ఆయన సారధ్యంలో ఎన్నికలు జరగవు…!

394

*నిమ్మగడ్డ హయాం లో స్థానిక ఎన్నికలు హుళ్లక్కే…
*ఆయనపై ప్రభుత్వానికి లోపించిన విశ్వాసం…
*నిమ్మగడ్డ పదవీకాలం ఇక పది నెలలే…!
*డిసెంబర్ వరకు కరోనా నియంత్రణ చర్యలే…!
*ఈ సమయంలో ఎన్నికలుండవ్….!
*ఆ తరువాత ఆయన పదవీకాలం మూణ్ణెల్లే….
*నిమ్మగడ్డ పదవి అలంకార ప్రాయమే….!
(భోగాది వేంకట రాయుడు)
విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా తన మిగిలిన పదవీకాలాన్ని ధృవీకరిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వెలువరించిన 318 పేరాల తీర్పులో…318 వ పేరాలోని పదజాలాన్ని ప్రభుత్వం ఇంట్రప్రిట్ చేసిన తీరుపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో సారి హైకోర్ట్ కు వెళ్లనున్నారు. 318వ పేరాలో వ్యక్తమైన హైకోర్ట్ భావనకు అనుగుణంగా ఆయన వ్యవహరించారా అనే విషయమై మరో మూడు, నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుంది. తీర్పుకు అనుగుణంగా రాష్ట్రప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకోకముందే…రమేషకుమార్ తొందరపడి ఛార్జ్ తీసుకోవడం కరెక్ట్ కాదని గనుక హై కోర్ట్ నుంచి వివరణ వస్తే…రమేష్ కుమార్ గత 35 ఏళ్లుగా కష్టపడి సముపార్జించుకున్న వ్యక్తిగత ప్రతిష్ట మసకబారుతుంది.
రాష్ట్ర హైకోర్టు తీర్పు పై ప్రభుత్వం సుప్రీమ్ కోర్టుకు వెడుతున్నందున… ఆ తీర్పు వచ్చే వరకు రమేష్ కుమార్ అసహనంగా వేచి ఉండాల్సిందే.
రమేష్ కుమార్ తనంత తానుగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ బాధ్యతలు తీసుకోడాన్ని హై కోర్ట్ తప్పుపట్టకపోతే….అప్పుడూ ఆయనకు పెద్దగా పని ఉండే అవకాశం లేదు.
ఆయన సారథ్యం పై రాష్ట్రప్రభుత్వానికి నమ్మకం లేదనే విషయం ఇప్పటికే స్పష్టమై పోయింది. అందువల్ల, ఆయన పదవీకాలం ముగిసేవరకు… స్థానిక ఎన్నికలకు వెళ్లకుండా ప్రభుత్వం వేచి ఉంటుందనడం లో సందేహం లేదు. ఇందుకు ప్రకృతి కూడా తనవంతు సాయం చేస్తున్నట్టు కనబడుతున్నది.
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం కోసమే ఆయన ఎన్నికల ప్రక్రియను ‘మిడిల్ డ్రాప్’ చేశారు. ఇప్పుడు ఆ కరోనా వైరస్ కనీసం ఈ ఏడాది డిసెంబర్ దాకా మనల్ని వదలదని ప్రధాని దగ్గరనుంచి …కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ దాకా అందరూ చెబుతున్నారు.
పోనీ ‘తగిన జాగ్రత్త’లతో ఎన్నికలు నిర్వహించేద్దామని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉత్సాహపడినప్పటికీ….ఆయన ఏకపక్షంగా నిర్వహించడానికి లేదు. రాష్ట్రప్రభుత్వం తో ఖచ్చితంగా సంప్రదించాలి. ఈ మాట సుప్రీం కోర్టు చెప్పింది. అందువల్ల, ఆయన ఉత్సాహానికి …రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం లేదు.
ఇక వచ్చే ఏడాదిలోకి అడుగు పెడితే….ఆయన పదవీకాలం మిగిలి ఉండేది…మూడునెలలే. ఆ సమయం సరిపోదు.2016 ఏప్రిల్ 1 న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్,2021 మార్చ్ 31న పదవీ విరమణ చేయాల్సి ఉంది. అంటే…వచ్చే ఏడాది మొదటి మూడు నెలలే ఆయన ఆ పదవిలో ఉంటారు.
షెడ్యూల్ ప్రకటనకు నెల ముందు కోడ్ అమలులోకి వచ్చేవిధంగా నోటిఫికేషన్ ఇవ్వాలని సుప్రీమ్ కోర్ట్ చెప్పింది. అందువల్ల, నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాం లో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.
చిత్రం ఏమిటంటే…ఆయన హయాంలో స్థానిక ఎన్నికలు అసలు జరగనే లేదు…..ఎక్కడన్నా ఉప ఎన్నికలను మినహాయిస్తే…
స్థానిక సంస్థల గత ఎన్నికలు …నిమ్మగడ్డ ఆ పదవిలోకి రాకముందే జరిగిపోయాయి. కనుక, ఆ పదవి…ఆయనకే ఉపయోగపడింది తప్ప…;
రాష్ట్రప్రజలకు ఉపయోగపడలేదు. వచ్చే పది నెలలూ అంతే!

-భోగాది వెంకట రాయుడు