మనస్తాపంతో మహిళా ఐఏఎస్ రమామణి మృతి
పోస్టింగు ఇవ్వకపోవడమే ఆమె చావుకు కారణమా?
జగన్ సర్కారు, ప్రవీణ్‌ప్రకాష్ కారణమన్న ఆరోపణలు
అధికారులకు పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తారా?
జగన్ సర్కారులో పోస్టింగులు లేని అధికారులకు మరణమే శరణమా?
ఏబీవీ, కోయప్రవీణ్, రాజమౌళికి పోస్టింగులివ్వరా?
ప్రభుత్వంలో అంతా ‘రెడ్డి’ కార్పెట్టేనా అంటున్న బ్రాహ్మణ సంఘాలు  
ప్రవీణ్‌పై చర్య తీసుకోవాలన్న బీజేపీ నేత రఘురాం
సర్కారుపై టీడీపీ బ్రాహ్మణ నేతల ఫైర్
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఒక మహిళా అధికారి జగన్మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో సహనిందితురాలయి  జైలుపాలయ్యారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆమెను, తెలంగాణ నుంచి ఏపీకి తీసుకురావాలని అన్న సర్కారు శతవిధాలా ప్రయత్నించింది. ఇంకా ఆమె ఢిల్లీ చూరుపట్టుకునే వేళ్లాడుతూనే కనిపిస్తుంటారు. జగనన్న ఢిల్లీకి వచ్చినప్పుడల్లా, ఆయన చుట్టూ ప్రదక్షణలు చేస్తూ దర్శనమిస్తారు. విజయసాయి పక్కన ప్రత్యక్షమవుతుంటారు. జైలుకు వెళ్లిన ఆమెను ఎలాగైనా తన కొలువులో చేర్చుకునేందుకు, జగనన్న సర్కారు చూపిస్తున్న శ్రద్ధ ఇది! ఏపీలోనే ఎలాంటి ఆరోపణలు లేకుండా పనిచేస్తున్న, మరో మహిళా ఐఏఎస్‌కు మాత్రం పోస్టింగ్ ఇవ్వకుండా అవమానించిన వైనం. దానితో మనస్తాపానికి గురయిన ఆమె ఆ అవమానాన్ని గుండెల్లో దాచుకుని, చివరకు అశువులు బాసిన విషాద ఘటన!! ఈ రెండు సంఘటనలు అధికారుల పట్ల పాలకుల వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. ఇక చదవండి..

పోస్టింగు ఇవ్వకపోవడమే రమామణి మృతికి కారణమా?

పి.కె.రమామణి. ఏపీలో కమర్షియల్ టాక్స్ శాఖలో కార్యదర్శి. ముక్కుసూటి  అధికారి, నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తారన్న పేరున్న ఐఏఎస్ అధికారిణి. అలాంటి అధికారి ఆకస్మికంగా మృతి చెందారు. అలాగని ఆమెకెలాంటి అనారోగ్య సమస్యలూ లేవు. పోస్టింగు ఇవ్వకుండా వేధిస్తున్నారన్న మానసిక వేదన తప్ప! అవును జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఆమెపై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, అకారణంగా పోస్టింగు ఇవ్వకుండా వెయిటింగ్‌లో పెట్టింది. దానితో ఆమె మానసికంగా కుంగిపోయారు. ప్రభుత్వం తనకు ఎందుకు అకారణంగా ఎందుకు ఇలాంటి శిక్ష విధించిందని తలచుకుని కుమిలిపోయారు. గుంటూరులోని తన బంధువుల నివాసంలోనే గడుపుతున్న ఆమె, ఆ మనోవేదనతోనే హటాత్తుగా మృతి చెందారు. ఈ వార్త ఐఏఎస్ వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. జగన్ సర్కారులో పోస్టింగులు లేని అధికారులు, మానసిక వేదనతో ఏవిధంగా మరణవేదన అనుభవిస్తున్నారో ఈ ఘటన అద్దం పట్టింది.

