పనిమంతులకు పట్టం కడతారా?

720

తెలంగాణ బీజేపీ రాష్ట్ర కమిటీలో చోటెవరికి?
‘లిమిటెడ్ బ్రాండ్’కు తెరదించుతారా?
కమలం కొందరిదేనన్న అపవాదుపై ‘సంజయా’స్త్రం సంధిస్తారా?
టీడీ పీ-కాంగ్రెస్ నుంచివచ్చిన నేతలకు చోటిస్తారా?
నియోజకవర్గాల్లో నలుగుతున్న ఆ పార్టీల నేతలు
హైదరాబాద్‌లో పార్టీని ప్రక్షాళం చేయటం సంజయుడికి సాధ్యమేనా?
కలదళపతి సంజయుడి ముందు సమస్యలు వేయి
(మార్తి సుబ్రహ్మణ్యం)

భారతీయ జనతా పార్టీ తెలంగాణ దళపతిగా వచ్చిన ఎంపి సంజయ్‌కుమార్ ముందు రాష్ట్ర కమిటీ ఏర్పాటు సవాలుగా నిలిచింది. ఇప్పటివరకూ బీజేపై పడిన ‘హైదరాబాద్ పార్టీ’ ముద్రను తొలగించటం ఆయనకు పెద్ద సవాలు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటివరకూ గ్రామీణ ప్రాంతాల నుంచి అధ్యక్షులయిన వారి సంఖ్య అత్యల్పం. తెలంగాణలో చెన్నమనేని విద్యాసాగర్‌రావు తర్వాత, మరెవరూ రాష్ట్ర అధ్యక్షులు కాలేకపోయారు. ఇంద్రసేనారెడ్డి అధ్యక్షుడయినప్పటికీ, ఆయన రాజకీయ నేపథ్యం కూడా హైదరాబాద్ జిల్లాలోని మలక్‌పేట నియోజకవర్గమే. మళ్లీ సుదీర్ఘ విరామానంతరం.. కరీంనగర్ జిల్లాకు చెందిన సాగర్జీ తర్వాత, అదే జిల్లా నుంచి బండి సంజయ్‌కుమార్‌కు పగ్గాలివ్వడం ద్వారా.. బీజేపీ గ్రామీణ ప్రాంతాల వారినీ గుర్తిస్తుందన్న సంకేత ం పంపింది. ఇది కూడా చదవండి.. కమలదళాల డిమాండ్  తీర్చిన ఒవైసీ

అంతా ఆ అరడజను మంది చుట్టూనే…

నిజానికి తెలంగాణలో బీజేపీ అంటే… దత్తాత్రేయ, ఇంద్రసేనారెడ్డి, లక్ష్మణ్, బద్దంబాల్‌రెడ్డి, కిషన్‌రెడ్డి వంటి కొందరు మాత్రమే గుర్తుకొస్తారు. ఏ పదవులు వచ్చినా వీరి చుట్టూనే అవి తిరుగుతుంటాయన్న భావన దశాబ్దాల నుంచి స్థిరపడింది. రాష్ట్ర కమిటీలలో కొన్నేళ్ల నుంచి వీరి అనుచరులే కొనసాగుతున్నారు. పదవులు మారతాయే తప్ప, వ్యక్తులు మాత్రం మారరన్న ప్రచారం లేకపోలేదు. బండారు దత్తాత్రేయ గవర్నర్‌గా వెళ్లినా ఇంకా ఆయన- ఆయన వర్గ ప్రభావం కొనసాగుతోంది. ఇటీవలి సంజయ్ ఎంపికలో కూడా చాలా ప్రహసనం నడిస్తే గానీ, ఆయన అధ్యక్షుడు కాలేకపోయారు. ఇది కూడా చదవండి.. సంజయుడి ‘బండి’కి సీనియర్లు సహకరిస్తారా?

గ్రేటర్ హైదరాబాద్ పార్టీలో జరిగే పదవుల పంపకాలలో కూడా ఈ ప్రముఖుల అనుచరులకే పెద్దపీట దక్కుతున్న సంస్కృతి దశాబ్దాల నుంచి నడుస్తోంది. నగర కమిటీల్లో కూడా చాలామంది సీనియర్లు దశాబ్దాల నుంచి వివిధ పదవుల్లో పాతుకుపోయారు. విచిత్రమేమిటంటే .. వీరిలో 80 శాతం నాయకులకు, సొంత నియోజవర్గాల్లో పార్టీని కనీసం రెండవ స్థానంలో కూడా తీసుకువచ్చే సత్తా కూడా లేదు. అయినా సమర్ధత ప్రాతిపదికన కాకుండా, కేవలం సీనియారిటీ పేరు మీదనే వారంతా నెట్టుకొస్తున్నారు. సగానికిపైగా నాయకులు క్షేత్రస్థాయి పోరాటాలను ఏనాడో అటకెక్కించి, మీడియా ప్రకటనలతో కాలక్షేపం చేస్తున్న పరిస్థితి.

