వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏడాది పాలన అద్భుతం. మంచి అనుభవం ఉన్న పాలకుడిలా ఏడాది పాలన చేశారు. ఎక్కడా కూడా అవినీతి మచ్చ కనబడకుండా జాగ్రత్త పడ్డారు. టీడీపీ నేతలు, వారి అనుకూల మీడియా పని గట్టుకుని ఎన్ని విమర్శలు చేసినా తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల సమస్యలు తెలుసుకోవడంలో ఎంత సమర్ధవంతంగా పని చేశారో, సీఎం అయ్యాక ప్రజా సమస్యల పరిష్కారంలో అంతే సమర్ధంగా పని చేస్తున్నారు. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు గడప గడపకు వెళ్తున్నాయి.
వైఎస్ జగన్ ఏడాది పాలనపై సోషల్ మీడియా ప్రశంసలు కురిపించింది. తెలుగు రాష్ట్రాల ప్రజలే కాదు కర్ణాటక, తమిళనాడుల్లోని వైఎస్ జగన్ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తించారు. వైఎస్ జగన్ లాంటి పాలకుడు తమకు లేకపోవడం దురదృష్టకరమంటూ పోస్ట్‌లు పెట్టారు.తమిళనాడు, కర్ణాటకల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీలు పెట్టి సంబరాలు చేసుకున్నారు అభిమానులు. సోషల్ మీడియాలోనైతే వైఎస్ జగన్‌ను అభినందిస్తూనే చంద్రబాబుపై దుమ్మెత్తి పోశారు మహిళలు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లలో చేయనది వైఎస్ జగన్ ఏడాది కాలంలో చేసి చూపించి విశ్వసించదగ్గ నాయకుడు అనిపించుకున్నాడని మహిళలు చెప్పారు. ఇంటి దగ్గరకే పింఛన్లు, వాలంటీర్ వ్యవస్థ జగన్ ప్రజారంజక పాలనకు నిదర్శనాలు. చంద్రబాబు పాలనలో పింఛన్ ఇవ్వడానికి పదో తారీఖు వరకు తిప్పుకున్న రోజులున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఫస్ట్ తారీఖునే , తెల్లవారక ముందే పింఛన్లు ఇంటి గడప తొక్కుతున్నాయి. దీంతో వృద్ధులు వైఎస్ జగన్ పాలనను అభినందిస్తున్నారు. రివర్స్ టెండరింగ్‌తో వేల కోట్ల ప్రజాధనాన్ని సీఎం జగన్ ఆదా చేశారు. అమ్మ ఒడితో చిన్నారుల చదువులకు అండగా నిలిచారు. గోరు ముద్ద పథకంతో మామయ్య విద్యార్ధుల ఆకలి తీర్చారు. ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రెండో విడత పది వేల రూపాయలు ఇచ్చి మాట ఇస్తే తప్పనని జగన్ నిరూపించుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన బకాయిలను చెల్లించడమే కాకుండా, వేల కోట్ల రూపాయల ఫీజులు చెల్లించారు. మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి నేను చదివిస్తానని విధ్యార్ధులకు ధైర్యానిచ్చారు. వెయ్యి రూపాయల బిల్లు దాటితే ఆరోగ్య శ్రీ వర్తిస్తుందని చెప్పి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలిచారు.ఏపీలోనే కాదు సౌత్ ఇండియాలోని ప్రముఖ ఆస్పత్రుల్లో ఎక్కడైనా వైద్యం చేయించుకోవచ్చంటూ ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెడుతున్నాయి. అక్టోబర్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ జలాలు పొలాల్లో గలగలపారనున్నాయి. ఓ నాయకుడిగా కాకుండా ఓ సేవకుడిగా వైఎస్ జగన్ ప్రజారంజక పాలన సాగిస్తున్నారు.
