తుమ్మల,చారిని మర్చిపోయారా..?

387

సీనియర్లు లేకనే విపక్షాల ఎదురుదాడి
కర్నెకు ఎమెల్సీ రెన్యువల్ ఖరారు?
బ్రాహ్మణ కోటాలో చారి లేదా దేశపతి?
రెడ్డి కోటాలో నాయని లేదా శ్రవణ్‌కుమార్‌రెడ్డి
కార్పొరేషన్లు అన్నీ ఖాళీనే
తెరాసలో చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

సీనియర్ల సేవలు వినియోగించుకోవడంలో పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చూపిస్తున్న వైనంపై టీఆర్‌ఎస్‌లో చర్చ జరుగుతోంది. ఉద్యమ పార్టీ నుంచి ఫక్తు రాజకీయ పార్టీగా మారిన తర్వాత, టీఆర్‌ఎస్ నాయకత్వం అనుసరిస్తున్న ఎత్తులు, తీసుకుంటున్న నిర్ణయాలన్నీ రాజకీయ పార్టీ వ్యూహాలకు అనుగుణంగానే మారాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ తెరాసనే విజయపరంపర కొనసాగిస్తోంది. ఇటీవలి ఎంపీ ఎన్నికల్లో ఏడు స్థానాలు కోల్పోవడం మినహాయించి, మిగిలిన అన్ని రకాల ఎన్నికల్లోనూ కారు బ్రేకుల్లేకుండా దూసుకుపోతోంది. అయినప్పటికీ,  బీజేపీ-కాంగ్రెస్ పార్టీలు క్షేత్రస్థాయిలో.. ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు, కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనలు జనక్షేత్రంలో వేడిపుట్టిస్తూనే ఉండటం ప్రస్తావనార్హం.

ఆ రెండు పార్టీలు ఎన్నికల్లో ఓడినా..

ఆ రెండు పార్టీలూ ఎన్నికల్లో ఓడిపోతున్నప్పటికీ.. ప్రభుత్వ విధానాలు, నిర్ణయాలపై చేస్తున్న నిరసన కార్యక్రమాలకు మాత్రం, జనంలో స్పందన లభిస్తుండటం ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల కరోనా కాలంలో కోవిడ్ పరీక్షలు, ధాన్యానికి గిట్టుబాటు ధర, మార్కెట్‌యార్డుల్లో సమస్యలు, పోతిరెడ్డిపాడు అంశం, ప్రాజెక్టుల సందర్శన పేరుతో బీజేపీ-కాంగ్రెస్ నేతలు చేసిన హడావిడి, ఆరోపణలను సమర్ధవంతంగా తిప్పికొట్టలేకపోయారని గుర్తు చేశారు. కేటీఆర్ ఫార్మ్‌హౌస్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి  రేవంత్‌రెడ్డి నానా యాగీ చేస్తే.. బాల్క సుమన్, కర్నె ప్రభాకర్ వంటి ఇద్దరు ముగ్గురు నేతలు మాత్రమే, ఎదురుదాడి చేసిన విషయాన్ని తెరాస నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇలాంటి అంశాలలో  తెరాస నుంచి ఎదురుదాడి తగ్గిపోవడం చర్చనీయాంశమయింది. ముఖ్యంగా చానెళ్ల చర్చలకు వెళ్లే వారిని నిరోధించడం కూడా పార్టీ-ప్రభుత్వ వాణి జనంలోకి వెళ్లకపోవడం, విపక్షాల వాణి ఎక్కువగా వినిపించడానికి  ఒక కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అంతా ఆ నలుగురైదుగురేనా..?