కేంద్రంలో అధికారంలో ఉన్నా..

బీజేపీ కేంద్రంలో మూడుసార్లు అధికారంలో ఉండి, టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. ఖైరతాబాద్, ముషీరాబాద్, మలక్‌పేట, కార్వాన్, గోషామహల్, ఉప్పల్, అంబర్‌పేట నియోజకవర్గాలు త ప్ప.. అదనంగా ఒక్క కొత్త సీటు కూడా సాధించలేకపోవడంబట్టి, హైదరాబాద్‌లో పార్టీ ఏ స్థాయిలో ‘సంప్రదాయ రాజకీయం’పేరిట చతికిల పడిందో స్పష్టమవుతోంది. కొత్త వారు పార్టీలోకొచ్చిన తర్వాత, వారిని గౌరవించకపోగా, అవమానించే సంప్రదాయం చాలాకాలం నుంచి కొనసాగుతోంది. దానితో విసుగుపుట్టిన నేతలు, వెనక్కి వెళ్లిపోతున్న పరిస్థితి నెలకొంది. ఇటీవల టీడీపీ నుంచి వచ్చిన ఓ సీనియర్ నేత, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో తన సొంతు ఖర్చుతో పారిశుద్ధ్య కార్మికులు, పార్టీ పేద కార్యకర్తలకు బియ్యం, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఇది కూడా చదవండి.. కరోనా కాలంలో కమలం కరసేవ!

దానికి లక్ష్మణ్, రామచందర్‌రావు, గరికపాటి మోహన్‌రావు, చాడ సురేష్‌రెడ్డి వంటి అగ్రనేతలు హాజరయ్యారు. అయితే ఈ పంపిణీ కార్యక్రమం కూడా ఫలానా చోట పెడతామని బతిమిలాడుకుంటే.. కుదరదు, మేం చెప్పినచోటనే పెట్టాలని భీష్మించుకోవడంతో, కొన్ని చోట్ల వాయిదా పడిన ఘటనలున్నాయి. ఇది ఒక్క సికింద్రాబాద్‌కే పరిమితమయిన వ్యవహారం కాదు. ఇతర పార్టీల నుంచి చేరిన వారి పరిస్థితి ఇదే! కొత్త వారు వస్తే ఎక్కడ తమ ఉనికికి ప్రమాదమోనన్న భయంతో మొదట్లోనే వారి ఉత్సాహాన్ని నీరుగారుస్తున్న సంస్కృతికి కొత్త అధ్యక్షుడు సంజయ్ చెక్ పెట్టకపోతే, పార్టీ లిమిటెడ్ కంపెనీగానే మిగిలిపోతుందంటున్నారు. ఇక నగరంలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొని, కనీసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చే దిక్కు కూడా లేకుండా పోయింది.ప్రస్తుత అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్‌రావుది ఒంటరి పోరాటంగానే కనిపిస్తోంది. ఇది కూడా చదవండి.. కేంద్ర నిధులతోనే కేసీఆర్ పథకాలు

సంజయ్ రాకతో పెరిగిన దూకుడు

స్వతహాగా దూకుడు నేతగా పేరున్న సంజయ్ అధ్యక్షుడయిన త ర్వాత, తెలంగాణలో పార్టీకి ఊపు వచ్చింది. ఇప్పటివరకూ తెలంగాణ రాజకీయ రంగస్థలంపై కాంగ్రెస్ నుంచి ఒక్క రేవంత్‌రెడ్డి మాత్రమే, కేసీఆర్‌ను ఢీ కొట్టగలరన్న అభిప్రాయం బలంగా ఉంది. కానీ, సంజయ్ వచ్చిన తర్వాత రేవంత్‌తో సమానంగా కేసీఆర్‌ను ఢీకొంటున్నారన్న భావన ఏర్పడింది. లక్ష్మణ్ మాజీగా మారినప్పటికీ, ఆయన కూడా కేసీఆర్ సర్కారుపై విమర్శనాస్ర్తాలు సంధిస్తున్నారు. ఆయనతో పాటు రఘునందన్‌రావు, డికె అరుణ, రామచందర్‌రావు, సంకినేని వెంకటేశ్వరరావు, చాడ సురేష్‌రెడ్డి, యుమునా పాఠక్ వంటి అతి తక్కువమంది మాత్రమే సర్కారుకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇది కూడా చదవండి.. బిజెపి-టీఆర్‌ఎస్ లెక్కల యుద్ధం!

