పెద్ద తెర ‘పెదరాయుడు’ ఎవరు?

339
దాసరి పెద్దరికం కోసం పోరు?
చిరంజీవి-బాలయ్య చిటపటలు దానికోసమేనా?
బాలయ్య లేకుండా కేసీఆర్‌ను అందుకే కలిశారా?
దాసరి స్థానంపై చిరు కన్నేశారా?
సిని‘మా’ అసోసియేషన్ ఉత్సవ విగ్రహమేనా?
సినిమా రేట్లు పెంచే కుట్ర జరుగుతోందా?
టాలీవుడ్‌లో ఎవరి దుకాణం వారిదే!
(మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమా పరిశ్రమకు పెద్దదిక్కు ఎవరని ప్రశ్నిస్తే.. ‘ఇంకెవరూ..? దాసరి నారాయణరావు’ అని మూకుమ్మడిగా ఠక్కున సమాధానమొస్తుంది. అది అప్పుడు! ఆయన జీవించి ఉన్న కాలంలో!! ఆ పెదరాయుడి స్థానం, ఆయన దివంగతుడవటంతో ఖాళీ ఏర్పడింది. మరిప్పుడు సినిమా పెద్దన్న ఎవరు? అదిగో.. ఆ సీటు కోసమే ఇప్పుడు చిరంజీవి-బాలకృష్ణ మధ్య, ‘తెర’వెనుక కనబడని పెనుగులాట జరుగుతోందా? ఎవరి అడుగులో కళామతల్లి ముద్దుబిడ్డలు నడవాలన్న దానిపై ఏకాభిప్రాయం కుదరకనే ఈ లడాయి.. మెగా తముళ్లు బడాయి మాటలు మాట్లాడుతున్నారా? మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమ, ఒక దాసరి లాంటి పెదరాయుడు కోసమయితే ఎదురుచూస్తోంది. ఇది పక్కా! కాకపోతే అందరినీ సమన్వయపరిచే పెద్దన్న ఎవరన్నదే ఇప్పుడు పెద్ద పంచాయితీ!! అందుకే ‘సమరసింహారెడ్డి’ తొడకొడుతుంటే, సై.. ‘రా’ అంటూ మీసం మెలేసి సవాళ్లు విసురుకుంటున్నారా?.. అందుకే ముఖ్యమంత్రులను కలిసే యవ్వారం అంతా ముసుగులోనే జరుగుతోందా?.. ఈ తెరవెనుక ‘వేషాలు’ చూడాలంటే ఫిలింనగర్‌కు వెళ్లాల్సిందే.. వెళ్లొద్దాం రండి..

టాలీవుడ్‌లో ఎవరి దుకాణాలు వారివే..

తెలుగు సినిమా పరిశ్రమలో ఎవరి దుకాణాలు వారివి. ఎవరి కులాలు వారివి. ఎవరి ఇగోలు వారివి. అంతా ప్రముఖులే. ఎవరి బడాయి వారికుంది. వీరిలో ‘ఎవరైతే నాకేంటి’ అనే విప్లవ నాయకులూ లేకపోలేదు. బహిరంగంగానే ఈ ముఠా నాయకుల తీరుపై ‘అంకుశం’ సంధించి, పెత్తతాన్ని రిన్ సబ్బుతో కడిగే ‘యాంగ్రీ’ యంగ్‌మ్యాన్లూ ఉన్నారు. ఎవరి మాట వినని ‘సీతయ్య’లూ, నిగ్గదీసి అడిగే  సీతక్కలూ ఉన్నారు. సరే జోకర్లు తెరపైనే కాదు, తెరవెనుక ఎప్పుడూ ఉంటారనుకోండి. ‘శవం తమ్ముడిదయినా కంపు కామనే’నని రాంగోపాల్‌వర్మ సినిమాలో చెప్పినట్లు, ఈ జోకర్లు లోపల, బయటా కామనే!  అన్నట్లు మధ్యలో.. అష్టావధానంలో అప్రస్తుత ప్రసంగంలా, ‘నేనూ ఉన్నానని’ నిరూపించుకునేందుకు కొందరు ‘హీరో తమ్ముడన్నయ్య’లూ ఈమధ్య ట్వీటాటలాడుతున్నారు. సొంత యూ ట్యూబ్ చానెళ్లలో ‘జాతినుద్దేశించి’ ‘జబర్దస్త్’గా ప్రసంగిస్తుంటారు. సరే.. ఇక సాయంవేళల్లో ‘టీవీ కామెడీ చర్చలు’ కడుపుబ్బ నవ్వించడానికి ఎలాగో ఉండనే ఉన్నాయి.  ఈలోగా అభిమాన సంఘాలు, సోషల్ మీడియాలో చేసే చర్చల్లాంటి రచ్చతో కృష్ణానగర్ ఆగమాగమవుతోంది.