అంతా ఆయనే చేస్తున్నారు…

రమామణి  గురించి కమర్షియల్ శాఖలో ఎవరినడిగినా ఆమ్మో.. ఆ మేడమా? అంటారు. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారని చెబుతారు. హెడ్‌స్ట్రాంగ్ అని ఇంకొందరంటారు. మరి అలాంటి అధికారిని ప్రభుత్వం అసలు ఎందుకు బదిలీ చేసింది? పోనీ ఆమెపై ఏమైనా ఆరోపణలున్నాయా అంటే అదీ లేదు. విధినిర్వహణలో తప్పుచేసినట్లు చిన్నపాటి మచ్చ కూడా లేదు. ఆమె చేసిన నేరం, పాపం ఏమిటంటే.. సీఎంఓలో ఒక అధికారి తన పేషీ ఖర్చులకు, తనకు కావలసిన వారికి ఆమె శాఖ నుంచి కార్లు పంపించకపోవడమేనట. కుదరదన్నందుకు సదరు అధికారి.. సాయంత్రం కల్లా ఆమెకు ఎలాంటి పోస్టింగు లేకుండా వెయిటింగ్‌లో పెట్టేశారన్నది వస్తున్న ఆరోపణ. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అంత ఉన్నత స్థాయి అధికారినే మార్చేసిన ఆ ఘనుడికి, ఓ సామాన్య ఐఏఎస్.. అందునా ఓ మహిళను మార్చేయడం పెద్ద లెక్కకాదన్నది అధికార వర్గాల వ్యాఖ్య. ఆ ఉత్తరాది అధికారి దూకుడుతో ఇచ్చిన అనేక ఉత్తర్వులతో.. ఇప్పటికే ప్రభుత్వం అప్రతిష్ఠపాలవగా, సీఎస్‌ైలు కోర్టు మెట్లు ఎక్కి, కోర్టుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు ఆయన చలవ వల్ల, అధికారులు మనస్తాపంతో చనిపోవలసి వస్తోందన్న వ్యాఖ్యలు అధికార వర్గాల్లో వినిపిస్తున్నాయి.

రమామణి మృతి దేనికి సంకేతం?

తనకు పోస్టింగు లేదన్న మానసిక వేదన, మనస్తాపంతో మృతి చెందిన రమామణి వ్యవహారంపై ఇప్పుడు చర్చ మొదలయింది. ఆమె మృతికి జగన్మోహన్ ప్రభుత్వం, సీఎంఓలో కీలక అధికారి ప్రవీణ్ ప్రకాష్ కారణమన్న ఆరోపణలు బహిరంగంగానే తెరపైకొచ్చాయి. ముఖ్యంగా జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఇప్పటికి ముగ్గురు బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన అధికారులను అవమానించారన్న అంశాన్ని ఆ సామాజికవర్గ నేతలు ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. దానితోపాటు కమ్మ వర్గానికి చెందిన మరికొందరు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు పోస్టింగులు లేకుండా మానసికంగా వేధిస్తున్న వైనం చర్చనీయాంశమయింది.

అప్పుడు.. రెడ్లకు పోస్టింగులివ్వలేదా?

ఈ వ్యవహారం అటు తిరిగి ఇటు.. గత ప్రభుత్వంలో రెడ్లకు మంచి పోస్టింగులు ఇవ్వలేదా? రెడ్లను ఇలాగే పోస్టింగులివ్వకుండా వెయింటింగ్‌లో ఉంచి వేధించారా? ఒకవేళ రేపు ప్రభుత్వం మారితే, ఇదే రెడ్లకు వచ్చే ప్రభుత్వం పోస్టింగులివ్వకుండా వేధిస్తే ఏమవుతుందన్న సరికొత్త చర్చ మొదలయింది. చంద్రబాబునాయుడు ఐదేళ్ల హయాంలో కమ్మ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ, రెడ్డి వర్గానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి గుర్తు చేశారు.

అజయ్‌కల్లంకు సీఎస్‌గా ఇచ్చారు కదా?

