రఘురాముడి బాణాలు తగిలేదెవరికి?

273

నిమ్మగడ్డ, టీటీడీ భూములపై వైసీపీ ఎంపీ రూటు సెపరేటు
బీజేపీతో దోస్తానా వద్దన్నా బేఖాతర్
సొంత పార్టీ నేతల భూదందాపై తాజాగా ఫైర్
హస్తినలో కమలదళాలతో చెట్టపట్టాల్
వైసీపీలో ఎంపీ రఘురామకృష్ణంరాజు సొంతబాట
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఆయన పేరు చివరిలోనే రాజు అనే గంభీరమైన అక్షరాలున్నాయి. కాబట్టి ఎవరినీ ఖాతరు చేయరు. తనకు తోచింది, తన మనసుకు నచ్చింది, తన ఆత్మసాక్షిగా అనుకున్నదే చెబుతారు. ఏ అంశంపైనయినా  కుండబద్దలు కొట్టడం ఆయన నైజం. తన వ్యాఖ్యల వల్ల సొంత పార్టీ ఏమైనా ఇబ్బందుల్లో పడుతుందా లేదా అన్నది ఆయనకు అనవసరం. అదేమంటే.. నేను పార్టీ నాయకుడిని కాదు. పార్టీలో నాకేమీ పోస్టులేదంటారు. పార్టీ ఏ కార్యకమ్రం చేపట్టినా అందులో పార్టీ కనిపించదు. పార్టీ అధినేత కనిపించరు. రాజుగారే దర్శనమిస్తారు. అలా ఆయన మాటలు, చేతల్లో రాజసం ఉట్టిపడుతుంది. ఆయనే నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు.

అసలు  రఘురామకృష్ణంరాజు రూటే సెపరేటు. ఆయన ఎవరినీ ఖాతరు చేయరు. తాను కావాలని రాజకీయాల్లోకి రాలేదంటారు. ఇందులో సంపాదించుకోవడానికి రాలేదంటారు. నిజమే. ఆయనకు బోలెడంత సంపద, దానికితోడు లెక్కలేనన్ని వ్యాపారాలున్నాయి. అన్ని పార్టీలతో సత్సంబంధాలున్నాయి. అందుకే రాజుగారు ఎవరినీ లెక్కచేయరు. చాలామంది రాజకీయ నాయకుల మాదిరిగా, సంపాదన కోసం అడ్డదారులు తొక్కరు. కక్కుర్తి పడరు. సొంత పార్టీ నాయకులయినా సరే.. ఇళ్ల కేటాయింపులో డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయాలని నిర్మొహమాటంగా చెప్పిన నేత. అందుకే ఆయనంటే ఆ పార్టీలో ఉన్నవారికి భయం. గౌరవం కూడా! చాలామంది ఆయన జోలికి వెళ్లడం ఎందుకులే అని మౌనంగా ఉంటారు. అందరి నాయకుల్లా జిందాబాదులు కొట్టించుకోవడం, నాయకత్వం వర్ధిల్లాలి అని అనిపించుకోవడమంటే రాజుకు మహా చెడ్డ చిరాకు. తనముందు అధినేతకు జైకొట్టినా ఒప్పుకోరు.

భూముల అమ్మకాలపై రాజుగారికి కోపమొచ్చింది..

అలాంటి రాజుగారికి సొంత పార్టీ అయిన వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలపై కోపం వచ్చింది. ఒకసారి, రెండుసార్లు కాదు.. ఓ నాలుగయిదుసార్లు కోపం వచ్చింది. ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయాలు,  ఆయనకు రుచించకపోవడమే దానికి కారణం. ఇటీవల టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారం రచ్చగా మారింది. దానిపై ఏపీలో బీజేపీ నేతలు నానా యాగీ చేశారు. ఉపవాసదీక్షలు చేశారు. ఫలితంగాప్రభుత్వం దిగివచ్చి, అమ్మకాలపై ఉత్తర్వులు ఇవ్వాల్సి వచ్చింది. తర్వాత టీటీడీ కూడా ఇకపై ఆలయ భూముల అమ్మకాలను నిషేధిస్తున్నట్లు ప్రకటించాల్సి వచ్చింది.

