ఉడుకుతున్న తెలంగాణ ఉద్యోగులు

1
77

తాయిలాలు తమవారికేనా?
కొందరిపైనే కేసీఆర్ కనికరం
ఉద్యోగ నేతల బంధువులకే ఉపకారమా?
పదవీ విరమణ వయసు ఎలా పెంచుతారు?
పీఆర్సీ, ఐఆర్‌పై సంఘాలు పెదవి విప్పవేం?
పిడికిలి బిగించడం మానేసి పైరవీలు చేస్తారా?
పోలీసు శాఖలోనూ పొడిగింపులపై విమర్శలు
టీజీఓ, టీఎన్జీఓ నేతలపై ఉద్యోగుల గరం
నేతలు కేసీఆర్ తొత్తులని బీజేపీ చీఫ్ సంజయ్ ఫైర్
                 (మార్తి సుబ్రహ్మణ్యం)

సహజంగా ఉద్యోగ సంఘాల నేతలంటే.. వారి వేతనాల పెంపు కోసమో, పీఆర్సీ కోసమో, ఐఆర్, కరువుభత్యం  కోసమో సర్కారుపై సమరం సాగించేవారిగా సమాజం భావిస్తుంటుంది. నిజానికి ఉద్యోగ సంఘ నేతలెప్పుడూ, సర్కారుకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తుంటారు. నిరంతరం వారి హక్కుల కోసమే పనిచేస్తుంటారు. కానీ.. తెలంగాణలో మాత్రం దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతోంది. ఉద్యోగ సంఘ నేతలకు-అధికారపార్టీ నేతలకు పెద్ద తేడా కనిపించడం లేదని, సదరు నేతలు తమ ప్రయోజనాల కోసం కాకుండా.. తమ భర్త, భార్య, బావల పదవీ విరమణ వయసును పెంచుకునేందుకే, తమ సంఘాలను పణంగా పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ అయితే ఓ అడుగు ముందుకేసి.. ఉద్యోగ సంఘ నేతలు కేసీఆర్ తొత్తులుగా పనిచేస్తున్నారని విరుచుకుపడుతున్నారు. అటు ఉద్యోగులు కూడా.. పదవీ విరమణ వయసు పెంచడానికి తమ నేతల బంధువులకున్న అర్హతలేమిటి? తమకు లేనిదేమిటని ఉడికిపోతున్నారు. ఇదీ..  పక్షపాత నాయకత్వంలో నలిగిపోతూ, నిస్సహాయులుగా మారిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల రోదన లాంటి వేదన.

ఆర్టీసీ సమ్మె నుంచి ఆరంభం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఆర్టీసీ కార్మికుల సమ్మె ఆరంభంలో, ఉద్యోగ సంఘాలు సమ్మెకు మద్దతునివ్వని వైనంపై విమర్శలు వెలువడ్డాయి. సమ్మెకు అన్ని పార్టీలు సంఘీభావం ప్రకటిస్తే, టీఎన్జీఓ నేతలు మాత్రం మౌనంగా ఉండటంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి దుమ్మెత్తిపోశారు. టీఎన్జీఓ నేతలు కేసీఆర్‌కు చెంచాగిరి చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ నేతలు కేసీఆర్ ఇచ్చే పదవులకు ఆశపడి, ఉద్యోగుల జీవితాలను తాకట్టుపెడుతున్నారని విరుచుపడ్డారు. ఆ కాలంలో ఆయన తన సొంత నిధులతో నియోజకవర్గంలోని ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నారు.

భార్యలు, బామ్మర్దులుంటే సరిపోతుందా?

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు తమ సంఘాల నేతల పైరవీల పర్వంపై కారాలు మిరియాలు నూరుతున్నారు. టీజీఓ నేత మమత భర్త, టీఎన్‌జీఓ నేత ఎం.రాజేందర్ బావ పదవీ విరమణ చేసినప్పటికీ.. వారిద్దరికీ మరో రెండేళ్లు పదవీ కాలం పొడిగిస్తూ, కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఉత్తర్వులతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఉడికిపోతున్నారు. వారిద్దరు పదవీ విరమణ చేసినరోజు అనేకమంది ఉద్యోగులు రిటైరయినప్పటికీ.. వారిద్దరికి మాత్రమే పొడిగింపు ఇవ్వడం ఏమిటని మండిపడుతున్నారు. ‘‘సంఘాలలో.. భార్యలు, బావమరుదులు నేతలుగా ఉంటే, సర్వీసును పొడిగించుకోవచ్చా? నేతలు పనిచేసేది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడేందుకా? లేక బంధువుల ప్రయోజనాలు పరిరక్షించేందుకా’’ అని తూర్పారపడుతున్నారు. ఉద్యోగ సంఘాలు పోరాటబాట విడిచి, పైరవీల బాట పడుతున్నందుకే.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం మానేసిందని మండిపడుతున్నారు. ఇలాంటి సిఫార్సు రాజకీయాలపై చూపే శ్రద్ధలో.. న్యాయంగా రావలసిన పీఆరీ, ఐఆర్ కోసం ప్రభుత్వంపై పోరాడ టంలో పదోవంతు చిత్తశుద్ధి చూపినా, ఇప్పటికి అవి సాధించేవాళ్లమని చెబుతున్నారు.

ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడతారా?

లాక్‌డౌన్ కాలంలో సగం జీతాలిచ్చినా, పీఆర్సీ, ఐఆర్ ప్రకటించపోయినా.. ఉద్యోగ సంఘాలు కేసీఆర్ సర్కారుపై సమరం సాగించకుండా, మౌనంగా ఉండ టంపై ఉద్యోగులు ఉడికిపోతున్నారు. ధనిక రాష్ట్రమని తరచూ చెప్పే కేసీఆర్.. పక్కనే ఉన్న ఏపీ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగాలేకున్నా, జగన్ ప్రభుత్వం జులై 2019 నుంచి 27 శాతం ఐఆర్, మే నుంచి పూర్తి వేతనం ఇస్తున్న  విషయాన్ని తమ నేతలు.. కేసీఆర్ సర్కారుకు గుర్తుచేయకపోవడం  దారుణమంటున్నారు. ఇవన్నీ డిమాండ్ చేయకుండా, ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి, తమ బంధువులకు పదవీ విరమణ వయసు పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు, తమను బలి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.  తమ సంఘాల నేతల కంటే, ప్రతిపక్షాలే తమ కోసం గళమెత్తడం.. ఉద్యోగ సంఘ నేతలకు సిగ్గుచేటన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

సంఘాల నేతల తీరుపై బండి సంజయ్ ఆగ్రహం

ఉద్యోగ సంఘాల నేతలు, తమ సహచర ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారంటూ బీజేపీ చీఫ్ బండి సంజయ్  విరుచుకుపడుతున్నారు. ‘ఉద్యోగ సంఘాల నేతలు కేసీఆర్‌కు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కొందరి సర్వీసు పెంచుతూ జీఓలివ్వడం కేసీఆర్‌కే చెల్లింది. ఉద్యోగసంఘాల నేతలు కేసీఆర్‌కు తొత్తులుగా మారి, ఉద్యోగుల ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు. 50 జీతాలు కట్‌చేసినా, ఐఆర్ ఇవ్వకపోయినా, పీఆర్సీ రాకపోయినా కేసీఆర్‌ను ప్రశ్నించకుండా ఆయనకు ఊడిగం చేస్తున్నారు. అందరికీ పదవీ విరమణ వయసు పెంచుతానన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? పక్క రాష్ట్రంలో రెండేళ్లు పెంచిన సంగతిని సంగాల నేతలు కేసీఆర్‌కు గుర్తు చేసి, ఎందుకు పోరాటం చేయడం లేదు? వాళ్లు తమ స్వలాభం కోసం ఉద్యోగ, ఉపాధ్యాయ హక్కులను తాకట్టుపెడుతున్నారు. సర్కారు ఉద్యోగులను, రాజకీయ ఆయుధంగా వాడుకుంటోంద’ని సంజయ్.. సీఎం కేసీఆర్ సహా, ఉద్యోగ సంఘ నేతలపై ధ్వజమెత్తారు.

ఊడిగం చేయాల్సింది కేసీఆర్‌కు కాదు: నర్సిరెడ్డి

ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు ఊడిగం చేయాల్సింది కేసీఆర్‌కు కాదని, ప్రజలకేనని తెలంగాణ టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. కొందరు ఉద్యోగ సంఘాల నేతలు, మరీ ఆత్మగౌరవం లేకుండా వ్యవహరించడం ద్వారా, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యోగుల పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ సంఘాల నేతలు.. ఉద్యోగుల ప్రయోజనాల కోసం పోరాడకుండా, ఎమ్మెల్సీ-ఎమ్మెల్యేల పదవుల కోసం కేసీఆర్ చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. అందుకే  కేసీఆర్,  ఉద్యోగులను లెక్కచేయడం లేదని నర్సిరెడ్డి ధ్వజమెత్తారు.

పోలీసు శాఖలోనూ ఇదే లొల్లి..

ఇక పోలీసు శాఖలో కూడా పదవీ విరమణ చేస్తున్న వారికి నిరంతరం పొడిగింపు ఇస్తున్న వైనం విమర్శలకు దారితీస్తోంది. దీనివల్ల తమ బదిలీ  అవకాశాలు దెబ్బతింటాయన్న ఆందోళన, పోలీసు శాఖలో వ్యక్తమవుతోంది. ఇటీవలి కాలంలో రిటైరవుతున్న అనేక మంది.. డిఎస్‌పి నుంచి ఐజి స్థాయి అధికారులకు, మళ్లీ పొడిగింపు ఇవ్వడంపై ఆ శాఖలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నలుగురైదుగురు  ఉన్నతస్థాయి అధికారులు, గత పదేళ్ల నుంచి రిటైరయినా కొనసాగుతున్న వైనాన్ని గుర్తు చేస్తున్నారు. అసలు సీఎం భద్రతా అధికారే రిటైరయి మూడేళ్లయినా, అక్కడే పనిచేస్తున్నారని గుర్తు చేస్తున్నారు.

