వారికి వైఎస్‌ జగనే కరెక్ట్‌ : నాగబాబు

285

అమరావతి : వరుస వివాదాస్పద ట్వీట్లతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న నటుడు, జనసేన నేత నాగబాబు మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలతో రెచ్చిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకూల పత్రికలను టార్గెట్‌గా చేసుకుని విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ జెండాను, అజెండాను మోస్తున్న కొన్ని తెలుగు వార్తా ఛానల్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తోందని ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వారికి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, అవసరం తీరాక బోడి మల్లయ్య అనే ఇలాంటి వారికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డినే కరెక్టని అభిప్రాయపడ్డారు. ఆయన ఎవరిని ఉద్దేశిస్తూ ట్వీట్‌ చేశారో స్పష్టంగా చెప్పనప్పటికీ చంద్రబాబు నాయుడుని పల్లకిలో మోస్తున్న కొన్ని మీడియా ఛానల్స్‌ని టార్గెట్‌ చేసినట్లు స్పష్టమవుతోంది. ‘టీడీపీ జెండాని, అజెండాని మోస్తున్న కొన్ని తెలుగు ఛానల్స్‌ చూస్తుంటే ముచ్చటేస్తుంది. టీడీపీ ఉప్పు తిన్న విశ్వాసాన్ని, ఆ పార్టీ పట్ల వాళ్లకున్న అనురాగం, చంద్రబాబు నాయుడు మనోడే అన్న అభిమానం, చంద్రబాబు కోసం ఎంతకయినా తెగించే సాహసం. వారికి ఉపయోగపడినంత కాలం ఓడ మల్లయ్య అని, బాబోరి తప్పుల్ని ఎత్తి చూపిస్తే బోడి మల్లయ్య అంటూ ప్రతిపక్ష పార్టీ నాయకులను చక్కగా విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రయోజనాలను కాపాడే రక్షణ కవచాలుగా మీడియా చూపిస్తున్న తెగువ, బాబుగారికి దగ్గరగా వుండే బాబులను కూడా ముద్దు చేసే వారి మమతానురాగాలు.. వావ్‌ ఇదీ అసలైన వార్తా పత్రికల స్పిరిట్ అంటే..శభాష్. ఒక్కోసారి వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి గారే వీళ్ళకి కరెక్ట్ అనిపిస్తుంది.’ అని ట్విటర్‌ వేదికగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.