‘గాంధీ’లో.. ఈ దారుణాలు ఏందీ?

520

కరోనా సేవలు కరవు
నిర్లక్ష్యంపై నిలదీస్తున్న వీడియోలు
వైద్యం అందక జర్నలిస్టు మృతి
తాజాగా జూనియర్ డాక్టర్ల ధర్నా
మంత్రి ఈటెల హామీతో విరమణ
చావులు, ధర్నాలతో గాంధీ ఆగమాగం
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణలో అతి పెద్దదయిన గాంధీ సర్కారు ఆసుపత్రి ఇప్పుడు దారుణాలకు కేంద్రంగా మారింది. కరోనా కేసులు చూసే కోవిడ్ ఆసుపత్రిగా మార్చిన ఆ ఆసుపత్రిలో కరోనా రోగులకు కనీస సౌకర్యాలు లేవంటూ చనిపోయే ముందు ఓ జర్నలిస్టు తన మిత్రుడితో చేసిన చాటింగ్.. తాజాగా కరోనాతో ఆసుపత్రిలో చేరిన మరికొందరు జర్నలిస్టులు వ్యక్తం చేసిన ఆవేదన, ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇవి చాలదన్నట్లు.. జూనియర్ డాక్టర్ల మెరుపు ధర్నాతో గాంధీ దవాఖానా ఆగమాగమవుతోంది.

సకాలంలో వైద్యం అందక జర్నలిస్టు మనోజ్ మృతి..

ఇటీవల కరోనా పాటిజివ్ లక్షణాలతో గాంధీలో చేరిన టివి-5 జర్నలిస్టు మనోజ్.. తనకు సరైన చికిత్స అందించడం లేదని తన మిత్రులతో చాటింగ్ చేశారు. ఐసియులో పరిస్థితులు బాగాలేవని, ఆక్సిజన్ పెట్టడం లేదని, తనను ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లాలని వేడుకున్నాడు. వాటికి సంబంధించిన వీడియోలు కూడా పంపించాడు. అది సోషల్‌మీడియాలో హల్‌చల్ అయింది. దానితో గాంధీలో కరోనా రోగులకు ఏ స్థాయిలో వైద్యం అందుతుందో బయట ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత మనోజ్ మృతి చెందాడు. అంటే చనిపోతూ కూడా మనోజ్ విధినిర్వహణ చేశాడన్నమాట!

‘గాంధీ’ నరకప్రాయం..

అయితే, తన సోదరుడు మనోజ్ మృతికి.. గాంధీ వైద్యులు సకాలంలో స్పందించకపోవడమే కారణమని, ఆయన సోదరుడు ఆరోపించారు. ‘గాంధీ ఆసుపత్రి నరకప్రాయంగా ఉంది. 12 గంటలపాటు నా తమ్ముడికి వైద్యం కూడా అందించలేదు. మల్టీవిటమిన్ టాబ్లెట్ ఇచ్చి వార్డులో బెడ్ కేటాయించి చేతులు దులిపేసుకున్నారు. సకాలంలో వైద్యం చేసి ఉంటే నా తమ్ముడు బతికేవాడు. చివరకు వాడు చనిపోయాడన్న విషయం పోలీసుల ద్వారా తెలుసుకోవలసి వచ్చింద’ని కళ్లనీళ్లపర్యంతమయ్యాడు.

ఆకలేస్తే.. అన్నం కూడా పెట్టరా?

కరోనా కేసులతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకునే రోగులకు, మెరుగైన చికిత్స అందిస్తామని కేసీఆర్ సర్కారు గొప్పలు చెబుతోంది. వారికి పౌష్టికాహారం ఇస్తామని, దానికోసం ఎన్ని కోట్లయినా ఖర్చు పెడతామని ప్రెస్‌మీట్లలో చెప్పేవ న్నీ, డాంబీకాలేనన్నది జర్నలిస్టుల రోదనలు బట్టబయలు చేశాయి. కనీసం తాగడానికి మంచినీరు, తినడానికి తిండికూడా పెట్టని సర్కారు నోటి నుంచి వందలు-వేల కోట్ల ఖర్చు మాటలు రావడం వింతల్లో వింత. మరి కోవిడ్ పేరుతో చేస్తున్న ఖర్చంతా ఎక్కడికి వెళుతున్నందన్నది ప్రశ్న.

