గురువుకు పదహారు.. శిష్యుడికి నాలుగో స్ధానమా?

442

బెస్ట్‌సీఎం రేసులో కేసీఆర్ కంటే జగన్‌కే ఎక్కువ మార్కులు
నె ంబర్‌వన్ రాష్ట్రానికి పదహారో స్థానమేంటి?
గులాబీదళాల్లో ర్యాంకుల గుబులు
మోదీకి ఆంధ్ర-తెలంగాణలో ఎక్కువ మార్కులు
సీట్లు లేని ఆంధ్రాలో మోదీ పాలనకు అధిక మార్కులు
‘సీ ఓటర్-ఐఏఎన్‌ఎస్’ సర్వేపై చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)
దేశంలోనే మనది ధనిక రాష్ట్రం. అభివృద్ధిలో మనమే నెంబర్ వన్. వ్యవసాయరంగంలో మనమే దేశానికి మార్గదర్శకులం. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మన రాష్ట్రంలో అమలవుతున్న విధానాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా మారుతోంది’’
– ఇది తెలంగాణ సీఎం కే సీఆర్ తరచూ అనేక వేదికలపై చేసే వ్యాఖ్యలు. విపక్షాలు తన పాలనపై ధ్వజమెత్తిన ప్రతిసారీ, వారిపై ఎదురుదాడి చేసే సమయంలో సంధించే అస్త్రాలివి. ఆయనొక్కరే కాదు.. మంత్రుల మాటల్లోనూ తెలంగాణ రాష్ట్రం నెంబర్‌వన్ అనే పదమే ఊతపదంలా దొర్లుతుంటుంది. మనం ప్రపంచంతోనే పోటీపడుతున్నామని చెబుతుంటారు.
గురువుకు ఇలా.. శిష్యుడికి అలా..
కానీ.. దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల పనితీరుపై ‘సీ ఓటర్-ఐఏఎన్‌ఎస్’ అనే ప్రముఖ సంస్థ నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో మాత్రం.. తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వచ్చిన స్థానం పదహారు! ఢిల్లీ, అసోం, కర్నాటక, చత్తీస్‌గఢ్, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు.. కొత్తగా గద్దెనెక్కిన  ఉద్ధవ్ థాక్రే వంటి ముఖ్యమంత్రుల కంటే, కింది స్థానంలో ఆయన ర్యాంకు ఉండటం ఒక ఆశ్చర్యమయితే.. కేసీఆర్ మార్గంలో నడుస్తూ, ఆయన రాజకీయ శిష్యుడిగా ప్రచారంలో ఉన్న, ఏపీ సీఎం జగన్ పైనుంచి నాలుగవ స్థానంలో ఠీవిగా నిలవడం మరో ఆశ్చర్యం. నిజం.. ఆ సంస్థ ఇచ్చిన ర్యాంకులలో కేసీఆర్‌కు 16, ఆయన రాజకీయ శిష్యుడయిన జగన్‌కు 4వ స్థానం దక్కడం చర్చనీయాంశమయింది.
అనుకున్నంత అనుకూలత లేదా?
దీనిపై గులాబీ దళాల్లో చర్చ మొదలయింది. నిజానికి ఈ ర్యాంకులు గులాబీ దళాలలో గుబులు పుట్టించాయి. అసెంబ్లీ నుంచి పంచాయితీ ఎన్నికల వరకూ కారు జోరు అంతగా దూసుకుపోతే, తమ బాసుకు సీఎంలలో 16వ స్థానం దక్కడమేమిటని విస్తుపోతున్నారు. కేసీఆర్ వీరాభిమానులయితే ‘అసలు ఆ సంస్థకు విశ్వసనీయత లేదు. మాకు ప్రజాబలం ఉంది. అసలు పనేమీ చేయని కేజ్రీవాల్ కంటే, కేసీఆర్‌కు తక్కువ ర్యాంకు ఇచ్చినప్పుడే ఆ సంస్థ లెక్కలు తప్పని తేలిపోయింద’ని తమ అభిమానం ప్రదర్శిస్తున్నారు. అయితే, పార్టీ నేతలు మాత్రం దీనిని తేలిగ్గా తీసుకోకుండా ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. అసలు పాలనానుభవం లేని జగన్‌కు 4వ స్థానం, దశాబ్దాల తరబడి పాలనానుభవం, వ్యూహరచయితగా విమర్శలకులతోనూ ప్రశంసలు అందుకునే కేసీఆర్‌కు 16వ స్థానం వచ్చిందంటే.. బయట పరిస్థితులు తాము అనుకున్నంత సానుకూలంగా లేవన్నట్లు గుర్తించాలని వ్యాఖ్యానిస్తున్నారు.
