రాజు గారు జగనన్నను తిట్టారా?.. పొగిడారా?

539

పాలనపై ఓ వైపు ప్రశంసలు, మరోవైపు విమర్శలు
సంజాయిషీ నోటీసు ఏం ఇస్తారు?
అలాగైతే ఆనం, ధర్మాన బోళ్లకూ నోటీసులిస్తారా?
అపాయింట్‌మెంట్‌పై వ్యాఖ్య అక్షరసత్యమేనంటున్న నేతలు
మా మనసులో మాటనే రాజుగారు చెప్పారంటున్న సీనియర్లు
వైసీపీలో రఘురామ రచ్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

కొన్నేళ్ల క్రితం తెలుగు సినిమా రంగాన్ని ఊపేసిన ప్రతిఘటన సినిమా గుర్తుందా? విజయశాంతికి హీరోయిజం తెచ్చిన సినిమా అది. అందులో విలన్ కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్ ‘ఇంతకూ వీడు నన్ను తిడతాండా? పొగడ్తాండా?’ అన్న డైలాగు ఇప్పటికీ గుర్తే. నర్సాపురం వైసీపీ ఎంపి రఘరామకృష్ణంరాజు ఆ పార్టీ నాయకత్వంపై వేస్తున్న నర్మగర్భ  డైలాగులు చూస్తుంటే, అప్పట్లో ప్రతిఘటనలో కోటా శ్రీనివాసరావు చెప్పిన డైలాగులే గుర్తుకొస్తున్నాయి. ఓ వైపు తన పార్టీ అధినేత జగనన్నను ఆకాశానికెత్తుతూనే, మరోవైపు ప్రభుత్వంలో జరుగుతున్న అక్రమాలు బయటపెడుతున్న తీరు వైసీపీ నాయకత్వాన్ని జుట్టు పీక్కునే చేస్తున్నాయి. ఆయనపై వేటు ఎలా వేయాలా అని దారులు వెతుక్కునేలా చేస్తున్నాయి.

రఘురామ బాణాలు.. ఎప్పుడెలా..?

‘ మంచి ఉద్దేశంతో  ప్రజలలో జీవితాంతం నిలిచిపోవాలన్న సదుద్దేశంతో సీఎం జగనన్న ఇళ్ల పథకం పెడితే, ఫ్లాట్లకు ఇంతని చెప్పి కలెక్టు చేస్తున్న విధానంపై మాట్లాడా. ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నా, ప్రభుత్వం భూములు అమ్మి పథకాలు చేపడుతోంది. సొంత పార్టీ నేతలు అవినీతికి పాల్పడినా జగన్ సహించరు. తోలు తీస్తారు. సంక్షేమ కార్యక్రమాల వల్ల జగన్ మూడు టర్ములు ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎన్నికల సంస్కరణల్లో భాగంగానే నిమ్మగడ్డను తప్పించారు. వైఎస్ అంటే నాకు అత్యంత అభిమానం. ఆయన కుమారుడిగా జగనంటే ఇష్టం. ఇసుక విధానానికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలెవరూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. సీఎంకు చెప్పే అవకాశం లేక మీడియా ద్వారా మాట్లాడుతున్నారు’
– ఇది నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి గురించి చేసిన ప్రశంసలు.

‘టీడీపీ కంచుకోట నర్సాపురం. వైసీపీ వాళ్లు కాళ్లావేళ్లాపడి బతిమిలాడితేనే నేను పోటీ చేశా. అక్కడ జగన్ బొమ్మతో గెలిచే సీన్ లేదు. నా వల్లేనే చాలామంది ఎమ్మెల్యేలు గెలిచారు.  నేను జగన్ దయతో పార్లమెంటు స్టాండింగ్ చైర్మన్ కాలేదు. మోదీ దయతో స్పీకర్ గారు ప్రత్యేక కోటా కింద ఇచ్చారు. ఎవరి నుంచీ డబ్బులు తీసుకునే అలవాటు నాకు లేదు. గతంలో కూడా నేనెప్పుడూ జగన్‌ను ఆయన ఇంట్లో కలవలేదు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో కలిశాం.  నన్ను రాజీనామా చేయాలంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేస్తే, ఎవరు ఎవరి బొమ్మతో గెలుస్తారో చూద్దాం. కొట్టు సత్యనారాయణ ఓ దొంగ. ఆయన గురించి ఆయన మేనల్లుడే చెబుతాడు. మంత్రి రంగరాజు కుటుంబంపై ఎన్ని ఆరోపణలున్నాయో క లెక్టర్‌ను అడగండి. భూముల కొనుగోలులో కూడా డబ్బులు కొట్టేస్తున్నారు. దీనిగురించే మాట్లాడా.  నా నియోజకవర్గంలో ఓ  డాక్టర్‌కు  లారీ ఇసుక కూడా ఇప్పించలేకపోయా. ఇళ్ల పథకంలో అవినీతి జరుగుతోంది. ముఖ్యమంత్రి చుట్టూ కోటరీ ఉంది. ఆయన ఎవరికీ అపాయింట్‌మెంట్లు ఇవ్వడం లేదు’
– ఈ వ్యాఖ్యలు కూడా.. అదే నర్సాపురం  వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసినవే.

