గవర్నర్‌పై కమలదళాల అసంతృప్తి

203

క్రియాశీలకంగా పనిచేయడం లేదన్న భావన
సర్కారుపై సానుకూలత పనికిరాదన్న వ్యాఖ్యలు
నిమ్మగడ్డ వ్యవహారంలో తొందరపడ్డారా?
ఇలాంటి ఆర్డినెన్సును ఎలా ఆమోదిస్తారన్న సుప్రీంకోర్టు
న్యాయకోవిదులను సంప్రదించారా?
 ఈసారైనా ఆపనిచేయాలన్న బీజేపీ నేత యామినీ
ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా కోర్టుకెక్కిన బీజేపీ
గవర్నర్ తొలగింపు ఖాయమా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘నిమ్మగడ్డ వ్యవహారంపై నేను పార్టీ నాయకత్వం అనుమతి తీసుకునే హైకోర్టులో కేసు వేశా. రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జాతీయ అధ్యక్షుడు నద్దా కూడా అనుమతించారు. ఇందులో నాకు పార్టీ అండ ఉంది’
– మాజీ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్.

‘నిమ్మగడ్డ అంశంలో న్యాయాన్ని కాపాడాలన్న ఉద్దేశంతోనే, మా పార్టీ హైకోర్టుకు వెళ్లింది. నిమ్మగడ్డ రమేష్ విషయంలో గవర్నరుకు, రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చింది. గవర్నర్ ఇకపైనయినా న్యాయసలహాలు తీసుకుంటారని ఆశిస్తున్నాం’
-ఏపీ బీజేపీ నాయకురాలు సాదినేని యామినీ శర్మ.

అంతా ఒకే పారీ వాళ్లే.. దారులే వేరు!

గవర్నరును కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నియమిస్తుంటుంది. ఆయన కచ్చితంగా ఆ పార్టీకి చెందిన వారే అయి ఉంటారు. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పనిచేసే గవర్నర్లు.. కేంద్రంలో అధికారంలో పార్టీని, ఆయా రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి కృషి చేస్తుంటారన్నది బహిరంగ రహస్యం. ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పనిచేసే గవర్నర్ల ఆలోచనలెప్పుడూ, రాజకీయ కోణంలోనే ఉంటాయి. ప్రతిపక్ష పార్టీ సీఎంలకు పంటికింద రాయిలా మారుతుంటారు. అలాంటి విషయాల్లో గవర్నర్లు చురుకుగా వ్యవహరిస్తుంటారు. కానీ ఏపీలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం! వైసీపీ ప్రభుత్వం తయారుచేసిన ఆర్డినెన్స్‌పై, గవ ర్నర్ వాయివేగంతో సంతకం చేయడం కమలదళాలను ఖంగుతినిపించింది. ఓవైపు నిమ్మగడ్డ వ్యవహారంలో, జగన్ సర్కారుపై బీజేపీ జగడానికి దిగింది. మరోవైపు ఆదే పార్టీ నియమించిన గవర్నరేమో అందుకు విరుద్ధంగా, అదే జగన్ సర్కారు ఇచ్చిన ఆర్డినెన్స్‌ను, వాయివేగంతో ఆమోదించారు.  ఇదీ.. ఏపీలో సీఎం-గవర్నర్-బీజేపీల మూడుస్తంభాలాట!

బీజేపీ వాదనే గెలిచింది.. గవర్నర్ సంతకం ఓడింది..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్ నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించేందుకు.. జగన్ సర్కారు సిద్ధం చేసిన ఆర్డినెన్సుపై న్యాయనిపుణుల సలహాలు తీసుకోకపోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఆర్డినెన్స్‌ను పెండింగ్‌లో ఉంచి, కొంతకాలం వేచిచూడకుండా.. జగన్ సర్కారు పంపిన ఆర్డినెన్స్‌పై సంతకం చేసిన, ఏపీ గవర్నర్ హరిచందన్ బిశ్వభూషణ్ తీరుపై.. బీజేపీలో ఆనాడే అసంతృప్తి వ్యక్తమమయింది. తాజాగా సుప్రీంకోర్టు సైతం, ‘ఇలాంటి ఆర్డినెన్స్ ఎలా ఆమోదిస్తారంటూ’ ప్రశ్నించడం బట్టి.. గవర్నర్ నిర్ణయం తప్పంటూ, ఇప్పటివరకూ బీజేపీ నేతలు చేస్తున్న వాదన నిజమయినట్లు స్పష్టమయింది.

గవర్నర్‌ను మార్చాలన్న కమలదళం..

