గ్యాంగ్ లీడర్లా..? బ్యాండ్ లీడర్లా?

726

స్థలాలు, స్టుడియోలు, సినిమా హాళ్లు, సినిమా రేట్లు
ఇవేనా జగన్‌తో హీరోల ముచ్చట విశేషాలు?
అమరావతి గురించి అడిగే దమ్మెవరికీ లేదా?
జనసేనాని పవన్, రాజశేఖర్‌కు పిలుపేదీ?
టికెట్ల డబ్బులు కావాలి గానీ రైతుల ఇక్కట్లు పట్టవా?
అమరావతిపై మాట్లాడరు గానీ అక్కడ భూములు కావాలా?
సినీ స్టార్లకు అమరావతి రైతుల సెగ
రీల్ హీరోలే.. రియల్ హీరోలు కాదా?
కడిగేసిన కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ
    (మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకరు మెగాస్టార్.. మరొకరు యువ  సామ్రాట్.. ఇంకోకాయన మెగా ప్రొడ్యూసర్.. మరొకాయన మెగా డైరక్టర్.. అంతా ఆంధ్రా వాళ్లే! అందరికీ అక్కడ ఆస్తులున్నాయి. థియేటర్లున్నాయి. కాకపోతే వీరందరి అడ్డా తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో!! ఎవరు అధికారంలో ఉంటే వారి భుజమెక్కడం వారికి మాత్రమే తెలిసిన ఓ కళ. కాంగ్రెస్ సర్కారు అప్పుడెప్పుడో స్టుడియోలకు ఇచ్చిన భూములు ఇంకా సరిపోవడం లేదట. అందుకే.. ఆంధ్రా సీఎం జగనన్న వద్దకు వెళ్లి అక్కడ కూడా భూముల కోసం దస్తీ వేసొచ్చారు. సినిమా హాళ్ల కరెంటు కష్టాలు, ఇంకా బోలెడు ‘తెర వెనుక’ ముచ్చట్ల కోసం, అంతా కలసి ప్రత్యేక విమానంలో బెజవాడ వెళ్లారు. బాగానే ఉంది. కళామతల్లి సేవలో పీకల్లోతు మునిగి తరిస్తున్న ఈ స్టార్లే.. మొన్నామధ్య తెలంగాణ సీఎం కేసీఆర్‌నూ కలిశారు. సినిమా భాషలో చెప్పాలంటే..సీన్ కట్‌చేస్తే, ఇప్పుడు మరో ‘వేషం’ ఆంధ్రాలో వేశారు. సినిమాలు కదా? వేషాలు మామూలే!

సీన్ కట్ చేస్తే.. ఏపీలో మరో ‘వేషం’..

అయితే.. గ్యాంగ్‌లీడర్లు  ఇద్దరు సీఎంలకు కలిసిన పాయింటు కామనే. అదేంటంటే.. సినిమా షూటింగులు ప్రారంభించాలని ఒకరి వద్ద, అడగకుండానే వరమిచ్చినందుకు మరొకరి వద్దకు వెళ్లి బంతిపూలివ్వడానికి! అదేనండీ.. బోకేలివ్వడానికి!! బాగానే ఉంది. సొంత రాష్ట్రానికి వెళ్లిన ఈ సినీ హీరోలు, నిర్మాతలు, దర్శకుల గ్యాంగ్, ఆ గ్యాంగ్‌లీడర్.. మరి అమరావతిలో రాజధానిని అక్కడే కొనసాగించాలని  అడిగారా? పోనీ, ఆ డిమాండ్‌తో తమ వద్దకు వచ్చిన రైతులను కలిశారా? వారి గోడు విన్నారా? అంటే అదేం లేదు. స్థలాలు, స్టుడియోలు, సినిమా హాళ్లకు కరెంటు రాయితీలు, థియేటర్లలో మినిమం ఫిక్స్‌డ్ ఛార్జిల ఎత్తివేత, నంది అవార్డులు! ఇవే సినీ గ్యాంగ్‌లీడర్ల అజెండా!!ఇది కూడా చదవండి: పాపం.. సినిమా వాళ్లకు సొమ్ముల్లేవట!

ఆ వేషాలే.. వేరప్పా!

