పాలకులకు నిబంధనలు పట్టవా?

679

కొండపోచమ్మసాగర్ ప్రారంభోత్సవంలో కోవిడ్ నిబందనలేవీ?
తెరాస నేతలకు భౌతికదూరం, మాస్కుల నిబంధనలు పట్టవా?
ఆలయాలు మూసేస్తే యాగాలెలా చేస్తారు?
బీజేపీ, కాంగ్రెస్ నేతల విమర్శ
(మార్తి సుబ్రహ్మణ్యం)

దేశవ్యాప్తంగా కోవిడ్-19 నిబంధనలు అమలవుతుంటే, తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వమే వాటిని ఉల్లంఘించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్న కార్యక్రమమే, లాక్‌డౌన్ ఉల్లంఘనకు వేదికయిన వైనంపై బీజేపీ,కాంగ్రెస్ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. చావుకు 50, పెళ్లికి 20 మంది మాత్రమే ఉండాలని స్వయంగా చెప్పిన కే సీఆర్ కార్యక్రమానికి ఏకంగా 1500 మంది మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా ఎలా పాల్గొన్నారని అటు నెటిజన్లు కూడా ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.

కొండపోచమ్మలో కోవిడ్ నిబంధనల ఉల్లంఘన

కొండపోచమ్మసాగర్‌ను ప్రారంభించిన సందర్భంలో పాలకులే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని కాంగ్రెస్,బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. సోషల్‌మీడియా వేదికగా తెరాస వ్యతిరేకవర్గాలు కూడా దీనిపై ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నాయి. ఆ కార్యక్రమానికి హాజరయిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, తెరాస నేతలు సామాజిక దూరం పాటించలేదని, దీన్నిబట్టి ఈ ప్రభుత్వ కార్యక్రమం ప్రజలకు ఏం సంకేతం ఇస్తోందని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని దేవాలయాల్లో భక్తులకు ప్రవేశం, ప్రత్యేకపూజలు లేవు. అర్చకులు మాత్రమే దేవుడికి అర్చన చేసి వెళుతుంటే.. కేసీఆర్ బృందం మాత్రం కొండపోచమ్మ ఆలయంలో సుదర్శనయాగం, నవచండీయాగం నిర్వహించారు. ఆ కార్యక్రమానికి హాజరైన త్రిదండి చినజీయర్‌స్వామి ఆశీస్సుల కోసం భక్తులు భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు లేకుండా తోసుకోవడంపై రెండు పార్టీల నేతలు ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. అక్కడికి వచ్చిన పోలీసు అధికారులు, లాక్‌డౌన్ నిబంధనలకు అమలుచేయకుండా ప్రేక్షకపాత్ర పోషించారంటూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు.

మాస్కులు లేని పౌరులకు వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తున్న పోలీసులు, కొండపోచ మ్మసాగర్ కార్యక్రమానికి మాస్కులు లేకుండా వచ్చిన తెరాస నేతలపై ఎందుకు జరిమానాలు విధించలేదన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. రాజకీయపార్టీలు నిత్యవసర వస్తువులు పంపిణీ చేసే సమయంలో భౌతిక దూరం పాటించలేదంటూ నేతలపై కేసులు నమోదు చేస్తున్న పోలీసులు, కొండపోచమ్మసాగర్ కార్యక్రమానికి హాజరయిన తెరాస నేతలు భౌతికదూరం పాటించకపోయినా వారిపై ఎందుకు కేసులు నమూదు చేయలేదని కాంగ్రెస్-బీజేపీ నేతలు నిలదీస్తున్నారు.

కేసీఆర్ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారు: ఎమ్మెల్సీ రాంచందర్

కొండపోచమ్మసాగర్ కార్యకమ్రంలో స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆరే కోవిడ్  నిబంధనలు ఉల్లంఘించడం దారణమని బీజేపీ హైదరాబాద్ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు వ్యాఖ్యానించారు. తాము ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదని, అయితే ప్రారంభోత్సవాల పేరుతో జరిగే ఉల్లంఘనలకే వ్యతిరేకమని స్పష్టం చేశారు. ‘మేం నగరంలో అనేక చోట్ల పేదవారికి మోదీ కి ట్లు పంపిణీ చేస్తే,  భౌతిక దూరం పాటించలే దని పోలీసులు మాపై కేసులు నమోదు చేశారు. కరోనా సమయంలో దీనిని రాజకీయం చేయడం ఇష్టం లేక దానిపై మేమేం మాట్లాడలేదు. మాస్కులు లేవని చాలామందిపై పెనాల్టీలు వేస్తున్నారు. మరి కొండపోచమ్మసాగర్ కార్యక్రమంలో సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ నాయకులు మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించలేదని టీవీలలో చూశాం. రాష్ట్రంలో గుళ్లన్నీ మూసేశారు. కానీ కేసీఆర్ కోసం కొండపోచమ్మ ఆలయం మాత్రం తెరిచి యాగం చేశారు. మరి మిగతా భక్తులకు అలాంటి అవకాశం ఎందుకు కల్పించడం లేదు’ అని రాంచందర్‌రావు ప్రశ్నించారు.

సీఎం ఏం సంకేతం ఇస్తున్నారు? ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి

రాష్ట్రంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న సమయంలో.. సీఎం కేసీఆర్ నిర్వహించిన సుదర్శనయాగంలో వేలాదిమంది మాస్కులు లేకుండా, భౌతికదూరం పాటించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొనడం బట్టి.. ప్రజలకు సీఎం కేసీఆర్ ఏమి సంకేతాలిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి  తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. కోవిడ్ నిబంధనలు పాటించని కేసీఆర్, మంత్రులు, ఎమ్మెల్యేలపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ఆ కార్యక్రమంలో మాస్కులు లేకుండా పాల్గొన్న ఎంతమందిపై, పోలీసులు జరిమానాలు విధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవైపు ప్రజలు మాస్కులు కట్టుకోవాలని, దూరం పాటించాలని చెబుతున్న ముఖ్యమంత్రే, దానిని ఉల్లంఘిస్తే ప్రజలకు ఆయన ఇక ఏం నీతులు చెబుతారని ప్రశ్నించారు. మంత్రులు, తెరాస ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొనే ఏ కార్యక్రమాల్లోనూ కోవిడ్ నిబంధనలు పాటించ క పోయినా, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.