కర్షకులకు ఇక నెలవారీ పెన్షన్లు?

131

ప్రతిరైతుకూ 5 వేలరూపాయల పెన్షన్
ఎరువులు, పెస్టిసైడ్స్ ఉచితం?
పొలం నుంచి పంట తరలింపు రవాణా ఉచితం?
రైతు పిల్లలకు కార్పొరేట్ విద్య ఉచితం?
రైతులకు ఇక కార్పొరేట్ వైద్యం
ఈ వారంలో కేసీఆర్ వరాలు?
రైతుల జీవితాల్లో  కేసీఆర్ కొత్త వెలుగు
రైతుల్లో పెరుగుతున్న ఉత్కంఠ
(మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ రైతుల జీవితాలు కనీవినీ ఎరుగని స్థాయిలో.. వారు సైతం ఊహించని రీతిలో మారనున్నాయి. ఆరుగాలం కాయకష్టం చేసే కర్షకుడి జీవితాలలో వెలుగునింపేందుకు.. ముఖ్యమంత్రి కేసీఆర్,  దేశంలోనే తొలిసారి అనితరసాధ్యమైన వరాలు మరో ఆరురోజుల్లో ప్రకటించబోతున్నారు. ఇప్పటివరకూ వచ్చిన అనేక ప్రభుత్వాలు రైతు ప్రయోజనాలను పట్టించుకోకపోగా, వారి ఆశలను సమాధి చేశాయి. ఫలితంగా దశాబ్దాల నుంచీ  తెలంగాణలో, వేలాదిమంది రైతులు తమ జీవితాలను ఉరికొయ్యలకు అర్పించుకున్నారు. కానీ,  రైతు కష్టం తెలిసిన కేసీఆర్.. వారి కష్టాలకు చలించి ప్రవేశపెట్టిన ైరె తుబంధు పథకం, దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఆ పథకంతో రైతులకు ఆర్ధికభరోసా లభించింది. వ్యవసాయరంగంలో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో ఉంటూ, దేశానికి అన్నంపెట్టే అన్నపూర్ణగా మార్చిన రైతు రుణం తీర్చుకునేందుకు..  దేశంలో ఏ పాలకుడూ చేయని సాహసాన్ని చేయడం ద్వారా, కేసీఆర్ రైతుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనున్నారు.

కర్షకులలో మరో హర్షధ్వని?

‘వారం రోజుల్లో రైతులందరికీ తీపికబురు చెబుతాం. ప్రపంచంలోనే ఎక్కడా లేని వార్త చెబుతా. భారతదేశమే అబ్బురపడి, అడ్డంపడే ఈ విషయం కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. బంగారు తెలంగాణ, భాగ్యరాశుల తెలంగాణ, పసిడిపంటల తెలంగాణను త్వరలోనే సాకారం చేసుకోబోతున్నామ’ని కొండపోచమ్మసాగర్‌ను ప్రారంభించిన సందర్భంగా, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసీఆర్ తమకు ఎలాంటి వరాలు ప్రకటించనున్నారు? దానితో తమ జీవితాల్లో ఏవిధంగా వెలుగు నిండబోతోందన్న ఉత్కంఠ రైతువర్గాల్లో నెలకొంది. ఇప్పటికే కొండపోచమ్మసాగర్‌లో కొలువుదీరిన గోదావరి జలాలతో, మెతుకుసీమ సస్యశ్యామలమయిన ఆనందంలో ఉన్న రైతులకు.. కేసీఆర్ చెప్పిన తీపికబురు మరింత ఆనందభరితులను చేసింది. ఆ జలసిరిని చూసిన జనం.. దశాబ్దాల నుంచి తాము అనుభవించిన కరవు కష్టాలను నెమరవేసుకుని, ఆ జలఘోషను చూసి ఆ బాధలు మర్చిపోయారు. దశాబ్దాలుగా కరవుకోరల మధ్య చిక్కుకున్న ఆ నేల.. ఉప్పొంగిన గోదావరి పరవళ్లతో నిలువెల్లా తడిసి ముద్దయింది.

అసాధ్యం.. సుసాధ్యమైన వేళ..

