ఏమిటీ డిబేట్లు…?

405

* ఏమిటీ అరుపులూ…కేకలు?
*ఏమిటీ యాంకర్ల నృత్య భంగిమలు…?
*వాళ్ళేమైనా’ఛీర్ బోయ్’స్సా…వీక్షకులను ఆకట్టుకోడానికి?
*జనం సమస్యలు గాలికి వదిలేసి…
*ఉబుసుపోక కబుర్లపై డిబేట్లా?
*అరుపులూ… కేకలా….?
ఈ ‘ఛీర్ లీడర్స్’ కి పబ్లిసిటీ లు ఏంటి…?
*ఈ ‘నిలయ విధ్వంసుల’ వీరంగాలు ఏమిటి?
*తెలుగు టీవీ వీక్షకులకు వీటినుంచి విముక్తే లేదా? !
విజయవాడ:
ఉదయంగానీ…సాయంత్రాలు గానీ న్యూస్ చానెళ్లు పెట్టాలంటే భయం వేస్తోంది. డిబేట్లు…డిబేట్లు…డిబేట్లు…
వాటిని చూడకపోతే….జనానికి తెల్లారదు పొద్దుగూకదు అన్నట్టుగా. సినిమాలలో హీరో, హీరోయిన్లను వాల్ పోస్టర్లలో రకరకాల భంగిమలలో చూపించినట్టుగా…ఈ డిబేట్లను నిర్వహించేవారిని రకరకాల భంగిమలలో చూపిస్తూ ఆయా ఛానెళ్లలో ముందస్తు ప్రోమోలు. ఆ డిబేట్లు….వాటిల్లో పాల్గొనే మనుషులు….వాళ్ళ విశ్లేషణలు….ఆ క్రమంలో వీళ్ళు వేసుకునే కేకలు..సవాళ్లు, ప్రతి సవాళ్లు…ఆ యాంకర్ల బాడీ లాంగ్వేజీలు…ఆ డిబేట్లతో పాల్గొనే వారి స్థాయి….మొదలైనవి చూస్తుంటే దుఃఖం వస్తున్నది. కొందరు ఛీర్ లీడర్స్ కు వత్తులు పలకడం కూడా రాదు.
తెలుగు రాష్ట్రాలలో దాదాపు పది కోట్లమందికి పైగా జనం ఉన్నారు. వారి జీవనం, మనుగడ, వారి బతుకు తెరువుకు…మాన ప్రాణాలకు సంబంధించిన సమస్యలు కూడా వేలల్లోనే ఉండడం సహజం. ఆ స్థానిక సమస్యలపై…పొద్దున్న ఒకటి, సాయంత్రం ఒకటి …ఆ సమస్య సంబంధితులతో డిబేట్ నిర్వహిస్తే….ఆ సమస్య అధికార యంత్రాంగం దృష్టికి వెళ్ళడానికి…;సంబంధిత బాధితులకు ఉపశమనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా అన్ని చానెళ్లు కలిపితే…రోజూ ఓ యాభై సమస్యలపై ప్రభుత్వ స్థానిక యంత్రాంగం లో కదలిక అయినా తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇందులో సెన్సేషలిజం ఉండదు. వాస్తవికత ఉంటుంది. ఛీర్ లీడర్ల నృత్య భంగిమ ప్రదర్శనల అవసరం ఉండదు.
మాటవరుసకు…విజయవాడ పటమట లో గ్యాంగ్ వార్ జరిగిందని….ఒకరు చనిపోయారని వార్తలు వచ్చాయి. ఈ సంఘటన జరగడానికి పూర్వపరాలు ఏమిటి? అధికారులు ఏమి చేశారు? ఇకముందు ఏమి చేస్తారు అనే విషయమై ఒక డిబేట్ చేసి…ఆ రెండు వర్గాలనుంచి ఇద్దరు ముఖ్యులను…, ఆ అపార్ట్మెంట్ యజమానిని, ఈ కేస్ ను హ్యాండిల్ చేస్తున్న విజయవాడ డీ సీ పీ 1 ను లైన్ లోకి తీసుకుని…డిబేట్ చేయవచ్చు. దీనివల్ల, పటమట ప్రాంత జనానికి కొంచెం ధైర్యం కలిగించినవారు అవుతారు.
లేదూ—-కర్నూల్ లో కోవిడ్-19విపరీతంగా వ్యాపిస్తోంది.అక్కడ సామాజిక ముఖ్యనేతలు ఒకరిద్దరు, మునిసిపల్ కమిషనర్, కలెక్టర్,జిల్లా వైద్యాధికారి ని లైవ్ లోకి తీసుకుని…మొత్తం సమస్యను కూలంకషంగా చర్చించవచ్చు..
ఇలా…. ఒకో జిల్లాకు…ఒకో పట్టణానికి సంబంధించిన స్థానిక సమస్యల పై న్యూస్ చానెళ్లు గళం ఎత్తవచ్చు. అక్కడ ఉండే అధికారులు కూడా ఎలెర్ట్ అవుతారు. ఛానెల్స్ కు గౌరవం…విశ్వసనీయత కూడా పెరుగుతాయి.
ఈ డిబేట్ల జాఢ్యం …ఇంగ్లీష్ చానళ్ల నుంచి తెలుగు వాటికి అంటుకున్నట్టు కనపడుతున్నది. మాటవరుసకు…నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారమే తీసుకుంటే…
