మాదిగలకు ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్?

226

వర్ల రామయ్య పేరు ఖరారు?
గతంలో మాదిగలను దూరం చేసుకున్న బాబు
మాలలకు భయపడి కార్పొరేషన్ ఏర్పాటులో వెనుకంజ
జగన్ వచ్చిన తర్వాతనే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు
మళ్లీ మాదిగలను దరి చేర్చుకునే యత్నంలో టీడీపీ
(మార్తి సుబ్రహ్మణ్యం)
అధికారంలో ఉన్నప్పుడు దూరమయిన సామాజిక వర్గాలను.. తిరిగి దరిచేర్చుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా, ఆయా వర్గాలకు టీడీపీలో స్థానం కల్పించేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో ఉన్నారు. యాదవ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ, యువనేత బీద రవిచంద్రకు టీడీపీ ఏపీ పగ్గాలివ్వాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించిన బాబు.. వర్కింగ్ ప్రెసిడెంట్‌ను మాదిగలకు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.

రాజ్యసభ ఎన్నికల్లో వర్లకు చేయిచ్చిన బాబు..

అందులో భాగంగా, పార్టీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడయిన వర్ల రామయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఆ ప్రకారంగా బీసీ-దళిత కాంబినేషన్ తో,  పార్టీ తిరిగి బడుగు బలహీన వ ర్గాలకు చేరువవుతుందన్న అంచనాతో ఉన్నట్లు కనిపిస్తోంది. గతంలో వర్ల రామయ్యకు రాజ్యసభ సీటు ఇస్తానని హామీ ఇచ్చి, చివరి నిమిషంలో చేయివ్వడంతో దళితులు ముఖ్యంగా, మాదిగలు పార్టీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు-లేని సమయంలో కూడా, వర్ల విపక్షాలపై తన పదునైన మాటల ద్వారా ఎదురుదాడి చేశారు. ఇప్పటికీ జగన్ ప్రభుత్వంపై కీలక అంశాలపై, ఆయనే ఎక్కువగా స్పందిస్తున్నారు.

‘పెద్దమాదిగ’నవుతానన్న బాబు..

నిజానికి మాదిగలు తొలి నుంచీ టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా కొనసాగుతున్నారు. చంద్రబాబు విపక్ష నేతగా ఉన్నప్పుడు హిందూపురం నుంచి ప్రారంభించిన పాదయాత్రలో, చెప్పులు కుట్టి ‘పెద్దమాదిగ’నవుతానని ప్రకటించారు. తెలంగాణలో చేసిన పాదయాత్రలో బాబుకు రక్షణగా మాదిగలే నిలిచారు. దానితో మందకృష్ణమాదిగ వంటి అగ్రనేత కూడా, టీడీపీకి మద్దతు ప్రక టించారు. ఆ ఎన్నికల్లో మాదిగ సామాజికవర్గం మూకుమ్మడిగా టీడీపీకి జైకొట్టింది.

మాదిగలను మర్చిపోయిన టీడీపీ..

కానీ అధికారం లోకి వచ్చిన తర్వాత మాదిగలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారి ప్రాధాన్యం అత్యల్పం. రాజ్యసభ ఎన్నికల్లో అయితే మొత్తం అగ్రకులాలనే అందలమెక్కించింది. ఒక్క అడుగు బలహీన వారికి అవకాశం కల్పించలేదు. మాదిగ వర్గానికి  చె ందిన వర్ల రామయ్య, యాదవ వర్గానికి చెందిన బీద మస్తాన్‌రావుకు రాజ్యసభ ఇస్తారనుకున్నా అప్పుడూ అగ్రకులాలకే ఇవ్వడం మిగిలిన కులాలకు అసంతృప్తి కలిగించింది. ఈ ఆరేళ్లలో కమ్మ, వెలమ, కాపు, వైశ్యకు తప్ప ఒక్క రెడ్డి, ఒక్క బీసీ, ఒక్క దళితుడికి అవకాశం ఇవ్వకపోవడంతో  బడుగు బలహీన వర్గాల వారు పార్టీకి దూరమయ్యారు. పోనీ బాబు ఏరి కోరి ఎంపిక చేసుకున్న ఆ ఎంపీలంతా పార్టీలో ఉన్నారా అంటే అదీ లేదు.