అదిగో.. ఆ వ్యవహారమే మన రాజుగారికి యమా కోపం తెప్పించింది. శ్రీవారిపై విశ్వాసంతో భక్తులు ఇచ్చిన భూములు అమ్మడం తప్పని, అది కోట్లాదిమంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశమని రాజు కుండబద్దలు కొట్టారు. అది బోర్డు సభ్యులు కూర్చుని నిర్ణయించేది కాదన్నారు. ‘నేను ట్రస్టీని కాబట్టి భక్తుల మనోభావన నాకు అనవసరం. నేను ఏం చేసినా చెల్లుతుందనుకుంటే కుదరద’ని కుండబద్దలు కొట్టడం ద్వారా, రాజు తనేమిటో స్పష్టం చేశారు. వైసీపీ నేతలంతా వైఎస్‌ను తమ నాయకుడిగా కీర్తిస్తుంటే,  వైఎస్ తన నాయకుడు కాదని నిర్మొహమాటంగా చెప్పడం రాజుకే చెల్లింది.

నిమ్మగడ్డ తొలగింపు తప్పిదమే..

ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ను తప్పిస్తూ, తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కూడా రాజుగారికి రుచించలేదు. తాను తమిళనాడు హైకోర్టు గతంలో ఇచ్చిన ఆర్డర్‌ను దీనితో పోల్చుకుని చూస్తే, రమేష్‌ను తొలగిస్తూ ఇచ్చిన ఆర్డర్ తప్పనుకున్నానని చెప్పారు. ‘మనకు ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలన్న మంచి ఆలోచన ఉన్నప్పటికీ ఆర్డర్ సరిగా ఉండాలి. అందుకే హైకోర్టు తీర్పుపై నేను ఆశ్చర్యపోలేదు. వయోపరిమితి అంశాన్ని రాష్ట్రప్రభుత్వం చూడలేకపోవడం దుర దృష్టకరం’ అన్నారు. ఇదే అంశంలో ఓవైపు మంత్రులు, వైసీపీ నేతలంతా రమేష్‌పై ఎదురుదాడి చేస్తుంటే, రాజుగారు మాత్రం హైకోర్టు తీర్పును సమర్థించడం విశేషం.

మెచ్చుకుంటూనే.. మెత్తగా చురకలు

అయితే ఈ అంశంలో రాజుగారు.. ఓవైపు జగనన్న సర్కారును మెచ్చుకుంటూనే, మరోవైపు మెత్తగా చురకలు అంటించడం ప్రస్తావనార్హం. ‘మనకు ఎంత మంచిగా చేయాలి, ఎంత మంచి సంస్కరణలు చేయాలనుకున్నా రాజ్యాంగంలోని అధికరణలను దృష్టిలో ఉంచుకోవాలి.  ఈసారి ఏ ఆర్డర్లిచ్చినా కూడా చాలా కూలంకషంగా పరిశీలించి ఆర్డరు ఇస్తే బాగుంటుంన’ని మెత్తగానే మొత్తారు. అంటే. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే సమయంలో గుడ్డిగా వ్యవహరిస్తోందని, ఎవరితో చర్చించడం లేదన్న విషయాన్ని.. రాజుగారు చెప్పకనే చెప్పారన్నమాట!

రాజుగారా..? మజాకానా?

ఢిల్లీలో పార్టీ నేత విజయసాయిరెడ్డి అనుమతి లేకుండా ప్రధాని, కేంద్రమంత్రులను కలవవద్దని జగనన్న ఇచ్చిన ఆదేశాలను మిగిలిన ఎంపీలంతా కచ్చితంగా పాటిస్తున్నారు. అయితే రాజు మాత్రం అసలు ఖాతరే చేయకుండా, తన దారిన తాను వెళుతున్నారు. కేంద్రమంత్రులు, బీజేపీ కీలక నేతలతో సన్నిహితంగా వ్యవహరిస్తుండటం, జగనన్న అండ్ కోకు అస్సలు నచ్చడం లేదట. ఒకవైపు జగనన్న ఇంగ్లీషు మీడియం కోసం పట్టుదలతో ప్రతిపక్షాలతో పోరాడుతుంటే.. రాజుగారు మాత్రం, అదే సమయంలో మాతృభాష పరిరక్షణపై లోక్‌సభలో గళం విప్పి.. తనను ఎవరూ శాసించలేరన్న సంకేతాన్ని తాడేపల్లికి పంపించారు. అది అప్పట్లో పార్టీవర్గాలలో హల్‌చల్ చేసింది. దానితో జగన్ ఆయనను పిలిపించి మాట్లాడారు. అది వేరే విషయం!