దా‘సరిలేరు నీకెవ్వరూ’…


దర్శకరత్న దాసరి విడిచివెళ్లిన పెద్దరికం హోదా కోసం ఇప్పుడు, టాలీవుడ్‌లో తెరవెనుక కనిపించని హోరాహోరీ పోరు నడుస్తోందని ఫిలింనగర్ టాక్! దాసరి బతికున్నప్పుడు ఏ చిన్న సమస్య వచ్చినా, అంతా ఆయన దగ్గరకు వెళ్లేవారు. ఆయనే అన్నింట్లోనూ చొరవ తీసుకుని సమస్యలు పరిష్కరించేవారు. దాసరి అంటే గిట్టని సినీ ప్రముఖులు సైతం, ఆయన మాట గౌరవించేవారు. దాసరిని తెర వెనుక ఎన్ని తిట్టిపోసినా, వేదికపైకొచ్చి మేమంతా ఒకటే, మాది కళామతల్లి కుటుంబమని మైకులు పగలకొట్టేవారు.
విరోధులయినా కౌగిలించుకుని, ఫొటోలకు ఫోజులిచ్చేవారు. అసలు ఆ వేదికపై వారు చూపించే అనురాగం, ఆప్యాయత, టన్నుల కొద్దీ ఒలకపోసే అభిమానం చూసి, భట్రాజులే ఈర్ష్య  పడేవారు. ఆ బాపతు యాక్షన్, ఓవరాక్షన్ ఇప్పుడూ కనిపిస్తుందనుకోండి. కానీ, ఇప్పటిమాదిరిగా బహిరంగంగా విమర్శించుకోవడం, క్రమశిక్షణ కట్టుతప్పడం వంటి సీన్లు, దాసరి ఉన్నప్పుడు అంతగా కనిపించేవి కాదు. ఏదేమైనా దాసరి బతికున్నప్పుడు, సినిమా రంగం క్రమశిక్షణగానే కనిపించిందన్నది మాత్రం వాస్తవం.

ఆ స్థానం కోసమే వెటరన్స్ ఆరాటం..

ఇప్పుడు దాసరి మాదిరిగా టాలీవుడ్‌ను తమ భుజస్కంధాలపై వేసుకునేందుకు, ఇద్దరు ‘వయసుమళ్లిన హీరోల’ మధ్య ఆసక్తికరమైన యుద్ధం జరుగుతోంది. దాసరి సామాజికవర్గానికే చెందిన మాజీ మెగాస్టార్,  ప్రజారాజ్యం పార్టీ మాజీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఎంపి, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నారంటున్నారు. ప్రస్తుతం చిరంజీవికి సినిమాలు లేవు. అయితే, ఇది సుతరామూ నచ్చని, ఎమ్మెల్యే కమ్ హీరో నందమూరి బాలకృష్ణ ఒంటరిగానే ఆ ప్రయత్నాలను అడ్డుకుంటున్నారన్నది మరో టాక్. ఆ మాటకొస్తే బాలయ్య చేతిలో కూడా పెద్ద సినిమాలేవీ లేవు. అరవైఏళ్లు పూర్తి చేసుకున్న ఈ ఇద్దరూ వెటరన్సే.

దాసరి-చిరంజీవికి ఎప్పుడూ వైరమే..


నిజానికి చిరంజీవి-దాసరికి ఎప్పుడూ పొసగేది కాదు. ఇద్దరివీ భిన్నధృవాలు. అనేక వేదికలపైనా, ఇంటర్వ్యూలలో కూడా, దాసరి పరోక్షంగా చిరంజీవిపై వ్యాఖ్యలు చేసేవారు. చిరు పార్టీ స్థాపించిన సమయంలో దాసరి ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమిళంలో విజయం సాధించిన కత్తి సినిమాను తెలుగులో  రీమేక్ చేసే విషయంలో, వారిద్దరి మధ్య ఏర్పడిన వివాదంపై సోషల్‌మీడియాలో అనేక కథనాలు వచ్చాయి. ‘సినిమాల్లో ఎన్టీఆర్, రజీకాంత్, అమితాబ్ మాత్రమే సూపర్‌స్టార్లు. మిగిలినవారంతా ఉత్తి స్టార్లే’నని దాసరి, పరోక్షంగా చిరుపై సెటైర్లు సంధించారు. చిరు ప్రజారాజ్యం పెట్టిన తర్వాత ఆయనపై తీసిన మేస్త్రీ సినిమా అంతా చిరుపై సెటైర్లతోనే సాగడం సంచలనం సృష్టించింది. ‘స్టోరీలో దమ్ములేకుండా 150వ సినిమా అయినా ఆడద’ని బాంబు పేల్చారు. ‘అడ్రస్ లేని వాళ్లుకు అడ్రసిస్తే మిడిసిపడతున్నార’ని చేసిన దాసరి వ్యాఖ్య, అప్పట్లో సినీ పరిశ్రమను కుదిపేసింది. అంతకుముందు చిరంజీవి తన వల్లే పైకొచ్చారని దాసరి చాలా సార్లు చెప్పడాన్ని విస్మరించకూడదు. సినిమాల నుంచి లబ్ధిపొందిన వాళ్లు సినిమా పరిశ్రమకు ఏమీ చేయడం లేదని చిరుపై దాసరి మరో విమర్శనాస్త్రం సంధించారు. దీన్నిబట్టి వారిద్దరి మధ్య విబేధాలు ఏ స్థాయిలో ఉండేవో ఊహించుకోవచ్చు.

