టీడీపీని బతికించిన అచ్చెన్న అరెస్ట్

369

ఈఎస్‌ఐ కుంభకోణంలో కార్మికమంత్రులంతా నిమిత్తమాత్రులే
సీఎంఓ చెప్పిందే కార్మికమంత్రులకు శాసనం
మెడికల్,హోర్డింగులన్నీ పలుకుబడి ఉన్న వారికే
అచ్చెన్న కార్యదర్శులపైనా నజర్?
నాటి కాపు కార్పొరేషన్ వ్యవహారాలపైనా నిఘా
సీఎంఓకు విద్యాదీవెన స్టడీసెంటర్ల ఎంపిక ఫైళ్లు?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడు అరెస్టుతో వైసీపీ సర్కారు తెలుగుదేశం పార్టీని బతికించింది. జగన్మోహన్‌రెడ్డి సర్కారు విధానాలపై ఇప్పటివరకూ మీడియా వేదికగా పోరాడుతున్న టీడీపీ.. అచ్చెన్నాయుడు అరెస్టుతో ఒక్కసారిగా రోడ్డెక్కింది. ఒక కీలక అంశం కోసంఎదురుచూస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు, అచ్చెన్న అరెస్ట్ బ్రహ్మాస్త్రంలా మారింది. ఇలాంటి అవకాశాలను వినియోగించుకోవడంలో అనుభవం ఉన్న బాబుకు, వైసీపీ సర్కారే ఆయుధం అందించినట్లు ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

అచ్చెన్న అరెస్టు.. టీడీపీకి కలసివచ్చిందా?


ఈఎస్‌ఐ మందుల కొనుగోలు వ్యవహారంలో భారీ అవినీతి జరిగిందంటూ, అప్పట్లో కార్మికమంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడును, జగ న్ సర్కారు నాటకీయ ఫక్కీలో అరెస్టు చేసిజైలుపాలు చేసింది. పైగా మూడురోజుల క్రితమే పైల్స్ ఆపరేషన్ చేయించున్న అచ్చెన్నను పోలీసులు అరెస్టు చేయడాన్ని టీడీపీ బాగా ప్రచారం చేసింది. దానికితోడు చంద్రబాబు స్వయంగా ఆసుపత్రికి వెళ్లడం, అక్కడ ఆయనకు అనుమతి నిరాకరించటాన్ని టీడీపీ కావలసినంత ప్రచారం చేసుకుంది. అచ్చెన్నను బీసీ నేతగాతెరపైకి తీసుకువచ్చి, ఓ బీసీ నేతను అన్యాయంగా అరెస్టు చేశారన్న ప్రచారంతో బీసీలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేసింది. ఇదంతా అచ్చెన్నకు సానుభూతిని పోగుచేయడంతోపాటు, టీడీపీకి రాజకీయంగా కలసివచ్చినట్లు జరుగుతున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇప్పటివరకూ రాష్ట్రంలో టీడీపీ నిస్తేజంగా ఉంది. కరోనా కూడా దానికి తోడవటంతో, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేసే అవకాశం లభించడంలేదు. చంద్రబాబు కూడా ఇప్పటివరకూ హైదరాబాద్‌కే పరిమితం కాగా, మిగిలిన నాయకులంతా జూమ్‌లోనే మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో వైసీపీ నేతల దూకుడుకు టీడీపీ నేతలు తాళలేకపోతున్నారు. దీనితో మొత్తం టీడీపీ వర్గాలలో నిరాశ ఆవహించింది.

అచ్చెన్నను అరెస్టు చేసి.. టీడీపీకి జగన్ అస్త్రాలిచ్చారా?