మోదీ పలకరింపుపై వైసీపీ షాక్..

అంతేనా? పార్లమెంట్ సెంట్రల్‌హాల్‌లో స్వయంగా ప్రధాని మోదీనే ఆయనను పలకరించి. ‘రాజుగారూ బాగున్నారా?’ అని పలకరించి కౌగిలించుకోవడం, రాజుతో మాట్లాడటం కూడా వైసీపీ నాయకత్వానికి సుతరామూ నచ్చడం లేదు. అసలు బీజేపీ వాళ్లతో సన్నిహితంగా ఉండవద్దని చెబితే, రాజు మాత్రం దానిని లెక్కచేయకుండా వెళుతుండటం జగనన్న బృందానికి యమా కోపం తెప్పిస్తోంది. ఎంపీగా గెలిచిన తొలిసారే కీలకమైన పార్లమెంటు స్టాండింగ్ కమిటీ చైర్మన్‌గా ఎంపిక య్యారంటే, రాజుగారు ఢిల్లీ దర్బారుకు ఎంత దగ్గరగా ఉన్నారో మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతోంది. పాపం ఆ పదవి కోసం ఓ యువ ఎంపీకి పార్టీ సిఫార్సు చేసినా ఫలితం దక్కలేదు.

బొచ్చులో నాయకత్వమని ఫైర్..

ఇక తన నియోజకవర్గంలో ఓ పదవి అంశంలో కార్యకర్తలతో మాట్లాడుతున్న సందర్భంలో, రాజు చేసిన వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. వైసీపీ కార్యకర్తలు ఉత్సాహంతో జగన్ నాయకత్వం వర్థిల్లాలి అని నినాదాలు చేశారు. తనకూ జై కొట్టారు. దానితో రాజుగారు అగ్గిరాముడయ్యారు. ‘ఎవరయ్యా నాయకత్వం? ప్రతివాడూ ప్రతివాడి నాయకత్వం గురించి మాట్లాడటమేనా ఇక్కడ? యూజులెస్‌ఫెలోస్. అవతలకుపో. మీకు ఎవరి నాయకత్వం కావాలి? బొచ్చులో నాయకత్వం? నోర్మూసుకుని కూర్చో’మని చిరాకుపడ్డారు.

ఆయన  ఢిల్లీలో ఇచ్చిన విందుకు బీజేపీ అగ్రనేతలు హాజరుకావడం వైసీపీలో చర్చనీయాంశమయింది. అయితే తాను,  పార్టీ  సహచరులను  కూడా ఆహ్వానించానని, అందుకు పార్టీకి సమాచారం ఇవ్వాల్సిన పనిలేదని నిర్మొహమాటంగా చెప్పారు.  ‘నేను పార్టీ నుంచి వెళ్లిపోవాలనుకునేవారు కూడా పార్టీలో ఉన్నారు. నామీద జగన్‌కు చాడీలు చెప్పేవారు ఒకరిద్దరు ముగ్గురున్నారు. వాళ్లు అదే పనిమీద ఉన్నార’ని తనపై కుట్ర జరుగుతోందని కుండబద్దలు కొట్టడం రాజుకే చెల్లింది.

పోటీ పెట్టినా బేఖాతర్..

బీజేపీతో సన్నిహితంగా వ్యవహరిస్తుండటం, పార్టీ గీత దాటి సొంత దారిలో వెళుతున్న రాజుకు ముకుతాడు వేయాలన్న వైసీపీ నాయకత్వ వ్యూహాన్ని రాజు ఏమాత్రం ఖాతరు చేయడం లేదు. మాజీ ఎంపి గోకరాజు గంగరాజు కుటుంబాన్ని వైసీపీలోకి తీసుకువచ్చి, రఘురామరాజుకు చెక్ పెట్టాలన్న నాయకత్వ వ్యూహానికి ఆయనేమీ తొణకడం లేదు. గంగరాజు కుటుంబానికి జిల్లా పార్టీ పగ్గాలిచ్చినా, ఈ రాజుగారు మాత్రం అస్సలు ఖాతరు చేయకుండా, నర్సాపురంపై తనముద్ర వేసేందుకు సొంతబాటలు వేసుకుంటున్నారు. మరి రాజుగారా?.. మజాకానా?