జనానికి దానితో ఏం సంబంధం? రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయన ఉంటే ఏంటి? లేకపోతే ఏంటి? ఆ పదవిలో ఎవరుంటే జనానికి ఏంటి? ఆయన ఆ పదవిలో ఉన్న గత నాలుగేళ్లలో ఆంధ్ర రాష్ట్రానికి చేసిన సేవ ఏంటి?
అయినా సరే…దానిమీద టీవీ ఛానెళ్లలో జరిగినంత రగడ ‘నా బూతే…నా భవిశ్శత్’కదా! ప్రజలకు దానితో సంబంధం లేదు కదా! పోనీ , ఈ అంశం లో అటు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు గానీ…ఇటు ప్రభుత్వానికి గానీ ఈ డిబేటీషియన్లు ఏమైనా దిశా నిర్దేశం చేశారా? అంటే…అదీ లేదు.
తెలుగు రాష్ట్రాలలోని 90 శాతానికి పైబడిన జనానికి …కట్టుకోడానికి బట్ట…తింటానికి తిండి…ఉంటానికో నీడ ముఖ్యం. వీటికోసం వారు జీవనపోరాటం చేస్తూనే ఉంటారు… జీవించివున్నంత కాలం.
ఆ పోరాటం లో చాలామంది అలిసిపోయి…తనువులు చాలిస్తుంటారు.
అందరి సమస్యలు అన్నీ వెలుగులోకి రావు. వచ్చినవాటినన్నింటీ కీ పరిష్కారం చూపడం కూడా కుదరకపోవచ్చు. సమస్యలు లేని జనజీవనం అనేది ప్రపంచం లోఎక్కడా ఉండదు. అయినప్పటికీ…వీలున్న మేరకు వాటిని ప్రభుత్వం, అధికార యంత్రాంగం , సమాజం దృష్టికి తీసుకు రావడానికి ఈ డిబేట్లు ఉపయోగపడాలి. ‘ఛీర్ లీడర్స్” ప్రమోషన్ల కోసం కాదు.
ఈ డిబేట్లు …కుటీర పరిశ్రమ స్థాయికి ఎదిగాయన్న మాట కూడా వినిపిస్తున్నది. వీటిల్లో పాల్గొని…తమ వాదనా పటిమలతో వీక్షకులను సమ్మోహితులను చేయాలని ఉవ్విళ్ళూరే వీర డిబేటీషియన్లు కొందరు..కొన్ని ఛానెళ్లలోని కొందరు ఛీర్ బాయ్స్ కు ఆదాయ వనరులుగా కూడా మారినట్టు చెప్పుకుంటున్నారు. చానెళ్లు ఓ విషయాన్ని గమనించాలి.
ఒక ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగానో… వ్యతిరేకంగానో…డిబేట్లతో ఊగిపోవడంవల్ల ప్రజాభిప్రాయాన్ని తదనుగుణంగా మలచలేరనే విషయాన్ని గమనించాలి. ప్రభుత్వ వ్యవహారశైలి పై ప్రజలు తమ అభిప్రాయాన్ని …….తమ వ్యక్తిగత అనుభవం ఆధారంగా ఏర్పరుచుకుంటారు. దీనిని ‘పెర్సెప్షన్’అందాము. ప్రసార, ప్రచార మాధ్యమాలు చేసే ప్రచారాలు ఎన్నికల్లో గెలుపు ఓటములను నిర్ణయించే పక్షంలో 2004 లో చంద్రబాబు ఓడిపోకూడదు…రాజశేఖర రెడ్డి గెలవకూడదు. అలాగే, 2014 లో చంద్రబాబు గెలవగూడదు..,2019 ఓడిపోకూడదు….
ప్రసార, ప్రచార మాధ్యమాలు కూడా కులాల…పార్టీల వారీగా విడిపోయాయనే భావం సమాజంలో బలంగా నాటుకుపోయివున్న ఈ రోజులలో….ఈ డిబేట్లకు వెంట్రుకపాటి విలువకూడా లేకుండా పోతున్నదనే భావం వ్యక్తమవుతోంది. అందుకే…ప్రభుత్వ పెద్దలు వీటిని పట్టించుకోవడం మానేశారు.ఈ డిబేట్లు….ఛీర్ లీడర్స్, వాటిమీదే ఆధారపడి కాలక్షేపం చేసే పడక్కుర్చీ విశ్లేషకుల కు, ఆయా ఛానెళ్ల కు చెందిన కులాల్లో నోరున్నవారికి, ఆయా పార్టీలలోని ఆత్రగాళ్లకు తప్ప …జనసామాన్యానికి దమ్మిడీ ఉపయోగం లేదనే స్పృహ ఆయా  చానెళ్లకు కలిగేదాకా…ఈ ‘గృహ హింస’ను భరిద్దాం. జై ఛీర్ లీడర్స్…జై డిబేటీషియన్స్…జై ఛానెల్స్.

-భోగాది వెంకట రాయుడు