ఓ సార్లూ.. సీపీఎస్ రద్దు ముచ్చటేదీ?

0
5

ఏపీ-తెలంగాణ ఉద్యోగులకు నెరవేరని హామీ
తెలంగాణలో ఐఆర్, పీఆర్సీకి దిక్కులేదు
కిక్కురుమనని ఉద్యోగసంఘాలు
ఏపీలో ఇప్పటికే ఐఆర్ అమలు
కేసీఆర్-జగన్‌పై ఉద్యోగుల అసంతృప్తి
రణం మరచి రాయబారపాత్రలో నేతలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘సీపీఎస్ అంటూ ప్లకార్డులు పట్టుకుతిరిగే ఉద్యోగులు వాళ్లు అడిగేది ఎంత న్యాయమైన డిమాండంటే.. ఉద్యోగులు వాళ్లు రిటైర్మెంట్ వచ్చేసరికే వాళ్ల జీతాలు 20 నుంచి 40 వేల రూపాయల వరకూ పోతది. కానీ ఇప్పుడు అనుసరిస్తోన్న ఈ సీపీఎస్ విధానం వల్ల,  వాళ్లందరికీ కూడా కనీసం వాళ్లకు ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత, కనీసం పెన్షన్ కింద పదహైదువందలు కూడా రాని పరిస్థితిలో ఉంటే, వారంతా కూడా మేము ఎలా బతకాలని అడుగు ఉన్నారు. వాళ్లది సరైన డిమాండ్. ఈ ఉద్యోగస్తులకు నేను చెబుతా ఉన్నా. మనం దేవుడి దయ వల్ల అధికారంలోకి వచ్చిన తర్వాత సీఈపీఎస్‌ను రద్దు చేస్తాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రతి ఉద్యోగస్తుడికి స్థలాలు ఇస్తాం. ఇళ్లు కట్టిస్తామని మాటఇస్తా ఉన్నా’
– ఎన్నికల ముందు నాటి విపక్ష నేత, ప్రస్తుత ఏపీ సీఎం జగన్ హామీ.

‘తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. నేను ఈ సభ నుంచి హామీ ఇస్తున్న. వారికి పీఆర్సీ ఇస్తాం. అదొక్కటే కాదు. వారి డిమాండ్లన్నీ నెరవేరుస్తాం. నోటిఫికేషన్ లోగా అందరితో మాట్లాడి పరిష్కరిస్తా. కేసీఆర్ మాట ఇచ్చాడంటే వంద శాతం నెరవేరుస్తాడు. దాని గురించి ఉద్యోగులేం భయపడనక్కర్లేదు’
– ఎన్నికల ముందు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ.

– ఎన్నికలయ్యాయి. ఉద్యోగులకు వరదానాలిచ్చిన ఇద్దరూ, ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. ఏడాది విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. కానీ.. సీపీఎస్ రద్దు హామీ మాత్రం హామీగానే నిలిచిపోయింది. వారి కల కల్లలుగానే మిగిలిపోయింది.  అదొక్కటే కాదు.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యోగుల చిరకాల వాంఛితమయిన అనేక డిమాండ్లు, పరిష్కారం కాక పడకేశాయి. అటు వీటిపై పిడికిలి బిగించి పోరుబాటలో నడిచి, రణనినాదం చేయాల్సిన ఉద్యోగ సంఘాలు, పాలకుల నీడలో సేదదీరుతూ సుఖనిద్ర పోతున్నారని ఉద్యోగులు ఉడికిపోతున్నారు. ఇది కూడా చదవండి.. ఉడుకుతున్న తెలంగాణ ఉద్యోగులు

ఉద్యోగుల మెడపై వేళ్లాడుతోన్న సీపీఎస్ కత్తి..


కంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం (సీపీఎస్)పై తెలుగు రాష్ట్రాల ఉద్యోగుల్లో మళ్లీ కలవరం మొదలయింది. దానిని రద్దు చేయాలన్న తమ డిమాండును.. రెండు ప్రభుత్వాలు చిదిమేస్తున్న తీరుతోపాటు, దానిపై పెదవి విప్పని తమ సంఘ నాయకమ్మన్యుల పరాధీనతపై ఫైరవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 3.28 లక్షల మంది ఉద్యోగులలో, 1.50 లక్షల మంది ఉద్యోగుల  మెడపై ఇప్పుడు సీపీఎస్ కత్తి వేళ్లాడుతోంది. చప్రాసీ నుంచి గప్-్ర1 ఆఫీసర్ వరకూ సీపీఎస్ పరిథిలోకి వస్తారని ఉద్యోగులు చెబుతున్నారు.

ఉద్యోగుల డబ్బుతో షేర్ మార్కెట్ వ్యాపారమా?

