జన్వాడ జమీన్‌పై ఆగని రేవంత్ జంగ్!

552

అది కేటీఆర్‌దేనని వాదిస్తున్న రేవంత్
డాక్యుమెంట్లతో మీడియా ముందుకు
తనతో రావాలని కేటీఆర్‌కు సవాల్
రాజీనామా చేయాలని డిమాండ్
ఆసక్తికరంగా మారిన ఫాంహౌజ్ ఫైట్
(మార్తి సుబ్రహ్మణ్యం)

జన్వాడ భూమి వ్యవహారంపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపి రేవంత్‌రెడ్డి తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో యుద్ధానికే సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించినందుకు జైలుపాలయిన రేవంత్.. ఇప్పుడు మరోసారి కేటీఆర్‌పై సమరానికి సిద్ధమయ్యారు. ఈసారి ఆయన ఆధారాలతో మీడియా ముందుకురావడం సంచలనం సృష్టించింది. కేటీఆర్ ఫాంహౌస్ అంటూ మీడియాను తీసుకువెళ్లి ఆ భూమిని చూపిన వ్యవహారంలో రేవంత్‌ను పోలీసులు అరెస్టు చేసి, జైలుకు పంపించిన విషయం తెలిసిందే. బెయిల్‌పై బయటకు వచ్చిన రేవంత్.. ఆ వ్యవహారాన్ని విడిచిపెట్టేలా క నిపించడం లేదు. జైలు నుంచి విడుదలయిన వెంటనే ఢిల్లీ వెళ్లి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి, కేటీఆర్ ఫాంహౌస్ నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. దానికి స్పందించిన గ్రీన్ ట్రిబ్యునల్ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది.

ఒవైసీనీ విడిచిపెట్టని రేవంత్..

ఆ ఫాంహౌస్  తనది కాదని కేటీఆర్ ట్వీట్ చేసినప్పటికీ.. ముమ్మాటికీ అది కేటీఆర్‌దేనంటూ తాజాగా తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు బయటపెట్టిన రేవంత్,  మరో సంచలనానికి తెరలేపారు. ఈ అంశంలో ఆయన కేటీఆర్‌కు విసిరిన సవాల్ కూడా ఆసక్తికలిగిస్తోంది. ఈ వ్యవహారంలో కేటీఆర్‌కు దన్నుగా నిలిచిన, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా రేవంత్ విడిచిపెట్టకపోవడం విశేషం. రేవంత్‌రెడ్డి చేసిన ఆరోపణల సందర్భంలో ఒవైసీ మంత్రి కేటీఆర్‌కు బాసటగా ట్వీట్ చేయడమే దానికి కారణం.

ఆ సర్వే నెంబర్లలోని భూములు వేర్వేరు..

తాజాగా కేటీఆర్ భూములకు సంబంధించి తన వద్ద డాక్యుమెంట్లతో మీడియాముందుకు వచ్చిన రేవంత్.. వాటి ద్వారానే కేసీఆర్,కేటీఆర్‌పై ప్రశ్నాస్త్రాలు, సవాళ్లు సంధించడం చర్చనీయాంశమయింది. ధన్వాడ ఫాంహౌస్ 301 నుంచి 313 సర్వే నెంబర్ల వరకూ విస్తరించి ఉందని, అందులోని 301 సర్వే నెంబర్లలో కేటీఆర్ సతీమణి పేరిట 3 ఎకరాలు ఉందని  రేవంత్‌రెడ్డి తన తాజా మీడియా సమావేశంలో బయటపెట్టారు. అన్ని నిబంధనలు ఉల్లంఘించి, లక్ష చదరపు అడుగుల్లో కేటీఆర్ ఫాంహౌస్ కట్టుకున్నారని ఆరోపించారు.  301-313 సర్వే నెంబర్లలో 25 ఎకరాల భూమి ఉందని చెప్పారు. 645 సర్వేనెంబర్‌లోని భూమి, 301 సర్వే నెంబర్‌లోని భూములు వేర్వేరని స్పష్టం చేశారు.  అర్బన అవెంచర్స్‌లో భూమి ఉందని, 2 కోట్ల 70 లక్షల 72 వేల 825 రూపాయలు అందులో ఉన్నాయని కేటీఆర్ ఎన్నికల అఫిడవిట్‌లో ఇచ్చారని గుర్తు చేశారు. 111 జీఓను ఉల్లంఘించి కేటీఆర్ అక్రమ నిర్మాణం చేపట్టారని ఆరోపించారు. బాల్క సుమన్ అక్కడ కేటీఆర్ లీజుకు తీసుకున్నారని చెబుతుంటే, కేటీఆర్ మాత్రం అక్కడ తనకు భూమి లేదని ట్వీట్ చేశారని రేవంత్ గుర్తు చేశారు.

