ఏబీ కేసులో..  కోర్టు ధిక్కరణ!

591

తీర్పు ఇచ్చి 20 రోజులు దాటినా ఇవ్వని పోస్టింగ్
మళ్లీ కోర్టుకెళితే సీఎస్‌కు చిక్కులే
సీఎంలో సమర్ధులు లేకనే సమస్యలా?
మానవ హక్కుల కమిషన్లోనూ ఉల్లంఘనే
ఏపీకి లోకాయుక్త రాదేమిటి?
ఉప లోకాయుక్త నియామకమేదీ?
కోర్టుల పైనా ఇంత నిర్లక్ష్యమా?
సమీక్షలు చేసే వారేరీ?
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వరస వెంట కోర్టుల్లో అక్షింతలు పడుతున్నా ప్రభుత్వ తీరు మారడం లేదు. ఎక్కడో తమిళనాడులో ఉన్న మాజీ న్యాయమూర్తి కనగరాజను  రాష్ట్రానికి తీసుకువచ్చి, ఎన్నికల కమిషనర్‌గా కూర్చోబెట్టే శ్రద్ధలో.. కోర్టు ఇచ్చిన తీర్పులను వెంటనే  అమలుచేయాలన్న ఆలోచన పదోవంతు కూడా చూపించడంలేదు. ఫలితంగా జగన్మోహన్‌రెడ్డి సర్కారు చేస్తున్న నిర్లక్ష్యానికి, అధికారులు కోర్టు బోనెక్కాల్సిన దుస్థితి ఏర్పడింది.

చంద్రబాబు సర్కారులో నిఘా దళపతిగా చేసిన డిజి స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దానిపై హైకోర్టుకెళ్లగా.. ఏబీకి వెంటనే జీతంతోపాటు, పోస్టింగు కూడా ఇవ్వాలని ఆదేశించింది. అయితే, ఎప్పటిలోగా పోస్టింగు ఇవ్వాలన్నది తీర్పులో స్పష్టం చేయలేదు. ఇది జరిగి 20 రోజులు దాటింది. కోర్టు తీర్పు నేపథ్యంలో, తనకు తిరిగి పోస్టింగ్ ఇవ్వాలంటూ ఏబీ వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తీర్పు వచ్చిన మూడురోజుల తర్వాత వినతిపత్రం ఇచ్చారు. దానితోపాటు తీర్పు కాపీని జతపరిచారు. అయినా పదిరోజుల వరకూ ఎలాంటి స్పందన లేదు. దానితో మరో రెండుసార్లు తన పోస్టింగు విషయంపై నిర్ణయం తీసుకోవాలని ఏబీ మళ్లీ సీఎస్‌కు రాసిన లేఖలో గుర్తు చేశారు.

మళ్లీ చిక్కుల్లో సీఎస్?

అయినా దీనిపై సీఎస్‌లో చలనం కన్పించకపోవడంతో, తిరిగి కోర్టును ఆశ్రయించాలని ఏబీ భావిస్తున్నారు. ఒకవేళ ఆయన కోర్టు ధిక్కరణ కేసు వేస్తే, సీఎస్ మరోసారి కోర్టు ఎదుట హాజరుకావలసి ఉంది. ఇప్పటికే ఒకసారి కోర్టుకు హాజరైన సీఎస్.. మళ్లీ ఏబీ కోర్టు వేయనున్న  ధిక్కరణ కేసులో హాజరయితే, ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతినడం ఖాయం. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టులలో చేదు అనుభవాలు ఎదురవుతున్న ప్రభుత్వానికి, సీఎస్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కడం నగుబాటేనని అధికారులు చెబుతున్నారు. పాలకులు తీసుకునే నిర్ణయాలకు తాము కోర్టుల చుట్టూ తిరగవలసి వస్తోందన్న అసంతృప్తి ఇప్పటికే అధికారులలో స్థిరపడింది. ఇక మళ్లీ స్వయంగా సీఎస్ కోర్టు మెట్లు ఎక్కితే, జాతీయ స్థాయిలో కూడా తాము చులకన అవుతామని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సీఎస్.. కింకర్తవ్యం?

సహజంగా ఇలాంటి తీర్పు వచ్చినప్పుడు సీఎస్ సంబంధిత శాఖ అధిపతికి ఓ లేఖ రాస్తారు. మీ శాఖలో ఏ పోస్టు ఖాళీ ఉందో వివరాలివ్వాలని కోరతారు. అక్కడి నుంచి వచ్చిన ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను జతపరిచి, ముఖ్యమంత్రికి లేఖ రాస్తారు. ఖాళీగా ఉన్న పోస్టులలో సంబంధిత అధికారిని ఎక్కడ నియమించాలో సూచించాలని, సీఎస్ తన లేఖలో అభ్యర్ధిస్తారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనందున, ధిక్కరణ కింద తాను కోర్టుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి, సంబంధిత అధికారికి సంబంధించిన పోస్టింగు వ్యవహారాన్ని త్వరగా తేల్చాలని సీఎస్‌లు ముఖ్యమంత్రులను అభ్యర్ధిస్తుంటారు.

ఏబీ విషయంలో.. ఎలా?

అయితే, పోస్టింగ్ కోసం కోర్టుకు వెళ్లి విజయం సాధించే అధికారుల విషయంలో ప్రభుత్వానికి కొన్ని వెసులుబాట్లు ఉన్నాయి. సదరు అధికారికి జీతం ఆపే అధికారం లేదు కాబట్టి, పెండింగ్ జీతం ఇచ్చేస్తే సగం సమస్య పరిష్కారమవుతుంది. ఇక పోస్టింగ్ విషయంలో ప్రభుత్వానికి ఉన్న అధికారాల బట్టి వ్యవహరించవచ్చు. అంటే సదరు అధికారికి జీతం ఇస్తూనే, కంపల్సరీ వెయిట్’లో ఉంచవచ్చు. తర్వాత సదరు అధికారి ప్రవర్తన, విధేయత, వ్యవహారశైలి ప్రకారం తిరిగి ఎప్పడైనా పోస్టింగ్ ఇవ్వవచ్చు. లేదా లూప్‌లైన్ పోస్టింగ్ కూడా ఇవ్వవచ్చు. ఇదంతా ప్రభుత్వ విచక్షణ-సదరు అధికారి భవిష్యత్తు వైఖరిపై ఆధారపడి ఉంటుంది. మరి ఏబీ విషయంలో ప్రభుత్వం ఎలాంటి పద్ధతి వ్యవహరిస్తుందో చూడాలి.

బాబు బాటలో పయనిస్తారా?

ఈ విషయంలో గతంలో చంద్రబాబు నాయుడు వినూత్నంగా వ్యవహరించేవారు.  ఒక అధికారి పనితీరు నచ్చని పక్షంలో, ఆయనకు జీతం ఇస్తూనే ఆఫీసుకు రానవసరం లేదని చెప్పేవారు. రిటైర్డ్ అధికారి జెఆర్ ఆనంద్‌కు అదేవిధంగా ఇచ్చినట్లు సీనియర్ ఐఏఎస్‌లు గుర్తు చేస్తున్నారు. చివరకు జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత.. పోస్టింగు ఇవ్వని సతీష్‌చంద్రకు జీఏడీ ద్వారా, ఆయన స్కేలు ప్రకారం జీతం చెల్లించాలని నాటి సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం ఆదేశించారు. అయితే,  మరో సీనియర్ ఐఏఎస్ జెస్వీ ప్రసాద్ దాదాపు 7 నెలల పాటు జీతం లేకుండా వెయిటింగ్‌లో ఉన్నారు. ఈ విషయం  సీఎం జగన్ దృష్టికి వెళ్లగా.. ప్రసాదన్నకు జీతం ఆపేశారని నాకు తెలియదన్నా అని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. అంటే సీఎంఓలో ఏం జరుగుతోంది?

సీఎంఓలో సమర్ధులేరీ?

తన కార్యాలయంలో ఏ అధికారి ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయంపై కూడా జగన్‌కు పట్టులేదని దీనితో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎంలో సమర్ధులైన అధికారులు లేకపోవడం, కీలకమైన అంశాలపై ఎప్పటికప్పుడు చరుకుగా స్పందించే వారు, వాటిపై అవగాహన ఉన్న అధికారులు లేనందునే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అధికారులు వ్యాఖ్యానించారు. ‘సీఎం ఏం చెబితే అది చేయడమే తప్ప, ఆయన ఆదేశించే అంశాల వల్ల తలెత్తే సమస్యలు వివరించే ధైర్యం ఉన్న అధికారులు లేరు. సీఎం గారు అలాంటి వారిని సెలక్ట్ చేసుకున్నారు.అప్పుడు చంద్రబాబుకు ఆ విధంగా నచ్చచెప్పేవాళ్లం. మేం సబ్జెక్ట్ సూటిగా చెబితే బాబు గారు కన్విన్స్ అయ్యేవారు. ఇప్పుడు జగన్ గారు నేను చెప్పిందే చేయాలంటున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పే ధైర్యం సీఎంఓలో ఉన్న వాళ్లకెవరికీ లేదు. ఉన్న వాళ్లంతా జగన్‌గారి మాదిరిగానే వ్యవహరిస్తుంటే, ఇక మంచి చెడ్డలు ఎవరు చెబుతారు.మరి అజయ్‌కల్లంగారు కూడా ఎందుకు నచ్చచెప్పడం లేదో నాకు అర్ధం కావడం లేదు’  అని ఇటీవలే రిటైర్డ్ అయిన ఓ సీనియర్ ఐఏఎస్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో  ఏబీ వెంకటేశ్వరరావు విషయంలో, హైకోర్టు ఇచ్చిన తీర్పుపై  జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

మానవ హక్కుల కమిషన్ చైర్మన్ నియామకమేదీ?

ఏపీలో మానవ హక్కుల కమిషన్ ఏర్పాటుచేయాలన్న హైకోర్టు తీర్పును కూడా, జగన్మోహన్‌రెడ్డి సర్కారు తుంగలోతొక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న మానవ హక్కుల కమిషన్‌ను  రెండుగా విభజించారు. ఆ ప్రకారంగా ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న మానవ హక్కుల కమిషన్, తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌గా  కొనసాగుతోంది. అయితే అందులో విభజనకాలం నాడు పనిచేస్తున్న ఆంధ్రప్రాంత ఉద్యోగులే కొనసాగుతున్నారు. గతంలో ఉన్న కమిషన్ బోర్టు కూడా మారి, ఇప్పుడు కేవలం హైదరాబాద్ అన్న అక్షరాలకు పరిమితమయింది.

8 నెలలయినా కమిషన్ దిక్కులేదు..

నిజానికి అక్టోబర్ 31న నాలుగు నెలలోగా  హెచ్చార్సీని ఏర్పాటుచేయాలని హైకోర్టు ఆదేశించింది. అయితే రెండు నెలల్లోగా ఏర్పాటుచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దానికి స్పందించిన హైకోర్టు సీజీ.. నాలుగు నెలల గడువు తీసుకుని, ఆలోగా ఆఫీసు ప్రారంభించామన్న విషయాన్ని కూడా చెప్పాలని ఆదేశించారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం అడిగిన గడువు కంటే, హైకోర్టు రెండు నెలల అదనపు గడువు ఇచ్చిందన్న మాట! కానీ 8 నెలలు దాటుతున్నా .. హక్కుల కమిషన్ ఏర్పాటుచేయకపోవడం, కోర్టు ధిక్కరణ అవుతోందంటున్నారు.

ఏపీలో లోకాయుక్త ఏదీ..?

నిజానికి తెలంగాణ ప్రభుత్వం కూడా లోకాయుక్త, హెచ్చార్సీని కూడా హైకోర్టు ఆదేశాల మేరకే ఏర్పాటుచేసింది. అలాగే ఏపీలో లోకాయుక్తను హైకోర్టు ఆదేశాల మేరకే ఏర్పాటుచేసింది. అయితే ఉపలోకాయుక్త నియామకం ఇప్పటిదాకా చేయలేదు. కానీ, లోకాయుక్త ఇప్పటికీ హైదరాబాద్‌లోని హెరిటేజ్ మిల్డింగ్‌లోనే  ఉండటం గమనార్హం. తొలుత ఏపీలో విజయవాడలోని  ఆర్‌అండ్ బి భవనంలో ఏర్పాటుచే సింది. శ్రీకాంత్ నాగులపల్లి తదితర అధికారులు వచ్చి భవనాన్ని పరిశీలించి,  దానికోసం మరమ్మతులు కూడా చేయించారు. అయితే మూడు రాజధానుల అంశం తెరపైకి రావటంతో అది కాస్తా ఆగిపోయింది. మార్చి నుంచి రోజూ వాయిదాలే నడుస్తున్నాయి. ఈ మధ్యలో కరోనా వచ్చింది. దీనితో ఫిర్యాదు చేసేవారు, హైదరాబాద్ వరకూ వెళ్లడం ఇబ్బందిగా మారింది. ఈ వ్యవహారం అటు తెలంగాణ ఉద్యోగులు కూడా ఇంక్రిమెంట్ల విషయంలో నష్టపోతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తెలంగాణ ఉద్యోగులు చేసిన పోరాటానికి నజరానాగా తెలంగాణ సర్కారు… ఆ రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ, ఒక ప్రత్యేక ఇంక్రిమెంటు ప్రకటించింది. అయితే కమిషన్ విభజన కానందున, కమిషన్‌లో పనిచేసే తెలంగాణ నేపథ్యం ఉన్న ఉద్యోగులకు మాత్రం ఇంక్రిమెంటు నిలిచిపోయింది.

వైఎస్ హయాంలోనే ప్రారంభం.. మరి జగన్‌కు ఆ తొందరేదీ?

నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో మానవ హక్కుల కమిషన్‌ను దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 2005లో ఏర్పాటుచేశారు. జస్టిస్ సుభాషణ్‌రెడ్డిని చైర్మన్‌గా  నియమించారు. కానీ, విచిత్రంగా వైఎస్ కుమారుడు జగన్ విభజిత రాష్ర్టానికి సీఎం అయ్యారు.  కొత్త కమిషన్ ఏర్పాటుచేసే అవకాశం వినియోగించుకోకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తమిళనాడులో ఉన్న కనగరాజ్‌ను ఎస్‌ఈసీగా తీసుకువచ్చేందుకు శ్రద్ధ చూపిన జగన్.. తన తండ్రి హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన హక్కుల కమిషన్‌ను, కొత్త రాష్ట్రంలో ఏర్పాటులో చూపిస్తే బాగుండేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పేరిరెడ్డి వచ్చిన తర్వాతనే కమిషన్‌కు ఇమేజ్

అయితే హక్కుల కమిషన్‌కు మధ్యలో చాలామంది చైర్మన్లు, ఇన్చార్జి చైర్మన్లుగా వచ్చినప్పటికీ, కాకుమాను పెదపేరిరెడ్డి ఇన్చార్జి చైర్మన్‌గా వచ్చిన తర్వాతనే కమిషన్ నేరుగా ప్రజల వద్దకు వెళ్లింది. కొన్ని వేల కేసులు ఆ కాలంలో పరిష్కరించారు. అనేక సమస్యలను పత్రికా వార్తల ఆధారంగా సుమోటోగా తీసుకున్నారు. ఎస్పీ, కలెక్టర్లను కూడా కమిషన్‌కు పిలిపించారు. పెదపేరిరెడ్డి తీసుకున్న వేగవంతమైన చర్యలతో, సామాన్యులు కూడా కమిషన్ గడప తొక్కడంతో కేసులు వేలసంఖ్యకు చేరుకున్నాయి. ప్రస్తుతం ఏపీకి కమిషన్ లేకపోవడంతో, వస్తున్న ఫిర్యాదులు ఎలా పరిష్కరించారో అర్ధం కాక అయోమయంలో ఉన్నారు. ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్రంలో పనిచేస్తున్న ఏపీ ఉద్యోగులే, తెలంగాణ కమిషన్‌లో పనిచేస్తున్నారు. దీనితో తాము ఇబ్బందులు పడాల్సివస్తోందని ఆంధ్రా ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలోనే కమిషన్ ఏర్పాటుచేస్తే పదోన్నతులతోపాటు, కొత్త పోస్టులు కూడా వస్తాయంటున్నారు.