‘జవహర్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ధనుంజయరెడ్డి, రామకృష్ణారెడ్డి, వెంకట్రామిరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, సనీల్‌కుమార్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, శ్రీకంఠనాధరెడ్డి, వేణుగోపాలరెడ్డి  వంటి ఐఏఎస్, ఐపిఎస్, ఐఆర్‌ఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులకు మంచి పోస్టింగులిచ్చారు. చివరకు సీఎస్‌గా మరొకరికి అవకాశం ఇవ్వాల్సినప్పటికీ, రెండు నెలల్లో రిటైరయ్యే అజయ్‌కల్లం రెడ్డికి, ఆయన అభ్యర్ధన మేరకు ఆ పోస్టు ఇచ్చారు. అంతకుముందు ఆయనకే ఫైనాన్స్, ఎక్సైజ్, రెవిన్యూ వంటి కీలకశాఖలు ఇచ్చారు కదా? కీలమైన పంచాయితీరాజ్ శాఖను జవహర్‌రెడ్డికి ఇచ్చారు. లోకేష్ ఆయనకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. ధనుంజయరెడ్డికి కీలకమైన వ్యవసాయశాఖ కమిషనర్ ఇచ్చారు. కానీ  ఎన్నికల ముందు కలెక్టర్ పోస్టు ఇచ్చిన ధనుంజయ్‌రెడ్డిని, అక్కడ ఎక్కువకాలం ఉంచకుండా, ఎన్నికల ముందు తొలగించి త ప్పు చేసిన అదే చంద్రబాబు.. నిజాయితీపరుడైన వెంకట్రామిరెడ్డిని నాలుగేళ్లు ఒకే శాఖ అప్పగించి మంచిపనిచేశారు. మరి అదే వెంకట్రామిరెడ్డికి జగన్ ప్రభుత్వం రెరాలో ఇస్తామని చెప్పి ఇప్పటికీ ఇవ్వలేదు. ఆరకంగా సమర్ధులైన రెడ్లు ఉన్నా, ఈ ప్రభుత్వం వారిని వినియోగించుకోవడం లేద’ని ఓ ఐఏఎస్ అధికారి వాపోయారు.

బాబు కూడా అదే పనిచేసి ఉంటే..

అప్పుడు చంద్రబాబు కూడా.. ఇప్పుడు జగన్ మాదిరిగానే రెడ్డి వర్గ అధికారులకు  పోస్టింగులివ్వకుండా వెయిటింగ్‌లో పెడితే ఏం చేసేవారు? ఏం చేసేవారన్న ప్రశ్నలు తెరపైకొస్తున్నాయి. ‘సరైన వారికి సరైన పోస్టింగులివ్వడంలో ఈ ప్రభుత్వం విఫలమయింది. దీనితో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. కులం కోణంలో పోస్టింగులివ్వడం మంచి పద్ధతి కాదు. గతంలో జగన్ కమ్మవారిని విమర్శించి, ఇప్పుడు రెడ్లకు ఎక్కువ పోస్టింగులిస్తున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు, కోయప్రవీణ్, రాజమౌళి వంటి అధికారులకు పోస్టింగులివ్వకపోవడం వల్ల జగన్ ఏం సంకేతాలిస్తున్నారు? నేను వైఎస్ దగ్గర కూడా పనిచేశా. కానీ ఆయనెప్పుడూ ఈ కోణంలో చూడలేదు. జగన్ మాత్రం చాలా చిత్రంగా వ్యవహరిస్తున్నా’రని  ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

ఏడాది నుంచీ పోస్టింగులు ఏవీ?

డిజిపి స్థాయి అధికారి అయిన ఏబీ వెంకటేశ్వరరావుకు, పోస్టింగు ఇవ్వాలని హైకోర్టు చెప్పినా, ఇప్పటివరకూ దానిని అమలుచేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన కోయ ప్రవీణ్‌పై ఎలాంటి ఆరోపణలు లేకపోయినా, కేవలం కులం ముద్రతో ఇప్పటివరకూ పోస్టింగు ఇవ్వని వైనం విమర్శలకు గురవుతోంది. ఆయన గతంలో తెలంగాణలో పనిచేసినప్పటికీ, ఆయనపై ఎలాంటి ఆరోపణలు రాలేదు. రాజమౌళిదీ అదే పరిస్థితి. అయితే.. విచిత్రంగా అదే కమ్మ వర్గానికి చెందిన కృష్ణబాబు, సాయిప్రసాద్,  సురేంద్రబాబు, కాటమనేని భాస్కర్ ఇవ్వడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో అర్ధం కావడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