పోలీసుల మెమోనే సాక్ష్యం..

డ్రోన్ కెమెరా కేసులో పోలీసులు తనను అరెస్టు చేసినప్పుడు, కేటీఆర్ అక్కడ ఉంటున్నారని పోలీసులు కోర్టుకు నివేదిక ఇచ్చారని రేవంత్ గుర్తు చేశారు. వట్టినాగులపల్లిలో తనకు భూములున్నమాట వాస్తవమేనని, అందులో అంగుళం అక్రమ నిర్మాణం ఉంటే కూల్చివేయడానికి సిద్ధమేనని, స్వయంగా తానే గడ్డపారతో కూల్చేస్తానన్నారు. అయితే,  కేటీఆర్ కూడా ఆ పనిచేయగలరా అని సవాల్ చేశారు. అక్రమనిర్మాణం చేపట్టిన కేటీ ఆర్ తన పదవి నుంచి తప్పుకోవాలని, లేదా బర్తరఫ్ చేయాలన్న రేవంత్ డిమాండ్ సంచలనం సృష్టిస్తోంది.

రాజీనామా చేయరెందుకు?

‘కేటీఆర్ తనకు అక్కడ భూమి లేదని ట్వీట్ చేశాడు. నేను ఇన్ని డాక్యుమెంట్లు, రాజేంద్రనగర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వద్ద పోలీసులు నాకు వ్యతిరేకంగా మెమో ఫైల్ చేశారు. నేను బయటకొస్తే కేటీఆర్ ప్రాణాలు, కేసీఆర్ కుటుంబ ఆస్తులకు హాని ఉందని అందులో బాజాప్తా రిపోర్టు చేశారు. కేటీఆర్.. నేను అడుగుతున్నా. నువ్వు ఆదర్శంగా ఉంటవా? ఉండవా? నేను ఇంత బహిరంగంగా డాక్యుమెంట్లతో మాట్లాడుతుంటే, నువ్వు ట్విట్టర్లలో చిలకపలకులెందుకు పలుకుతవ్? నువ్వు తెలంగాణ బిడ్డవయితే పొక్కలో ఎందుకు దాక్కుంటునవ్? దమ్ముంటే బయటకు రా! నువ్వు మాట్లాడకుండా బ్రోకర్లు, జోకర్లతో మాట్లాడిస్తున్నవ్. నేను ఉద్యమకారుడనని పదే పదే చెప్పుకునే కేసీఆర్ దీనిపై స్పందించాలి.ఇయ్యాల నీ కొడుకు అవినీతి బాగోతాన్ని బట్టబయలు చేసిన. నేను చేసిన ఆరోపణలలో ఒక్కశాతం తప్పున్నా నువ్వే శిక్ష విధించినా అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్న. గ్రీన్‌ట్రిబ్యునల్ విచారణకు వచ్చే అధికారులకు, మున్సిపల్ అధికారులు తమ మంత్రి కేటీఆర్‌పై స్వేచ్ఛగా నివేదికలివ్వగలరా? ఒక ఎస్పీపై కానిస్టేబుల్ నివేదిక ఇవ్వగలరా? ఇదీ అంతే! అందుకే ముందు నీ కొడుకును పదవి నుంచి తప్పించు. రెండునెలలోనే నివేదిక ఇవ్వాలి కాబట్టి, ఆ రెండు నెలలు పదవి నుంచి తప్పుకో. రెండు నెలలు పదవిలో లేకపోతే సచ్చిపోతావా? నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు దళితుడైన కోనేరు రంగారావు రాజీనామా చేశారు కదా? మాకు పదవులు గడ్డిపోచలని టీఆర్‌ఎస్సోళ్లు అంటారు  కదా? ఇప్పుడు కేసీఆర్ నిజాయితీ, సచ్చీలత నిరూపించుకునే అవకాశం వచ్చింది. రా ముందుకు. కేటీఆర్.. నువ్వు అవినీతిపరుడివి. అక్రమార్కుడివి. నేను నిరూపించా’’నని రేవంత్ తన వద్ద ఉన్న డాక్యుమెంట్లు చూపిస్తూ కేటీఆర్‌పై చెలరేగడం సంచలనం సృష్టిస్తోంది.