ఏపీలో బాధ్యతలేని ప్రతిపక్షం ఉంది. ఆ బాధ్యతలేని ప్రతిపక్షానికి అండగా అబద్దాలు వండివార్చే మీడియా. వైఎస్ జగన్ పాలన చాలా బాగుందని సీ ఓటర్, సీఎన్ఎన్ సర్వే ప్రజాభిప్రాయాన్ని కళ్లకు కట్టాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బెస్ట్ సీఎంల లిస్ట్‌లో 4వ ర్యాంక్ ఇచ్చాయి. ఓ యువకుడు, మొదటి సారి సీఎం, సొంత పార్టీ పెట్టి 9 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చారు, నిత్యం అడ్డంకులు సృష్టించే ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూనే, ఎల్లో మీడియా చేసే దుష్ప్రచారాన్ని తిప్పి కొడుతూనే ఏడాదిలోనే మంచి పాలకుడిగా పేరు తెచ్చుకోవడమంటే మాములు విషయం కాదు.
కాని..వైఎస్ జగన్ మంచి పాలన ఎలా చేయవచ్చో చేసి చూపించారు. కరోనా సమయంలో దేశానికే మార్గదర్శకుడిగా వైఎస్ జగన్ నిలిచారు. జోన్లు వ్యవస్థతో దేశ ఆర్ధిక వ్యవస్థ పడిపోకుండా కేంద్రానికి చుక్కాని అయ్యారు. ఒక పక్క కరోనాతో దేశం మొత్తం తలకిందులవుతుంది. మరో పక్క ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతుందని కేంద్రం బెంబేలెత్తుతుంది. అన్ని రాష్ట్రాలు కేంద్రం వైపు ధీనంగా చూసే పరి స్థితి. కాని..వైఎస్ జగన్ సీఎంగా ఉన్న ఏపీలో మాత్రం సంక్షేమ పథకాలు ఆగలేదు. ఉద్యోగుల జీతాలూ ఆగలేదు. ప్రాజెక్టులకు నిధుల కొరత లేదు. పాలనా రధం ఎక్కడా దారి తప్పకుండా సాహసంగా ముందుకు సాగింది. ఆర్ధిక క్రమశిక్షణ, ప్రజలకు సేవ చేయాలనే తపన ఉంటే ఏమైనా చేయొచ్చని చేసి చూపించారు వైఎస్ జగన్. మభ్య పెట్టే మాటలు కాకుండా ఉన్నది ఉన్నట్లు ప్రజలకు చెప్పడంలోనే నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. కరోనాతో కలిసి జీవించాలని చెప్పి ప్రజలను మానసికంగా సిద్ధం చేసిన నాయకుడు వైఎస్ జగన్. ఈ మాట చెప్పడానికి ఎంతో ధైర్యం ఉండాలి. వైఎస్ జగన్ ఈ మాట చెప్పిన తరువాతనే ప్రధాని సహా అందరూ కరోనా నిజాలపై నోరు విప్పారు. ఏడాది కాలంలోనే దమ్ము, దయ ఉన్న లీడర్‌గా వైఎస్ జగన్ పేరు తెచ్చుకున్నారు.
ఏడాది కాలంలోనే మేనిఫెస్టోలోని 90శాతానికి పైగా హామీలను అమలు చేసిన నాయకుడిని నేనైతే ఇప్పటి వరకు చూడలేదు, ఏ పుస్తకంలో చదవలేదు, ఇప్పటి వరకు వినలేదు కూడా. మేనిఫెస్టోనే ఓ వేదంలా భావిస్తూ జగన్ పాలన సాగిస్తున్నారు. ఏడాదిలోనే వైఎస్ జగన్ పాలకుడిగా తానేంటో నిరూపించుకున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చే పాలనా సంస్కరణలు ప్రపంచానికి ఆదర్శం కాబోతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి పాలకుడు ఏపీ ప్రజలకు దొరకడం వారి అదృష్టం. ఎందుకంటే..నేటి పాలన బాగుంటేనే రేపటి భవిష్యత్తు బాగుంటుంది.
