భరోసా ఇవ్వలేకపోతున్న బాబు

161

నమ్మకస్తులే నిష్క్రమిస్తే ఎలా?
మూస రాజకీయాలు ఎన్నాళ్లు?
ఆత్మీయ వాతావరణం ఏదీ?
కులం వాసన పోలేదంటున్న తమ్ముళ్లు
మళ్లీ అధికారంపై ఆశలు వదులుకుంటున్న నేతలు
అన్న గారి కాలం నాటి ధీమా ఏదీ?
ఇంకా గంటల సమావేశాలు, టెలీకాన్ఫరెన్సుల గోల ఏంటి?
‘జగన్మాయ’తో ఊపిరాడని తమ్ముళ్లు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆత్మస్థైర్యానికి మారుపేరయిన నందమూరి తారక రాముడు స్థాపించిన తెలుగుదేశం పార్టీ జెండా మోస్తున్న తమ్ముళ్లకు,  ఇప్పుడు ఆ ఆత్మస్థైర్యమే కరవయింది. అధికారం పోవడం అలవాటయినప్పటికీ, మళ్లీ అధికారంలోకి వస్తామన్న అలనాటి ధీమా, ఇప్పుడు ఏ ఒక్క నేతలో కూడా  భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. మూస రాజకీయాలకు మూత పెట్టకపోతే, జగన్ లాంటి బలవంతుడిని ఎదుర్కోవడం కష్టమేనన్నది తమ్ముళ్ల వాదన. అధినేత ఆప్తమిత్రుడైన కరణం బలరాం, విశ్వాసపాత్రుడైన శిద్దా రాఘవరావు లాంటి నేతలే నిష్క్రమిస్తే.. ఒక్కో ఎమ్మెల్యే జారిపోతుంటే,  ఇక బాబు ఎవరికి మాత్రం భరోసా ఇవ్వగలరన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఫుట్‌బాల్ కోర్టులో క్రికెట్ ఆడుతున్న వైనం సీనియర్లకు సైతం విసుగుతెప్పిస్తోంది. జనం ఆలోచనలు, అంచనాలను అన్వేషించడం లేదంటున్నారు. తమ ఆలోచనల ప్రకారం ప్రజలు-పార్టీ నడవాలన్న పాత కాలపు ధోరణి నుంచి అప్‌డేట్ కాకపోతే, బాహుబలిగా ఉన్న జగన్‌ను ఢీకొట్టడం,  అసంభవమేనని సీనియర్లు నిర్మొహమాటంగా చెబుతున్నారు.

తండ్రిని ఎదిరించి.. తనయుడిని తట్టుకోలేకపోతున్నారా?


మాజీ మంత్రి శిద్దారాఘవరావు టీడీపీకి గుడ్‌బై చెప్పడం అధినేత చంద్రబాబుకు షాకులాంటిదే. ఆయన పార్టీ జాతీయ కోశాధికారి కూడా. కొద్దినెలల క్రితమే టీడీఎల్పీ కోశాధికారిగా ఉన్న, గుంటూరు ఎమ్మెల్యే మద్దాలి గిరి కూడా వైసీపీ కండువా కప్పేసుకున్నారు. ఈ ఇద్దరూ కోశాధికారులు వైశ్య వర్గానికి చెందిన వారే కావడం ప్రస్తావనార్హం. నిజానికి ఇదే శిద్దా రాఘవరావు వ్యాపారాలపై వైఎస్ హయాంలో వేధింపులు జరిగినా, తట్టుకుని నిలబడ్డారు. అప్పడు బాబు కూడా ధైర్యంగా శిద్దా వెంట నిలిచి భరోసా ఇచ్చారు. కానీ, ఇప్పుడు ఎలాంటి రాజకీయానుభవం లేని జగన్ చర్యలకు టీడీపీ నేతలు నిలువెల్లా వణికిపోతున్నారు. వైఎస్‌నే ఎదిరించి నిలబడి, సహచరులకు, అనుచరులకు భరోసా ఇచ్చిన బాబు.. ఇప్పుడు జగన్ దూకుడు ముందు బేలగా మారుతున్న వైచిత్రి.

వెన్నంటి ఉన్న వారినే విస్మరిస్తే ఎలా?