రఘురాముడు చెప్పింది అక్షర సత్యాలేనంటున్న వైసీపీ సీనియర్లు..

తన పార్టీ ప్రజాప్రతినిధుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించే వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి, ఆయన పార్టీకి  ఇప్పుడు  కంట్లో నలుసులా మారిన ఎంపి  రఘురమకృష్ణంరాజు వ్యవహారం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీడీపీలో కలవరం సృష్టించిన అచ్చెన్నాయుడు అరెస్ట్‌పై మంత్రులంతా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు. కానీ రఘురామకృష్ణంరాజు మాత్రం దానిని ఖండించటం వైసీపీకి ఇబ్బంది కలిగించింది. ‘ అచ్చెన్నాయుడు తప్పు చేస్తే చర్య తీసుకోవచ్చు. కానీ ఆయనను గోడదూకి మరీ అరెస్టు చేయాల్సిన అవసరం లేదు. ఆయనేమైనా బిన్‌లాడెనా? టీడీపీ నేతలు రోజుకొకరు అరెస్టవుతారని మంత్రులు చెప్పడం మంచిది కాదు. దానివల్ల వైసీపీ ప్రభుత్వం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ప్రజలు భావించే అవకాశం ఉంటుంది. అచ్చెన్నను పరామర్శించకుండా అడ్డుకోవడం మానవహక్కుల ఉల్లంఘన అవుతుంది’ అని చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీని ఇరుకునపెట్టగా, విపక్షానికి ఆత్మస్ఱైర్యం ఇచ్చినట్టయింది.
నిజానికి సీఎం అపాయింట్‌మెంట్, ఇసుక అక్రమాలు, ఇళ్లలో అవినీతి గురించి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యల్లో, అణువంత కూడా అబద్ధం లేదని వైసీపీ సీనియర్లు అంగీకరిస్తున్నారు. తమ ఎమ్మెల్యేలు, అధికారులు కలసి ఈ వ్యవ హారంలో దోచుకుతింటున్న విషయం తమకు తెలిసినప్పటికీ, దానిని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లేదని వాపోతున్నారు. తన అధినేత సీఎం అయిన ఆరు నెలల వరకూ పరిస్థితి అంతా కఠినంగానే కనిపించిందని, కానీ ఇప్పుడు ఎమ్మెల్యేలు సంపాదించుకునే పనిలోనే పడ్డారంటున్నారు.

రెడ్లకు.. ఇదేనా గౌరవం?

‘మేం గత రెండు ఎన్నికల్లో వైసీపీ కోసం పనిచేశాం. గత ఎన్నికల్లో అయితే సొంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఎమ్మెల్యే అభ్యర్ధి మా కులం కాకపోయినా, మా  రెడ్లను పట్టించుకోకపోయినా కేవలం జగన్‌పై అభిమానంతో గెలిపించాం. కానీ ఆయన ఇప్పుడు ఆయన తమ్ముడు, టీడీపీ హయాంలో బ్రోకరుగా పనిచేసిన పక్క నియోజకవర్గంలోని ఓ వ్యక్తిని అడ్డుపెట్టి, మా క్వారీలను ఆపతున్నారు. రెడ్ల ప్రభావం ఉన్న మా గ్రామాన్ని ఇతర కులాలకు ఇచ్చే ప్రయత్నాలు చేశారు. మాపై కేసులు పెట్టి అరెస్టు చేసి జైలుకు పంపించారు. మా ప్రభుత్వమే మమ్మల్ని జైలుకు పంపించిందంటే ఎమ్మెల్యేల హవా ఎలా ఉందో మీరే అర్ధం చేసుకోవచ్చు’ అని గుంటూరు జిల్లాకు చెందిన రెడ్డి సామాజిక వర్గ, వైసీపీ మండల పార్టీ నేత ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాము సీఎంఓ, సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో అంతటా ఉందని, రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలు.. రాష్ట్రంలో పార్టీ, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబించాయని చెబుతున్నారు.