వలస నేతలను స్థానం కల్పిస్తారా?

డాక్టర్ లక్ష్మణ్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, తెలుగుదేశం-కాంగ్రెస్ నుంచి చాలామంది నేతలు బీజేపీలో చేరారు. వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు,మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గఇన్చార్జుల స్థాయి నాయకులున్నారు. దీనితో పార్టీ బాగా బలపడుతోందన్న భావన కలిగించింది. కానీ, వారికి ఇప్పటిదాకా ఎలాంటి ప్రోత్సాహం లేదు. ఉదాహరణకు డికె అరుణను తీసుకుంటే.. కాంగ్రెస్‌ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయడంతోపాటు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాను శాసించారు. అదే జిల్లాలో టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌కు బలమైన అనుచర వర్గం ఉంది. ఆయనకు మాత్రం ఇటీవల జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇక ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ, ఉమ్మడి రాష్ట్ర యూత్ కాంగ్రెస్‌గా ఒక ఊపు ఊపిన పొంగులేటి సుధాకర్‌రెడ్డి కూడా బీజేపీలో చేరారు. ఆయనకూ పెద్దగా గుర్తింపు లేదు. ఇది కూడా చదవండి.. నిరంతర సేవా స్రవంతి.. కిషన్‌రెడ్డి!

మోత్కుపల్లి, పెద్దిరెడ్డి సంగతేమిటి?

టీడీపీలో సుదీర్ఘకాలం మంత్రి,ఎమ్మెల్యే, పొలిట్‌బ్యూరో సభ్యుడిగా పనిచేసిన దళిత నేత మోత్కుపల్లి నర్శింహులు కూడా, బీజేపీలో చేరడంతో నల్లగొండ జిల్లాలో పార్టీకి బలం పెరిగినట్టయింది. అంతకుముందు చాలా కాలం క్రితమే, అదే పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు బీజేపీలో చేరి,ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గ్రామీణ సమస్యలతోపాటు, రైతు సమస్యలపై సంకినేనికి మంచి అవగాహన ఉంది. ఇక టీడీపీలో ఉండగా కేసీఆర్‌పై యుద్ధం చేసిన వారిలో మోత్కుపల్లి ప్రముఖుడు. ఎవరికీ భయపడకుండా, సర్కారుపై యుద్ధం చేస్తాడన్న పేరున్న ఆయన సేవలను ఇంతవరకూ వినియోగించుకోకపోవడమే ఆశ్చర్యం. అనుభవం, జనంలో బలం ఉన్న మోత్కుపల్లి సేవలు వినియోగించుకుంటే,ఆయన చేసే యుద్ధంతో.. అటు మీడియాలోనూ పార్టీకి స్థానం ఉంటుందని చెబుతున్నారు. వరంగల్‌లో మాజీ ఎంపి చాడ సురేష్‌రెడ్డికీ విస్తృతమైన సంబంధాలున్నాయి. ఆయన కూడా పార్టీలో చేరినప్పటికీ,ఆయనకూ తగిన గుర్తింపు లేకుండా పోయింది. ఇక టీడీపీలో పొలిట్‌బ్యూరోస్థాయి నేతగా పనిచేసిన, మాజీ మంత్రి ఇనగాల పెద్దిరెడ్డికి మంచి వ్యూహకర్తగా పేరుంది. సమన్వయకర్తగా కూడా పేరున్న పెద్దిరెడ్డి సేవలు పెద్దగా వినియోగించుకుంటున్న దాఖలాలు లేవంటున్నారు.

గరికపాటి వెంట చేరిన వారి సంగతేమిటి?

ఇక టీడీపీలో ఎంపీగా కొనసాగుతూ, లక్ష్మణ్ హయాంలో బీజేపీలో చేరిన గరికపాటి మోహన్‌రావు వెంట.. వందలమంది టీడీపీ కార్యకర్తలు తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పార్టీలో చేరారు. సుమారు 25 వేలమందితో నిర్వహించిన భారీ సభ బీజే పీ నేతలనే నోరెళ్లబెట్టించింది. అప్పటివరకూ ఆ స్థాయిలో బీజేపీ నేతలెవరూ సభ నిర్వహించకపోవడమే దానికి కారణం. వారిలో మాజీ ఎమ్మెల్యేల, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జులు చాలామంది ఉన్నారు. మాజీ మంత్రి బోడ జనార్దన్, శశిధర్‌రెడ్డి, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్‌గౌడ్, పెరిక జగన్నాధం, ఈగమల్లేశం, బొట్ల శ్రీనివాస్,మేకల సారంగపాణి, అంజయ్య, శ్రీనివాస్, కోనేరు చిన్ని, శోభారాణి, లంకెల దీపక్‌రెడ్డి, ఎమ్మెన్‌రావు, పాల్వాయి రజనీకుమారి, మొవ్వ సత్యనారాయణ, శ్రీకాంత్‌గౌడ్, సామ రంగారెడ్డి, దుష్యంత్‌రెడ్డి, పుల్లారావుయాదవ్, మేకల హర్షకిరణ్ వంటి బీజేపీలో చేరారు.