మరోవైపు శిద్దా రాఘవరావు వంటి అగ్రనేతలు కూడా వైసీపీ కండువా కప్పేసుకుంటున్నారు. మాజీ మంత్రి నారాయణ కూడా రేపో,మాపో వైసీపీలో చేరవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఆయన వియ్యంకుడైన గంటా శ్రీనివాసరావు కూడా, పార్టీ మారే అవకాశాలున్నాయన్న చర్చ జరుగుతోంది. పార్టీలో ఎంతమంది ఉంటారు?ఎంతమంది ఊడతారన్న బెంగ కొనసాగుతోంది. మరోవైపు పార్టీలోని సీనియర్లు హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలో విశ్రాంతి తీసుకుంటున్నారు. యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమ వంటి పదవులు అనుభవించిన నేతలంతా, మీడియాలో ప్రకటనలకు పరిమితమయ్యారు.

ఈ నిర్లిప్త, నిస్తేజ పరిస్థితిలో గొంతెత్తి మాట్లాడే అచ్చెన్నాయుడును అరెస్టు చేయటం టీడీపీకి కలసివచ్చింది. బీసీ నేతను అరెస్టు చేశారన్న నినాదాన్ని ఎత్తుకున్న టీడీపీ వ్యూహం, బీసీవర్గాలను బాగానే తాకినట్లు కనిపిస్తోంది. చివర కు అచ్చెన్నను అరెస్టు చేసిన తీరును వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు కూడా తప్పుపట్టడంతో జగన్ సర్కారు ఇరుకున పడాల్సివచ్చింది. అటు, వైసీపీ నేతలు సైతం అచ్చెన్నకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేస్తే సరిపోయేదంటున్నారు. ఆయనను బలవంతంగా తీసుకురావడం వల్ల అనవసర సానుభూతిని తామే తెచ్చి పెట్టామన్న వ్యాఖ్యలు వైసీపీ నేతల్లో కూడా వ్యక్తమవుతోంది. అటు.. స్తబ్దుగా ఉన్న పార్టీ శ్రేణులు కూడా అచ్చెన్న అరెస్టు వ్యవహారంతో ఒక్కసారిగా బయటకొచ్చి, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. దీన్నిబట్టి..అచ్చెన్నను అరెస్టు చేసి,జగన్ సర్కారే టీడీపీకి ఆయుధం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది.

తగిన శాస్తే జరిగిందంటున్న మరికొందరు నేతలు

కాగా అచ్చెన్న అరెస్టు వ్యవహారంపై టీడీపీలోని మరికొందరు నేతలు విభిన్నంగా స్పందిస్తున్నారు. అచ్చెన్న మంత్రిగా ఉన్న సమయంలో పార్టీ నేతలను లెక్కచేయలేదని, ఆయన పేషీ అంతా పీడించుకుని తిన్నదని వ్యాఖ్యానిస్తున్నారు. పేషీకి వచ్చిన పార్టీ వారిని కూడా వదిలిపెట్టలేదని గుర్తు చేస్తున్నారు. మందుల కంపెనీలు, హోర్డింగు కాంట్రాక్టుల కోసం వచ్చిన పార్టీ వారికి, చిన్న పనికూడా చేయలేదని గుర్తు చేస్తున్నారు. విదేశీవిద్యకు సంబంధించిన కోచింగ్ స్టడీసెంటర్‌ను తాను సిఫారసు చేస్తే, కనీసం పరిశీలించకుండా, వినుకొండకు చెందిన ఓ కమ్మ వ్యాపారి ద్వారా అన్ని వ్యవహారాలు చక్కదిద్దారని ఓ మాజీ మంత్రి చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు ఎవరినీ పట్టించుకోకుండా, అహంకారపూరితంగా వ్యవహరించారన్న వ్యాఖ్యలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అంత చేసినందుకు ఇప్పుడు తగిన శాస్తి జరిగిందని, అయితే కోర్టు నోటీసు ఇచ్చి, అరెస్టు చేస్తే సరిపోయేదని వ్యాఖ్యానిస్తున్నారు.

ఈఎస్‌ఐ ఆదేశాలన్నీ సీఎంఓల నుంచే..