‘జగన్ చెప్పినట్లు పనిచేసిన వాళ్లకే మంచి పోస్టింగులు దక్కుతున్నాయి. కనీసం ప్రశ్నించకపోయినా మౌనంగా ఉండాలన్న సంకేతాలిస్తున్నారు. ఎన్నికల ముందు వైసీపీ ఎమ్మెల్యేలతో బేరసారాలాడారని సతీష్‌చంద్ర-ఏబీ వెంకటేశ్వరరావుపై  జగన్, విజయసాయిరెడ్డి సహా వైసీపీ లీడర్లంతా ఆరోపించారు. మరి అదే సతీష్‌చంద్రకు కీలకమైన పోస్టింగు ఇచ్చిన జగన్, ఆయనతోపాటు అదే ఆరోపణ ఎదుర్కొన్న ఏబీ వెంకటేశ్వరరావును మాత్రం సస్పెండ్ చేశారు. అంటే దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మీరే ఊహించుకోండని’ ఒక ఏఐఎస్ అధికారి వ్యాఖ్యానించారు.

ప్రవీణ్‌ప్రకాష్ మానసిక క్షోభ పెట్టారు: బీజేపీ నేత రఘరాం

ఐఏఎస్ రమామణి మృతిపై ప్రభుత్వం విచారణ చేయాలని ఢిల్లీలో బీజేపీ అధికార ప్రతినిధి పురిఘళ్ల రఘురాం డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నారు.  ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ప్రవీణ్‌ప్రకాష్, రమామణిని మానసికంగా వేధించినట్లు తెలుస్తోంది. కమర్షియల్ టాక్స్ కమిషన్ పియూష్‌కుమార్ కూడా ఆమెను వేధించారని ఆరోపించారు. ఒక నిజాయితీగల అధికారికి నెలల తరబడి పోస్టింగులు ఇవ్వకుండా మానసికంగా వేధిస్తున్నారు. ‘అనంతపురం జెసిగా పనిచేసిన రమామణి నిజాయితీ గురించి ఆ జిల్లా మంత్రికీ తెలుసు. సీఎంకు తెలియకుండా ప్రవీణ్‌ప్రకాష్ పోస్టింగులు ఇస్తున్నారంటున్నారు. రమామణిని మానసికక్షోభకు గురిచేశారని ఆమె బంధువులు చెబుతున్నారు.  ప్రభుత్వం వెంటనే ప్రవీణ్‌ప్రకాష్‌పై చర్యలు తీసుకోవాల’ని రఘురాం డిమాండ్ చేశారు.

హవ్వ.. ఇంత కులపిచ్చేంటి: శ్రీధర్‌శర్మ

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో కులపిచ్చి అడుగడుగునా కనిపిస్తోందని, రెడ్డేతర వర్గాలను అణచివేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను, ఆయా వర్గాలు రోడ్డెక్కి వ్యతిరేకించాలని బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. దీన్నిబట్టి.. రెడ్డేతర కులాలు వీటిపై ఏ స్థాయిలో ఆగ్రహంతో ఉన్నాయో స్పష్టమవుతోంది.  ప్రధానంగా సీఎస్‌గా ఉన్న ఎల్వీని అవమానకర రీతిలో పంపించిన, సీఎంఓలోని ఉత్తరాది అధికారిని ప్రోత్సహించిన పెద్దలు.. తాజాగా ఓ బ్రాహ్మణ ఐఏఎస్ అధికారి మృతికి కారణమయ్యారని ధ్వజమెత్తారు. పోస్టింగులు-వేధింపుల  విషయంలో వైఎస్ హయాంలో కూడా ఇంత కులపిచ్చ కనిపించలేదని ఆయన మండిపడ్డారు. ఐఏఎస్ రమామణి మృతిపై విచారణ జరిపి, ఆమె మానసిక ఒత్తిళ్లకు కారణమయిన ఉత్తరాది అధికారిని శిక్షించాలని డిమాండ్ చేశారు.