పాత పెన్షన్ విధానంలో 50 శాతం పెన్షన్, కుటుంబసభ్యులకు 30 శాతం పెన్షన్, కమ్యూటేన్ 12 లక్షల రూపాయల గ్రాట్యుటీ  వంటి సౌకర్యాలు లభిస్తాయి. కానీ కొత్త సీపీఎస్ విధానంలో మాత్రం.. డిఏ, బేసిక్ పే నుంచి 10 శాతం చొప్పున డబ్బు మినహాయించి, అంతే మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా జమ చేస్తుంది. రిటైరయ్యే వరకూ పోగయిన మొత్తం నుంచి, 60 శాతం నగదుగా చెల్లిస్తారు. మిగతా 40 శాతం డబ్బును, ప్రభుత్వాలే షేర్ మార్కెట్‌లో పెట్టి, దాని ద్వారా వచ్చే డబ్బునే తిరిగి పెన్షన్‌గా చెల్లిస్తారు. ఒకవేళ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన కంపెనీకి లాభాలు రాకపోయినా, దానికి డిమాండ్ లేకపోయినా ఉద్యోగుల పెన్షన్ తగ్గిపోతుందన్న మాట.

అంటే అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలు చెల్లించకుండా, వారి డబ్బుతో ప్రభుత్వమే వ్యాపారం చేసి, పెన్షన్‌పై పరాచకాలు ఆడుతోందని స్పష్టమవుతోంది. అందుకే అవసానదశలో తమ జీవితాలతో చెలగాటమాడే ఈ సీపీఎస్ బదులు, పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నది ఉద్యోగుల డిమాండ్. దీనికి ఎన్నికల ముందు సానుకూలంగా, ఉద్యోగుల చెవులకు ఇంపుగా హామీలిచ్చి, వారితో ఓట్లు వేయించుకుని గద్దెనెక్కిన పాలకులు మాత్రం,  ఇప్పుడు దానిపై చడీ చప్పుడు చేయడం లేదు.

ఏపీలో 27 శాతం ఐఆర్..

గతంలో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు హయాంలో వేసిన ఠక్కర్ కమిటీ నివేదిక, ఏమయిందో ఎవరికీ తెలియదు. ఇప్పుడు సీఎంగా ఏడాది నుంచీ కొనసాగుతున్న జగన్ కూడా, సీపీఎస్‌పై మీనమేషాలు లెక్కబెడుతున్నారు. పాలకుల హామీని గుర్తు చేసి, నిలదీయాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం..  ప్రభుత్వాలకు గులాంగిరీ చేస్తున్నారన్న ఆగ్రహం వ్యక్తమవుతోంది.  ఏపీలో జగన్ ప్రభుత్వం జులై 2019 నుంచి 27 శాతం ఐఆర్ ఇస్తుంటే, తెలంగాణలో దానికీ అతీగతీ లేదని, దానిపై ఉద్యమించాల్సిన ఉద్యమ నేతలు.. భర్త, బావల కోసం పైవరీలు చేసే దళారుల అవతారమెత్తుతూ, తమను బలిపశువులను చేస్తున్నారని ఉద్యోగులు మంపడిపడుతున్నారు.

మాట నిలబెట్టుకోని కేసీఆర్..

ఐఆర్,  పదవీ విమరణ వయసు పెంచుతామన్న కేసీఆర్ హామీ కూడా ఇప్పటికీ నిలబెట్టుకోలేదని తెలంగాణ ఉద్యోగులు మండిపడుతున్నారు. ఈ అంశంలో ఉద్యోగ సంఘాల నేతల కంటే,  రాజకీయపక్షాలే ఉద్యోగులకు  బాసటగా నిలవడం విశేషం. దీనితో రంగంలోకి దిగిన టీఎన్జీఓ, టీజీఓ సంఘ నేతలు.. తాజాగా నిరసన సరం కాస్తంత పెంచడం ప్రస్తావనార్హం. పదవీ విరమణ వయసు పెంచి దానిని జూన్ నుంచి అమలుచేయాలని, కరోనా నేపథ్యంలో జూన్ నెల వేతనం పూర్తిగా చెల్లించాలని, ఏప్రిల్, మే నెలలో కత్తిరించిన జీతాన్ని పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐఏఎస్, ఐపిఎస్‌లకు పదవీ విరమణ తర్వాత కూడా పొడిగింపు అవకాశాలిస్తుంటే, దానిని విస్మరించి తమ నేతలపైనే విమర్శలు చేయడం వెనుక కొందరి కుట్ర ఉందని, ఉద్యోగ సంఘ నేతలు అనుమానం వ్యక్తం చేశారని సమాచారం. పదవీ విరమణ వయసు పెంపుపై.. కేసీఆర్ ఇప్పటివరకూ విధానపరమైన నిర్ణయం తీసుకోకపోవడంపై ఉద్యోగులలో నిరసన వ్యక్తమవుతోంది. దీనిపై వారు మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిళ్లు చేస్తున్నా.. ఈ విషయంలో తామేమీ చేయలేమని, సారుతో మాట్లాడుకోండని చేతులెత్తేస్తున్న వైనం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here