వైఎస్ జగన్ పాలనలో గ్రాఫిక్స్ లేవు, వాస్తవాలు ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనలో అబద్దాలు లేవు, నిజాలు ఉన్నాయి. వైఎస్ జగన్ పాలనలో దుబారా లేదు, ప్రతి పైసాకు జవాబుదారి తనం ఉంది. వైఎస్ జగన్ పాలనలో దబాయింపు లేదు, వినమ్రం ఉంది. వైఎస్ జగన్ పాలనలో ప్రభుత్వ అధికారులపై దాడులు లేవు, వారి బాధ్యతను గుర్తు చేసే పాలన ఉంది. వైఎస్ జగన్ పాలనలో పోలవరాన్ని ఏటీఎంల ఉపయోగించుకోవడం లేదు, పోలవరం పూర్తైతే ప్రతి ఇళ్లు ఏటీఎం అయ్యేలా పనులు జరుగుతున్నాయి. వైఎస్ జగన్ పాలనలో గర్భంలో ఉన్న శిశువు దగ్గర నుంచి ఇంటిలో ఉన్న ముదుసలి వరకు భరోసా ఉంది.అందుకే.. ప్రధాని మోదీ సైతం జగన్ పాలనకు ఫిదా అవుతున్నారు. సామాన్యుల నుంచి ఢిల్లీ రాజు వరకు వైఎస్ జగన్ పాలనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఏడాదిలోనే తానేంటో నిరూపించుకుని కోట్ల మంది భవిష్యత్తుకు దివిటై నిలిచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి.
పాలన ఓకే మరీ పార్టీ పరిస్థితి ఏంటీ?!!..
వైఎస్ జగన్ ఏడాది పాలనపై జాతీయ సర్వేలు, సామాన్యుల దగ్గర నుంచి ఢిల్లీ పెద్దల వరకు శభాష్ అంటున్నారు. ఈ సమయంలోనే పార్టీ పరిస్థితి ఏంటని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ఆర్ సీపీపై దృష్టి పెట్టడంలేదనే విమర్శలు బాగా వినిపిస్తున్నాయి. ఈ ధోరణి చాలా ప్రమాదకరమని కూడా హెచ్చరిస్తున్నారు. మోదీ -అమిత్ షా పాలనలో ఎంత బిజీగా ఉన్నా బీజేపీ బలోపేతం విషయంలో ఎక్కడా కూడా నిర్లక్ష్యంగా కనిపించరు. ఎప్పుడూ కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి నాయకుడి వరకు టచ్‌లో ఉంటారు.
పార్టీ బలంగా ఉంటనే ఢిల్లీలో కూర్చోగలం లేకపోతే గుజరాతే అని వారిద్దరికీ తెలుసు. అందుకే ..పార్టీపై ఏమాత్రం పట్టు కోల్పోకుండా చాలా జాగ్రత్తగా ఉంటూ పావులు కదుపుతుంటారు. మోదీ – అమిత్ షాల విజయ రహస్యం కూడా పార్టీని ఎప్పటికప్పుడు బలోపేతం చేసుకోవడంలోనే ఉంది. మోదీ – అమిత్ షా లాంటి వారే బీజేపీపై అంతగా దృష్టి పెడుతుంటే..వైఎస్ జగన్, ఆయన వ్యూహకర్తలు ఏం చేస్తున్నారనేది ప్రశ్న. వైఎస్ జగన్ ఏడాదిలో మంచి పాలకుడిగా పేరు తెచ్చుకోవచ్చు. కాని..ఆ పాలనా ఫలాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వైఎస్ఆర్ సీపీ జెండానే ప్రాణంగా భావించి, మోసే కార్యకర్తలు కావాలి. ఈ ఏడాది కాలంలో జెండా మోసిన కార్యకర్తలకు ఏమైనా భరోసా పార్టీ నుంచి లభించిందా?!!. వాలంటీర్ వ్యవస్థ చాలా బాగుంది. వైఎస్ జగన్ ఆలోచనలు, ఆశయాలను వారు ప్రతి గడపకు తీసుకెళ్తున్నారు. దీనిలో సందేహం లేదు. కాని..ఎన్నికల సమయంలో వాలంటీర్లు ఏజెంట్లుగా పోలింగ్ బూతుల్లో కూర్చోలేరుగా..?. ఒక వేళ కూర్చున్నా టీడీపీ వాళ్లు ఊరుకుంటారా?. ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోరు..!!. అందుకే పాలన వేరు, రాజకీయం వేరు. పథకాలు వేరు,పార్టీ వేరు. పాలనా, పథకాలు ఒక కోవకు చెందుతాయి. రాజకీయం, పార్టీ ఓ కోవకు కిందకు వస్తాయి. రెండు ఒకటి కాదు. రెండు విభిన్నం. కాని కవలల పిల్లలు లాంటివి. దేనిని నిర్లక్ష్యం చేసినా అధికారం చేజారుతుంది. అందుకే.. రెండూ భిన్నమైనవి అన్నప్పటికీ కవల పిల్లలు లాంటివి అన్నది. ఏడాది గడిచిపోయింది. పార్టీని, కార్యకర్తలను, జెండా మోసిన వారిని పట్టించుకోలేదనే విమర్శలు భారీ ఎత్తునే ఉన్నాయి. వీటిన్నింటిని కూడా సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చింది. ఈ విషయంలో మోదీ – అమిత్ షా సూత్రాన్ని వైఎస్ఆర్ సీపీ ఫాలో అవ్వాలి. పాలనపై దృష్టి పెడుతూనే వైఎస్ఆర సీపీ బలోపేతంపై కూడా మనసు పెట్టాలి. వైఎస్ జగన్ పాలనలో బిజీ కాబట్టి సమర్ధుడైన నాయకుడిని పార్టీ వ్యవహారాలు చూసే బాధ్యతలు అప్పగించాలి. రోజూ సాయంత్రం సమయంలో వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మేధావులు, విద్యావేత్తలు, రిటైర్డ్ ఉద్యోగులతో భేటీ అవ్వాలి. దీనికి ఓ సమయం, ఎవరితో ఎప్పుడు భేటీ అవ్వాలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. కిందిస్థాయిలో పార్టీ పరి స్థితిపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటూ ఉండాలి. 2019లో 23 సీట్లను వైఎస్ఆర్ సీపీ కోల్పోయింది. అంతే కాదు 3 ఎంపీ సీట్లు లాస్ అయ్యారు. 23 ఎమ్మెల్యే, 3 ఎంపీ సీట్లు ఎందుకు కోల్పోయాం, నెక్ట్స్ వాటిని కూడా ఎలా గెలివాలి అనే ప్రణాళికలు ఉండాలి. వైఎస్ఆర్ 151 ఎమ్మెల్యు, 22 ఎంపీ సీట్లలో నేటి పరిస్థితి ఏంటీ?. 2024లో వైఎస్ఆర్ సీపీ ఆ సీట్లు నిలబెట్టుకోగలదా ? అనే విషయంలో గ్రౌండ్ స్థాయిలో వర్క్ జరుగుతుండాలి. వైఎస్ఆర్ సీపీ అంటే ప్రాణం పెట్టే వారు ఎవరూ, పార్టీని నమ్ముకున్న వారు ఎవరు?. ఎవరికీ ఏ పదవులు ఇస్తే పార్టీ పరంగా న్యాయం జరుగుతుంది అనేది ఇప్పటి నుంచేనా కసరత్తు జరగాలి. వైఎస్ జగన్ సంక్షేమ పథకాలతో బీసీలు వైఎస్ఆర్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే..కింజరపు రామ్మోహన్ నాయుడిని టీడీపీ అధ్యక్షుడిని చేసిన తరువాత బీసీలు ఆలోచన ఎలా ఉంటుంది అనే దానిపై వైఎస్ఆర్ సీపీ ఇప్పటి నుంచే సమాలోచనలు చేయాలి. పాలనకు పార్టీయే ప్రాణం అనే సత్యాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవ్వాలి. ఆయన పథకాల మీద ఆయనకు నమ్మకం ఉండొచ్చు, పార్టీ మీద అంతకంటే ఎక్కువ నమ్మకం ఉండాలి. ఏపీలోని ప్రతి నియోజకవర్గం, గ్రామంలో వైఎస్ఆర్ సీపీ బలమేంటో సీఎం వైఎస్ జగన్‌కు తెలిసి ఉండాలి. అప్పుడే ఆయనకు పాలకుడిగా, నాయకుడిగా వంద శాతం మార్కులు పడతాయి. ఒక చెట్టు ఉంది అనుకున్నాం. ఆ చెట్టుకు వేరులు, కాండం చాలా ముఖ్యం. వేరులు , కాండం లేకపోతే చెట్టు నిలవదు, కొమ్మలు, పూలు, పండ్లు కాయవు. ఓ చెట్టుకు వేర్లు , కాండంలాంటిది రాజకీయ పార్టీ అయితే..పూలు, పండ్లు లాంటిది పాలన. ఈ విషయాన్ని వైఎస్ఆర్ సీపీ వ్యూహకర్తలు దృష్టిలో పెట్టుకోవాలి.