సర్కారుపై సొంత పార్టీనే పెరుగుతున్న అసంతృప్తి స్వరాలు

151 మంది ఎమ్మెల్యేలతో ఏర్పాటుచేసిన జగన్ సర్కారుపై సొంత పార్టీ ఎమ్మెల్యేలోనే అసంతృప్తి ప్రారంభం కావడం విశేషం. దీన్ని అప్పుడే అసంతృప్తి అనడం భావ్యం కాదని, అయినా దీనిని మొగ్గలోనే తుంచకపోతే, అది పెరిగి పెద్దది కావడం ఖాయమని సీనియర్లు హెచ్చరించారు. ఈ విషయంలో ఎన్టీఆర్ చరిత్రను మర్చిపోకూడదంటున్నారు. నీటిపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఇసుకపై బోళ్ల బ్రహ్మనాయుడు, జగ్గిరెడ్డి తదితరులు చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వ పనితీరు, క్షేత్రస్థాయి వాస్తవాలకు అద్దం పట్టాయి.  ముఖ్యంగా.. ప్రజాప్రతినిధులకు సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడంపైనే వారిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఏ సీఎం కూడ గతంలో ఇలా వ్యవహరించలేదని, ఈ విషయంలో ఆయన కేసీఆర్‌ను ఆదర్శంగా తీసుకుంటే దెబ్బతింటారని స్పష్టం చేస్తున్నారు. ‘నెల్లూరు మాఫియాకు అడ్డాగా మారింది. ల్యాండ్, శ్యాండ్, లికకర్ మాఫియా, కబ్జాకోరులకు, బెట్టింగ్ రాయుళ్లకు అడ్డా అయింది. జగన్ ఏడాది పాలనలో కేకు సంబరాలు తప్ప, అభివృద్ధి లేదు. ఈ నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోతున్నామన్న ఆవేదన ఉంది. మాకు రావలసిన నీళ్లు ఏమవుతున్నాయి? అమ్ముకుంటున్నారా?  నీటి విషయంలో సీఎం జగన్ లేఖ ఇచ్చినా అమలుచేసే దిక్కులేదు. అసలు రాష్ట్రంలో వెంకటగిరి అనేది ఉందా? తొలగించేశారా? ఇక్కడ ఒక ఎమ్మెల్యే ఉన్నారని గుర్తుందా?  ఈ పరిస్థితి ఎప్పుడూ చూడలేద’ని మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలను  గుర్తు చే స్తున్నారు.

సీఎం నిర్లక్ష్యం సరికాదంటున్న సీనియర్లు..

అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానిస్తున్న సీఎం జగన్ విధానం సరికాదన్న అభిప్రాయం పార్టీ ప్రజాప్రతినిధులలో  వ్యక్తమవుతోంది.  ‘తాను గెలిపించిన ఎమ్మెల్యేలు కాబట్టి, నా బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేల కాబట్టి వాళ్లను కలవాల్సిన పనిలేదనుకోవడం తప్పు. నన్ను కలిస్తే ఏదో పనులు చెబుతారని భయపడటం ఇంకో తప్పు. మాపై స్థానికంగా అనేక విషయాల్లో ఒత్తిళ్లు, సిఫార్సులు వస్తాయి. అవి మా స్థాయిలో ఉండవు. సీఎం చెబితేనే జరిగే పనులు కూడా ఉంటాయి. కలెక్టర్లు, ఎస్పీ మా మాట వినడం లేదు. మరి ఆయన మాతో కలవకపోతే ఎలా? ఎవరికి చెప్పుకోవాలి? అందుకే కొన్ని విషయాలు మీకు లీక్ చేయాల్సి వస్తోంది. మీడియాలో వచ్చిచన తర్వాతనే స్పందన కనిపిస్తోంది. అందుకే అందరూ అదే పనిచేస్తున్నారు. ఇప్పుడు మేమంతా ఎక్కువగా విజయసాయిరెడ్డి గారినో, సజ్జల గారినో కలుస్తున్నాం. వాళ్లు చూద్దాం, చేద్దాం అంటున్నారు. కొన్ని పనులు వాళ్లు చెప్పినా జరగడం లేదు. ఇలాగైతే ఎలా? ఇప్పటికే మాకు జగన్ దగ్గర పలుకుబడి లేదని, మాకు ఆయన అపాయింట్‌మెంట్లు ఇవ్వరన్న చులకన భావం మొన్నటి వరకూ క్యాడర్, లీడర్లలోనే ఉండేది. ఇప్పుడు రఘురామకృష్ణంరాజు ఆ విషయం చెప్పిన తర్వాత, ఇక ప్రజల్లో కూడా మేం చులకన అయిపోతాం. అయినా జగన్ గారు చంద్రబాబు మాదిరిగా గంటలకు గంటలు సమీక్షలేం చేయడం లేదు కదా? మిగిలిన ఖాళీ సమయంలో మమ్మల్ని ఎందుకు కలవరు? మాకైనా, ఇంకెవరికైనా నడిచినంత కాలమే నడుస్తుంది. ఎప్పుడూ మనమే ఉంటామనుకోవడం భ్రమ. పవర్‌లో ఉన్న ఎవరికైనా అంతా పాజిటివ్‌గా కనిపిస్తుంది. కానీ గ్రౌండ్ లెవల్‌లో వాస్తవాలు భిన్నంగా ఉంటాయని ఎవరూ గుర్తించకనే దెబ్బతింటుంటారు. నేనూ మంత్రిగా చేశా. కానీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదు. వైఎస్‌గానీ, కిరణ్ గానీ, రోశయ్యగానీ ఇలా వ్యవహరించలేదు. చివరకు చంద్రబాబు కూడా వచ్చేముందో, వెళ్లేముందో ఎమ్మెల్యేలను కలిసేవార’ని ఓ సీనియర్ నేత, మాజీ మంత్రి వ్యాఖ్యానించారు.

