తెలంగాణలో ఉద్యమం చేపడుదాం

375
తెలంగాణలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మలిదశ ఉద్యమం చేపడుదాం. బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చేసిన ఉపన్యాసం.
కేసీఆర్‌ అనే మూర్ఖుడి చేతిలో తెలంగాణ తల్లి బందీ అయ్యిందని బిజెపి తెలంగాణ అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ అన్నారు. కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మాటలు నమ్మి అన్ని వర్గాల ప్రజలు మోసపోయారన్నారు. కేసీఆర్ అబద్ధాలు, మోసాలతో కాలం గడుపుతున్నారని, అమరుల ఆకాంక్ష నెరవేరలేదని తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం గన్ పార్క్ లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. ఉద్యమంలో అమరవీరుల ఆత్మబలిదానాలు, పోరాటాలను స్మరించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు శ్రీ చింతా సాంబమూర్తి, శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, శ్రీ మంత్రి శ్రీనివాసులు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు వేముల అశోక్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బిక్కునాథ్ నాయక్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు :
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన జరిగిన మహా ఉద్యమంలో, ఒక పవిత్ర కార్యంలో అసువులుబాసిన అమరవీరులకు జోహార్లు అర్పిస్తున్నాం.   వందలాది మంది వీరుల త్యాగాల ఫలితంగా, అనేక పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొని.. పోరుసల్పి స్వరాష్ట్రాన్ని సాకారం చేసుకున్నారు. అయితే ప్రజలు నమ్మకంతో రాష్ట్రాన్ని అప్పజెప్పితే ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని ముఖ్యమంత్రి కేసీఆర్ నెరవేర్చలేదు. గత ఆరేళ్లుగా టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సాధించింది అబద్ధాలలో రికార్డులు మాత్రమే. ఇంటికో ఉద్యోగం అంటూ, లక్ష ఉద్యోగాలు అని చెప్పి.. తీరా, పట్టుమని 20వేల ఉద్యోగాలు కూడా నియమించలేదు. ఈ ఆరేళ్లలో దాదాపు లక్ష మంది పదవీవిరమణ పొందితే.. ఆ ఖాళీలను భర్తీ చేసిన పాపన పోలేదు. ఎంతోమంది యువత ఉద్యోగాలు వస్తాయని గంపెడాశలు పెట్టుకుంటే వారి ఆశలను అడియాసలు చేశారు.
కేసీఆర్ సర్కారులో విద్య, వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమయింది. ఇంటర్ విద్యార్థుల విషయంలోనూ టీఆర్ఎస్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. 21 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే.. వారి కుటుంబాలను పట్టించుకున్న పాపాన పోలేదు. అంతేకాకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలను వంచించి మోసం చేశారు.  రైతుబంధు పేరుతో ఎన్నికల హామీలిచ్చి.. ఓట్లు  గడించారు.. రైతుబంధు ఇవ్వలేదు. రుణమాఫీ విషయంలోనూ మోసం చేశారు.
కేంద్ర ప్రభుత్వ వాటాలేని ఒక్క సంక్షేమ పథకం కూడా ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదు. కేంద్ర నిధులను దారి మళ్లీస్తూ.. కేంద్ర పథకాలను నిర్వీర్యం చేస్తున్నారు. మరోవైపు రైతుబంధు ఎగ్గొట్టేందుకు సీఎం కేసీఆర్‌ కొత్తకుట్ర చేస్తున్నారు. భూసార పరీక్షలు చేయకుండా, ఆయనకు ఇష్టమొచ్చిన పంటలు వేయమంటున్నారు.
పంటమార్పిడి విధానానికి బిజెపి వ్యతిరేకం కాదు. నాలుగేళ్ల క్రితమే భూసారపరీక్షలు నిర్వహించాలని..  తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ప్రత్యేకంగా రూ. 125 కోట్లను మంజూరు చేస్తే.. కనీసం భూసార పరీక్షలు నిర్వహించకుండా, సాయిల్ హెల్త్ కార్డులు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు.  ప్రజలను మోసం చేయడమే సీఎం కేసీఆర్ నైజం. ప్రస్తుత పరిస్థితుల్లో  ప్రజల ఆకాంక్షలు నెరవేరే పరిస్థితి లేదు. అమరవీరుల త్యాగాలకు, ఆకాంక్షలకు న్యాయం జరగడం లేదు.
కేసీఆర్ సర్కారు వల్ల లాభపడింది కేవలం వారి కుటుంబం మాత్రమే. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ ఇప్పుడు ప్రజలు అన్నింటా వంచనకు గురవుతున్నారు. కమీషన్ల కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణితో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగుతోంది.
కేసీఆర్ అహంకారపూరిత, స్వార్థపూరిత రాజకీయాలకు సమాధి కట్టేందుకు ప్రజల పక్షాన పోరాడుతాం. అమరుల ఆశయాలను నెరవేర్చేలా బిజెపి మలిదశ ఉద్యమం చేపట్టబోతోంది. కేసీఆర్ అహంకారపూరిత, స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలికేందుకు ప్రజలు బిజెపికి మద్దతుగా నిలవాలని కోరుకుంటున్నాం.
కార్యాలయ కార్యదర్శి