రాంచరణ్‌నూ వదలని దాసరి..

దాసరి అప్పట్లో చిరు కొడుకు, రాంచరణ్‌నూ విడిచిపెట్టలేదు. ‘ఇప్పటి హీరోలకు డాన్సులు తప్ప యాక్టింగ్ తెలియదు. అయినా ఓవరాక్షన్‌కు కొదవలేదని’  విమర్శించారు. దానికి కోపం వచ్చిన రాంచరణ్.. ‘గొప్ప దర్శకులుగా పిలవబడేవాళ్లు, ఇప్పుడు వేదికలమీద ప్రసంగాలకే పరిమితమవుతున్నారు.నోరు తప్ప మరేమీ కదపలేకపోతున్నార’ని దాసరి బాడీైసైజుపై పరోక్షంగా సెటైర్ వేశారు. ‘కోతి కల్లుతాగితే ఎలా ప్రవర్తిస్తుందో తెలుసు కదా? అదే కోతికి మైకు దొరికితే ఏం చేస్తుందో మీరే ఊహించుకోండని’ రాంచరణ్ చేసిన ట్వీట్, దాసరికి ఆగ్రహం కలిగించింది. ఓ ఫంక్షన్‌లో దాసరి చేసిన వ్యాఖ్యలపై.. చిరు మేనల్లుడు అల్లు అర్జున్ కూడా ఘాటుగా స్పందించటం దాసరికి మనస్తాపం కలిగించింది. ఈ విధంగా చిరంజీవి కుటుంబంపై దాసరి.. మెగాస్టార్ చిరంజీవిపై దాసరి మధ్య జరిగిన యుద్ధాన్ని, ఇప్పుడు సినిమాపక్షులు గుర్తు చేస్తున్నాయి.

కాపు ఉద్యమంలో కీలకపాత్ర..


కాపు రిజర్వేషన్ ఉద్యమంలో దాసరి పాత్ర అనిర్వచనీయం. అలాంటి కాపు కార్డు గుర్తింపు ఉన్న తనను.. చిరంజీవి అదే కార్డుతో దాటివెళ్లడం, దాసరికి నచ్చేదికాదు. ఓసారి నేను పనిచేసిన ఓ పత్రికాధిపతితో కలసి, దాసరిని ఆయన నివాసంలో దాదాపు 2 గంటలు భేటీ అయ్యాం. రాజకీయాల్లో కులాల ఆధిపత్యం, సినిమా ముచ్చట్లు ఆ భేటీలో దొర్లాయి. ఆ సందర్భంలో చిరంజీవి తన పార్టీని విలీనం చేసి, తద్వారా తన కేంద్రమంత్రి పదవి కోసం ఆరాటపడుతున్నారని దాసరి  మనసులోమాట బయటపెట్టారు. అందుకు గోల్డ్‌స్టోన్ ప్రసాద్ అనే వ్యక్తి, కాంగ్రెస్ హైకమాండ్‌తో మధ్యవర్తిత్వం చేస్తున్నాడన్నారు.

కాపులను కాంగ్రెస్ వైపు తీసుకువచ్చేందుకు తాను చేసిన కృషిని, దాసరి గుర్తు చేశారు. ఆ సందర్భంలో, వంగవీటి మోహన్‌రంగా-ముద్రగడ-కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వాలను ప్రస్తావించారు. చంద్రబాబు తనను గౌరవిస్తాడు కానీ అతనిని నమ్మలేమన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయ భవిష్యత్తు ఉందని అంచనా వేశారు. ఈ సమయంలో ఒక రాజకీయ పార్టీ అవసరం ఉందని, కాపు-బీసీలు కలిస్తే అధికారం ఖాయమని చెప్పారు. ఇంకా ఈవిధంగా చాలా వ్యాఖ్యలు, మా సంభాషణలో దొర్లాయి. ఆ తర్వాత ముద్రగడ ఉద్యమం, ఆందోళన విషయంలో మాత్రం దాసరి-చిరంజీవి ఒకే వేదికపైకి వచ్చారు.