టీడీపీ ప్రతి ఏటా నిర్వహించే మహానాడు, చంద్రబాబు పాదయాత్రలు, బస్సుయాత్రలతోపాటు, భారీ బహిరంగసభలకు సమన్వయకర్తగా వ్యవహరించిన గరికపాటికి ఓ ప్రత్యేక స్థానం ఉంది. అయితే అలాంటి ఆయన వెంట వచ్చిన వారికి, ప్రస్తుతం తగిన గుర్తింపు లేని పరిస్థితి ఏర్పడింది. దీనితో చాలామంది నేతలు, తాము పార్టీలో చేరి పొరపాటు చేశామా అని ఆలోచించుకుంటున్న వాతావరణం నెలకొంది. స్థానిక బీజేపీ నేతలు సైతం వారిని సమన్వయం చేసుకోవడం లేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది. అయితే, అందరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందని, ముందు నియోజకవర్గాల్లో పనిచేయాలని గరికపాటి వారికి హితవు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో.. వివిధ పార్టీల నుంచి వచ్చిన అగ్రనాయకులకు స్థానం కల్పించడంపైనే, సంజయ్ నాయకత్వ ప్రతిభ ఆధారపడి ఉందంటున్నారు.

మూస ఆలోచనలు పోతేనే భవిష్యత్తు..

నిత్యం క్షేత్రస్థాయిలో రాజకీయ ప్రత్యర్ధులతో యుద్ధం చేసే, టీడీపీ-కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తేనే పార్టీ కింది స్థాయికి వెళుతుంది. ఆ రెండు పార్టీలు అధికారం ఉన్నా, లేకున్నా ప్రజలు-మీడియా మధ్యలోనే ఉంటారు. ధర్నాలు చేయడం, ప్రజలను సమీకరించడం, వారికోసం అధికారుల వద్దకు వెళ్లి, పనులు చేయించే సంస్కృతిలో పనిచేయడంవల్ల, ప్రజలకూ వారిపై నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అవసరమైతే సొంత డబ్బు ఖర్చు పెట్టి, నియోజకవర్గంలో రాజకీయ ప్రత్యర్ధులను ఎదుర్కొనే ధైర్యం ఉన్నవారే, ఇప్పుడు పార్టీకి అవసరం ఉంది. మూస ఆలోచనలు, మూస నాయకులు, అదే 50 మందితో బహిరంగసభలు, ఇళ్ల నుంచి రాజకీయాలు చేసే బీజేపీ నాయకుల కంటే.. ప్రత్యర్ధులతోదేనికయినా సిద్ధపడే, కాంగ్రెస్-టీడీపీ నుంచి వచ్చిన వారికి పగ్గాలివ్వడమే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇది కూడా చదవండి.. సంజయుడి సారథ్యంలో కమలం విక సిస్తుందా?

కరుణాకర్ ఎక్కడ?

తెలంగాణ రాష్ట్రంలో ఇక గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలు ఒక్కటే మిగిలిన నేపథ్యంలో.. బీజేపీలో ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న నగర మాజీ అధ్యక్షుడు జి.ఆర్.కరుణాకర్ కనిపించకపోవడం చర్చనీయాంశమయింది. పార్టీలో అగ్రనేతల ఒంటెత్తు పోకడలు, ఏకపక్ష నిర్ణయాలు,దారి తప్పుతున్న సిద్ధాంతాలు, ఆర్గనైజేషన్‌లో తప్పులను ప్రశ్నించిన కరుణాకర్‌ను అగ్రనేతలు వ్యూహాత్మకంగా పక్కనపెట్టారు. అలాంటి ఫైర్‌బ్రాండ్ లేకపోవడంవల్లనే, కొద్దో గొప్పో బలంగా హైదరాబాద్‌లో కూడా, పార్టీ ఉనికి ప్రశ్నార్ధకంగా మారిందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. రాష్ట్ర కమిటీలో అలాంటి నేతలు ఉండటం వల్ల, గాడితప్పిన ఆర్గనైజేషన్ మళ్లీ పట్టాలకెక్కుతుందన్న వాదన వినిపిస్తోంది. ఇది కూడా చదవండి… బీజేపీ-టీఆర్‌ఎస్..శత్రుపక్షమా?మిత్రపక్షమా?