విపక్షాలపై సీనియర్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, జగదీష్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాసగౌడ్ తప్ప మిగిలిన వారెవరూ పెద్దగా స్పందించడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇటీవల వలస కార్మికులను రైల్వే శాఖనే సొంత ఖర్చులు భరించి తరలించాలని తలసాని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. మోదీ చెప్పిన తర్వాతనే మద్యం షాపులు తెరిచారని బీజేపీపై ఎదురుదాడి చేశారు. వీరు తప్ప మిగిలిన మంత్రులంతా, నియోజకవర్గాలకు పరిమితమయిపోయారు. మండలి విప్ కర్నె ప్రభాకర్‌తో పాటు పోచంపల్లి శ్రీనివాసరెడ్డి వంటి ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్సీలు మాత్రమే క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. బాల్క సుమన్, గువ్వల బాలరాజ్, మేయర్ బొంతు రామ్మోహన్ వంటి నేతలు మాత్రమే చురుకుగా వ్యవహరిస్తున్నారు. కేటీఆర్ ఒక్కరే అంతా తానయి వ్యవహరిస్తున్నారు తప్ప, మిగిలిన ఎమ్మెల్యే-ఎమ్మెల్సీ-ఎంపీలు, చివరకు పార్టీ నేతలు కూడా..  ఆ స్థాయిలో విపక్షాలను, సమర్ధవంతంగా ఎదుర్కోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇక పదవులు తీసుకున్న కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా స్థాయిలో జడ్పీ చైర్మన్లు నిమిత్తమాత్రంగా మారారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.  కరోనా సమయంలో కేంద్రంపై విమర్శలు, విపక్షాలపై ఎదురుదాడిలో తలసాని, ఎర్రబెల్లి ముందున్నారు. ఆర్టీసీ సమ్మె సమయంలో సర్కారు నిర్ణయాన్ని విపక్షాలు తూర్పారపట్టాయి. తెలంగాణ ఉద్యమ పార్టీలు, కార్మిక సంఘాలు విమర్శల దాడి చేశాయి.  ఆ సమయంలో సంబంధిత శాఖ మంత్రిగా ఉన్న పువ్వాడ అజయ్ నిర్లిప్తంగా ఉన్న నేపథ్యంలో.. తలసాని శ్రీనివాసయాదవ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్ గౌడ్ ముగ్గురు మాత్రమే ఆయా వర్గాలపై ఎదురుదాడి చేశారు. ఫలితంగా తలసాని, శ్రీనివాసగౌడ్ ఇద్దరూ విపక్షాలకు లక్ష్యంగా మారాల్సి వచ్చింది.

విపక్షాల విమర్శలపై ఎదురుదాడి ఏదీ..?

గత కొద్ది నెలల నుంచి కాంగ్రెస్-బీజేపీ నుంచి వెల్లువెత్తుతున్న విమర్శలు, ఆరోపణలకు ధీటైన సమాధానం చెప్పే నేతలు కరవయ్యారన్న వ్యాఖ్యలు  తెరాస వర్గాల్లో వినిపిస్తున్నాయి.  దీనికి సీనియర్ల సేవలు వినియోగించుకోకపోవడం కూడా ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉదాహరణకు అనువజ్ఞులైన తుమ్మల నాగేశ్వరరావు, సముద్రాల వేణుగోపాలచారి, మధుసూదనాచారి, కడియం శ్రీహరి, చందూలాల్, జోగు రామన్న, లక్ష్మారెడ్డి, జూపల్లి, మండవ వెంకటేశ్వరరావు, తీగల కృష్ణారెడ్డి  వంటి సీనియర్ల  సేవలు వినియోగించుకోకపవడంపై పార్టీ వర్గాల్లో విస్మయం వ్యక్తమవుతోంది. టివి చానెళ్లలో జరిగే చర్చలలో విపక్షాలు సర్కారుపై నలుచెరుగులా దాడి చేస్తుంటే, చర్చలపై నిషేధం విధించడంతో పార్టీ గళం వినిపించలేకపోతున్నామని నేతలు చెబుతున్నారు. ‘నియోజకవర్గాల్లో నేతలు బాగానే పనిచేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలోనే నేతలు మౌనంగా ఉండటం వల్ల పార్టీ ఎదురుదాడి చేయడం లేదని మీకు అనిపిస్తుండవచ్చ’ని ఓ సీనియర్ వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో సమర్థవంతంగా పనిచేసిన వేణుగోపాలచారి

కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా సమర్థవంతంగా పనిచేశారు. రాష్ట్రానికి సంబంధించి రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, పవర్‌ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు, ఎన్‌జీఆర్ నిధులు తీసుకురావడంలో గట్టి కృషి చేశారు. కేంద్రమంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు బాగా అక్కరకొచ్చింది. ఇప్పుడు కేంద్రమంత్రులుగా పనిచేస్తున్న వారితో ఆయనకు సన్నిహిత పరిచయాలున్నాయి. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, సమస్యలను కేంద్ర మంత్రిత్వ శాఖలకు వెళ్లి పరిష్కరించే ప్రభుత్వ ప్రతినిధిని చారి సమర్ధవంతంగా నిర్వహించారన్న పేరుంది. అయితే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ, ఆయనతోపాటు ఖాళీ అయిన ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి పదవులను ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. తెలంగాణ రాష్ట్రంలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్‌లోనే నాలుగులక్షల మంది బ్రాహ్మణులున్నారు. ఆయా సంఘాలతో చారికి విస్తృత సంబంధాలున్నాయి. అలాంటి చారి సేవలు కూడా, పార్టీ పెద్దగా వినియోగించుకోవడం లేదంటున్నారు. ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణలపై కేసీఆర్ ఒంటికాలితో లేచారు. మీ డబ్బు మాకు అవసరం లేదని నిర్మొహమాటంగా తిరస్కరించారు. తర్వాత.. కేంద్ర విధానం వల్ల రాష్ట్రాలపై పడే భారంపై, గతంలో విద్యుత్ శాఖ సహాయమంత్రిగా పనిచేసిన వేణుగోపాలచారి ఇచ్చిన వివరణ, చేసిన వాదన కేసీఆర్ వాదనకు మరింత బలం చేకూర్చింది. కరోనా సమయంలో పనులు లేక ఇబ్బందులు పడుతున్న బ్రాహ్మణులు, అర్చకులకు అగర్వాల్ సమాజ్ సాయంతో,  గ్రేటర్ హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాలోని ఆ సామాజికవర్గానికి వేణుగోపాలాచారి నిత్యావసర వస్తువులు అందించారు.

తుమ్మల సేవలు అవసరం లేదా..?

అటు వ్యూహకర్తగా పేరున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా ఎన్నికల్లో ఓటమి తర్వాత  మౌనంగా ఉన్నారు. ఖమ్మం జిల్లా నుంచి పువ్వాడ అజయ్‌కు మంత్రి పదవి ఇచ్చినందున, అదే సామాజికవర్గానికి చెందిన తుమ్మలను పక్కనపెట్టారు. దీనితో  ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న ఆయన కేసీఆర్ పిలిస్తే తప్ప వెళ్లలేదు. తన సేవలు అవసరమైతే పార్టీనే పిలుస్తుందన్న భావనతో ఉన్న తుమ్మల, తన గ్రామంలో వ్యవసాయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు ఊపందుకుంటున్నాయి. సీపీఎం ఆందోళన కార్యక్రమాలతో మళ్లీ పోయిన పట్టు సాధించుకునే వ్యూహంలో ఉంది.

సీనియర్లయిన తుమ్మల, చారి ఇద్దరూ కేసీఆర్‌కు అత్యంత సన్నిహితులే అయినప్పటికీ, వారి సేవలు ఎందుకు వినియోగించుకోవడం లేదో అర్ధం కావడం లేదంటున్నారు. పైగా తుమ్మల ప్రాతినిధ్యం వహిస్తున్న కమ్మ సామాజికవర్గ బలం రాజధాని-రంగారెడ్డి జిల్లాలో బలంగా ఉంది. గతంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ తరఫున తుమ్మల, చారి నగరంలోని వారి సామాజికవర్గాలను సమీకరించే బాధ్యత చేపట్టారు. మళ్లీ త్వరలో గ్రేటర్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో, వారిద్దరి సేవలు పార్టీ ఏవిధంగా వినియోగించుకుంటుందో చూడాలంటున్నారు.
ఇక స్వయంగా కేసీఆర్ వెళ్లి పార్టీలో చేర్చుకున్న, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు కూడా పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించడం లేదంటున్నారు. కడియం శ్రీహరి, మధుసూదనరావు, చందూలాల్, జూపల్లి వంటి నేతలకు విపక్షాలపై ఎదురుదాడి చేసే అనుభవం, సత్తా ఉన్నప్పటికీ.. వారి సేవలు వినియోగించుకోకపోవడానికి .. నాయకత్వానికి ఉన్న లెక్కలేమిటో, తెలియడం లేదంటున్నారు. బీజేపీ-కాంగ్రెస్ విమర్శల దాడి పదును పెంచుతున్న నేపథ్యంలో, ఇలాంటి సీనియర్ల సేవలు వినియోగించుకుంటేనే, ప్రభుత్వం రక్షణాత్మక పరిస్థితిలో ఉంటుందని తెరాస నేతలు విశ్లేషిస్తున్నారు.

