బాలయ్యా.. వరంగల్‌లో ఏందీ గోలయ్యా?

529

బాలయ్య సిఫార్సుతో పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవి
ఎన్టీఆర్‌భవన్‌లో ధర్నాకు దిగిన వరంగల్ తమ్ముళ్లు
బాలయ్య చెబితే ఇచ్చేస్తారా అంటున్న తెలంగాణ తమ్ముళ్లు
నేరుగా బాలకృష్ణకు లేఖ పేరుతో ఆవేదన
పార్టీ పదవులపై తెలంగాణ తమ్ముళ్ల అసంతృప్తి
పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు
                (మార్తి సుబ్రహ్మణ్యం)

ఇప్పటికే సినీహీరోల మధ్య జరుగుతున్న వివాదంలో నలుగుతున్న నందమూరి బాలకృష్ణ.. తెలంగాణలో టీడీపీ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవి వ్యవహారానికి సంబంధించి మరో వివాదంలో ఇరుక్కున్నారు. బాలకృష్ణ సిఫార్సుతో పార్టీ పదవి దక్కించుకున్న వైనం, వరంగల్ జిల్లా తమ్ముళ్లకు ఆగ్రహం కలిగించింది. బాలకృష్ణ చెబితే ఇచ్చేస్తారా అని ప్రశ్నిస్తూ, వారంతా హైదరాబాద్‌లోని టీడీపీ ఆఫీసులోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగిన వైనం చర్చనీయాంశమయింది. అంతేనా? నేరుగా బాలకృష్ణకే పార్టీని రక్షించమంటూ రాసిన లేఖ ఆసక్తికరంగా మారింది.

పార్టీలో ఉన్న ప్రస్తుతం ఉన్న జిల్లా అధ్యక్ష పదవుల స్థానంలో, పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవి వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల చాలామందికి పదవులు రావడంతో సానుకూలత వ్యక్తమవుతోంది. అదీకాకుండా సంస్థాగతంగా, పార్టీపై దృష్టి సారించేందుకు తగిన సమయం ఉంటుందని భావిస్తున్నారు. అయితే, తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ అసమర్ధ నిర్వాకం, ఎంపికల వైఫల్యం  కారణంగా, ఇష్టం వచ్చినట్లు చేస్తున్న నియామకాలపై పార్టీ శ్రేణుల్లో అసంతృప్తికి దారితీస్తోంది. ఇప్పటికే రమణ తీరు వల్ల, పార్టీ అగ్రనాయకులంతా పార్టీని వీడారన్న విమర్శలున్నాయి.

బాబును తప్పుదోవ పట్టిస్తున్న సీనియర్లు..

మళ్లీ  నియోజకర్గ ఇన్చార్జిల నియామకంలో పార్టీ అధ్యక్షుడు రమణ, పార్టీ అధినేత చంద్రబాబును తప్పుదోవ పట్టిస్తున్నారన్న ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. తామంతా కలసే నిర్ణయాలు తీసుకున్నామని, ఒకరిద్దరు నేతలు కుమ్మక్కయి తీసుకుంటున్న నిర్ణయాలపై చంద్రబాబు నాయుడు ఆమోదముద్ర వేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు సీనియర్లు తమకులేని పెత్తనం మీద వేసుకుని, రమణతో కలసి ఒక వ్యూహం ప్రకారం పదవులు పంచుకుంటున్నారన్న విమర్శలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అసెంబ్లీ, అంతకుముందు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అభ్యర్ధుల ఎంపిక సమయంలో కూడా ఇదే జరిగిందటున్నారు.

ఇక తాజాగా వరంగల్ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా అశోక్ నియామకం వెనుక, నందమూరి బాలకృష్ణ సిఫారసు ఉందన్న విషయం తెలుసుకున్న తమ్ముళ్లు అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఆ పదవి ఆశించిన ముగ్గురు సీనియర్లు తమలో ఎవరికి ఆ పదవి ఇచ్చినా కలసి పనిచేస్తామని పార్టీ నాయకత్వానికి చెప్పారు. అశోక్ పార్టీలో పనిచేయలేదని ఫిర్యాదు చేశారు. అయినా, బాలకృష్ణ సిఫార్సు చేశారని అశోక్‌కు అధ్యక్ష పదవి ఇవ్వడం వరంగల్ జిల్లా పార్టీలో దుమారం రేపుతోంది. దీనితో మనస్తాపం చెందిన సీనియర్లు ఈ అంశాలను, నేరుగా బాలకృష్ణకే లేఖాస్త్రం సంధించారు.  ప్రస్తుతం దీనిపై వరంగల్‌లో రెండు వర్గాల మధ్య వాట్సాప్ వార్ జరుగుతోంది.

కోర్ కమిటీ చర్చించకుండానే నిర్ణయమా?

బాలయ్య అభిమాని పేరుతో అశోక్ ఆయన వద్దకు వెళ్లి అధ్యక్ష పదవి కోసం  సిఫార్సు చేయించుకున్నారని, అయితే స్థానిక విషయాలు తెలియని బాలయ్య అమాయకంగా ఆయన పేరు సిఫారసు చేశారని అశోక్ వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. ఈయన నియామకంపై చంద్రబాబు ఏడెనిమిది మందితో నియమించిన కోర్ కమిటీ ఏమాత్రం చర్చించలేదంటున్నారు. కేవలం ముగ్గురు కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబును కాదని, పార్టీలో ఇద్దరు ముగ్గురు నాయకులే కూడబలుక్కుని నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. హైదరాబాద్ జిల్లా సమన్వయ కమిటీలో కూడా ఇదే బృందం.. సీనియర్లకు స్థానం లేకుండా పేర్లు ప్రకటించారంటున్నారు. చంద్రబాబు కూడా వారినే విశ్వసిస్తున్నారని, పార్టీ కార్యాలయానికి బాబు వచ్చిన సమయంలో.. తమ సమస్యలు ప్రస్తావించేందుకు జిల్లా నేతలు వచ్చినప్పుడు, సీనియర్లు బాబు చాంబరులోనే తిష్టవేసుకోవడం ద్వారా, తాము బాబుకు  సమస్యలు చెప్పలేకపోతున్నామని జిల్లా నేతలు వాపోతున్నారు.

పార్టీ ఆఫీసులోనే తమ్ముళ్ల ధర్నా..

కాగా, అశోక్‌కు పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న సమాచారం అందుకున్న వరంగల్ సీనియర్ నేతలయిన.. కంప వినోద్‌కుమార్, సాంబయ్య, అర్శనపల్లి విద్యాసాగర్‌రావు నేతృత్వంలో పార్టీ కార్యకర్తలు, హైదరాబాద్‌లోని పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. తామెవరో గుర్తు పట్టని వ్యక్తిని తీసుకువచ్చి, అధ్యక్ష పదవి ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ ఆఫీసు ఆవరణలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద సాయంత్రం వరకూ ధర్నా నిర్వహించారు. ఈ విషయం తెలిసిన సీనియర్ నేత బక్కని నర్శింహులు తమ వద్దకు వచ్చి మీ విషయంపై చంద్రబాబు స్పందించి, అశోక్ నియామకం నిలిపివేయమని చెప్పారంటూ తమకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపచేశారని అధ్యక్ష పదవి ఆశిస్తున్న ఆ ముగ్గురు బాలకృష్ణకు రాసిన లేఖలో  పేర్కొన్నారు. కానీ, తాము పార్టీ పరులపాలు కాకూడని ఎవరినయితే వ్యతిరేకిస్తున్నామో, అదేవ్యక్తికి  అధ్యక్ష పదవి ఇచ్చారని బాలకృష్ణకు రాసిన లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసు నాయకులు కూడా మీ సిఫారసు మేరకే అధ్యక్ష పదవి ఇచ్చినట్లు చెబుతున్నందున, ఈ విషయంలో జోక్యం చేసుకుని పార్టీని కాపాడాలని కోరారు.
నందమూరి నట సింహం. పేదల పెన్నిది. క్యాన్సర్ వ్యాధి గ్రస్థుల ప్రాణధాత. సాక్షాత్తు ధైవ సమానులైన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నట. రాజకీయ వారసులైన గౌ”శ్రీ. నందమూరి బాలకృష్ణ గారికి శుభోదయ నమస్సులులతో మీ వీరాభిమానులు విన్నవించుకొను విజ్ఞప్తి. అయ్యా. మన తెలుగుదేశం పార్టీ నిర్మాణమే “ఆత్మగౌరవ” పునాదుల పై నిర్మితమైనదని మీకు చెప్పేటంతటి వాళ్లం కామయ్యా . కానీ మీ పేరు దుర్వినియోగం ఔతుంటే ఉండబట్ట లేక తప్పని స్థితిలో వినమ్రులమై విన్నవించుకుంటున్న విషయమేమంటే అయ్యా. మన పార్టీ జిల్లా కమిటీలు రద్దు పరచి వాటి స్థానంలో పార్లమెంటరీ పార్టీ కమిటీలు వేస్తున్న సంగతి తమకు విధితమే కధా అయ్యా. ఈ నియామక ప్రక్రియలో భాగంగా గత సంవత్సరం. నవంబర్ మాసంలో రాష్ట్ర పార్టీ పరిశీలకులు వచ్చినప్పుడు నాతో పాటు ఆశావహులైన మరో ముగ్గురు నేతలు ధరఖాస్తు చేసుకోవటం. మా పేర్లను పరిశీలకులుగా వచ్చిన పార్టీ ప్రతినిధులు పార్టీకి నివేదించడం జరిగిందయ్యా. కానీ అనూహ్యంగా మమ్ము కాదని. పరిశీలకులు వచ్చినప్పుడు లేని. మన పార్టీ సభ్యుడు కానీ మాకే తెలియని. టిఆర్ఎస్ పార్టీతో అంటకాగే కుటుంబానికి చెందిన ఓ పిల్లవాడికిస్తున్నారనే ముందస్తు మాచారంతో మన ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లోని మన ధైవమైన అన్న స్వర్గీయ నందమూరి తారక రాముడికి “మా గోడు” వెల్లబోస్తు ఆశావహులైన ముగ్గురం. సధరు వ్యక్తికి ఇవ్వడం ధర్మం కాదని. మా పూర్వానుభవాన్ని. అంకిత భావాన్ని పరిగణనలోకి తీసుకొని మాలో ఎవరికిచ్చిన సమన్వయంతో కలసి పని చేస్తూ పార్టీని ముందుకు తీసుకొని వెళ్తామని. పార్టీని పరులపాలు కాకుండా కాపాడుకోవాలనే ఏకైక ధ్యేయంతో 30-12-19 “నిరవధిక నిరాహార దీక్ష” పూనుకొంటిమి. రెండవ రోజున మన అలుపెరుగని ఆదర్శ నేత. అభివృద్ధి ప్రధాత గారైన గౌ”శ్రీ. నారా చంద్రబాబు నాయుడు గారు స్పందించి పెద్ధలు రావుల గారితో మమ్ము చల్లబరచి తదుపరి పెద్దలు గౌ”శ్రీ. బక్కని నర్సింహులు గారిని మా వద్దకు పంపించి. వారిచే పార్టీని కాపాడుకోవాలనే మీ ఆరాటాన్ని. పోరాటాన్ని జాతీయ అధ్యక్షుల వారు పెద్ద మనస్సుతో అర్థం చేసుకొన్నారని. వెంటనే ఆ నియామక ఉత్తర్వులు నిలిపివేయమని అజ్నాపించారని. మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడిన తదుపరి మీలో ఒకరిని ఎన్నిక చేసి మీ న్యాయమైన కోరికను తీరుస్తానన్నారని. నా ద్వారా మన అధినేత గారు పంపిన వర్తమానాన్ని గౌరవించి. ఈ నిమ్మరసం స్వీకరించి “దీక్ష” వివరించమనగా మారు మాటాడకా “దీక్ష” విరమించి. మిక్కిలి సంతోసిస్తూ. పార్టీ ఎంతో పఠిష్టంగా పునర్నిర్మాణం కాగలదనన్న ఎంతో ఆశించామయ్యా కానీ మా “ఆశ” నీరుగారి పోవడానికి ఎంతో కాలం పట్టలేదని తమకు తెలిపేందుకు చింతిస్తూ. ఇంత జాప్యం తర్వాత తిరిగి అతనికే పట్టం కట్టడమే గాక మీ సిఫారసుచే ఇచ్చామని. మీ పేరుని దుర్వినియోగం చేస్తూ మమ్ము మరింత క్షోభకు గురిచేస్తున్న వైనాన్ని గ్రహించి పార్టీనీ మమ్మల్ని కాపాడమని “చెమ్మగిల్లిన కళ్ల” తో మిమ్ము వేడుకుంటున్నామయ్యా 🙏మీ వీరాభిమానులు : కంప వినోద్ కుమార్ న్యాయవాది. హన్మకొండ సాంబయ్య. అర్శనపల్లి విద్యాసాగర్ రావు న్యాయవాది.

మీ చలవతోనే అధ్యక్షుడినయ్యానన్న అశోక్..

అటు బాలకృష్ణ సిఫార్సుతో అధ్యక్ష పదవి పొందిన అశోక్ పేరుతో కూడా, వాట్సాప్‌లో ఓ సందేశం సర్క్యులేట్ అవుతోంది. ఆయన కూడా తనకు పదవి ఇచ్చిన బాలకృష్ణకు ఓ లేఖ రాసినట్లు అందులో ఉంది. మీ చల్లని దీవెనలతోనే పార్టీ అధ్యక్ష పదవి దక్కిందని, మీ నమ్మకాన్ని వమ్ము చేయనని అందులో కృతజ్ఞతలు చెప్పారు. మీతో మాట్లాడిన తర్వాత తమకు చాలా శక్తి వచ్చింద న్నారు. ఇన్నాళ్లూ మీరు తెలంగాణ టీడీపీపై చిన్నచూపు చూస్తున్నారని చిన్నబుచ్చుకునేవాళ్లమని, కానీ నిన్నటి మీ మాటలతో మీరు మాపై ఎంత ప్రేమ, దూర దృష్టితో ఉన్నారో అర్ధం చేసుకున్నామన్నారు. మీ చల్లని నోటితో మమ్మల్ని గెలిపిస్తామని కూడా దీవించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
మా అభిమాన నాయకులు, నటసింహం నందమూరి బాలకృష్ణ గార్కి…నమస్కారాలతో ధన్యవాదాలు తెలియజేస్తూ
మీ చల్లని దీవెనలతో, ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తల కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ వరంగల్ పార్లమెంట్ అధ్యక్షులుగా నియామకం కావడం జరిగింది.
మీరు మాపై చూపిన ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టడానికి రాజీలేని కార్యాచరణతో ముందుకు వెళ్లి పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని పూర్తి నిస్వార్థతతో, హృదయపూర్వకంగా మీకు హామీ ఇస్తున్నాను.
మాయొక్క ఈ కృషిలో కార్యాచరణలో పార్టీ వ్యవస్థాపకులు, తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక,తెలుగు అందగాడు ,వెండితెర చక్రవర్తి కీశే నందమూరి తారకరామారావు గారి దీవెనలు,ఆదర్శ నాయకత్వానికి ప్రతిరూపం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనం, అండదండలు ఉంటాయన్న నమ్మకం మీతో మాట్లాడిన తరువాత మాకు కలిగింది.
నిన్న సైతం(ఆదివారం) మీతో మాట్లాడిన సందర్భములో మీ మాటలతో మీరు మాకు ఇచ్చిన దీవెనలు,ధైర్యం చాలా శక్తివంతమైనది.ఇన్ని రోజులు మీరు తెలంగాణ టిడిపిపై చిన్నచూపు చూస్తున్నారని మేము చిన్నబుచ్చుకునేవాళ్ళం. కానీ నిన్నటి మీ మాటలతో మాపై మీరు ఎంతటి ప్రేమతో,దూరదృష్టితో ఉన్నారో అర్థం అయ్యింది.
మీ దీవెనలతో,నోటి మాటలు తథాస్తు పలికి విజేతలు అయిన వారు ఎందరో….మీ చల్లని నోటితో మమ్మల్ని గెలుపిస్తానని అని కూడా దీవించారు.ఇది మీ దీవెనలతో తథాస్తు అవుతుందని, పాజిటివ్ శక్తితో ముందుకు వెళ్తాము.
ఇదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు, తెలంగాణ రాష్ట్రం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,కోర్ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.జాతీయ, తెలంగాణ తెలుగుదేశం పార్టీ పెద్దలు, నాయకుల అండదండలు,ఆశీస్సులు, మార్గదర్శనం మాకు ఉంటాయని ఆశీస్తున్నాను.మీ అభిమానులుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గా ముందుకు సాగే మా కార్యాచరణలో పెద్ద,చిన్న ప్రతి ఒక్కరి సలహా,సహాయ, సహకారాలతో ముందుకు సాగుతామని పార్టీ పురోభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.
కృతజ్ఞాతిభివందనాలతో……….
ఇట్లు
మీ అభిమాని,తెలుగుదేశం కార్యకర్త
చీటూరి అశోక్,
అధ్యక్షులు,
తెలుగుదేశం పార్టీ-వరంగల్ పార్లమెంట్