బాధ్యత ఉండక్కర్లా?

113

మాస్కులు లేకుండా కనిపించిన ఏపీ ఎమ్మెల్యేలు
జగన్, మంత్రులు, ఎమ్మెల్యేలదీ అదే నిర్లక్ష్యం
మరి చలాన్లు ఎవరికి వేస్తారు సారూ?
ఎదుటివారికి చెప్పడానికేనా నీతులు ?
(మార్తి సుబ్రహ్మణ్యం)


ఒకరు ముఖ్యమంత్రి.  చుట్టూ వందమందికి పైగా శాసనసభ్యులు.  అంత పెద్ద పదవుల్లో ఉన్నవారికి సామాజిక బాధ్యత ఒకరు చెప్పాలా? మాస్కులు పెట్టుకోవాలని ఒకరు బోధించాలా?  ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా రక్కసి, తెలుగు రాష్ట్రాల్లోనూ రెక్కలు విప్పి స్వైరవిహారం చేస్తోంది. సీఎం నుంచి మంత్రుల వరకూ అందరిదీ ఒకటే పిలుపు. అంతా సామాజికదూరం పాటించాలి. మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. పైగా అవన్నీ అందరికీ పంపిణీ కూడా చేస్తున్నారు.  మరి ఈ నీతులన్నీ ఎదుటివారికి  చెప్పడానికేనా? వాటిని పాటించేందుకు ఆ మహానుభావులంతా అతీతులా?

తాజాగా ముగిసిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు… మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో.. కొన్ని సందర్భాలలో మహేష్,  ‘మీకు బాధ్యత ఉండక్కర్లా’ అని ప్రజాప్రతినిధులను, ఉల్లం‘ఫునులను’ చూపుడు వేలుతో ప్రశ్నించేలా కనిపించాయి!

రెండురోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాలు చూసిన వారికి, ప్రజాప్రతినిధులకు బాధ్యత ఉండక్కర్లా అన్న మహేష్ డైలాగు గుర్తురాకమానదు. సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి సహా కొందరు  మంత్రులు  కూడా మాస్కులు ధరించిన దాఖలాలు, భూతద్దం వేసి వెతికినా కనిపించలేదు. కొందరు మంత్రులు, మరికొందరు ఎమ్మెల్యేలు మాత్రమే మాస్కులు పెట్టుకుని కనిపించారు. ఇటీవల నగరిలో మాస్కు పెట్టుకుని, కిట్లు వేసుకుని, సామాజిక కార్యక్రమాలు వేసుకుని, పూలు కూడా చల్లించుకున్న ఎమ్మెల్యే రోజా కూడా.. తాజా సభలో మాస్కు లేకుండా దర్శనమివ్వడం ఆశ్చర్యం.

చివరకు బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు.. ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌రెడ్డి తన బృందంతో సీఎంను జగన్‌ను కలిశారు. కనీసం అప్పుడు కూడా ఎవరూ మాస్కులతో కనిపించకపోవడం బాధ్యతారాహిత్యమే కాదు కలవరం కలిగించే అంశం.  ఆ తర్వాత మహిళా ప్రజాప్రతినిధులు సీఎంను కలసిన సందర్భంలోనూ ఇద్దరు తప్ప, మిగిలిన ఆరుగురు ప్రజాప్రతినిధులు  మాస్కులతో కనిపించలేదు. అంతకుముందు.. సీఎం జగన్‌ను గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలు కలిశారు. వారిలో ఏ ఒక్కరూ మాస్కులు పెట్టుకున్నట్లు కనిపించలేదు. ఎమ్మెల్యేలు కరోనా కాలంలో జనంలో ఉంటూ.. మాస్కులు, శానిటైజర్లు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్నారు. ఆ క్రమంలో వివిధ రకాల వ్యక్తులను కలుస్తున్నారు. తాజాగా తెలంగాణలో ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక మాజీ ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్ లక్షణాలు బయటపడ్డాయి. ఏపీలో ఎమ్మెల్యే గన్‌మెన్ మృతి చెందారు. తమిళనాడులో సీఎం కార్యదర్శి కరోనాతో మృతి చెందారు. మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులకు కరోనా సోకింది. ఇంత భయానక పరిస్థితిలో కనీసం మాస్కులు కూడా పెట్టుకోకుండా, ప్రజాప్రతినిధులంతా సీఎంను కలవడం వల్ల ఎవరికి ప్రమాదం? ఆపాటి స్పృహ కూడా వారిలో లేకపోవడాన్ని ఏమనాలి? బాధ్యతారాహిత్యమా? నిర్లక్ష్యమా?

చట్టాలు చేసే ప్రజాప్రతినిధులే మాస్కులు పెట్టుకోకుండా కనిపిస్తే, వారంతా ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? ఎమ్మెల్యేలు పెట్టుకోకుండా మాకెందుకు చెబుతారని ప్రశ్తిస్తే అవమానం ఎవరికి? మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేస్తూ ఆ ఫొటోలను మీడియాలో ప్రచారం చేసుకుంటున్న ప్రజాప్రతినిధులు.. తాము మాత్రం వాటిని ఆచరించకపోవడం ఏం ఆదర్శం? అసెంబ్లీ అంతా సెంట్రలైజ్‌డ్ ఏసీ అన్న విషయం తెలిసి కూడా, మాస్కులు కట్టుకోవడం కనీస బాధ్యత అని తెలిసికూడా దానిని పాటించకపోవడం నిర్లక్ష్యమా? ధిక్కారమా? లేక   నిబంధనలు తమకు వర్తించవన్న ధీమానా?

మరి.. మాస్కులు లేని సామాన్యులకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్న పోలీసులు.. మాస్కులు లేకుండా అసెంబ్లీలో కూర్చున్న ప్రజాప్రతినిధులకు చలానా విధించే ధైర్యం ఉందా అన్నది ప్రశ్న. అటు తెలంగాణలో సీఎం కేసీఆర్ భారీ సంఖ్యలో నిర్వహించిన అధికారుల సమావేశంలో, అధికారులంతా మాస్కులతోనే హాజరయ్యారు. కానీ, ఏపీలో సీఎం నిర్వహించే సమీక్షలలో ఒకరిద్దరు తప్ప, మిగిలిన అధికారులెవరూ మాస్కులు ధరించకపోవడం బట్టి..  సామాజికబాధ్యతపై ప్రజాప్రతినిధులకు ఎంత శ్రద్ధ ఉందన్నది స్పష్టమవుతోంది. యధా రాజా.. తథా ప్రజ!