ఒళ్లు కాదు.. బుర్ర కూడా పెరగాలని ఒవైసీపై ఫైర్

ఫాంహౌస్ వ్యవహారంలో మంత్రి కేటీఆర్‌కు బాసటగా ట్వీట్ చేసిన మజ్లిస్ ఎంపి అసద్‌నూ రేవంత్ విడిచిపెట్టలేదు. ఈ సంద ర్భంగా ఆయన.. తెరాస-మజ్లిస్ బంధంపైనా వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
‘‘ఓ లండన్ బారిస్టర్‌ను తెచ్చిండు. ఆ లండన్ బారిస్టర్ ట్విట్టర్‌లో నువ్వు వీరుడివి, శూరుడివి. నువ్వు ఎగిరితే ఆకాశం. దిగితే పాతాళం అని. నీ అంత మొన గాడు లేడని, నిన్ను చూసి అసూయ పడుతున్నారంటున్నాడు. సిగ్గుండాలి ఆరున్నర అడుగులు పెరిగినాయనకు. ఈ మాట అననీకి! ఒళ్లు పెరిగితే సరిపోదు. బుర్రకూడా పెరగాలి ఆరున్నర అంగుళాలాయనకు. ట్విట్టర్ లో ఈయనకు మద్దతు పలకడానికొచ్చిండు! ఈయన లండన్‌లో బారిస్టర్ చదివిండట. ఎందుకయ్యా బొందపెట్టుకోవడానికి. నీ సదువెందుకు సంకనాకడానికా అని అడుగుతున్నా.  నువ్వు గులాంగిరీ చేయదలచుకుంటే చెయ్యి. మాకేం అభ్యంతరం లేదు. నీ పార్టీని తాకట్టుపెడితే పెట్టుకో. మాకేం అభ్యంతరం లేదు. నీ తమ్ముడు చూసుకుంటాడు నీ తాకట్టును! లండన్ బారిస్టర్‌ను వదిలేసినాక, మిడత దండును తెచ్చిండ’ని మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని, పేరు పెట్టకుండానే రేవంత్ విరుచుకుపడ్డారు.

మళ్లీ తెరపైకొచ్చిన తెరాస నేతలు

రేవంత్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌పై ఆరోపణాస్త్రాలు సంధించిన తర్వాత.. తెరాస నేతలు కూడా మీడియాముందుకొచ్చారు. సంచలనాల కోసమే రేవంత్ ఆరోపణలు చేస్తున్నారని తెరాస సీనియర్ నేత, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. ఫామ్‌హౌస్‌పై కేటీఆర్ ఇప్పటికే స్పష్టత ఇచ్చారని, అయినా ఆయనను విమర్శించడం తగదన్నారు. తమకు న్యాయస్థానాలంటే గౌరవం ఉందన్నారు. రేవంత్ వంటివాళ్లు రాజకీయాల్లో ఉండటంపై కాంగ్రెస్ నాయకులే ఆలోచన చేయాలని, ఆయన ఎన్నిసార్లు జైలుకు వెళ్లివచ్చారని ప్రశ్నించారు.  ప్రజలకు నిజాలు చెప్పాలనే మీడియా ముందుకొచ్చామన్నారు. బాల్క సుమన్ చేసిన ఆరోపణలపై, రేవంత్ సమాధానం ఇవ్వాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.
[metaslider id=”17478″]

1 COMMENT