న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆర్డినెన్స్ రద్దు వ్యవహారంపై దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం విచారణ జరిపింది. మంత్రిమండలి సలహా మేరకు గవర్నర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను నియమించడం చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చిందని, కోర్టు ఆదేశాల ప్రకారం గతంలో నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదని ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాకేష్‌ ద్వివేది వాదనలు వినిపించారు. కోర్టు తప్పుపట్టిన నిబంధనతో నియమించబడిన రమేష్ కుమార్ తిరిగి ఎలా కొనసాగింపబడతారని ప్రశ్నించారు. పిటిషనర్‌ వాదనతో ఏకీభవించిన ‍న్యాయస్థానం.. న్యాయవాది‌ లేవనెత్తిన అంశాలపై రెండు వారాల్లోగా సమధానం చెప్పాలని మాజీ కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌తో సహా ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తాజా వివాదంపై పిటిషనర్‌ (ప్రభుత్వం) లేవనెత్తిన అంశాలపై వాదనలు వింటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇరువర్గాల వాదనలు వినేందుకు నోటీసులు జారీచేశామని తెలిపింది. అలాగే హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నిమ్మగడ్డ రమేష్ తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే లండన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వాదనలు వినిపించారు. కాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పదవీ కాలాన్ని, సర్వీసు నిబంధనలను సవరిస్తూ జారీచేసిన ఆర్డినెన్స్‌ను హైకోర్టు రద్దుచేయడంపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో జూన్‌ 1న పిటిషన్‌ దాఖలు చేసింది.

By user

Leave a Reply

Close Bitnami banner