సర్వే ఫలితాన్ని తేలిగ్గా తీసుకోవద్దంటున్న సీనియర్లు..
సర్వే నివేదికలను తేలిగ్గా తీసేయడం మంచిదికాదన్న వ్యాఖ్య, గులాబీ దళాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. అసెంబ్లీ-లోక్‌సభ, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ చేసిన తర్వాత కూడా.. జూనియర్లతో పోల్చితే కేసీఆర్‌కు పెద్దగా  ప్రజాదరణ లేదన్న అంశాన్ని, తేలికగా కొట్టిపారేయకూడదంటున్నారు. ముఖ్యంగా, కేసీఆర్ ఎవరికీ అందుబాటులో ఉండరని, ప్రగతిభవన్‌కే పరిమితమయ్యారన్న విపక్షాల ఆరోపణలు జనంలో స్థిరపడుతున్నాయంటున్నారు. దానికితోడు పార్టీ-ప్రభుత్వానికి దూరం పెరుగుతోందని, పైస్థాయిలో అవినీతి తగ్గినా కిందిస్థాయిలో విపరీతంగా ఉందన్న అభిప్రాయాన్ని, తొలగించాల్సిన అవసరం ఉందంటున్నారు. ముఖ్యంగా తెరాస నేతలు నియోజకవర్గ స్థాయిలో అనేక దందాలకు పాల్పడుతున్నా, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి.
విపక్షాల విమర్శల ప్రభావం..
ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, సమర్ధులైన నాయకులను ఎంపికచేసుకోవడంలో వైఫల్యం చెందారన్న విమర్శలు కూడా అంతర్గతంగా వినిపిస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో అనుకూల మీడియా అనేక కారణాలతో కేసీఆర్ పనితీరు బ్రహ్మాండమని ప్రచారం చేస్తున్నప్పటికీ.. నిజానికి అసలు పరీక్షలు చేయడం లేదని, ఈ విషయంలో ఏపీ సర్కారే చాలా మెరుగన్న అభిప్రాయం.. హైదరాబాద్ వంటి నగర, పట్ణణ ప్రాంత ప్రజల్లో నెలకొన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి; బీజేపీలో బండి సంజయ్, లక్ష్మణ్, రఘునందన్‌రావు, డికె అరుణ , నాగం వంటి నేతలు కేసీఆర్ సర్కారుపై చేస్తున్న ఆరోపణలు  విద్యాధికులను బాగా ఆకట్టుకుంటున్నట్లు ..యూట్యూబ్ చానెళ్లలో చూస్తున్న  సందర్శకుల సంఖ్యనే చెబుతోందంటున్నారు.
కొత్త నేతల కంటే ఎందుకు వెనుకబడ్డాం?
సాగునీటి ప్రాజెక్టులపై కేసీఆర్‌కు ఎంత సానుకూలత కనిపిస్తుందో, విపక్షాలు చేస్తున్న ఆరోపణల కారణంగా అంతే వ్యతిరేకత కూడా  పోగవుతున్న విషయాన్ని గ్రహించలేకపోతున్నామని సీనియర్లు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో తెరపైకొచ్చిన, పోతిరెడ్డిపాడు వివాదంలో విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పడంలో, కేసీఆర్ సర్కారు విఫలమయిందన్న వాదనను గుర్తు చేస్తున్నారు. మేమిద్దరం కలసి పనిచేస్తున్నామని స్వయంగా కేసీఆర్ చెప్పడం తెలంగాణవాదులకు, తమ పార్టీ వర్గాలకూ రుచించలేదంటున్నారు.