జీన్స్ వేసే చిరంజీవి పంచె కట్టి పొలాల్లో దిగి వ్యవసాయం చేస్తారు. రైతు సమస్యలపై పిడికిలి బిగించి సీఎం కారును ఆపి మరీ గర్జిస్తారు. టీషర్టులు వేసే నాగార్జున ముతకచొక్కాలతో రైతు వేషం కట్టి, వారి తరఫున పోరాటం చేసే వేషం కడతారు. ఇవన్నీ సినిమా వేసే  ‘వేషాలే’! సినిమా తెరపైనే వాళ్లంతా హీరోలు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడే కథానాయకులు. అన్యాయాలను ఎదిరించే పులులు. అది రీల్ లైఫ్‌లో!! కానీ ముఖానికి మేకప్ తీసి, ‘వేషం’ మార్చి అదే పాలకుల వద్దకు వెళితే పిల్లులే!!! మాకు స్టుడియోలకు స్థలాలివ్వండి.. థియేటర్ల కరెంటు చార్జీల సంగతి చూడండి.. మా సినిమా రిలీజ్‌కు టికెట్ల రేట్లు పెంచుకునే వెసులుబాటు ఇవ్వండి.. మొత్తంగా.. మా రూపంలో తిష్టవేసిన కళామతల్లిని బతికించండి. మీరు బతకండి.. మమ్మల్ని బతికించండి. ఇదే చివరాఖరలో అసలు వేషంలోని ఈ హీరోలు, మెగా హీరోలు, యువ సామ్రాట్టులు, మెగా ప్రొడ్యూసర్లు పాలకుల ముందు మోకరిల్లి అరిచే బీద అరుపులు! పోనీ.. ఈ కళామతల్లి ఉద్ధారకులేమైనా, సినీ పరిశ్రమపైనే ఆధారపడి జీవించే కార్మికులకేమైనా దమ్మిడీ విదిలిస్తారా? నాలుగు ఇళ్లు కట్టించి ఇస్తారా అంటే అదీ లేదు. వైఎస్ సీఎంగా గెలిచిన తర్వాత.. అక్కినేని ఆధ్వర్యాన ఆయనను కలిసిన ఈ కళామతల్లి ముద్దుబిడ్డలు.. తమకు క్రికెట్ ఆడుకునేందుకు ఓ రెండెకరాలు కావాలని బీదరుపులు అరిస్తే.. ‘ఆ మాత్రం దానికి నా దగ్గరకు రావడం ఎందుకు? మీ మురళీమోహన్‌ను అడిగితే ఇస్తాడుకదా’ అని వ్యంగ్యాస్త్రం సంధిస్తే, బిక్కచచ్చి నవ్వుముఖం పులుముకొని బయటకొచ్చారట. అలా ఉంటుంది వీరి కళాపోసన!

వాళ్లు.. రీల్ హీరోలే.. రియల్ కాదన్న పద్మశ్రీ


మంగళవారం ఏపీ సీఎం జగనన్నను కలిసేందుకు ప్రత్యేక విమానంలో, చిరంజీవి నాయకత్వంలో వెళ్లిన సినిమా బృందం.. గోకరాజు గంగరాజు గెస్ట్‌హౌస్‌లో దిగిందని తెలుసుకున్న అమరావతి రైతు బృందాలు, అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించాయి. అయితే వారిని పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు. అమరావతిని రాజధానిగా కొనసాగించమని.. సినీ ప్రముఖులకు కోరేందుకే వెళుతున్నాము తప్ప, ఘర్షణ కోసం కాదని రైతులు చెప్పినా పోలీసులు వినలేదు. ఈలోగా మాజీ మెగాస్టార్ సారథ్యంలోని సినిమా నటుల బృందం జగనన్నను కలవడం, అటుంచి అటే గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లిపోవడం జరిగింది.

‘అమరావతిలో భూములు అడిగేందుకు వచ్చిన హీరోలు, కనీసం రాజధానిని అమరావతిలోనే ఉంచాలని డిమాండ్ చేస్తారనుకున్నాం. కానీ వాళ్లకు ఆంధ్రాలోని భూములు కావాలి గానీ, అమరావతి, రైతుల ఆందోళన అవసరం లేదని స్పష్టమయింది. వీళ్లు రీల్ హీరోలే తప్ప రియల్ హీరోలు కాద’ని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ విరుచుకుపడ్డారు. గతంలో కూడా.. అమరావతికి మద్దతునివ్వని హీరోల సినిమాలు చూడవద్దని, సుంకర పద్మశ్రీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అటు రైతులు కూడా.. రైతులు వేషాలు వేసే హీరోలకు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, వారికి స్టుడియోలు, స్థలాలపై ఉన్న ప్రేమ అమరావతిపైగానీ, ఏపీ ప్రజలపైగానీ లేదని ధ్వజమెత్తారు.ఇది కూడా చదవండి: రాజధానిపై సినిమా స్టార్లు మాట్లాడరేం?

బాలయ్య సరే.. పవన్, రాజశేఖర్‌కు పిలుపేదీ?

