ఏడాదిలో.. సంక్షేమం ఫుల్‍..! అభివృద్ది నిల్‍..!

365

జగన్‍ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచింది. ఆరంభంలో విజయోత్సవ వేడుకలు, ఆ తరువాత వలంటీర్ల నియామకాలు, గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాట్లు జరిగాయి. నవరత్నాల అమలుతో సంక్షేమ కార్యక్రమాల పర్యవేక్షణ, రేషన్‍ కార్డులు, ఫించన్లు, మధ్యలో ఉపాధి హామీ నిధులు, 14వ ఆర్దిక సంఘం నిదులు చివరిలోకి వచ్చే సరికి కరోనా సమస్య ఎదురయింది. రాజకీయ ఆటు పోట్లు, ఆంతరంగిక సమస్యలు షరా మామూలే. ఈ ఏడాదిలో గతంలో నిలిచిపోయిన అభివృద్ది పనులు ప్రారంభించలేదు. కొత్త అభివృద్ది కార్యక్రమాలు చేపట్టలేదు. నవరత్నాలు అమలు చేయటం తప్ప అభివృద్ది చేసేందుకు నిధుల కొరతతో ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయాయి. అమరావతి రాజధానిని జగన్‍ ప్రభుత్వం నిలిపివేసింది.. మూడు రాజధానుల ప్రకటన చేసి ఆయా ప్రాంతాలు అభివృద్దిచేస్తామని చెప్పినా.. ఒక్క ప్రాంత అభివృద్దికే నిధులు లేవు.. మూడు ప్రాంతాల అభివృద్ది ఎలా చేస్తారని అడుగుదామంటు ముఖ్యమంత్రి అందుబాటులోకి రారు.ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోరు అని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మా ప్రభుత్వం సంక్షేమ పధకాలను అమలు చేస్తుంది. అభివృద్ది పనులు గురించి పట్టించుకోము అన్న చందంగా మంత్రులు, ప్రజా ప్రతినిధులు మాటలను బట్టి స్పష్టమవుతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. గతంలో 90 శాతం పూర్తయిన అభివృద్ది పనులు కూడా పూర్తి చేయటానికి నిధులు లేవని నిలిపివేశారు. రాజధాని అభివృద్ది నిలిచిపోయింది. ఐటీ అభివృద్ది ఆగిపోయింది. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గు ముఖం పట్టింది. అప్పులతో సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అభివృద్ది గురించి ఎవరూ పట్టించుకోవద్దు.. ఆ తరువాత నిధులు కేటాయిస్తానని జగన్‍చెప్పిన మాటలు ఎప్పటికి అమలు అవుతాయో.. అధికార పార్టీ ప్రతినిధులకు, అమాత్యులకే అంతుబట్టడం లేదట. సంక్షేమ పధకాలు, నవరత్నాలను అమలు చేస్తే.. చాలు మళ్లీ అదికారంలోకి వస్తాం.. అభివృద్దిని ప్రజలు పట్టించుకోరు అని జగన్‍కు నమ్మకం ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. చంద్రబాబు హయాంలో మారు మూల గ్రామాలలో కూడా అభివృద్ది జరిగింది. ప్రతి గ్రామంలో సిసి రోడ్లు వేశారు. సంక్షేమ పధకాల ఫలాలను అందజేశారు.

అయినా మెజార్టీ ఓటర్లు ఎన్నికలలో ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దీనిని బట్టి అభివృద్ది కన్నా.. అదాయమే మిన్నగా జగన్‍ భావిస్తున్నారని మెజార్టీ ఓటర్లు నమ్ముతున్నారు. మనకు రాజధాని లేదు.. అభివృద్ది జరగటం లేదు. ఐటి రంగం చతికిలపడిపోయింది.. మన పిల్లల భవిష్యత్తు ఏమిటని సంక్షేమ పథకాల ఫలాలను అందుకుంటున్న ఓటర్లు ఆలోచించటం లేదు. దీనిని జనాభిప్రాయంగా భావిస్తూ.. నవరత్నాలు అమలు చేస్తే… చాలు అభివృద్ది అవసరం లేదన్నట్లుగా పాలన సాగిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. అప్పులు తెచ్చి నవరత్నాలను అమలు చేసినా.. రేపు అప్పులు దొరకకుంటే.. రాష్ట్ర బడ్జెట్‍లో 90 శాతం నవరత్నాలు అమలుకే కేటాయించే అవకాశాలున్నాయని రాజకీయ పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు.