ఫిరాయింపులపై బాబు-జగన్ దొందూ దొందే!

770

గతంలో 23 మంది వైసీపీ ఎమ్మ్యెలకు బాబు కండువా
ఇప్పుడు అదే బాటలో జగన్మోహన్‌రెడ్డి
రాజీనామా చేసి రావాలన్న షరతు అటకెక్కిందా?
నాడు అక్రమార్కులంటూ సొంత మీడియాలో కథనాలు
మరిప్పుడు వారి  మైనింగ్ అక్రమాల ఖాతా చింపేసినట్లేనా?
బాబు చేసిన తప్పులే జగన్ చేస్తున్నారనని వైసీపీ సీనియర్ల  విమర్శ
                     (మార్తి సుబ్రహ్మణ్యం)

చరిత్రలో ఏదీ దాగదు. అది ఏదీ దాచుకోదు. అయితే దానిని ప్రజలు పట్టించుకోరనుకోవడం పార్టీ అధినేతల భ్రమ లాంటి భావన. సదరు అధినేతలు చెప్పే నైతిక విలువలు, నీతివంతమైన రాజకీయాలు, పారదర్శక చర్యలన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాటిస్తారనుకోవడం  నేతిబీరకాయ చందమే. పార్టీ ఫిరాయింపులపై గతంలో సత్యహరిశ్చంద్రుడు కూడా సిగ్గుపడే విధంగా మాట్లాడిన అధినేతలిద్దరూ.. ఇప్పుడు తాము చెప్పిన విలువల వలువులు ఊడదీయడంలో, ఒకరికి మించి మరొకరు పడుతున్న పోటీ ‘నవ్విపోదురుగాక నాకేటి సిగ్గట్ట’న్నట్లు మారింది.  ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై గతంలో చంద్రబాబు నాయుడు నడిచిన బాటలోనే.. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి కొత్త చెప్పులతో నడుస్తున్న వైచిత్రి విమర్శలకు దారితీస్తోంది. ఫిరాయింపులపై… గతంలో బాబు చేసిన తప్పులే, ఇప్పుడు జగన్ కూడా చేస్తున్నారన్న విమర్శ సొంత పార్టీలో వినిపిస్తోంది.

ఫిరాయింపులపై బాబు అలా ముందుకెళ్లారు..

చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు.. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని వారందరినీ  లాగేస్తామని, నాటి విపక్ష నేత జగన్మోహన్‌రెడ్డి గవర్నర్ నివాసం వద్ద మీడియా సమక్షంలో హెచ్చరించారు. దానితో అప్రమత్తమయిన బాబు.. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ముందు జాగ్రత్తగా లాగేశారు. నాడు జగన్ నోరు జారకపోతే, ఫిరాయింపుల పర్వానికి తెరలేచి ఉండేది కాదేమో?! సరే.. పార్టీ ఫిరాయించిన వారికి పచ్చ కండువా కప్పే ముందు.. తమ ప్రభుత్వ పథకాలు చూసి వైసీపీ ఎమ్మెల్యేలు ఆకర్షితులయి, అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకు వచ్చారని చంద్రబాబు ప్రవచించారు. అటు ఎమ్మెల్యేలు కూడా.. బాబు ప్రభుత్వ పథకాలను చూసి, నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము టీడీపీలో చేరామని సెలవిచ్చారు. మరికొందరయితే, జగన్ వద్ద ఎమ్మెల్యేలకు కనీస గౌరవం లేదని విమర్శించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో టీడీపీ సరిగ్గా 23 ఎమ్మెల్యేలకే పరిమితమయింది. అది వేరే విషయం.

నాడు ఏపీలో అలా.. తెలంగాణలో ఇలా!

