జగన్ ‘సంక్షేమ’ సూపర్ ఎక్స్‌ప్రెస్!

490

నేరుగా జనాలకే నిధులు
నేతలు ఇక నిమిత్తమాత్రులేనా?
‘జనం-జగన్’ సూత్రం సూపర్‌హిట్
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్కారు నడుపుతున్న సంక్షేమ బండి.. సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌లా దూసుకుపోతోంది. భవిష్యత్తులో ఇక, ఎమ్మెల్యేలు-ఎంపీలు-నాయకులతో సంబంధం లేకుండా… నేరుగా జగనే పథకాల రూపంలో జనంలోకి వెళ్తున్నారు.  నేరుగా ప్రజలకే నిధులు అందిస్తున్న వైనంతో, ఇక నాయకులు నిమిత్తమాత్రులుగా మారనున్నారు. జగన్ మాత్రం నేరుగా జనంలోనే ఉండిపోతారు. జనం చేతిలోకి డబ్బు వెళితే ఆ కిక్కే వేరంటున్నారు. తాజాగా ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టిన పలు పథకాలకు కేటాయించిన నిధుల తీరు చూస్తే ఇది నిజమనిపించక మానదు.

రాష్ట్ర ఖజానా నిండుకున్నప్పటికీ, సంక్షేమ పథకాలకు మాత్రం ఎక్కడా నిధుల కొరత లేకుండా, సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీనిని పరిశీలిస్తే.. భవిష్యత్తుపై ఆయన ఎంత పకడ్బందీగా అడుగులు వేస్తున్నారో స్పష్టమవుతోంది. పెద్దగా ప్రజాదరణ పొందని, ఆశించిన రీతిలో ఖర్చు కాని పథకాలకు కోత విధించి, జనాదరణ ఉన్న పథకాలకు, తనకు వ్యక్తిగతంగా పేరు తెచ్చే పథకాలకే గతేడాది కంటే ఎక్కువ నిధులు కేటాయించారు. దీని ద్వారా… బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు మరింత చేరువ కావాలన్న తన లక్ష్యాన్ని, త్వరగా  సాధించే దిశలో జగన్ పయనిస్తున్నట్లు తాజా బడ్జెట్ కేటాయింపులు స్పష్టం చేస్తున్నాయి.

బడుగు బలహీన వర్గాలకు చేరువ..

ఈసారి బడ్జెట్‌లో.. బీసీలకు 270 శాతం నిధులు పెంచగా, మైనారిటీలకు 116 శాతం, ఎస్సీలకు 110 శాతం, కాపులకు 42 శాతం, ఎస్సీ ఉప ప్రణాళికకు 735 కోట్లు గతేడాది కంటే ఎక్కువ పెంచింది. స్కూలుకు వెళ్లే పిల్లల తలిదండ్రులను మెప్పించిన ‘జగనన్న విద్యాదీవెన’కు గత సంవత్సరం 1,999 కోట్లు కేటాయించిన జగన్, ఈఏడాది 3,009 కోట్లు పెంచింది. ‘జగనన్న తోడు’ పథకానికి 100 కోట్లు, ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకానికి 200 కోట్లు, ‘వైఎస్సార్ జగనన్న చేదోడు’ పథకానికి 247 కోట్లు, వైఎస్సార్ పించను పథకానికి 16 వేల కోట్లు కేటాయించింది. ఇక ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి గత ఏడాది 993.61 కోట్లు కేటాయిస్తే, ఈసారి దానిని 2 వేల కోట్లకు పెంచారు.

ఇతర పార్టీల సానుభూతిపరుల మనసులో సైతం..

వీరంతా జగన్‌కు బలమైన ఓటు బ్యాంకులే కావడం విశేషం. కాగా, జగన్ ఈ ఏడాదిలో చేపట్టిన ఈ కొత్త పథకాల వల్ల..గతంలో ఇతర పార్టీలకు ఓట్లు వేసిన వారు కూడా లబ్థిదారులుగా మారుతున్నారు. అమ్మఒడి పథకం అందుకు ఓ ఉదాహరణ. అన్ని పథకాలకు నేరుగా లబ్ధిదారులకే నిధులిస్తున్నందున, అవి అందుకుంటున్న వారిలో ఇతర పార్టీల సానుభూతిపరులున్నప్పటికీ, వారిలో కూడా జగన్ పట్ల సానుకూలత పెరుగుతోంది.  ఫలితంగా  వైసీపీ ఓటు బ్యాంకు  మరింత బలోపేతం కావడానికి కారణం కానున్నారు. తాము ఏడాదిలోనే వంద శాతం హామీలు నెరవేర్చామని వైసీపీ సర్కారు చెబుతుంటే, టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం కేవలం 57 శాతమే అమలు చేశారని వాదిస్తున్నారు. ఆ ప్రకారం చూసుకున్నా.. కేవలం ఏడాదిలోనే 57 శాతం హామీలు నెరవేర్చడం కూడా సాహసమే అవుతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఇక ‘జగన్-ఓటరు’ మాత్రమే..

జగన్మోహన్‌రెడ్డి తన పదవీకాలం మరో నాలుగేళ్ల సమయం ఉన్నప్పటికీ.. వాయువేగంతో సంక్షేమ పథకాలన్నీ,  ముందుగానే అమలు చేయడానికి చాలా కారణాలున్నాయని పార్టీ సీనియర్లు చెబుతున్నారు. భవిష్యత్తులో ఏ ఒక్క నాయకుడిపై పార్టీ ఆధారపడకుండా, తనను చూసే జనం ఓట్లు వేశారని భావించే సీనియర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా..  తమిళనాడులో జయలలిత, కరుణానిధి మాదిరిగా, కేవలం తనను చూసి మాత్రమే ఓట్లు వేసే బ్రహ్మాండమైన ప్రణాళికతోనే, ఆయన ఇవన్నీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ వేగంతో అమలు చేస్తున్నారని విశ్లేషస్తున్నారు. ఎన్నికల్లో ఏ అభ్యర్ధిని నిలబెట్టినా.. ప్రస్తుతం అమలుచేస్తున్న పథకాలతో నేరుగా జనంలోకి వెళ్లినందున, అన్ని చోట్లా ఇకపై అభ్యర్ధుల రూపంలో.. జగన్ మాత్రమే  కనిపిస్తారంటున్నారు.
అందుకే ఏ పథకమైనా ప్రజాప్రతినిధులు, నేతలు, మధ్య దళారులు, అధికారులు, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా.. నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాలకే నగదు చేరుతోంది. దీనితో జగన్‌పై వ్యక్తిగతంగా  ఆ సంతృప్త-కృతజ్ఞత స్థాయి అంచనాలకు మించి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. అందుకే జగన్ ప్రతి పథకం కూడా, నేరుగా లబ్థిదారుల ఖాతాలకే వేస్తున్నారంటున్నారు. ఈ విధానంతో,  మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా.. ‘జగన్-ఓటరు’ మాత్రమే ఉంటారని, దానివల్ల జగన్ ప్రజల గుండెలో నిలిచిపోతారన్న విశ్లేషణ పార్టీ సీనియర్ల నుంచి వినిపిస్తోంది.