మోడల్ టౌన్‌గా పులివెందుల‌

194

పులివెందుల‌ అభివృద్ధిపై సీఎం జగన్‌ సమీక్ష
అమరావతి : పులివెందుల ఏరియా డెవలప్ మెంట్ ఏజెన్సీ (పాడా)పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. పులివెందుల మోడల్ టౌన్‌ను నాలుగు రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రణాళికను సిద్ధం చేశామని అధికారులు వివరించారు. 2053 వరకు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికను రూపొందించామని తెలిపారు. నగరంలో మంచినీరు, డ్రైనేజీ, మురుగునీటి శుద్ది ప్లాంట్ తదితర సదుపాయాలను కల్పిస్తున్నామని పేర్కొన్నారు. పాడా పరిధిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ నమూనాలను అధికారులకు సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ధిలో పులివెందులను మోడల్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న వసతులను కూడా కల్పించి ఆధునీకరిస్తున్నామని సీఎంతో చెప్పారు. వీధి వ్యాపారులకు రెండు, మూడు ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. సమీక్షా సమావేశంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాడా అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం నిర్మించే భవనాలు ఏళ్ళు గడుస్తున్నా కొద్దీ మరింత అందంగా కనిపించేలా నిర్మాణంలో జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. అలాగే ఉలిమెల చెరువును సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కింద అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మంచినీటి శుద్ధి ప్లాంట్ ను కూడా అనుబంధంగా ఏర్పాటు చేయాలన్నారు. చెరువు నుంచి పాడా పరిధిలో ప్రజలకు మంచినీటిని అందించే విధంగా ప్రణాళిలకు రూపొందించాలని పేర్కొన్నారు. పులివెందులలోని మెయిన్ రోడ్‌లో మార్పు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. శుక్రవారం జరిగిన ఈ సమీక్ష రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖామంత్రి బొత్స సత్యనారాయణ, కడప ఎంపి వైఎస్ అవినాష్ రెడ్డి, పలువురు అధికారులు పాల్గొన్నారు.