సీన్ కట్ చేస్తే.. తెలంగాణలో ఇదే విధానానికి సీఎం కేసీఆర్ తెరలేపినప్పుడు, ఇదే చంద్రబాబు విరుచుకుపడ్డారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేస్తున్నారని, కనీసం తెరాస ఎమ్మెల్యే కాని తలసాని శ్రీనివాసయాదవ్‌కు, మంత్రి పదవి ఎలా ఇస్తారని బాబు గర్జించారు. పార్టీ మారిన తమ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను తప్పుదోవపట్టించారని ఆరోపించారు. అయితే.. తెలంగాణలో పార్టీ మారిన తమను విమర్శిస్తున్న బాబు.. ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేలను ఏవిధంగా తన పార్టీలో చేర్చుకుంటున్నారు? మరి ఆయన చేస్తున్నది రాజకీయ వ్యభిచారం కాదా’ అని తెరాసలో చేరిన తలసాని శ్రీనివాసయాదవ్ పరుషపదజాలంతో బాబుపై విరుచుకుపడ్డారు.

ఫిరాయింపులపై నాడు  జగన్ ఫైర్..

ఈ ఫిరాయింపుల పర్వంపై వైసీపీ సభలో గర్జించింది. ఇది అప్రజాస్వామ్యమని, వారిని అనర్హులుగా గుర్తించి, అక్కడ తిరిగి ఎన్నికలు నిర్వహించాలని ఇదే జగన్ డిమాండ్ చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభాలాకు గురిచేసిందని ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారని, వారికి పనులు ఇప్పిస్తామని ఎర వేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. పార్టీ మారని వారిపై వేధింపులు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. దేవుడు స్క్రిప్టు రాస్తున్నాడని జగన్ హెచ్చరించారు. ఆ సమయంలో పార్టీ మారిన వైసీపీ ఎమ్మెల్యేల వ్యాపారాలతోపాటు, తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రులు-ఎమ్మెల్యేల అక్రమ మైనింగ్ వ్యాపారాలపై తన సాక్షి మీడియాలో కథనాలు కూడా వెలువరించింది.

ఆచరణకు నోచుకోని జగనన్న మాట..

తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ విజయదుందుభి మ్రోగించింది. 151 మంది ఎమ్మెల్యేలతో సభలోకి అడుగుపెట్టింది. ఆ సందర్భంలో.. ఎవరు పార్టీ ఫిరాయించినా వెంటనే వారి సభ్యత్వం రద్దు చేయాలని స్పీకర్‌కు సీఎం జగనన్న సభ సాక్షిగా సూచించారు. ఎవరైనా తమ పార్టీలో చేరాలనుకుంటే, వారు తమ పదవులకు రాజీనామా చేసి, రావాల్సిందేనని స్పష్టం చేశారు. ‘ ఫిరాయింపుల విషయంలో నాకూ,చంద్రబాబుకూ తేడా ఉండాలి కదా?’ అని కూడా వ్యాఖ్యానించారు. ఆ ప్రకారంగా.. ఫిరాయింపుల విషయంలో తనకు కొన్ని నైతిక విలువలు ఉన్నాయని, జగన్ తన గురించి తాను చెప్పకనే చెప్పారు. చంద్రబాబు మాదిరిగా తాను ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహించనని, ఒకవేళ వారు వచ్చినా కచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతనే తీసుకుంటానన్న సంకేతం ఇచ్చారు.

మాట తప్పి.. మడమ తిప్పిన జగన్!

పార్టీ మారే వారు కచ్చితంగా తమ పదవులకు రాజీనామా చేసి రావాలన్న జగన్ వ్యాఖ్యలు, అప్పట్లో  ప్రజాస్వామ్య ప్రియులను మెప్పించాయి. నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు చేయనిది… గతంలో ఎన్టీఆర్  అమలుచేసిన  ఈ సంప్రదాయాన్ని, జగన్ పాటించడంపై హర్షం వ్యక్తమయింది. కానీ, ఆచరణలో మాత్రం జగన్.. తాను కూడా ‘ఆ తానులో ముక్కనే’నని నిరూపించుకున్నారు. ఫలితంగా..  జగన్ మాట తప్పి మడమ తిప్పారన్న విమర్శలకు గురికావసి వచ్చింది. వల్లభనేని వంశీ, మద్దాలి గిరి, కరణం బలరాం టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీకి జై కొట్టారు. అయితే, వారు తెలివిగా తమ మెడలో కండువా వేయించుకోకుండా, తమ అనుచరులను చేర్పించారు. జగన్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. కరణం బలరాం అయితే, చంద్రబాబు వంటి అనుభవజ్ఞుడు యువకుడైన జగన్‌ను చూసి నేర్చుకోవాలని సలహా ఇచ్చారు. ఆయన కూడా తన కుమారుడు కరణం వెంకటేష్‌ను వైసీపీలో చేర్పించి, తాను మాత్రం సాంకేతిక కారణాల భయంతో  అధికారికంగా చేర కుండా ఉండిపోయారు. మరికొందరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా, వైసీపీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నారు.

నైతికతా? సాంకేతికతా?..  ఏది ముఖ్యం?

అయితే.. ఇప్పటివరకూ సాంకేతికంగా వైసీపీలో చేరకపోయినా ముగ్గురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు నైతికంగా వైసీపీలో చేరినట్టే లెక్క. వీరిలో కొందరు వైసీపీ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఆ ప్రకారంగా.. జగన్ చెప్పిన నైతిక సూత్రాలను పాటి స్తే, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలపై అప్పుడే  అనర్హత వేటు వేయాల్సి ఉంది. కానీ, ఇక్కడ సాంకేతిక కారణాలు చూపించడం బట్టి.. జగన్ కూడా సాధారణ రాజకీయ నాయకుడే తప్ప, ఆయనలో ఎలాంటి ప్రత్యేకతలు లేవని, ఆయన కూడా అందరిమాదిరిగానే మాట తప్పే నాయకుడేనన్న భావన స్థిరపడింది.  ఈ విషయంలో చంద్రబాబు-జగన్ దొందూ దొందేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

నాడు వారు అక్రమార్కులు.. నేడు విక్రమార్కులా?

వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా, టీడీపీ ప్రముఖులతోపాటు, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతల  వ్యాపారాల్లో జరుగుతున్న అక్రమాలపై.. జగన్ మీడియా పుంఖానుపుంఖాల కథనాలు రాసింది. అంతెందుకు? ఈ ఏడాది ఫిబ్రవరి 19న సాక్షి పత్రికలో… ప్రకాశం జిల్లాలో మైనింగ్ వ్యాపారాలపై ‘తవ్వేకొద్దీ అక్రమాలు’ పేరుతో ఒక ఆసక్తికర కథనం రాసింది. ఆ ప్రకారం.. చీమకుర్తి, బల్లికురవ, మార్టూరు ప్రాంతాల్లో  మైనింగ్ నిర్వహిస్తున్న కొన్ని కంపెనీలు, వందలకొట్ల రూపాయల రాయల్టీని దిగమింగాయని ఆరోపించింది. వీటిపై ఇతర జిల్లాలకు చెందిన మైనింగ్ అధికారులు విచారిస్తున్నారని, నోటీసులకు 15 రోజుల లోగా సమాధానం ఇవ్వకపోతే పర్మిట్లు ఇవ్వరని స్పష్టం చేసింది.   ఆ ప్రకారంగా కొన్ని కంపెనీలు చెల్లించాల్సిన పెనాల్టీలను కూడా క్యూబిక్ మీటర్లతో సహా టేబుల్ వేసి మరీ వెల్లడించింది.

అయితే.. ఆ కంపెనీలలో ఇటీవలే వైసీపీలో చేరిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, ఈపాటికే అనధికారిక ంగా చేరిన ఎమ్మెల్యే కరణం బలరాం, అద్దంకి  టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, రామారావు కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ జాబితాను కూడా సాక్షి వెల్లడించింది. ఆ ప్రకారంగా.. కరణం బలరాంకు చెందిన కెబి రాక్స్ 32 కోట్ల 63 లక్షల రూపాయలు, శిద్దారాఘవరావుకు చెందిన 28 కంపెనీలు కలిపి 888 కోట్ల 96 లక్షలు, గొట్టిపాటి రవికుమార్‌కు చెందిన సాయిలక్ష్మి గ్రానైట్స్, అంకమ్మచౌదరి, కిశోర్‌గ్రానైట్స్, కామేపల్లి గ్రానైట్స్, కిశోర్ శ్లాబ్స్ అండ్ టైల్స్, కిశోర్ బ్లాక్స్‌గోల్డ్ గ్రానైట్స్ కలిపి  303 కోట్ల 75 లక్షల చెల్లించాలని సాక్షి తన కథనంతో వెల్లడించింది. వీరంతా గ్రానైట్స్ తవ్వకాల్లో అక్రమాలకు పాల్పడ్డారని స్పష్టం చేసింది.

