జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి.. ధూళిపాళ్ల జోస్యం

276

మంగళగిరి: మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టుపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పందించారు. శుక్రవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన ఆయన.. అచ్చెన్న ప్రమేయం లేదని ప్రభుత్వ నివేదికలు చెబుతున్నా.. ఆయన్ను అరెస్టు చేయడం కక్షసాధింపు చర్యేనన్నారు. అసెంబ్లీలో ఆయన్ను ఎదుర్కోలేకే అరెస్ట్ చేశారని ఆరోపించారు. రాష్ట్రంలో బలహీన వర్గాల ప్రజానీకం రాజకీయంగా ఎదగడం ఇష్టం లేదా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించకూడదా… ఈ రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడం కోసం అధికారం ఇచ్చారన్నారు. కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డ ఎంతో మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. త్వరలో జగన్మోహన్ రెడ్డికి కూడా అదే గతి పడుతుందని జోస్యం చెప్పారు. ఆ రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. బలహీన వర్గాల ప్రజానీకం ఆలోచించుకోవల్సిన అవసరం ఉందని, బలహీన వర్గాల ఆత్మగౌరవ ప్రతీక టీడీపీ అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఏ ప్రజాప్రతినిధులు గళం విప్పుతున్నారో ఆ నేతలపై ప్రభుత్వం దాడి చేస్తోందని విమర్శించారు. ప్రజలు ఖండించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ కక్షసాధింపు మాత్రమేనని, ఆయన్ను ఎదుర్కోవడం కష్టం కాబట్టే… అచ్చెన్నాయుడును అరెస్ట్ చేయించారన్నారు.