ఈఎస్‌ఐ మందుల కొనుగోలులో ‘విజయ’ దరహాసం

461

తండ్రి పేరుతో సొంత కంపెనీకి కోట్ల ఆర్డర్లు
సత్తెనపల్లి కంపెనీ కేంద్రంగా ఈఎస్‌ఐ నిధులు లూటీ?
దళారీ పేరుతో ఆర్డర్లు?
త్వరలో ఆమె కూడా అరెస్టయ్యే అవకాశం?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో సంచలనం సృష్టిస్తున్న ఈఎస్‌ఐ మందుల కొనుగోలు కుంభకోణంలో.. గుంటూరు జిల్లా నర్సరావుపేట-సత్తెనపల్లి కేంద్రంగా ఉన్న ఒక ఫార్మా కంపెనీ పాత్ర కూడా ఉన్నట్లు ఏసీబీ గుర్తించినట్లు సమాచారం. తెలుగుదేశం అధికారంలో ఉండగా, నర్సరావుపేట-సత్తెనపల్లి నియోజకవర్గాలను అడ్డగోలుగా  దున్నేసిన, ఓ దివంగత రాజకీయ నేత కుటుంబం.. ఈఎస్‌ఐలో తమ ఫార్మా కంపెనీకి చెందిన మందులను దాదాపు ఐదున్నర కోట్లకు కొనుగోలు చేసేలా, నాటి ఈఎస్‌ఐ డైరక్టర్లపై ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఏసీబీ గుర్తించినట్లు తెలుస్తోంది. ఆ మేరకు తమ తండ్రి హోదాను అడ్డుపెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా పశువులకు సంబంధించిన మందుల కొనుగోలు చేసిన పశుసంవర్థక శాఖ వ్యవహారంపైనా, సర్కారు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

వ్యాపారులపై ఒత్తిళ్ల ‘విజయ’విహారం..

సత్తెనపల్లి కేంద్రంగా ఉన్న సదరు నేత కుటుంబ కంపెనీ.. తన అధికారం అడ్డుపెట్టుకుని, జిల్లాలోని ఏ మెడికల్ షాపులు, మెడికల్ ఏజెన్సీలను విడిచిపెట్టకుండా బలవంతంగా మందులు అంటగట్టిన వైనం, అప్పట్లోనే విమర్శలకు దారితీసింది. ఆ కంపెనీ నుంచి మందులు కొనుగోలు చేయని మెడికల్ ఏజెన్సీలపై, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ల ద్వారా దాడులు చేయించడం, నెలవారీ టార్గెట్లు కేటాయించడం వంటి అరాచక చర్యలు అప్పట్లోనే చర్చనీయాంశమయ్యాయి. సత్తెనపల్లి ఒకరికి, నరసరావుపేట మరొకరికి అప్పచెప్పిన ఆ దివంగత నేత తీసుకున్న నిర్ణయానికి.. ఆ రెండు నియోజకవర్గాల్లో, వ్యాపారులు బలయిపోయారన్న వార్తలు వెలువెడిన విషయం కూడా తెలిసిందే. ఆ ప్రకారంగా రెండు నియోజకవర్గాలను ‘దత్తత’ తీసుకున్న ఇద్దరు, వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన వైనం ఆంధ్రా సరిహద్దు అయిన పొందుగల నుంచి శ్రీకాకుళం వరకూ కథకథలుగా వినిపించేవి.

 పాత పాపాలు వెంటాడుతున్నాయా?

కూతురయిన మహిళా డాక్టరయితే, నర్సరావుపేటలో బంగారు షాపులో కొనుగోలు చేసిన నగలకు డబ్బులు కూడా ఇచ్చేవారు కాదని, చివరకు అన్నక్యాంటీన్ల నుంచి 5 రూపాయలకు దొరికే భోజనాన్ని.. తన ఫార్మా కంపెనీ కార్మికులకు ఇచ్చి, 40 రూపాయలు కోత విధించి చిల్లర చేష్టలకు పాల్పడుతున్నారన్న విమర్శలు, అప్పట్లో మీడియాలో కూడా సంచలనం సృష్టించాయి. అప్పట్లో ఈ అరాచకాలపై, అటు నర్సరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఇటు సత్తెనపల్లి వైసీపీ నేత అంబటి రాంబాబు మీడియా సమావేశాలు నిర్వహించి మరీ తూర్పారపట్టేవారు. రాష్ట్రంలో సంపాదించిన అక్రమ సంపాదనతో ఆఫ్రికా దేశంలో వ్యాపారాలు చేస్తున్నారన్న వారి ఆరోపణ, ప్రజల్లో చర్చనీయాంశమయింది.  ‘కె’ టాక్సుతో ఆ కుటుంబం ప్రజలను భయపెడుతోందని, బిల్డర్లు అపార్టుమెంట్లు కట్టాలంటే కె టాక్సు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని చేసిన ఆరోపణలు, ఆ కుటుంబ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. నర్సరావుపేట స్టేడియం పక్కనే ఉన్న స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించిన వారి నుంచి.. కె టాక్సు వసూలు చేసిన తర్వాతనే, శంకుస్థాపనకు వచ్చారన్న వార్తలు, వ్యాపారవర్గంలో చర్చనీయాంశమయింది.

అమ్మకాలన్నీ ఆమెకు ‘ఫార్మా’లిటీసే..

సదరు దివంగత నేత కుటుంబం సత్తెనపల్లిలో నిర్వహించే ఫార్మా కంపెనీ..  పశువులకు సంబంధించిన మందులను కూడా, రాష్ట్ర ప్రభుత్వానికి అంటకట్టిన వైనం దుమారం రేపింది. తమ ఫార్మా కంపెనీకి చెందిన ఉత్పత్తులను ఈఎస్‌ఐకు అమ్మే వ్యవహారాన్ని ఆమెనే పర్యవేక్షించేవారని, ఆ ఫార్మాలిటీస్ అన్నీ ఆమెనే చూసుకునేవారంటున్నారు. చివరకు గుంటూరులో సొంత భవనానికి ఇష్టారాజ్యంగా అద్దె వసూలు చేసి, సర్కారు ఖజానాను లూటీ చేసినట్లు వచ్చిన ఆరోపణలు, ఆ కుటుంబాన్ని భ్రష్ఠు పట్టించాయి. ఇప్పుడు తాజాగా ఈఎస్‌ఐ కుంభకోణంలో, నరసరావుపేటకు చెందిన ఓ మెడికల్ షాపు యజమానిని బినామీగా పెట్టుకుని, భారీ ఎత్తున సంపాదించారని ఏసీబీ గుర్తించిందంటున్నారు. ఈఎస్‌ఐ డైరక్టర్లు నోరు విప్పితే ఇంకెన్ని విషయాలు వెలుగుచూస్తాయో చూడాలి.

అరెస్టు తప్పదా..?

ఆమె ఫణి శ్రీనివాస్ అనే మెడికల్ రంగంలో పనిచేసే వ్యక్తితో.. ఓ సూట్‌కేస్ కంపెనీని ఏర్పాటుచేయించి, ఈఎస్‌ఐకు కోట్లాదిరూపాయల మందులు కొనుగోలు చేయించినట్లు, ఏసీబీ ప్రాధమిక నిర్ధరణలో తేలిందంటున్నారు. ఒక సామాన్య గుమాస్తాగా ఉన్న వ్యక్తి.. కంపెనీ ప్రారంభించడం, కోట్లు సంపాదించిన తర్వాత.. ఆ కంపెనీనిని మూసివేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇదే కేసులో  అచ్చెన్నాయుడు, ఈఎస్‌ఐ డైరక్టర్లు అరెస్టు కాగా, త్వరలో తన తండ్రి అయిన దివంగత నేతను అడ్డపెట్టుకుని కోట్లు సంపాదించిన, ఆ ఫార్మా కంపెనీ అధినేతను కూడా అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదంటున్నారు. దివంగత నేత లేనందున.. పార్టీ కార్యకర్తలు కూడా వారి వెంట లేకుండా పోయారు. వారికి పార్టీలో కూడా ఇప్పుడు పె ద్దగా ఆదరణ లేదు. ఈ నేపథ్యంలో అరెస్టు చేసినా, ఆ పార్టీ నుంచి ప్రతిఘటన, విమర్శలు వచ్చే అవకాశం లేదంటున్నారు. కాగా.. ఆసుపత్రి, షోరూము వేదికగా.. ‘ఆ ఇద్దరూ’ కాంట్రాక్టులు, ప్రభుత్వ పదవులు, పోస్టింగుల కోసం చేసిన సెటిల్‌మెంట్లు ఒక్కొక్కటి వెలుగులోకి రానున్నాయి.

పదవులు పేరుతో కోట్లాది రూపాయలు వసూలు చేసిన తండ్రీకొడుకులు… మున్సిపల్ ఎన్నికల్లో నేతల నుంచి లక్షలు వసూళ్లు…  విద్యుత్‌రంగంలో ఓ కీలక  పదవితోపాటు, సోలార్ కార్పొరేషన్‌లో ఎండీ పదవి, సీఆర్డీఏలో మరో పదవి, నామినేటెడ్ చైర్మన్ పదవి కోసం కోట్ల రూపాయల వసూలు..వైజాగ్ హోటల్‌లో మంతనాలు.. పోస్టు కోసం అమరావతి చాంబర్‌లో నాటి విద్యుత్ శాఖ మంత్రితో జరిపిన భేటీలు.. పోస్టు ఇచ్చేందుకు ముందస్తు డబ్బుల కోసం..  ఉదయం ఒకరు, సాయంత్రం మరొకరు  వరసగా చేసిన ఒత్తిడి ఫోన్లు.. ఇలాంటి తెరవెనుక ముచ్చట్లపై , సంచలన వార్తా కథనాలు త్వరలో…

  మీ ‘సూర్య’లో