మరి జగన్ మీడియా చెప్పింది నిజమా? అబద్ధమా?

మరి ఇప్పుడు జగన్ అధికార మీడియా అక్రమార్కులుగా పేర్కొన్న అదే కంపెనీల యజమానులయిన..శిద్దా రాఘవరావు, కరణం బలరాం ‘అన్నలను’ జగన్ వైసీపీలో చేర్చుకున్నారు. ఆ ప్రకారంగా..  వైసీపీలో చేరకముందు అక్రమార్కులుగా ఉన్న వారంతా, వైసీపీలో చేరితే విక్రమార్కులవుతారా? అప్పుడు పాపాత్ములని ముద్ర వేసిన జగన్ మీడియా, ఇప్పుడు వారంతా పులుకడిగిన ముత్యాలని, తమ పార్టీలో చేరినందున వారెలాంటి పెనాల్టీలు చెల్లించాల్సిన పనిలేదని  సర్టిఫికెట్ ఇస్తారా? మరి నిజంగా వీరంతా అంతకుమందు తామే ఆరోపించినట్లు…  అక్రమార్కులయితే, మరి నీతి- నిజాయితీకి నిలువుటద్దమైన వైసీపీలో వారిని ఎలా చేర్చుకున్నారు? అంటే గతంలో వైసీపీ నేతలు, సొంత మీడియా చేసిన ఆరోపణలు తప్పని ఒప్పుకున్నట్లేనా? మరిప్పుడేం చేస్తారు?..  గతంలో సన్నబియ్యం విషయంలో తమ సాక్షి పత్రిక తప్పుగా రాసిందని జగన్ చెప్పినట్లు.. ఈ ప్రముఖులపై గతంలో తాము రాసింది తప్పని సవరణ లాంటి వివరణ  ఇస్తారా? అన్నది ప్రశ్న.

1 COMMENT

  1. […] నిజానికి.. ఉండవల్లి  వ్యాఖ్యలన్నీ  ఆగ్రహంతో చేశారా? అసంతృప్తితో చేశారా? లేక తన స్నేహితుడి కుమారుడు దారి తప్పుతప్పుతున్నారన్న ఆవేదనతో చేశారా? ఆయనను సక్రమమైన దారిలో నడవమని హితవు పలుకుతూ చేశారా? అన్నది పక్కకుపెడితే.. ఉండవల్లి చేసిన వ్యాఖ్యలన్నీ తమ అధినేతకు క నువిప్పు అయ్యేవేనన్న అభిప్రాయం మాత్రం, మెజారిటీ వైసీపీ నేతల్లో వ్యక్తమవుతోంది.ఇది కూడా చదవండి: శహభాష్.. సీఎం జగన్! ఉండవల్లి చేసిన వ్యాఖ్యలను సానుకూలదృక్పథంతో చూడాలని, వ్యవస్థలో ఎక్కడ లోపాలున్నాయో చెప్పిన ఉండవల్లి సూచనలను పరిగణనలోకి తీసుకుంటే, జగన్మోహన్‌రెడ్డికి తిరుగుండదన్న భావన వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. నిమ్మగడ్డ, కోర్టులతో పోరాటం, సోషల్‌మీడియాలో పోస్టింగు చేసిన వారిపై కేసుల వంటి అనవసర వివాదాలు కొని తెచ్చుకోకుండా.. మరో 30 ఏళ్లు ఆయనే సీఎంగా ఉండేలా సానుకూల ధోరణి ప్రదర్శిస్తే మంచిదంటున్నారు. నిజానికి నిమ్మగడ్డ గురించి నేరుగా జగనే మీడియాలో మాట్లాడటం.. అప్పట్లో చాలామంది మంత్రులు, సీనియర్లకు నచ్చలేదు. ఆ పనేదో మిగిలిన వారికి అప్పగిస్తే సరిపోయేదన్న అభిప్రాయం అప్పట్లోనే వినిపించింది.ఇది కూడా చదవండి: ఫిరాయింపులపై బాబు-జగన్ దొందూ దొందే! […]