దొంగే.. దొంగా దొంగని అరచినట్టుగా ఉంది: అనిత

404

విశాఖ: టీడీపీ నేత, మాజిమంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు సంఘటన చూస్తుంటే.. ఒక దొంగే.. దొంగాదొంగని అరచినట్టుగా ఉందని తెలుగుదేశం పార్టీ నేత అనిత అన్నారు. అచ్చెన్నాయుడు అరెస్టుపై స్పందించిన ఆమె మీడియాతో మాట్లాడుతూ అనేక అవినీతి ఆరోపణల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి.. 16 నెలలు జైల్లో ఉండి వచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందో ఇవాళ జరగిన ఘటన ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. అసెంబ్లీలో గట్టిగా మాట్లాడి.. ప్రభుత్వం చేస్తున్న అన్యాయం, అవినీతిని ప్రశ్నించి, గట్టిగా వాదించగలిన ఏకైక నాయకుడు అచ్చెన్నాయుడని అన్నారు. అందుకే ఆయనపై కుట్ర చేసి.. దుర్మార్గంగా అరెస్టు చేశారని అనిత తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి జగన్ ప్రభుత్వాన్ని చూస్తుంటే సిగ్గేస్తుందన్నారు. ఈఎస్ఐ కేంద్రానికి సంబంధించిన సంస్థ అని, ఇందులో ఏపీకి ఎటువంటి సంబంధం లేదని అనిత అన్నారు. నోటీస్‌లో పేరు లేకుండా అచ్చెన్నాయుడుని ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు. అచ్చెన్నాయుడును అరెస్టు చేసి ఆయనను ఒక శక్తిలా ఈ ప్రభుత్వం మార్చిందన్నారు. ఆయనను అరెస్టు చేయడానికి 150 మంది పోలీసులు వెళ్లారని, ఆయనేమైనా తీవ్రవాదా? అని ప్రశ్నించారు. ఆయనొక ప్రజా ప్రతినిధి అని, ఆయన కుటుంబంలో ఎవరికీ నేర చరిత్రలేదన్నారు. ఉత్తరాంధ్రలో బీసీ వర్గానికి చెందిన మంచి నాయకుడని, వాళ్ల కుంటుంలోనే ముగ్గురు ప్రజాప్రతినిధులు ఉన్నారన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని అనిత వ్యాఖ్యానించారు.