బాలయ్య ఫైర్‌తో సీన్ రివర్స్..


ఇక తాజా పెదరాయుడు హోదా కోసం జరుగుతున్న పోరులో చిరంజీవి, ఒక అడుగు వేయడం ఆసక్తికలిగించింది. ఆయన నాయకత్వంలో.. నాగార్జున, మరికొందరు నిర్మాత, దర్శకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.  అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో చర్చించారు. దానితో సహజంగానే తెలుగు సినిమాకు, చిరంజీవి పెదరాయుడన్న భావన ఏర్పడింది.
అయితే, దీనిపై ఆగ్రహించిన నందమూరి బాలకృష్ణ.. ఆ సమావేశానికి తనను పిలవలేదని, వాళ్లంతా స్థలాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిశారని చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది.ఇది కూడా చదవండి.. చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!దీనితో పలువురు హీరోలు, నటులు బాలయ్యను కలసి అంతర్గతంగా  తమ మద్దతు ప్రకటించారు. ఈలోగా చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా.. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ చేసిన ట్వీట్ బాలయ్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఆ తర్వాత కూడా నాగబాబు వరసగా బాలయ్యపై తన యూ ట్యూబ్ చానెల్, ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ ఘటన తె లుగు సినిమా పరిశ్రమలో ఉన్న చీలికను స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి.. గ్యాంగ్ లీడర్లా..? బ్యాండ్ లీడర్లా?

అమరావతి ప్రస్తావన లేకుండానే ఏపీకి..

మళ్లీ కొద్దిరోజుల క్రితం ఇదే బృందం ఏపీ సీఎం జగన్‌ను కలిసింది. అందులో కూడా బాలయ్య లేరు. అదేరోజు తన పుట్టినరోజు ఉన్నందున రాలేకపోతున్నానని, చిరంజీవికి చెప్పినట్లు భోగట్టా. అయితే, మా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శితోపాటు, ఎక్కువ సినిమాలు చేస్తున్న ప్రస్తుత హీరోలు, నిర్మాతలు లేకుండానే.. చిరంజీవి కొంతమందిని ఎంపిక చేసుకుని, కేసీఆర్-జగన్ వద్దకు తీసుకువెళ్లడంపై ఆగ్రహం వ్యక్తమవుతోందట. అయితే, రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతునివ్వాలని కోరుతూ, చిరు బృందం ఉన్న గెస్ట్‌హౌస్‌కు రైతులు వెళ్లారు. సిని‘మా’కు తప్పని రాజధాని సెగ కానీ వారెవరూ రైతులను కలవకుండానే సీఎం వద్దకు వెళ్లారు. దీనిపై ఆగ్రహించిన రైతులు, అమరావతి వద్దు గానీ అమరావతిలో భూములు కావాలా అని విరుచుకుపడ్డారు. ఇది కూడా చదవండి.. రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?

చిరుకు పెదరాయుడు కిరీటం దక్కదా?

నిజానికి పరిశ్రమలో చిరంజీవిని అభిమానించే వాళ్లు ఎంతమంది ఉన్నారో, వ్యతిరేకించే వారూ అంతమంది ఉంటారు. మోహన్‌బాబు చాలాసార్లు చిరంజీవిని విమర్శిండం, అందుకు ప్రతిగా చిరంజీవి-పవన్ కూడా మోహన్‌బాబుపై సెటైర్లు వేయడం తెలిసిందే. అయితే, బాలకృష్ణను మాత్రం అన్ని వర్గాలూ అభిమానిస్తాయి. తనను పిలవకుండానే కేసీఆర్‌ను కలసిన చిరు బృందానికి, ఝలక్ ఇచ్చేందుకు బాలయ్య త్వరలో, అదే కేసీఆర్‌ను కలవబోతున్నట్లు సమాచారం. ఇప్పటి పరిస్థితి ప్రకారం చిరంజీవిని పెదరాయుడిగా అంగీకరించేందుకు, సినీ పెద్దలు సుముఖంగా లేన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికయితే దాసరి సీటు ఖాళీ. కాకపోతే చిరంజీవి ముందుజాగ్రత్తగా కర్చీఫ్ వేశారంటున్నారు!