స్వయంగా బాబు సహచరుడు, ఆయనతో దశాబ్దాల పాటు కలసి నడిచిన కరణం బలరామ్ కూడా, బాబును విడిచిపెట్టడమే తమ్ముళ్లకు షాక్ కలిగించింది. కాంగ్రెస్ నుంచి కలసి నడిచిన వారిద్దరిదీ అపురూప బంధం. ఎంతోమందికి మంత్రి పదవులిచ్చిన బాబు, ఇప్పటికి ఎన్నోసార్లు ముఖ్యమంత్రి అయినప్పటికీ, తన మిత్రుడైన బలరామ్‌కు మాత్రం మంత్రి పదవి ఇప్పించలేకపోయారు. దివంగత చిత్తూరు జిల్లా నేత శివప్రసాద్ కూడా బాబు చిన్ననాటి స్నేహితుడయినప్పటికీ, ఆయననూ ఆదరించలేకపోయారు. బాబుతో యూత్ కాంగ్రెస్  నుంచీ ఉన్న కొమ్మినేని వికాస్‌ను ఆయన నిర్లక్ష్యం చేస్తే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. వికాస్ ఇంటికివెళ్లి మరీ ఆయన మద్దతు ఆశించి, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. ఇలా తనతో నడిచిన వారికి కూడా, బాబు  భరోసా ఇవ్వలేకపోతున్నారు.

పాపం.. ప్రసూన!

ఇక టీడీపీ వ్యవస్థాపకదినం రోజున ఎన్టీఆర్‌తో కలసి వేదిక మీద ఉన్నవారిలో… ఇప్పుడు జీవించిన నేతల్లో నాదెండ్ల భాస్కరరావు ఒకరయితే, కాట్రగడ్డ ప్రసూన మరొకరు. వారిలో ఇప్పటికీ టీడీపీలో కొనసాగుతున్న మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూనకు గుర్తింపు లేదు. ఆమె ఇంకా పార్టీలో స్థానం కోసం, నాయకత్వంతో పోరాడాల్సిన దుస్థితి. దీనితో విసిగివేసారిపోయిన ఆమె తన కుమార్తె కరణం అంబికాకృష్ణతో కలసి గతంలో బీజేపీలో చేరగా, ప్రసూనకు బీజేపీ రాష్ట్ర కమిటీలో, ఆమె కుమార్తె కరణం అంబికా కృష్ణకు, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షురాలి పదవి ఇచ్చారు. తర్వాత చంద్రబాబు మళ్లీ తెలంగాణపై దృష్టి సారించడంతో తిరిగి టీడీపీలో చేరగా, చాలాకాలం తర్వాత ప్రసూనకు పార్లమెంటు ఇన్చార్జి పదవి ఇచ్చారు.

దీనితో తనకంటే జూనియర్ అయిన తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణతో, గుర్తింపు కోసం పోరాడాల్సిన పరిస్థితి. ఆనాడు దివంగత ఎన్టీఆర్‌తో వేదిక పంచుకుని, ప్రసంగించిన ఆమెతో, ఎన్టీఆర్ పార్టీ పేరు కూడా ప్రకటించారు. ఇప్పుడామె పార్టీలో ఉన్నా.. తన వ్యవసాయక్షేత్రంలో నేపాల్ రుద్రాక్ష చెట్లు, లిచీ, అవకాడో, లవంగాలు, యాలకుల చె ట్ల పెంపకంలో మునిగిపోయారు. టివి చర్చల్లో పార్టీ వాణి వినిపిస్తున్నారు. ఇంకా ఇలాంటి నేతలు చాలామంది గుర్తింపు లేక స్తబ్దతగా కనిపిస్తున్నారు.

కొమ్మినేని వికాస్..  ఎక్కడ?

బాబుతో యూత్ కాంగ్రెస్  నుంచీ ఉన్న కొమ్మినేని వికాస్‌ను ఆయన నిర్లక్ష్యం చేస్తే, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ మంత్రి కేటీఆర్.. వికాస్ ఇంటికివెళ్లి మరీ ఆయన మద్దతు ఆశించి, కేసీఆర్ వద్దకు తీసుకువెళ్లారు. తనతో అంత సన్నిహితంగా కలసి నడిచిన తన మిత్రుడైన వికాస్‌కు,  బాబు కనీసం రాష్ట్ర కమిటీలో చిన్న పదవి కూడా ఇవ్వలేకపోయారు. పార్టీ ఆఫీసుకు వచ్చే వారిని, పోయేవారిని పలకరించే రిసెప్షన్ కమిటీలో మాత్రమే ఆయనకో పదవి ఇచ్చారు. చంద్రబాబు-వైఎస్ యూత్ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు.. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడి ఉన్న వికాస్ సోదరుడు, కొమ్మినేని శేషగిరిరావు అనుచరులుగా బాబు-వైఎస్ పనిచేసేవారు. ప్రస్తుతం వికాస్ కూడా స్తబ్దతగానే ఉన్నారు. విచిత్రమేమిటంటే.. నాడు వైఎస్‌తో కలసి ఉన్న కెవిపి రామచంద్రరావుకు వైఎస్ రాజ్యసభ, సలహాదారు పదవి ఇచ్చారు. వైఎస్‌కు కెవిపి మాదిరిగా, బాబు కూడా వికాస్‌తో కలసి ఉన్నా ఆయనకు మాత్రం ఎలాంటి పదవి దక్కకపోవడం విశేషం.  ఇలా తనతో నడిచిన మిత్రులకు సైతం, బాబు  భరోసా ఇవ్వలేకపోతున్నారు.