అయితే, ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లు వంటి కీలక నిర్ణయాలన్నీ సీఎంఓ ఆదేశాల మేరకే జరుగుతాయని ఓ మాజీ మంత్రి చెప్పారు. ఇందులో కార్మికమంత్రులు నిమిత్తమాత్రులేనని, సీఎంఓ నుంచి ఎవరికి ఇవ్వమంటే వారికే ఇస్తారని చెబుతున్నారు. కాకపోతే మంత్రులు కొందరికి ఇచ్చుకునే వెసులుబాటు ఉంటుందని, మిగిలిన తెర వెనుక వ్యవహారాలన్నీ సీఎంఓ అధికారలే నడిపిస్తారంటున్నారు. కాకపోతే అచ్చెన్నకు గత ప్రభుత్వంలో ప్రాధాన్యం ఇచ్చినందున, సీఎంఓ పాత్ర తక్కువగా ఉండ వచ్చంటున్నారు. ఆ తర్వాత కార్మికమంత్రిగా వచ్చిన పితాని సత్యనారాయణ హయాంలో పగ్గాలు పూర్తిగా సీఎంఓ, మరో ప్రముఖుడి చేతిలోనే ఉన్నాయని చెబుతున్నారు. హోర్డింగ్స్ విషయంలో పితానిని నిమిత్తమాత్రుడిని చేసి, ఓ కీలక మంత్రి నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం కేటాయింపులు చేశారంటున్నారు. బాబు పాదయాత్ర చేసిన సమయంలో, పార్టీకి ఉచితంగా హోర్డింగులు ఇచ్చిన వారికి ఒక్క హోర్డింగు కూడా ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు.

కాపు కార్పొరేషన్ వ్యవహారాలపై సీఎంఓ నజర్?

అచ్చెన్న మంత్రిగా ఉన్న సమయంలో.. కాపు కార్పొరేషన్‌లో జరిగిన పలు హోర్డింగ్స్, స్టడీ సెంటర్ల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లన్నీ సీఎంఓకు చేరినట్లు చెబుతున్నారు. ఆ ప్రకారంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఓ స్టడీ సర్కిల్ అధినేతనే.. అచ్చెన్నతోపాటు, అప్పటి ఓ కీలక అధికారి, కాపు కార్పొరేషన్ మరో ముఖ్య అధికారి కలసి.. అర్హత లేని వారికి సైతం స్టడీ సర్కిళ్లు కేటాయించినట్లు తేలింద ని చెబుతున్నారు. ఆ సమయంలో దీనికి సంబంధించి.. నాటి చైర్మన్-కాపు కార్పొరేషన్ ఎండీ మధ్య జరిగిన బహిరంగ ఆరోపణలు-ప్రత్యారోపణలు, సీఎంఓకు చేసుకున్న ఫిర్యాదుల వ్యవహారాన్ని తాజాగా తవ్వితీస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో విద్యార్ధులు లేకపోయినా, ఉన్నట్లు రికార్డులు సృష్టించి ప్రభుత్వం ఇచ్చిన విదేశీ విద్య కోచింగు డబ్బును.. పెద్దమొత్తంలో నొక్కేసినట్లు సీఎంఓ అధికారులు గుర్తించినట్లు సమాచారం.

పేషీ పాత్రపైనా ఆరా?

కాగా అచ్చెన్న హయాంలో విజయవాడ, శ్రీకాకుళంలో పనిచేసిన పేషీ అధికారులు, సిబ్బంది కూడా ఈఎస్‌ఐ వ్యవహారంలో కీలకపాత్ర పోషించినట్లు సర్కారు భావిస్తోంది. శ్రీకాకుళంలో అచ్చెన్న వద్ద పనిచేసే ఒకరు, విజయవాడ పేషీలో పనిచేసే మరొకరు ఆయా సంస్థల అధికారులతో మంతనాలు జరిపినట్లు గుర్తించినట్లు సమాచారం. ఓ మహిళా అధికారి కూడా కాపు కార్పొరేషన్ స్టడీసెంటర్లలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. గతంలో కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన ఓ అధికారి-అచ్చెన్న పేషీ అధికారులు కలసి, కోచింగ్ సెంటర్ల ఎంపికలో కీలక పాత్ర పోషించినట్లు కనుగొన్నట్లు సమచారం.