రఘురామ్‌పై చర్య ఎలా…?

పార్టీ-ప్రభుత్వ విధానాలపై శరపరంపరగా అస్త్రాలు సంధిస్తున్న ఎంపి రఘురామకృష్ణంరాజుపై, ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక వైసీపీ నాయకత్వం తర్జన భ ర్జన పడుతోంది. ఆయన పై సస్పెన్షన్ వేటు వేస్తే నేరుగా బీజేపీకి జై కొడతారు. పోనీ, వదిలేస్తే జగన్ నాయకత్వం బలహీనమయ్యే ప్రమాదం ఉంది. అసలు సంజాయిషీ నోటీసు ఎలా ఇవ్వాలన్నది పెద్ద తలనొప్పిలా మారింది. ఏ కారణాలతో ఆయనకు షోకాజ్ ఇవ్వాలన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. రఘురామకృష్ణంరాజు.. ఇప్పటివరకూ మీడియా ముందుకొచ్చి చేసిన ఏ వ్యాఖ్యలూ, పార్టీకి ఏమాత్రం వ్యతిరేకంగా లేవు. పైగా ఆయనను చాలాసార్లు పొగిడారు. మూడు టర్ములు సీఎంగా ఉంటారని కొనియాడారు. చాలా కష్టపడుతున్నారని కూడా చెప్పారు. ఆ కోణంలో చూస్తే ఆయనకు  షోకాజ్ నోటీసు ఇవ్వడం సాధ్యం కాదు. అయితే, ఇసుక, ఇళ్ళ కేటాయింపులు, స్థలాల కొనుగోలులో జరుగుతున్న అవినీతిని సీఎం దృష్టికి తీసుకువెళుతన్నట్లు చెప్పారే తప్ప, అందులో సీఎంను గానీ, మంత్రిని గానీ బాధ్యులను  చేయలేదు. ఇక తనపై ఆరోపణలు చేసినందుకు ప్రతిగానే.. మంత్రి నానిని గానీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలపై సవాళ్లు విసిరారు.

మరి..  వారిపైనా కొరడా ఝళిపిస్తారా?

ఆ విషయంలో క్రమశిక్షణ చర్యల కింద నోటీసులిస్తే.. అవే నోటీసులు మంత్రి, పార్టీ ఎంపి అయిన రఘురాంపై విమర్శలు కురిపించిన ఎమ్మెల్యేలకూ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా.. గతంలో ప్రెస్‌మీట్ పెట్టి విమర్శలు కురిపించిన  ఆనం రామనారాయణరెడ్డి, అమరావతి నుంచి బయలుదేరిన ఇసుక మాయమవుతోందని ఆరోపించిన ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకూ, అధికారుల పనితీరుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుకూ  నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.  కాబట్టి రఘురామకృష్ణంరాజుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలియక తలపట్టుకోవలసి వస్తోంది. నిజానికి అటు రఘురామ్ కూడా, తొలి నుంచీ ఈ అంశంలో చాలా వ్యూహాత్మకంగానే మాట్లాడినట్లు ఆయన మాటల ధోరణి స్పష్టం చేస్తోంది.