పార్టీ ఆఫీసులో పనిమంతులకు పదవులేవీ?

గతంలో గాంధీభవన్‌లో పార్టీ కార్యక్రమాలు పర్యవేక్షించిన రాపోలు ఆనందభాస్కర్‌కు రాజ్యసభ, టీడీపీ ఆఫీసులో కార్యక్రమాలు పర్యవేక్షించిన టీడీ జనార్దన్, షరీఫ్, వీవీ చౌదరికి ఎమ్మెల్సీలు దక్కాయి. కానీ తమ పార్టీలో ప్రొఫెసర్ శ్రీనివాసరెడ్డి ఒక్కరికే ఎమ్మెల్సీ దక్కిందని, చాలాకాలం నుంచి పనిచేస్తున్న టీఆర్‌ఎస్‌ఎల్‌పి కార్యదర్శి రమేష్‌రెడ్డి, గట్టు రామచందర్‌రావు, కావేటి లక్ష్మీనారాయణ, టివిఎస్ శాస్త్రి వంటి వారికి కనీసం కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా దక్కలేదంటున్నారు. వీరంతా ఏళ్ల తరబడి పార్టీ కార్యాలయంలో అంకితభావంతో పనిచేస్తున్న వారే.  రాష్ట్రంలో దాదాపు 50 కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయని, ఇంతవవరకూ వాటిని భర్తీ చేయకపోవడం వల్ల నేతల్లో నిరుత్సాహ వాతావరణం నెలకొందని చెబుతున్నారు.

ఎమ్మెల్సీలెవరికి?

కాగా త్వరలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పుడు   శాసనమండలి అభ్యర్ధుల ఎంపికపై తెరాసలో ఉత్కంఠ కనిపిస్తోంది. అందులో ఒకటి ప్రస్తుత విప్ కర్నె ప్రభాకర్‌కు మళ్లీ ఇవ్వడం ఖాయమంటున్నారు. విపక్షాలపై ఎదురుదాడి చేయడంతోపాటు, కేసీఆర్‌కు అత్యంత విధేయుడైన ప్రభాకర్‌కు రెన్యువల్ అవడంఓ ఎవరికీ సందేహాలు లేవంటున్నారు. మాజీ మంత్రి నాయని నర్శింహారెడ్డి పేరు వినిపిస్తున్నా, ఆయన నడిచే పరిస్థితి కూడా లేదంటున్నారు. పార్టీలో కేసీఆర్‌తో తొలి నుంచీ కలసి నడిచిన నాయనికి ఇటీవల రాజ్యసభ అవకాశం దక్కలేదు. గతంలో టీఆర్‌ఎస్ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ ఆయనే చేసేవారు. అయితే తనకు మంత్రి పదవి ఇవ్వని సందర్భంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొంత సంచలనం సృష్టించాయి. హోంమంత్రి పదవి చేసిన తనకు ఆర్టీసీ చైర్మన్ ఏమిటని, నేను టీఆర్‌ఎస్‌కు ఒక ఓనర్‌ని. నాకు కేసీఆర్ మాట ఇచ్చి తప్పారని వ్యాఖ్యానించారు.  రెడ్డి సామాజికవర్గంలో పార్టీ ప్రధాన కార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి లేదా టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యదర్శి మందాటి రమేష్‌రెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒకవేళ నాయనికి అవకాశం దక్కకపోతే, శ్రవణ్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వవచ్చంటున్నారు.

ఇక మరో స్థానంలో కేసీఆర్ ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్ పేరు వినిపిస్తోంది. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన దేశపతితో కేసీఆర్‌కు అనుబంధం ఉన్నప్పటికీ, ఆ సామాజికవర్గంలో వేణుగోపాలచారికే తెలంగాణలో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. సామాజికవర్గ సమీకరణ కాకుండా, సాధారణ ఎంపికగా తీసుకుంటే దేశపతి వైపే కేసీఆర్ ఎక్కువ మొగ్గు చూపించవచ్చంటున్నారు. ఇక అసెంబ్లీ తొలి స్పీకర్ మధుసూదనాచారి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బాలమల్లు, సీతారాం నాయక్ కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు.