప్రకటించి, అందరి అభినందనలు అందుకున్నారు. అంతేకాకుండా చైనా సైనికుల ఘర్షణలో మృతి చెందిన 19 మంది జవాన్ల కుటుంబాలకూ, పది లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని ప్రకటించడం ద్వారా.. ఈ అంశానికి సంబంధించి తనపై వచ్చిన విమర్శలకు, పూర్తి స్థాయిలో తెరదించారు. ఏ సమయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో, చేసిన పొరపాట్లకు ఏవిధంగా దిద్దుబాటుకు దిగాలో కేసీఆర్‌కు తెలిసినంతగా మరెవరికీ తెలియదేమో? దటీజ్ కేసీఆర్!  అమరవీరుడి కుటుంబానికి ఐదుకోట్ల సాయం ప్రకటించిన తెలంగాణ సీఎం పెద్ద మనసుకు హేట్సాఫ్ చెప్పాల్సిందే!!