బాబు సహచరుడు బలరామ్ కూడానా..?

నిజానికి బలరామ్‌కు మాస్ ఇమేజ్ ఉంది. కార్యకర్తలకు ఆయనో ధైర్యం. బాబు నమ్మినవారిలో ఆయనొకరు. గత ఎన్నికల సమయంలో ఏ అభ్యర్ధికి ఇవ్వనన్ని నిధులు బలరామ్‌కు ఇచ్చారు. ఎన్నికల ముందు కొడుకు వెంకటేష్‌కు కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. సరే.. ఇప్పుడు బలరామ్ వార్ధక్యంలో పడ్డారు. కొడుకు భవిష్యత్తు కోసం పార్టీ మారానుకోవచ్చు. వ్యాపార రక్షణ కోణం కూడా ఉండవచ్చు. అయినా సరే మిత్రుడికి భరోసా ఇవ్వలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ‘సొంత మనిషి అనుకున్న బలరామ్‌కే భరోసా ఇవ్వలేని బాబు, ఇక మిగిలిన నాయకులకేం భరోసా ఇస్తారు? సొంత మిత్రుడే ఆయనను నమ్మకపోతే, ఇక మిగిలినవాళ్లేం నమ్ముతారు చెప్పండ’ని కర్నూలుకు చెందిన ఓ సీనియర్ నేత ప్రశ్నించారు.

వాళ్లిద్దరికే భరోసా ఇవ్వలేని బాబు ఇక..

తాజాగా శిద్దా కూడా.. కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యం కాపాడుకునేందుకే, వైసీపీ తీర్ధం తీసుకున్నారనుకోవచ్చు. ఎన్నికల ముందు శిద్దా సోదరుడికి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. అలాగని శిద్దా కూడా పార్టీకి తక్కువ సేవలేం చేయలేదు. పార్టీకి కోట్లు ఖర్చు పెట్టారు. సులభంగా గెలిచే దర్శి నుంచి కాకుండా.. ఒంగోలు ఎంపీ సీటిచ్చి ఆయనను బలిపశువును చేసినా, మౌనంగా బాబు మాట శిరోధార్యంగా పాటించారు. శిద్దాకు  మంత్రి పదవి అవకాశం ఇచ్చినా, పెత్తనమంతా సీఎంఓనే చేసింది. మనస్తత్వంలో బలరామ్ కంటే సాత్వికుడు, వివాదరహితుడైన శిద్దాను.. ఆయనతోపాటు, తన చిరకాల మిత్రుడైన బలరామ్‌ను పిలిచి భరోసా ఇవ్వలేని బాబు..  భవిష్యత్తులో గీతదాటే మిగిలిన తమ్ముళ్లకేం భరోసా ఇస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

ఇంకా అధికారంలో ఉన్నామన్న భ్రమలేనా?

ప్రతిపక్ష పాత్రలో ఉన్నప్పటికీ, ఇంకా అధికారంలోనే ఉన్నట్లు కంటున్న భ్రమల నుంచి, ఇంకా బయటకు రాలేకపోవడం పార్టీకి నష్టమేనంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారులను నెత్తిన ఎక్కించుకున్న బాబు, ఇప్పుడు కూడా నేలవిడిచి సాము చేస్తున్నారంటున్నారు. పార్టీ నేతలతో భేటీలు మరిచి, గంటలపాటు చేసే టెలీకాన్ఫరెన్సుల వల్ల పార్టీకి నయాపైసా లాభం ఉండటం లేదంటున్నారు. ఈ విధానం నేతలను విసుగెత్తిస్తున్నట్లు వారి మాటలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ పరిస్థితి, బాబు వ్యవహారశైలి, నిర్ణయాలు మారాలని జెసి దివాకర్‌రెడ్డి లాంటి నేతలు చెబుతున్నా, చెవికెక్కడం లేదంటున్నారు. పార్టీ ఓడినా ఇంకా బాబు చుట్టూ భజన  ఆగలేదంటున్నారు.

పార్టీ కమిటీలకే ఇంతవరకూ దిక్కులేదు..

మహానాడు సందర్భంలో ప్రకటించాల్సిన పార్టీ కమిటీలకు ఇంతవరకూ దిక్కులేదు. ఇప్పటిదాకా తెలుగుయువత భర్తీ చేయలేదు. ఇన్చార్జిలు లేని నియోజకవర్గాలు డజన్లలో ఉన్నాయి. ఇప్పటికీ మీడియా ఆధారంగా చేసే పోరాటాలు తప్ప, క్షేత్రస్థాయి పోరాటాలను అటకెక్కించారన్న విమర్శలున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు అన్నీ అనుభవించిన రాయలసీమ నేతలు చాలామంది.. ఇప్పుడు బెంగళూరు, చైన్నైలో పేకాట ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీనియర్ అయిన గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కాకుండా, పయ్యావుల కేశవ్‌కు ప్రతిష్టాత్మక పీఏసీ చైర్మన్ ఇచ్చారు. అయినా సర్కారు శాఖల సమాచారం తెప్పించుకోవడంలో, విఫలమవుతున్నారని ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. జిల్లా నేతలు, అనుబంధ సంస్థల నేతలతో కాకుండా.. పనికిరాని మీటింగులతో పేరుతో సమయం వృధా చేస్తున్నారన్న వ్యాఖ్యలకు, ఇప్పటికీ తెరపడకపోవడం బట్టి.. బాబు మారలేదన్న విషయం స్పష్టమవుతోందంటున్నారు.

ఇంకా మారని కులం కోణం..

ఇక పార్టీలో ఇంకా కులంవాసన పోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పార్టీ కార్యాలయంలో కింది నుంచి, పైస్థాయి వరకూ ఒకే కులం వారే ఇంకా కనిపిస్తున్నారన్న విమర్శలు, మిగిలిన సామాజికవర్గ నాయకుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అదే సామాజికవర్గ నేతలే పార్టీని వీడిపోతున్నా, ఆలోచనా ధోరణి మారకపోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. పార్టీలో కౌంటర్‌మెకానిజం పోయిందని, సర్కారును ఇరుకునపెట్టే అంశాలు అన్వేషించడంలో విఫలమవుతోందంటున్నారు. ఇటీవల టీటీడీ భూముల వ్యవహారంలో టీటీడీ చైర్మన్, సభ్యులుగా పనిచేసిన వారిని పక్కనబెట్టి.. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్‌గా పనిచేసిన వ్యక్తితో మాట్లాడించడం బట్టి.. పార్టీలో ఇంకా మూస ధోరణి పోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

పింక్ డైమండ్ సంగతి తేల్చరేం?

‘తిరుమలలో స్వామి వారికి ఉన్న పింక్ డైమండ్ బాబు ఇంట్లో ఉందని ఎన్నికల ముందు విజయసాయిరెడ్డి, రమణదీక్షితులు ఆరోపించారు. అప్పట్లో దాన్ని పార్టీ ఖండించింది.  వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ప్రత్యేక అధికారిగా వచ్చిన ధర్మారెడ్డి.. అసలు స్వామి వారికి పింక్ డైమండ్ లేదని తేల్చేశారు. ఈ అంశంపై సర్కారుపై న్యాయపోరాటం చేయాల్సిన నాయకత్వం నిమ్మకునీరెత్తినట్లు ఉండటమే వింతగా ఉంది. సార్ కూడా మౌనంగా ఉండటంతో ఆ ఆరోపణలు నిజమని అనుమానించాల్సిన పరిస్థితి వచ్చింది. నాడు టీటీడీ వాళ్లపై వేసిన నష్టపరిహారం తీర్మానాలు, కోర్టుకు రెండుకోట్లు డిపాజిట్ చేసిన కాగితాలు బయటపెట్టి, పింక్ డైమండ్ ఏమయిందని ఎదురుదాడి చేసే ఆలోచన లేకుండా ఆఫీసులో కూర్చుని స్టేట్‌మెంట్లు ఇస్తే ఎలాగ’ని గోదావరి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ప్రశ్నించారు.ఇది కూడా చదవండి: ఆ పింక్ డైమండ్ కాకి ఎత్తుకెళ్లిందా ‘స్వామీ’

వర్కవుట్…  చేస్తూనే ఉంటారా?