టాబ్లెట్లు కూడా ఇవ్వలేదన్నా..

కరోనా పాజిటివ్ లక్షణాలతో ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చేరిన, ముగ్గురు జర్నలిస్టుల రోదన కూడా సోషల్‌మీడియా ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. ‘‘అన్నా మేం ఆరో ఫ్లోర్‌లో ఉన్నాం. ఇక్కడికి ఎవరూ రావడం లేదు. బెడ్లపై పడుకున్నాం. మంచినీళ్ల బాటిల్ కూడా ఇవ్వలేదన్నా. చాయ్‌కూడా లేదన్నా. మేం ముగ్గురం ఉన్నాం. మేము తినలేదని చెప్పినా వినలేదు. నేనొక బిస్కట్ ప్యాకెట్ తెచ్చుకున్నా. టాబ్లెట్లు కూడా ఇవ్వలేదు. వార్డులో 15 మంది వరకూ ఉన్నారు. వాష్‌రూములు మూడున్నాయి. డాక్టరయితే ఎవరూ రాలేదు. మాకు ఆకలేస్తోందన్నా. అడిగితే తెచ్చిస్తామంటున్నారుగానీ రావడం లేదు. వేరే వార్డులో నీళ్లు తెచ్చుకున్నా. ఏం లేదన్నా.. కొంచెం ఫుడ్డు పెడితే కంగారు పడకుండా ఉంటం. ఆకలితో ఎట్ల ఉంటమన్న? రాత్రి నుంచీ ఏం తినలేదన్నా. ఆకలేస్తోంది’’ అని ఆ గాంధీ వార్డులో చికిత్స కోసం చేరిన, ఓ జర్నలిస్టు మాట్లాడిన  తాజా ఆడియో పరిశీలిస్తే.. నిర్లక్ష్యానికి గాంధీ ఆసుపత్రి నిలువుద్దంలా నిలిచిందన్నది స్పష్టమవుతోంది. చివరాఖరకు.. ఓ జర్నలిస్టు మరణించిన రెండురోజులకు, గాంధీలో జర్నలిస్టుల కోసం కరోనా వార్డు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ వార్డుకు మనోజ్ పేరు కూడా పెట్టినట్లు సెలవిచ్చింది. చావు కబురు చల్లగా చెప్పడమంటే ఇదేనేమో?!

జర్నలిస్టులకు ఇదేం శిక్ష?: రేవంత్

‘‘కరోనాపై యుద్ధంలో ముందువరసలో నిలబడిన సైనికులలో ఒకరైన జర్నలిస్టులకు ఇదేం శిక్ష’’ అని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జర్నలిస్టు మృతి చెందాడని ఆయన ఆరోపించారు. మృతి చెందిన జర్నలిస్టు కుటుంబానికి, 50 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఒక్కో జర్నలిస్టులకు నెలకు 10 వేల రూపాయల సాయం చేయాలని, 50 లక్షల రూపాయల బీమా కల్పించాలన్నారు. గాంధీలో వైద్యులకు- రోగులకు రక్షణ లేకుండా పోతే, ఇక కేసీఆర్ సర్కారు ఏం చేస్తోందని నిలదీశారు. గాంధీ వైద్యుల ధర్నాకు మద్దతునిచ్చేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేతలను అడ్డుకోవడం కేసీఆర్ నియంతృత్వానికి నిదర్శనమని రేవంత్ విరుచుకుపడ్డారు.

జూనియర్ల మెరుపు ధర్నా..