అగ్ర కులాలకే బాబు  అందలం..

సుజనాచౌదరి, టిజి వెంకటేష్, సీఎం రమేష్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత బీజేపీలో చేరిపోయారు. వీరిలో కమ్మ వర్గానికి చెందిన సుజనా చౌదరి, వెలమ వర్గానికి చెందిన సీఎం రమేష్‌కు రెండుసార్లు రాజ్యసభ సీటు ఇవ్వడం మరో విశేషం. ఒక దశలో  మాదిగ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభ ఇచ్చే సమయానికి,  అగ్రకులానికి చెందిన మరో నేత, ఆ సీటు తన్నుకుపోయారు. తర్వాత ఎన్నికల్లో వర్లకు ఎక్కడా సీటు కూడా ఇవ్వలేదు. అంతకుముందు ఎన్నికల్లో కూడా చివరి నిమిషయంలో ఆయనకు తిరుపతి ఎంపీ సీటు ఇచ్చిన బాబు, చివరి వరకూ అక్కడ కూడా  కొనసాగించలేదు.  అసెంబ్లీ సీటు ఇచ్చినా, అక్కడి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేను పార్టీలో తీసుకుని, ఇన్చార్జి పదవిని ఆమెకు ఇచ్చారు. ఈ విధంగా వర్ల రామయ్యకు చేసిన అన్యాయాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్ రూపంలో ఇచ్చి, మాదిగలను దరిచేర్చుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది.

ఎస్సీ నియోజకవర్గాల్లో కమ్మ నేతల పెత్తనం..


కాగా టీడీపీ అధికారంలో ఉండగా.. రాష్ట్రంలో ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా.. పెత్తనం మాత్రం కమ్మ వర్గ నేతల చేతుల్లో ఉండటంపై, తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయింది. ఒక్క చిత్తూరు జిల్లాలోని ఎస్సీ నియోజకవర్గంలోనే రెడ్డి వర్గం  పెత్తనం చేసింది.  మిగిలిన అన్ని రిజర్వుడు నియోజకవర్గాల్లో, కమ్మ నేతలే పెత్తనం చేయడం ద్వారా, ఎస్సీ ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహంగా మార్చేశారు. చివరకు మంత్రులుగా పనిచేసిన పీతల సుజాత, జవహర్, రావెల కిశోర్ వంటి వారికీ ఈ అణచివేత తప్పలేదు. దీనిపై ఎన్నిసార్లు బాబుకు ఫిర్యాదు చేసినా, ఆయన స్పందించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమయింది. ఇసుక రీచ్‌లు సహా, అన్ని వ్యవహారాల్లో ఆయా నియోజకవర్గాల్లో కమ్మ నేతలే దందాలు చేసి, దళిత మంత్రులను అప్రతిష్ఠపాలుచేశారన్న విమర్శలు వినిపించేవి.

మంద కృష్ణపై ఎదురుదాడి చేయించిన ఫలితం..

కాగా రాష్ట్రంలో ఏబీసీడీ వర్గీకరణ చట్టబద్ధత, అసెంబ్లీ తీర్మానం కోసం  ఉద్యమించిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ నేతను, చంద్రబాబు సర్కారు అణచివేసే ప్రయత్నాలు ఏపీలోని మాదిగలకు  రుచించలేదు. ఆయనను రాష్ట్రంలోని ప్రవేశించకుండా, టోల్‌గేట్ల వద్దనే ఆపి, వెనక్కిపంపించి వేయడం, సభకు అనుమతికి నిరాకరించడం వంటి అణచివేత చర్యలు.. సగటు మాదిగలో ఆగ్రహానికి కారణమయ్యాయి. చివరకు మంద కృష్ణకు వ్యతిరేకంగా జవహర్, వర్ల, డొక్కా వంటి మాదిగ నేతలను ప్రయోగించిన ఫలితంగా, స్థానికంగా వారు కూడా మాదిగలలో మద్దతు కోల్పోవలసి వచ్చింది. ఏపీలో మందకృష్ణకు మాదిగలలో ఉన్న ఇమేజ్‌ను గుర్తించడంలో బాబు విఫలమయిన ఫలితంగా, ఎన్నికల్లో ఆ వర్గం వారి చేతిలో ఓడిపోవలసి వచ్చింది.