మొత్తం పోలీసు శాఖలో సుమారు 30 మంది డీఎస్‌పి ఉంచి ఐజి స్థాయి అధికారుల సర్వీసు పొడిగించినట్లు చెబుతున్నారు.  వీరిలో చాలామంది సమర్ధులనే ఎంపిక చేసినప్పటికీ.. ఈ విధానం వల్ల, పోస్టింగుల కోసం ఎదురుచూస్తున్న వారికి, అన్యాయం జరుగుతోందన్న ఆవేదన వ్యక్తమవుతోంది. పైగా, రిటైరయిన వారినే మళ్లీ తీసుకుంటే.. వారు ఒకవేళ ఏమైనా తప్పు చేస్తే,  న్యాయపరంగా రిటైరయిన వారిపై ప్రభుత్వ పరంగా ఏం చర్య తీసుకుంటారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సర్వీసులో ఉన్నప్పుడయితే.. చార్జిమెమో ఇస్తారన్న భయం ఉంటుందని, ఇప్పుడు బోనస్‌గా మారిన ఉద్యోగంలో ఏం చార్జిమెమోలు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.

తమిళనాడులో అందరికీ ఏడాది పొడిగింపు..

అయితే.. నిజానికి డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్ ప్రకారం.. ఉద్యోగుల సర్వీసు పొడిగించుకునే అవకాశం ఉందని, మరికొందరు అధికారులు గుర్తు చేస్తున్నారు. తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఒక ఏడాదిపాటు, రిటైరయిన వారందరి సర్వీసు పొడిగించిందని చెబుతున్నారు. తెలంగాణలో కూడా అదే విధానం అందరికీ వర్తింపచేస్తే, ఎలాంటి సమస్యలు ఉండవంటున్నారు. కానీ.. పాలకులకు సేవలందించే  వారికి, పైస్థాయిలో పలుకుబడి ఉన్నవారికి, ఉద్యోగ సంఘాల నేతల బంధువులకు మాత్రమే దానిని పరిమితం చేయడం వల్లే, సమస్యలు వస్తున్నాయంటున్నారు.

రిటైరయిన వారికి డబ్బులెలా?

కాగా ఈ ఏడాది సుమారు 6 వేల మంది ఉద్యోగులు రిటైరవనున్నట్లు చెబుతున్నారు. వీరికి ఒక్కోరికి కనీసం 50 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన ఖర్చు తడిసి మోపెడవుతుంది. పదవీ విరమణ ప్రయోజనాలకే దాదాపు 3 వేల కోట్లు అవుతాయంటున్నారు. అసలే అంతంత మాత్రంగా ఉన్న రాష్ట్రం, ఇంత పెద్ద భారం మోయడం కష్టమేనంటున్నారు.  పైగా పదవీ విరమణ చేసిన వారికి, వెంటనే డబ్బు చెల్లించాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది. ఈ క్రమంలో, ఆర్ధిక భారం తాత్కాలికంగా తప్పించుకునేందుకయినా ప్రభుత్వం.. సర్వీసు పొడిగింపు ఇవ్వకతప్పదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

1 COMMENT

  1. […] ‘తెలంగాణ కోసం ఉద్యమించిన ఉద్యోగులకు తెలంగాణ సమాజం రుణపడి ఉంటుంది. నేను ఈ సభ నుంచి హామీ ఇస్తున్న. వారికి పీఆర్సీ ఇస్తాం. అదొక్కటే కాదు. వారి డిమాండ్లన్నీ నెరవేరుస్తాం. నోటిఫికేషన్ లోగా అందరితో మాట్లాడి పరిష్కరిస్తా. కేసీఆర్ మాట ఇచ్చాడంటే వంద శాతం నెరవేరుస్తాడు. దాని గురించి ఉద్యోగులేం భయపడనక్కర్లేదు’ – ఎన్నికల ముందు నాటి తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ. – ఎన్నికలయ్యాయి. ఉద్యోగులకు వరదానాలిచ్చిన ఇద్దరూ, ఆయా రాష్ట్రాలకు ముఖ్యమంత్రులయ్యారు. ఏడాది విజయోత్సవాలు కూడా చేసుకున్నారు. కానీ.. సీపీఎస్ రద్దు హామీ మాత్రం హామీగానే నిలిచిపోయింది. వారి కల కల్లలుగానే మిగిలిపోయింది.  అదొక్కటే కాదు.. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల్లోని ఉద్యోగుల చిరకాల వాంఛితమయిన అనేక డిమాండ్లు, పరిష్కారం కాక పడకేశాయి. అటు వీటిపై పిడికిలి బిగించి పోరుబాటలో నడిచి, రణనినాదం చేయాల్సిన ఉద్యోగ సంఘాలు, పాలకుల నీడలో సేదదీరుతూ సుఖనిద్ర పోతున్నారని ఉద్యోగులు ఉడికిపోతున్నారు. ఇది కూడా చదవండి.. ఉడుకుతున్న తెలంగాణ ఉద్యోగులు […]