సకాలంలో నిర్ణయాలు తీసుకోకపోవడంలో బాబు తన వైఫల్య పరంపరను, విజయవంతంగా కొనసాగిస్తున్నారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో ఇంతవరకూ కమిటీలు వేయలేదని, తెలంగాణలో కొన్ని కమిటీలు వేశారంటున్నారు. తెలంగాణలో అధ్యక్షుడిని మార్చేందుకు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తోందంటున్నారు. ఏడాది నుంచీ పార్టీ కమిటీలు కూడా వేసుకోలేకపోతున్నామంటే.. తామెంత చురుకుగా పనిచేస్తున్నామో స్పష్టమవుతోందని ఓ మాజీ మంత్రి వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ‘ఇప్పుడు సారు అధికార ంలో లేరు. బోలెడు సమయం ఉంది. అందరితో ఫ్రీగా మనసు విప్పి మాట్లాడవచ్చు.  వెంటనే నిర్ణయాలు తీసుకోవడానికీ అవకాశం ఉంది. కానీ ఇంకా అన్నీ నానబెడుతుండటమే మాకు నచ్చడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘ఇంకా వర్కవుట్  చేద్దామనే మాటలే సారు నుంచి వినిపిస్తున్నాయి. ఈ వర్కవుట్‌తోనే మేమంతా ఈ పరిస్థితికి వచ్చాం. సారు వర్కవుట్ చేస్తూనే ఉంటారు. అవతల జరగాల్సిన పని జరిగిపోతుంద’ని రాయలసీమకు చెందిన ఆ మాజీ మంత్రి నవ్వుతూ వ్యాఖ్యానించారు.

పలకరింపూ కరవేనా?

పార్టీలో ఎన్టీఆర్ కాలం నాటి ఆత్మీయ వాతావరణం పోయి.. వ్యాపారదృక్పథం, భజన సంస్కృతి పెరిగిందన్న వ్యాఖ్యలు, పాతతరం నేతల నుంచి వినిపిస్తున్నాయి. లాక్‌డౌన్ కాలంలో ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వంటి వారంతా.. తమ పార్టీ సీనియర్లకు, ఇతర పార్టీలోని మిత్రులకు  ఫోన్లు చేశారు. వారి యోగక్షేమాలు ఆరా తీశారు. చివరకు వెంకయ్యనాయుడు టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరికి ఫోను చేసి యోగక్షేమాలు అడిగితే.. తమ నాయకుడు చంద్రబాబు మాత్రం, ఆ పనిచేయలేకపోయారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కనీసం జగన్ సర్కారు కొనసాగిస్తున్న వేధింపుల వల్ల, మానసిక వేదన చెందుతున్న అధికారులకు సైతం బాబు నుంచి పలకరింపు లేదంటున్నారు.

పాతతరం ఆలోచనలకు ఏదీ పాతర?


నేతలు తమ కష్టసుఖాలు అధినేతకు చెప్పే సంస్కృతి లేదంటున్నారు.  ‘వ్యాపారులకు పెద్దపీట వేస్తే, వారు అధికారం ఉన్నంతసేపే ఉంటారు. అలాంటి వారికి పార్టీపై ఏం అంకితభావం ఉంటుంది? రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లనేమో బాబు గారు కత్తిరిస్తారు. ఇంకా ఇప్పుడూ మాలాంటి వాళ్లను గంటలసేపు బయటకూర్చోబెడతారు. పోనీ మీటింగులేమైనా ఫలప్రదంగా ఉంటాయా అంటే ఉండవు. ఇంకా పాత తరం ఆలోచనలే. వెంటనే నిర్ణయాలు తీసుకుంటారా అంటే అదీ లేదు.
అటు జగన్ యూత్‌లో దూసుకుపోతున్నాడు. కొత్త సెక్షన్లకు దగ్గరవుతున్నాడు. మా పార్టీ వాళ్లను లాగేస్తున్నాడు. అతడిని తట్టుకోవడం చాలా కష్టం. పేపర్లలో వచ్చినవాటిని చూసి మురిసిపోతే ఇంకా ఇక్కడే ఉంటాం. యంగ్‌టీముతో వెళ్లకపోతే ఇలాగే ఉంటాం. ముందు మా పార్టీ ముసలి లీడర్లను మార్చాలి. ఇన్ని అనుభవాల తర్వాత కూడా ఇంకా ఒకే కులం చుట్టూ పార్టీ తిరగడం మంచిదికాదు. ఈ సమయంలో కూడా పీఎసీ చైర్మన్ ఒకే కులానికి ఇస్తే ఎలా’ అని ఓ మాజీ మంత్రి స్పష్టం చేశారు. పార్టీ సీనియర్లు ఎందుకు వీడుతున్నారో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకుని, ఆయనే దిద్దుబాటకు దిగాలన్న వాదన వినిపిస్తోంది.