స్వీపర్లకు పీపీఈ కిట్లేవి సారూ?

539

ఇంకా రాని సామాగ్రి
టెండర్లతోనే సరా?
కమలం సమరనాదం

హైదరాబాద్: లాక్‌డౌన్ లాకులెత్తేసిన తర్వాత పెరిగిపోతున్న కరోనా పాజిటివ్ కేసులు గ్రేటర్ హైదరాబాద్ వాసులను బెంబేలెత్తిస్తున్నాయి. సడలింపులు ప్రకటించిన తర్వాత పెరుగుతున్న పాజిటివ్ కేసులకు ైవె ద్యులు, పోలీసులు, జర్నలిస్టులు బలవుతున్నారు. తాజాగా టివి5లో పనిచేస్తున్న ఓ జర్నలిస్టు కరోనా కాటుకు బలయిన వైనం అతని కుటుంబంలో విషాదం నింపగా, విధినిర్వహణలో ఉన్న జర్నలిస్టుల జీవితాలు అభద్రతాభావంలో పడ్డాయి. లాక్‌డౌన్ కాలంలో కూడా రోడ్డుమీద పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ఇవ్వాలన్న ప్రయత్నం ఇప్పటిదాకా నెరవేరని వైనంపై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరోత్సవం నాటికి పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ఇవ్వాలన్న లక్ష్యం నెరవేరకపోవడంపై కమలదళం సమరానికి సన్నద్ధమవుతోంది. ఇప్పటికే కరోనా పరీక్షలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందంటూ కమలదళపతి బండి సంజయ్ విరుచుకుపడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్ల అంశంపై అదే పార్టీ నేతలు యుద్ధానికి సిద్ధమవుతున్నారు.

గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఉన్న 18 వేల పారిశుద్ధ్య కార్మికులు, 2500 ఎంటమాలజీ కార్మికులకు జూన్ 2 నాటికి పీపీఈ కిట్లు అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి ఒక్కరికీ మాస్క్, శానిటైజర్, గ్లౌజ్, క్యాప్, కొబ్బరినూనె, సబ్బు, బూట్లు, టవల్‌తో కూడిన కిట్లు అందచేయాలని నిర్ణయించింది. ఆ మేరకు టెండర్లు కూడా పిలిచింది. ఇంకా దానిపై అధికారులు మీనమేషాలు లెక్కబెడుతున్నారే తప్ప, పారిశుద్ధ్య కార్మికులకు పీపీఈ కిట్లు ఇవ్వకపోవడం విమర్శలకు దారితీస్తోంది.  ఇప్పటివరకూ ఎలాంటి రక్షణ పరికరాలు అందించని ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీజేపీ నగర నేత మేకల సారంగపాణి ధ్వజమెత్తారు.

వైద్యులకు సైతం పీపీఈ కిట్లు ఇవ్వడం లేదని, దానితో జూనియర్ డాక్టర్లు విరాళాలు ఇవ్వాలని కోరిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణలో అందరికీ పరీక్షలు చేయకపోవడం వల్లనే, కరోనా కేసులు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. గతంలో వైద్యులకు కిట్లు లేకపోవడంతో రక్షణ కరువయిందని, అందరికీ పరీక్షలు నిర్వహించడం లేదని మీడియా బయటపెడితే.. కేసీఆర్ వారిపై ఎదురుదాడి చేశారని, ఇప్పుడు అదే నిజమైందని సారంగపాణి చెప్పారు. ఎదురుదాడితో ఎక్కువకాలం పాలించడం సాధ్యం కాదన్న విషయం తెలుసుకోవాలన్నారు.  కేంద్రం విడుదల చేస్తున్న నిధులను సక్రమంగా వినియోగించుకోకపోగా, అడ్డదారిలో దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. కరోనా నియంత్రణకు ఇచ్చిన కేంద్రనిధులు, రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు, సీఎంరిలీఫ్‌ఫండ్‌పై వివరాలు అడిగితే, కేసీఆర్ ఇవ్వకుండా దాచిపెడుతోందని విమర్శించారు.


నగరంలోని పారిశుద్ధ్య కార్మికులకు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రతి నియోజకవర్గంలో మోదీ కిట్లు పంపిణీ చేశారని, తాము కూడా సొంత నిధులతో వారికి నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. పార్టీ పరంగానే తాము ఇన్ని సహాయ కార్యక్రమాలు చేస్తుంటే, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయదని ఆయన  ప్రశ్నించారు. నగరంలో కొన్ని వేల మందికి 1500 రూపాయలు అందలేదని, వలస కార్మికులను ఆదుకోవడంలో కూడా కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. నగరంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కరోనా సమయంలో ప్రజలకు దూరంగా ఉంటే, వారికి బీజేపీనే  అండగా నిలబడిందని సారంగపాణి చెప్పారు