సీఎం జగన్‌తో భేటీకి బాలకృష్ణకు పిలిచినా, ఆయన తన జన్మదినం కాబట్టి రాలేకపోయారంటే అర్ధం చేసుకోవచ్చు. కానీ, జనసేన అధ్యక్షుడు, ఇంకా సినిమాల్లో నటి స్తున్న పవన్ కల్యాణ్, రాజశేఖర్‌ను ఎందుకు ఆహ్వానించలేదన్న ప్రశ్నలు సినిమా పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికే జగన్ సర్కారుపై పవన్ ఓ వైపు యుద్ధం చేస్తుంటే, మరోవైపు ఆయన సోదరుడైన చిరంజీవి మాత్రం ఆయనను సీఎంతో జరిగే చర్చలకు ఆహ్వానించకపోవడాన్ని, పవన్ అభిమానులు మండిపడుతున్నారు. అమరావతి ఉద్యమానికి పవన్ మద్దతునిస్తుంటే, ఆయన సోదరుడైన చిరంజీవి మాత్రం విశాఖలో స్టుడియోలు, స్థలాలకోసం జగన్‌కు మద్దతునివ్వడమేమిటని నిలదీస్తున్నారు. కరోనా సమయంలో అగ్రహీరోలంతా దుప్పటి ముసుగేసుకుని పడుకున్న సమయంలో, సినీ కార్మికులకు సొంత నిధులతో సాయం చేసిన జీవితా రాజశేఖర్‌ను ఎందుకు ఆహ్వానించలేదని టాలీవుడ్ వర్గాలు ప్రశ్నిస్తున్నారు.
మరి దీనిపై.. చిరంజీవికి తమ్ముడు, పవన్‌కు అన్నయ్యగా గుర్తింపుపొందిన నాగబాబు.. తన యూట్యూబ్ చానెల్‌లో ఏం సందేశమిస్తారో చూడాలి! ఏదేమైనా.. జగదేక వీరులంతా అతిలోక సుందరమైన బెజవాడకు వెళ్లిన జాలీ ట్రిప్ హాట్ టాపిక్ అయింది. మరిక మిగిలింది.. చిరంజీవి అండ్ కోకు సన్మానమే! ఇంతకూ పెత్తనమంతా చిరంజీవి చేస్తే.. ఇక  సిని‘మా’ అసోసియేషన్ ఉనికిలో ఉన్నట్లా? లేనట్లా? అన్నది డౌటనుమానం! సినీజనం మాత్రం.. ఆ సంగతి సత్యహరిశ్చంద్రుడి కజిన్ బ్రదరయిన, ‘మెంటల్‌కృష్ణ’నే చెప్పాలంటున్నారు! వినపడిందా రాజా?ఇది కూడా చదవండి: చిరంజీవి,బాలకృష్ణ.. మధ్యలో తలసాని!

1 COMMENT

  1. […] ఇక తాజా పెదరాయుడు హోదా కోసం జరుగుతున్న పోరులో చిరంజీవి, ఒక అడుగు వేయడం ఆసక్తికలిగించింది. ఆయన నాయకత్వంలో.. నాగార్జున, మరికొందరు నిర్మాత, దర్శకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు.  అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌తో చర్చించారు. దానితో సహజంగానే తెలుగు సినిమాకు, చిరంజీవి పెదరాయుడన్న భావన ఏర్పడింది. అయితే, దీనిపై ఆగ్రహించిన నందమూరి బాలకృష్ణ.. ఆ సమావేశానికి తనను పిలవలేదని, వాళ్లంతా స్థలాల కోసం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం తలసాని శ్రీనివాసయాదవ్‌ను కలిశారని చేసిన వ్యాఖ్య సంచలనం సృష్టించింది. ఇదికూడా చదవండి.. ‘చిరంజీవి, బాలకృష్ణ.. మధ్యలో తలసాని’ దీనితో పలువురు హీరోలు, నటులు బాలయ్యను కలసి అంతర్గతంగా  తమ మద్దతు ప్రకటించారు. ఈలోగా చిరంజీవి సోదరుడు నాగబాబు కూడా.. బాలయ్య క్షమాపణ చెప్పాలంటూ చేసిన ట్వీట్ బాలయ్య అభిమానులకు ఆగ్రహం కలిగించింది. ఆ తర్వాత కూడా నాగబాబు వరసగా బాలయ్యపై తన యూ ట్యూబ్ చానెల్, ట్విట్టర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. ఈ ఘటన తె లుగు సినిమా పరిశ్రమలో ఉన్న చీలికను స్పష్టం చేసింది.ఇది కూడా చదవండి.. గ్యాంగ్ లీడర్లా..? బ్యాండ్ లీడర్లా? […]