88 మీటర్ల ఎత్తు నుంచి 618 మీటర్ల ఎత్తుకు, గోదావరి జలాలను ఉత్తుంగతరంగాల మాదిరిగా ఎగిరిన దృశ్యాలు  చూసి ప్రపంచమే నివ్వెరబోయింది. ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీస్టేజ్ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టును.. కేవలం మూడేళ్లలో పూర్తి చేసిన ప్రభుత్వం, కేశవపురం రిజర్వాయరుతో త్వరలోనే హైదరాబాద్ ప్రజల తాగునీటి సమస్యకు తెరదించనుంది. దేశంలో 83లక్షల టన్నుల ధాన్యం సేకరించగా, అందులో తెలంగాణ నుంచే 53 లక్షల టన్నుల ధాన్యం సమకూరిందంటే, పంటలకు ప్రాణం పోయడంలో కేసీఆర్ సర్కారు ఏస్థాయిలో కృషి చేసిందో అర్ధమవుతుంది. ఇన్ని అద్భుతాలు ఆవిష్కరించిన కేసీఆర్.. కచ్చితంగా ప్రపంచం అబ్బురపడేలా, తమకు వరాలిస్తారన్న ధీమా, ఆశ.. రైతాంగం మోములో కనిపిస్తోంది.

ఎరువులు ఉచితం.. 5 వేల పెన్షన్?

లాక్‌డౌన్ వేళ ఖజానా ఆర్ధిక సంక్షోభంలో ఉన్నప్పటికీ,  కేసీఆర్ సర్కారు 5 లక్షల 50 వేల మంది రైతులకు 7 వేల కోట్లు రైతుబంధుకు చెల్లించింది. అదేసమయంలో 1200 కోట్ల రూపాయలు రైతురుణమాఫీకి జమచేసి, రైతులను మెప్పించిన కేసీఆర్ సర్కారు.. ఈవారంలో వారి పెదవులపై చిరునవ్వులు పూయించి, బతుకుపై ధీమానిచ్చే అద్భుత వరాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది.

ఆ నేపథ్యంలో టీఆర్‌ఎస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. తెలంగాణ రైతు తలెత్తుకుని భరోసాతో జీవించే, పలు పథకాలను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా రైతులకు ఎరువులు, పెస్టిసైడ్స్ ఉచితంగా పంపిణీ చేయనున్నట్లు సమాచారం. దీనివల్ల రైతులపై ఆర్ధిక భారం పూర్తిగా తగ్గిపోవడం ద్వారా, ఆత్మస్థైర్యంతో జీవించే వెసులుబాటు ఏర్పడనుంది. ఇది అమలయితే, దేశంలోనే రైతులకు ఉచితంగా ఎరువులు పంపిణీ చేసిన సీఎంగా, కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. అదే విధంగా వివిధ వర్గాలకు పెన్షన్లు ఇస్తున్నట్లుగానే, రైతులకు కూడా పెన్షన్ పథకం ప్రారంభించనున్నట్లు చెబుతున్నారు. ఆ ప్రకారం ప్రతి రైతుకు నెలకు 5 వేల రూపాయల పెన్షన్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది కూడా దేశంలో ఎక్కడా లేదు. కీలమైన ఈ రెండు పథకాలు అమలయితే, తెలంగాణ గడ్డపై  రైతు ఆత్మహత్యలు ఎక్కడా కనిపించవు.

ప్రతి పంటకూ మద్దతు ధర.. ఉచిత కార్పొరేట్ వైద్యం?

అలాగే ప్రతిపంటకు మద్దతుధర ఇవ్వాలని, ప్రభుత్వమే రైతు ఉత్పత్తులను మార్కెటింగ్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. రైతు తన పండించిన పంటను, పొలం నుంచి మార్కెట్‌యార్డు వరకూ తీసుకువెళ్లేందుకు అదనంగా  ఖర్చుతోంది. దీనివల్ల రైతు మరింత ఇబ్బందిపడకుండా ఉండేందుకు, ఇకపై పొలం నుంచి పంటను ప్రభుత్వ ఖర్చుతోనే యార్డుకు తరలించాలని, కేసీఆర్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఇక రైతు పిల్లలకు పీజీ వరకూ ఉచిత కార్పొరేట్ విద్య, రైతులకు ఉచిత కార్పొరేట్ వైద్యం, పిల్లలను మినహాయించి రైతుల వరకూ ఉచిత బస్సు ప్రయాణం, గేదెలకు ఉచితంగా గడ్డి సరఫరా చేసేందుకు కేసీఆర్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇవన్నీ అమలయితే.. మొత్తం భారతదేశానికే  తెలంగాణ రైతు, ధాన్యం అందించగలరన్న ధీమా వ్యక్తమవుతోంది. ఈ పథకాల వల్ల ఖజానాపై ఆర్ధిక భారం పడినప్పటికీ, ప్రపంచానికే వ్యవసాయ దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలిచిపోవాలన్న, కేసీఆర్ జీవితలక్ష్యం  నెరవేరుతుందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.