డొక్కాతో సహా… మాదిగ నేతల నిష్క్రమణ

కాంగ్రెస్ నుంచి వచ్చిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌కు ఎమ్మెల్సీ ఇవ్వడమే కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చినా, ఆయన వైసీపీలో చేరిపోయారు. నిజానికి డొక్కా టీడీపీలో ఉన్న సమయంలో చిత్తశుద్ధితోనే పనిచేశారు. మాదిగల ప్రయోజనాల కోసం కృషి చేశారు. మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ఒత్తిడి చేశారు. అలా టీడీపీ అధికారంలో ఉన్న చివరి రోజులు, అధికారం కోల్పోయిన తర్వాత చాలామంది మాదిగ నేతలు వైసీపీలో చేరిపోయారు.

మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుకు జంకిన బాబు..

బాబు అధికారంలో ఉన్నప్పుడు మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని మాదిగ నేతలు చాలా ఒత్తిళ్లు చేశారు. నాటి మంత్రి జవహర్, డొక్కా, వర్ల వంటి నేతలంతా బాబు చుట్టూ తిరిగారు. కానీ, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తే మాలలు దూరమవుతారని బాబు భయపడి, మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుకు బాబు వెనుకంజ వేశారు. నిజానికి చాలా ఏళ్ల నుంచీ ఎస్పీ కార్పొరేషన్ ఉన్నప్పటికీ, అందులో మాలలకే ఎక్కువ రుణాలు ఇస్తూ వచ్చారు. దానితో మాదిగల్లో అసంతృప్తి వ్యక్తమయింది. బాబు అధికారంలో ఉన్నప్పుడు మాదిగ అధికారుల కంటే, మాల వర్గ అధికారులనే అందలమెక్కించడం కూడా మాదిగలకు రుచించలేదు. ఇన్ని అన్యాయాలను సరిదిద్దాలంటే, మాదిగలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయడమే పరిష్కారమని.. ఆ వర్గ నేతలంతా బాబుకు మొరపెట్టుకున్నారు. దానివల్ల ఆర్ధిక భారం కూడా ఉండదని, ఎస్సీ కార్పొరేషన్ నిధులను సగం సగం చేస్తే సరిపోతుందని కూడా సూచించారు. దానిపై ముఖ్యమంత్రి-పార్టీ అధినేగా  నిర్ణయం తీసుకోవలసిన చంద్రబాబు.. తాను మాల నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని చెప్పడం, మాదిగలను హతాశులను చేసింది.

మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న జగన్..

అదే సమయంలో.. తాను అధికారంలోకి వస్తే మాదిగ కార్పొరేషన్ ఏర్పాటుచేస్తానని, నాటి విపక్ష నేత జగన్ హామీ ఇచ్చారు. అది వారిపై బ్రహ్మాస్త్రంలా పనిచేసింది. దానితో ఎన్నికల ముందే చాలామంది మాదిగ నేతలు, టీడీపీ సానుభూతిపరులయిన కిందిస్థాయి మాదిగలు వైసీపీకి జైకొట్టారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఇచ్చిన మాట ప్రకారం మాదిగ తోపాటు మాల, రెల్లి కార్పొరేషన్ జీఓ కూడా ఇచ్చి వారి మనసు గెలుచుకున్నారు. ఈ నేపధ్యంలో ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ.. మళ్లీ మాదిగలను దరిచేర్చుకునే వ్యూహంలో భాగంగా, వర్ల రామయ్యకు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు.