పార్టీ కంటే ఘోరంగా వైఎస్ఆర్ సీపీ మీడియా మేనేజ్ మెంట్ ఉందా?!!
వైఎస్ఆర్ సీపీకి అండగా సాక్షి ఉంది. సాక్షి పేపర్, సాక్షి టీవీ వైఎస్ఆర్ సీపీ బలోపేతానికి శక్తివంచన లేకుండా పని చేశాయి. పని చేస్తున్నాయి. వైఎస్ఆర్ సీపీకి సాక్షి పేపర్, సాక్షి టీవీ ఒక్కటే సరిపోదు. ఆధిపత్యం కోసం మధ్య యుగాల్లో కత్తులు, తుపాకులతో యుద్ధం చేసేవారు. ఇప్పుడు ఆధిపత్యం కోసం మీడియాతో యుద్ధం చేస్తున్నారు. నెపోలియన్ గురించి మన అందరికీ తెలుసు. మంచి యుద్ధ వ్యూహ కర్త. మీడియా గురించి ఆయన అన్నమాటలను ఇక్కడ గుర్తు చేస్తాను. ” నేను వెయ్యి ఫిరంగులకు కూడా భయపడను కానీ..ఒ క్క పత్రికకు భయపడతాను” స్వయంగా నెపోలియన్ అన్న మాటలివి. కలానికి, మీడియాకు ఉన్న శక్తిని నెపోలియన్ మధ్య యుగాల్లోనే గుర్తించి చెప్పిన మాటలివి. చంద్రబాబు నాయుడు మంచి పాలకుడు కాదు కానీ, మంచి పాలకుడిగా ఎల్లో మీడియా రాసి, చూపించింది. చంద్రబాబు దూరదృష్టి ఉన్న నేత కూడా కాదు కానీ ..విజన్ ఉన్న నేతగా ఎల్లో మీడియా రాసి, చూపించింది. చంద్రబాబు అతిపెద్ద అవినీతి పరుడు కానీ..ఆయన పెద్ద పతివ్రత అని ఎల్లో మీడియా రాసి చూపించిది. ఎల్లో మీడియా సాయంతోనే చంద్రబాబు ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవగలిగారు. ఎల్లో మీడియాతోనే జగన్ అవినీతి పరుడు అని చంద్రబాబు చిత్రించగలిగాడు. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ ఎదుగుదలంతా కూడా మీడియా మీదనే ఆధారపడి ఉంది. అందుకే చంద్రబాబు మీడియాను వదిలి పెట్టరు. ఇప్పటి కీ చంద్రబాబుకు 10కిపైగా శాటిలైట్ ఛానళ్లు అండగా ఉన్నాయి. 300కిపైగా యూ ట్యూబ్ ఛానళ్లు ఉన్నాయి. 300కిపైగా వెబ్ సైట్లు ఉన్నాయి. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసే సోషల్ మీడియా చంద్రబాబుకు ఉంది. వైఎస్ఆర్ సీపీకి ఉంది ఒక్క సాక్షి. ఆ సాక్షిలో కూడా పనికి వచ్చేవారు 30శాతం మంది కూడా ఉండరేమో. వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా వారిని అభినందించాలి. సాక్షి కంటే కూడా చిత్తశుద్దితో వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా పని చేస్తుంది. చంద్రబాబు అండ్ కో సాక్షిని చూసి బెదురుతారో లేదో కానీ..వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా అంటే వణికిపోతారు. వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియాలో కూడా జీతం తీసుకుని పని చేసే వారి కంటే కూడా స్వచ్ఛందంగా , అభిమానంతో పని చేసే వారే ఎక్కువ. రాజకీయంగా వైఎస్ జగన్‌కు వైఎస్ఆర్ సీపీ సోషల్ మీడియా రక్షణ కవచం. సాక్షి మీద వైఎస్ఆర్ సీపీ నేతలతోపాటు, వైఎస్ఆర్, జగన్ అభిమానులు కూడా ఆగ్రహంగా ఉన్నారు.వైఎస్ జగన్‌ను డిఫెన్స్ చేయడంలో, చంద్రబాబును ఎండగట్టడంలో సాక్షి ఘోరంగా విఫలమైందని వైఎస్ఆర్ సీపీ నేతలు చెబుతున్న మాటే. వైఎస్ జగన్ పాలన చాలా బాగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు తన ఎల్లో మీడియాతో జగన్ పాలనపై ఏదో విధంగా బురద జల్లిస్తున్నారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఎండగట్టే విధంగా సాక్షి టీవీ స్టోరీలు నడపలేకపోతుంది.లైవ్, ఫోన్, బ్రేకింగ్ ఇక చాలు అన్నట్లు సాక్షి టీవీ ఉంది. జగన్ పాలన గురించి చెప్పే స్టోరీలు, ఎల్లో మీడియాను ఖండించే స్టోరీలు, చంద్రబాబు కుట్ర రాజకీయాలు ఎండగట్టే స్టోరీలు సాక్షి నుంచి రావడంలేదని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.
