కరోనా మృతుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వండి…ప్లీజ్

528

*మానవాళిని కబళిస్తున్న కరోనా…!
*క్షణాలలో గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు….!
*దహన సంస్కారాలకూ నోచుకోని మృత దేహాలు….!
* ఎవరు ఎప్పుడో…తెలియని భయోద్వేగాలు….!
*చేతులెత్తేస్తున్న ప్రభుత్వాలు…!
*పనిలేక…తిండి దొరక్క…ఆకలి చావుల దిశగా నిరుపేదలు…!
*నష్టపరిహారంతో కొంతయినా ఊరట….!
భోగాది వేంకట రాయుడు
విజయవాడ;
కరోనా….కరోనా…కరోనా…
ఈ భూమండలం పై మానవజాతి అవతరించిన తరువాత…క్రీస్తుకు పూర్వమూ, తరువాతా;…దేశాలూ, ఖండాలూ ఏర్పడక ముందూ..ఏర్పడిన తరువాతా…; మనిషికి చావు తెలివితేటలు తగలడక ముందూ…తగలడిన తరువాతా…ఏ దేశానికి ఆ దేశంలో– మనుషుల్ని ఎక్కడికక్కడ బంధించి…ఒక్క రక్తం బొట్టు కూడా చిందించనివ్వకుండా నిలువునా ప్రాణాలు తీస్తున్న కరోనా ను చూసి…తలుచుకుని విశ్వమానవాళి …నిలువునా నీరై పోతున్నది. భయకంపితురాలై పోతున్నది. ఎవరిని ఎటునుంచి కొడుతుందో తెలియదు. ఎవరిని ఎప్పుడు మార్చురీకి పంపుతుందో తెలియదు.చివరికి కుటుంబ సభ్యులకు కూడా తెలియనివ్వదు. అమెరికాలోని ‘వైట్ హౌస్’ నుంచి వెలగపూడిలోని ‘సెక్రటరీల హౌస్’ వరకు…ఎవర్నీ అది వదిలిపెట్టడం లేదు. ‘ఇన్నాళ్లూ మీ అతి తెలివి చూపించారు. ఇప్పుడు నా తెలివి చూడండి ,మరి…’అంటూ మహాభారతం లో తక్షకుడు ఖాండవ వనాన్ని నాలుగు పక్కల నుంచీ దహించి వేస్తున్నట్టు కరోనా ఈ భూమండలం మీద పడి సమస్త మానవాళినీ గుటకాయస్వాహా చేసేస్తుంటే…ఏం చేయాలో ఏ ప్రభుత్వానికీ తెలియడం లేదు. మన ప్రభుత్వాలకే కాదు….;ప్రపంచం లోని ఏ దేశ ప్రభుత్వానికీ తెలియడం లేదు. జనాన్ని బతికించడం ఎలాగో తెలియడంలేదు.విశ్వమానవాళి పై అది ఎలా విరుచుకుపడిందో తెలియడం లేదు. దానికి విరుగుడు ఏమిటో తెలియడం లేదు.
చివరకు….శవాలను ఏం చేయాలో కూడా తెలియడం లేదు.
ఇవేమీ తెలియని దశలో ఉన్న ప్రభుత్వాలు..ఏమి చేస్తాయో ప్రజలకు తెలియడం లేదు. చేసే చేసే వ్యాపారాలు పోయి…వాటిల్లో చేసే ఉద్యోగాలు పోయి…బతుకు తెరువులూ, జీవనాధారాలూ పోయి …ఎలా బతకాలో జనాలకు తెలియడంలేదు. ఇలా… గాల్లో దీపాలుగా మారిపోయిన వేలూ, లక్షలూ, కోట్ల కుటుంబాలను ఎలా బతికించాలో ప్రభుత్వాలకూ తెలియడం లేదు. అందుకే…లక్షల కోట్ల విలువైన ఉద్దీపన పథకాలు అంటూ కామెడీ చేస్తున్నారు.
అందుకే…ప్రభుత్వాలకు ఓ విన్నపం. నిద్రలేచింది మొదలు….ఎక్కడ ఎవరు ఏ విధమైన ప్రమాదంలో మరణించినప్పటికీ….మన ప్రభుత్వాలు ‘నష్ట పరిహారం’ప్రకటించడం ఒక ఆనవాయితీగా…ఒక అలవాటుగా…రాను రాను ఒక హక్కుగా కూడా మారిపోయింది.
ఈ వెసులుబాటును కరోనా మృతుల కుటుంబాలకూ వర్తింప చేయాలి. పోయినవాళ్ళు పోగా…కనీసం బతికున్నవారికయినా…ప్రభుత్వ భరోసా ఉండాలి. వారి జీవనం తిరిగి గాడిలో పడడానికి ప్రభుత్వం బాసటగా నిలబడాలి. జనాలను చంపీ… చంపీ ,కరోనా కు అలుపు వచ్చి…అది విశ్రమించడానికి కొన్ని నెలలూ….లేదా, ఒకటీ, రెండూ సంవత్సరాలు పట్టవచ్చు. ఆ విపత్కర స్థితిలో జీవనాధారం గా ఈ నష్టపరిహారం ఎంతోకొంత అక్కరకు వస్తుంది.అందుకే, ఒక్కొక్క మృతుని/ మృతురాలి కుటుంబానికి కనీసం 5 లక్షల రూపాయలైనా నష్టపరిహారం అందచేసే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ పరిశీలించాలి.

-భోగాది వెంకట రాయుడు