కొత్తగా గద్దెనెక్కిన ఉద్ధవ్‌థాకరే, తమ అధినేత  వద్ద మెళకువలు నేర్చుకుంటున్న జగన్, ఛత్తీస్‌గఢ్‌లో భూపేష్‌భగేల్, కేరళలో పినయర్ వంటి సీఎంలంతా కేసీఆర్ పాలనానుభవం ముందు చిన్నవారే. అయినా ప్రజాదరణలో వారంతా తమ అధినేత కంటే ముందు వరసలో ఉండటానికి, కారణాలేమిటో అన్వేషించుకోవలసిన అవసరం ఉందని సూచిస్తున్నారు. విమర్శలు వచ్చినప్పుడే లోపాలేమిటో తెలుస్తాయని, అలాంటివి రానీయకుండా తొక్కిపెడితే తమకే నష్టమని వ్యాఖ్యానిస్తున్నారు.
మీడియాకు ‘సీఎంర్యాంకుల’ అంశం  చర్చ కాదా?
కాగా..సర్వేలలో విశ్వసనీయత ఉన్న ‘సీ ఓటర్-ఐఏఎన్‌ఆఎస్’ సంస్థ వెల్లడించిన అంశాలకు సంబంధించి.. మీడియా సంస్థలు చర్చలు నిర్వహించకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది. సహజంగా ఇలాంటి సర్వేలపై హడావిడి చేసే చానెళ్లు, పతాక శీర్షికలకెక్కించే పత్రికలు.. కీలకమైన ‘ప్రజాదరణ గల సీఎం’లకు సంబంధించి వెలవడిన సర్వేలకు, ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. దీన్నిబట్టి రాష్ట్రంలో మీడియా ఏ స్థాయిలో, ప్రభుత్వానికి భయపడుతోందో స్పష్టమవుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.  ఇప్పటికే మీడియా తమ కార్యక్రమాలు చూపించడం లేదని, అంతా పింక్ మీడియాగా మారిందని.. ఇదే పద్ధతి కొనసాగితే ఆ పత్రికలు, చానెళ్లను చూడవద్దని పిలుపునివ్వాల్సి వస్తుందని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఇటీవలే హెచ్చరించిన విషయం తెలిసిందే.
మోదీకి ఏపీ-తెలంగాణలో పెరుగుతున్న ఇమేజ్..
ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో.. ఆంధ్ర-తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాని నరేంద్రమోదీకి ప్రజాదరణ పెరగడం విశేషం. ముఖ్యంగా బీజేపీకి నాలుగు ఎంపీ, ఒక్క అసెంబ్లీ స్థానం ఉన్న తెలంగాణలో కంటే.. ఒక్క అసెంబ్లీ, ఒక్క ఎంపీ సీటు కూడా లేని ఏపీలోనే, మోదీకి ఎక్కువ ప్రజాదరణ వ్యక్తమవడం మరో విశేషం. తెలంగాణలో మోదీకి 71.51 శాతం ప్రజాదరణ ఉంటే, ఒక్క సీటూ లేని ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 83.6 శాతం ప్రజాదరణ లభించింది.దీనిని బట్టి.. ఈ రెండు రాష్ట్రాల్లో కేంద్రం అమలుచేస్తున్న పథకాలను, బీజేపీ రాష్ట్ర నాయకత్వాలు కిందిస్థాయి వరకూ తీసుకువెళ్లడంలో విజయం సాధించినట్లు స్పష్టమవుతోంది. ఏపీలో కన్నా లక్ష్మీనారాయణ, తెలంగాణలో బండి సంజయ్ నాయకత్వంలో రెండు ప్రభుత్వాలపై సమరం సాగిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారంలో.. ఏపీ బీజేపీ చీఫ్ కన్నా నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు దిగిన తర్వాతనే, జగన్ ప్రభుత్వం దిగివచ్చింది.