ఓ వైపు కరోనా కేకలతో జర్నలిస్టు, సామాన్యులు అల్లాడుతుంటే, మరోవైపు డాక్టర్లపై రోగి బంధువులు చేసిన దాడి వ్యవహారంతో గాంధీ ఆసుపత్రి ఆగమాగమవుతోంది. ఇప్పటికే తమకు రక్షణ కరవయిందంటూ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్, మంత్రి ఈటెల సైతం వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. వైద్యులపై దాడి చేసిన ఘటన తర్వాత, కేంద్రహోం మంత్రి అమిత్‌షా కూడా స్పందించి.. వైద్యులపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

తప్పులు మీవి.. శిక్షలు మాకా?

తాజాగా గాంధీలో చేరిన ఓ రోగి కాలుజారి మృతి చెందాడు. అయితే చాలాసేపటి వరకూ వైద్యులు రాలేదని, రోగి మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ రోగి బంధువులు డాక్టర్లపై దాడికి దిగిన వైనం సంచలనం సృష్టించింది. అందుకు నిరసనగా.. గాంధీ డాక్టర్లు, జూనియర్లు బుధవారం ఆసుపత్రి బయటకొచ్చి రోడ్డుపై ధర్నాకు దిగారు. అడ్మినిస్ట్రేటివ్ తప్పులకు డాక్టర్లు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రావాలని డిమాండ్ చేశారు. తమకు సరైన సౌకర్యాలు కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా డాక్టర్లకు సంఘీభావంగా తెలంగాలోని అన్ని జిల్లాల్లో జూనియర్ డాక్టర్లు ధర్నాలు నిర్వహించారు. వారికి మద్దతు పలికేందుకు వచ్చిన కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వరరెడ్డి, గూడూరు నారాయణరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు.

‘గాంధీ’కి ఈటెల

ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో, వైద్యమంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా గాంధీ ఆసుపత్రికి హుటాహుటిన వచ్చారు. ఈ సందర్భంగా వారు మంత్రికి తమ డిమాండ్లు వినిపించారు. గాంధీతోపాటు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనూ కరోనా చికిత్స అందించాలని డిమాండ్ చేశారు. వైద్యులకు రక్ష కల్పిస్తామని హామీ ఇవ్వడంతో, వైద్యులు ఆందోళన విరమించారు.

పోలీసులకూ తప్పని కరోనా కాటు..

అటు గాంధీ ఆసుపత్రిలో విధి నిర్వహణ చేస్తున్న పోలీసులకూ, కరోనా కాటు తప్పడం లేదు. చిలకలగూడ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న యువ అధికారికి పాజిటివ్‌గా తేలడంతో, ఆయన అక్కడే చికిత్స పొందారు. దీనితో పోలీసుస్టేషన్‌లో విధి నిర్వహణ చేస్తున్న సీఐ గంగిరెడ్డి సహా ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు 45 మంది పరీక్షలు చేయించుకోగా నెగటివ్ వచ్చింది. కాగా లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి విధినిర్వహణ చేస్తున్న చిలకలగూడ ఇన్స్‌పెక్టర్ గంగిరెడ్డి ఇంటికి దూరంగా ఉంటున్నారు. పోలీసుస్టేషన్‌లోనే పడుకుంటున్నారు. ఎవరైనా పరిచయస్తులు రోడ్డుమీద  కనిపించినా, దయచేసి ఇళ్ల నుంచి బయటకు రావద్దని హితవు చెబుతున్నారు. నలుగురు ఎస్‌ఐలు కూడా కరోనా కాలంలో ప్రజలను అప్రమత్తం చేయడంలో బిజీగా ఉన్నారు. కాగా, గాంధీలో డ్యూటీలంటేనే పోలీసులు హడలిపోతున్న పరిస్థితి ఏర్పడింది. దాదాపు 45 మంది సిబ్బంది గాంధీలో డ్యూటీలు చేస్తున్నారు.