సాక్షికి ప్రత్యామ్నాయంగా బలమైన మీడియా వ్యవస్థను నిర్మించాలని వైఎస్ఆర్ సీపీ, వైఎస్ఆర్, జగన్ అభిమానులు కోరుతున్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ఇబ్బందేనని వారు చెబుతున్న మాట. విశాఖ కేంద్రంగా సాక్షికి ప్రత్యామ్నాయ మీడియాపై వైఎస్ఆర్ సీపీ దృష్టి పెట్టాలని అంటున్నారు. రెండు చానళ్లు,రెండు పత్రికల తోపాటు , సోషల్ మీడియాను బలోపేతం చేసుకోవాలి. సోషల్ మీడియాలో వైఎస్ఆర్ సీపీని అభిమానించే యూ ట్యూబ్ యాజమానులను ప్రోత్సహించాలి.వెబ్ సైట్ యజమానులను ప్రోత్సాహించాలి. అంతేకాదు..స్వయంగా నమ్మకమైన , సమర్దులతో యూ ట్యూబ్ వ్యవస్థను నిర్మించుకోవాలి. కోట్ల రూపాయల పెట్టుబడులు మీడియాలో పెట్టాలి. మాకెందుకు మేము ఇంతే ఉంటామంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డా, ఆయన కష్టం బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ మధ్య కాలంలో ఒకతను నాతో అన్న మాటను ఇక్కడ చెబుతాను. సీఎంవోలో జగన్ గారి టీమ్ సరిగా లేదు, జగన్ గారు కష్టపడుతున్నారు, ఆయన స్పీడ్‌ను అందుకోలేకపోతున్నారు, నమ్మకంగా కూడా పని చేయడం లేదు. ఓవరాల్‌గా సీఎంవోలో టీం సరిగా లేదని అభిప్రాయపడ్డారు. రాజకీయమైనా, పాలనైనా వైఎస్ జగన్ చుట్టే తిరుగుతుంది. ఆయనపై ఒత్తిడి తగ్గించాల్సిన బాధ్యత ఆయన టీమ్ మీదనే ఉంటుంది. సలహాదారులు ఉందే అందుకు కదా?. వారు ఏం చేస్తున్నారు..?!!. సీఎంవోలో ఉన్న టీమ్ ఏం చేస్తుంది అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతాయి. అందుకే..ఇప్పటికైనా మంచి టీమ్‌ను, నమ్మకమైన మీడియాను నిర్మించుకోవాలి. సాక్షి పేపర్ గురించి నాకు తెలియదు కానీ..సాక్షి టీవీ మాత్రం చంద్రబాబును ఢీ కొట్టే స్థితిలో లేదు. సాక్షి టీవీ హెడ్లు కూడా అంత ప్రతిభ, సామర్ధ్యం ఉన్నవారు కాదు. వచ్చామా?. పోయామా?. అన్నట్లు చాలా లైట్‌గా ఉంటారు. ఈ వ్యవస్థను త్వరితగతిని మార్చుకోవాలి . మార్చుకోకుంటే నష్టపోయేది వైఎస్ఆర్ సీపీనే. ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దృష్టి పెట్టినప్పుడే వైఎస్ జగన్ పడే కష్టానికి న్యాయం జరుగుతుంది.
-వై.వి. రెడ్డి, సీనియర్ జర్నలిస్ట్
[…] […]