గవర్నర్ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఉన్న రాష్ట్ర బీజేపీ నేతలు, ఆయనను మార్చాలంటూ ఇప్పటికే కేంద్రాన్ని అభ్యర్ధించారు. ఆర్డినెన్స్‌ను ఆమోదించవద్దని రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గవర్నర్‌కు లేఖ రాసిన రోజునే ఆర్డినెన్స్‌ను ఆమోదించడాన్ని బీజేపీ వర్గాలు దానిని అవమానంగా భావించాయి. గవర్నర్ కనీసం న్యాయకోవిదులతో చర్చించి, నిర్ణయం తీసుకుంటారని భావించిన బీజేపీ నేతల ఆశలను  గవర్నర్  వమ్ము చేశారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, దూకుడుగా.. రాజకీయకోణంలో నిర్ణయాలు తీసుకునే గవర్నర్ అవసరం ఉందని, బీజేపీ వర్గాలు కేంద్రానికి సూచించాయి. ప్రస్తుత గవర్నర్ కొనసాగితే, రాష్ట్రంలో పార్టీ చేసే పోరాటాలకు అర్ధం ఉండదని వ్యాఖ్యానిస్తున్నారు.

‘సుప్రీం’ వ్యాఖ్యలతోనయినా కేంద్రం కదులుతుందా?

తాము ఎన్నో అంశాలపై వినతిపత్రాలు, ఫిర్యాదు చేసినప్పటికీ.. గవర్నర్ ఒక్కసారి కూడా ప్రభుత్వ వివరణ తీసుకోకపోవడం, కమలదళాలకు ఆగ్రహం కలిగిస్తోంది. ఇక దానివ ల్ల పోరాటాలు చేసి ఏం ఉపయోగమని నేతలు ప్రశ్నిస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు సైతం.. ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారంటూ నేరుగా, గవర్నర్ నిర్ణయాన్నే తప్పు పట్టినందున.. తక్షణం గవర్నర్‌ను మార్చాలని కమలదళాలు డిమాండ్ చేస్తున్నాయి.

కామినేని నుంచి.. యామినీ వరకూ

అటు బీజేపీ నేత యామినీ శర్మ సైతం.. గవర్నర్ నిర్ణయాన్ని పరోక్షంగా తప్పుపట్టారు. ఆయన న్యాయకోవిదుల సలహాలు తీసుకుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. అంటే గవర్నర్ న్యాయకోవిదుల సలహాలు తీసుకోలేదని, చెప్పకనే చెప్పినట్టయింది. మరో అడుగుముందుకేసి.. ఇకనయినా గవర్నర్ న్యాయసలహాలు తీసుకుంటారని ఆశిస్తున్నామని, తన అసంతృప్తిని పరోక్షంగా వ్యక్తం చేయడం ప్రస్తావనార్హం. ఈవిధంగా అటు బీజేపీకే చెందిన కామినేని శ్రీనివాస్ గవర్నర్ నిర్ణయానికి వ్యతిరేకంగా కోర్టుకెక్కడం, ఇటు ఆ పార్టీకే చెందిన యామినీ శర్మ కూడా గవర్నర్ నిర్ణయాన్ని  పరోక్షంగా తప్పుపట్టారు. దీన్నిబట్టి.. గవర్నర్ బిశ్వభూషణ్ పనితీరుపై, బీజేపీ నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారని స్పష్టమవుతోంది. మరి బీజేపీ కేంద్ర నాయకత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!

గెలిచిన జంధ్యాల వాదన..

కాగా నిమ్మగడ్డ తొలగింపు వ్యవహారంలో గవర్నర్ ఇచ్చిన ఆర్డినెన్స్ చెల్లదని.. కామినేని శ్రీనివాస్ పక్షాన నిలిచిన, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ వాదన గెలిచినట్టయింది. నిమ్మగడ్డను తొలగించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని ఆయన హైకోర్టులో వాదించారు. కాగా సుప్రీంకోర్టు సైతం, రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పునే సమర్ధించడంపై జంధ్యాల హర్షం వ్యక్తం చేశారు. ‘ఈ ఆర్డినెన్స్‌ను ఎలా ఆమోదిస్తారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. మేమూ ఇదే విషయంపై వాదించాం. ఇక రాజ్యాంగసంస్థలతో ఆడుకోవద్దన్న సుప్రీంకోర్టు హెచ్చరిక, రాష్ట్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలి. దేశంలో ఎవరికైనా అన్యాయం జరిగినప్పుడు న్యాయవ్యవస్థ, రాజ్యాంగబద్ధ సంస్థలు ప్రత్యామ్నాయంగా ఉంటాయని గ్రహించాల’ని జంధ్యాల వ్యాఖ్యానించారు.