2 COMMENTS

  1. […] అయితే, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు అసెంబ్లీకి పోటీ చేయటం ఇష్టం లేకపోయినా, తన వద్ద డబ్బు కూడా లేనందున  ఓడిపోతానని చెప్పినా..  తాము అన్నీ చూసుకుంటామని హామీ ఇచ్చి, పార్టీ నాయకత్వం బలవంతంగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించింది. ఎంపి అభ్యర్ధి కూడా.. డొక్కా ఉంటేనే అక్కడ తాను గెలుస్తానని చెప్పడంతో, పార్టీ  నాయకత్వం డొక్కా వైపు మొగ్గు చూపింది. ఆ సమయంలో ఆయన తన భార్య బంగారం, పొలం తాకట్టు పెట్టడంతోపాటు, మరో మూడుకోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలోని  బీజేపీ ఒత్తిళ్ల కారణంగా,  టీడీపీ నాయకత్వానికి రావలసిన ఆర్ధిక వనరులన్నీ ఆగిపోయాయి. విరాళాలిచ్చే వారిపై ఐటి, ఈడీ దాడులు చేసింది. ఆ క్రమంలో, ‘మీరు డబ్బు సర్దుబాటు చేసుకుంటే, తర్వాత  ఇస్తామని చెప్పడంతో’.. మిగిలిన అభ్యర్ధుల మాదిరిగా, డొక్కా కూడా వడ్డీకి డబ్బు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏడాది గడిచినా నాయకత్వం నయాపైసా ఇవ్వకపోవడం, అప్పులిచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడంతో.. ఒత్తిళ్లకు భరించలేని డొక్కా, ఓ దశలో వారిని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడ కూడా ఎలాంటి హామీ రాకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. మిగిలిన నేతల మాదిరిగా పెద్ద స్థితిమంతుడు గాని డొక్కాకు, అప్పుడే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. పార్టీలో చేరితే, తిరిగి ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి.. మాదిగలకు ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడ… […]

  2. […] అయితే, ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు అసెంబ్లీకి పోటీ చేయటం ఇష్టం లేకపోయినా, తన వద్ద డబ్బు కూడా లేనందున  ఓడిపోతానని చెప్పినా..  తాము అన్నీ చూసుకుంటామని హామీ ఇచ్చి, పార్టీ నాయకత్వం బలవంతంగా ప్రత్తిపాడు నుంచి పోటీ చేయించింది. ఎంపి అభ్యర్ధి కూడా.. డొక్కా ఉంటేనే అక్కడ తాను గెలుస్తానని చెప్పడంతో, పార్టీ  నాయకత్వం డొక్కా వైపు మొగ్గు చూపింది. ఆ సమయంలో ఆయన తన భార్య బంగారం, పొలం తాకట్టు పెట్టడంతోపాటు, మరో మూడుకోట్ల రూపాయలు అప్పు చేసి ఎన్నికల బరిలో దిగాల్సి వచ్చింది. ఆ సమయంలో కేంద్రంలోని  బీజేపీ ఒత్తిళ్ల కారణంగా,  టీడీపీ నాయకత్వానికి రావలసిన ఆర్ధిక వనరులన్నీ ఆగిపోయాయి. విరాళాలిచ్చే వారిపై ఐటి, ఈడీ దాడులు చేసింది. ఆ క్రమంలో, ‘మీరు డబ్బు సర్దుబాటు చేసుకుంటే, తర్వాత  ఇస్తామని చెప్పడంతో’.. మిగిలిన అభ్యర్ధుల మాదిరిగా, డొక్కా కూడా వడ్డీకి డబ్బు అప్పు చేయాల్సి వచ్చింది. కానీ ఏడాది గడిచినా నాయకత్వం నయాపైసా ఇవ్వకపోవడం, అప్పులిచ్చిన వాళ్లు ఇంటి చుట్టూ తిరగడంతో.. ఒత్తిళ్లకు భరించలేని డొక్కా, ఓ దశలో వారిని చంద్రబాబు వద్దకు తీసుకువెళ్లినట్లు ప్రచారం జరిగింది. కానీ అక్కడ కూడా ఎలాంటి హామీ రాకపోవడం ఆయనను అసంతృప్తికి గురిచేసింది. మిగిలిన నేతల మాదిరిగా పెద్ద స్థితిమంతుడు గాని డొక్కాకు, అప్పుడే వైసీపీ నుంచి ఆహ్వానం అందింది. పార్టీలో చేరితే, తిరిగి ఎమ్మెల్సీ ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు.ఇది కూడా చదవండి.. మాదిగలకు ఏపీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడ… […]