ఆ ముగ్గురినీ అవమానించిన జగన్ ప్రభుత్వం..

సీఎస్‌గా ఉన్న ఎల్వీ సుబ్రమణ్యంను అర్ధంతరంగా ఆ పదవి నుంచి తప్పిస్తే, మరో సీనియర్ ఐఏఎస్ అధికారి జేఎస్వీ ప్రసాద్‌ను నవంబర్ నుంచి మే వరకూ పోస్టింగు, జీతం ఇవ్వకుండా వేధించారని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు రమామణిని మహిళ అని కూడా చూడకుండా వెయిటింగ్‌లో ఉంచి, ఆమె మృతికి పరోక్షంగా కారణమయ్యారని బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. దీనిపై రాష్ట్రంలోని బ్రాహ్మణ సమాజం స్పందించి, జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రెడ్లకు తప్ప మిగిలిన వర్గాలకు స్థానం లేదన్న విషయాన్ని గ్రహించాలని పిలుపునిచ్చారు.

ఏమిటీ ‘రెడ్డి’ కార్పెట్?

‘సలహాదారులు, ఐఏఎస్, ఐపిఎస్, యూనివర్శిటీల నుంచి అన్ని  నియామకాల్లో అంతా రెడ్లే కనిపిస్తున్నారు. పత్రికలు తిరగేస్తే ఎవరో ఒక రెడ్డిని ఒక కార్పొరేషన్ చైర్మన్‌గా నియమిస్తున్నట్లు కనిపిస్తోంది. తమ అడుగులకు మడుగులొత్తే వారినే, జగన్మోహన్‌రెడ్డి ఆయా పదవుల్లో నియమించుకుంటున్నారు. ముగ్గురు బ్రాహ్మణ ఐఏఎస్‌లను అవమానకర రీతిలో బయటకు పంపించి, పోస్టింగులు లేకుండా వేధిస్తున్న జగన్మోహన్‌రెడ్డి కులపిచ్చను గ్రహించి, ఇప్పటికయినా బ్రాహ్మణులు కళ్లు తెరవాల’ని శ్రీధర్‌శర్మ పిలుపునిచ్చారు.

ఐఏఎస్-ఐపిఎస్  సంఘాలకు నోరు లేదా..?


ఒక ఐఏఎస్ అధికారిణి తనకు పోస్టింగు ఇవ్వలేదన్న మానసిక ఆవేదనతో మృతి చెందిన వైనం, ఐఏఎస్ సంఘానికి కనువిప్పు కావాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. తమ సహచరులకు ప్రభుత్వం పోస్టింగులు ఇవ్వకుండా అన్యాయం చేస్తుంటే, సీఎస్ వద్దకు వెళ్లి కనీసం నిరసన చెప్పే ధైర్యం కూడా లేకపోతే ఇక సంఘాలు పెట్టుకుని ఎందుకన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ సహచర ఐపిఎస్‌లకు పోస్టింగులు ఇవ్వకుండా అవమానిస్తుంటే ఐపిఎస్ సంఘం కూడా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఐఏఎస్-ఐపిఎస్‌లు ప్రభుత్వానికి కళ్లు చెవులు. మరి అలాంటి ప్రధాన అంగాలకే దిక్కులేకపోతే, వారికి ప్రాతినిధ్యం వహించే ఈ సంఘాలు ఎందుకు? మారోజుల్లో ఐఏఎస్‌లకు అన్యాయం జరిగితే ధైర్యంగా సీఎస్‌కు వద్దకు వెళ్లి నచ్చచెబితే, వారు వినేవాళ్లు. అవసరమైతే సీఎం దగ్గరకు వెళ్లి విషయం వివరిస్తే వాళ్లూ వినేవాళ్లు. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడు ఈ సంఘాలు, సభ్యులు ఏదైనా పార్టీల్లోనే మాట్లాడుకుంటున్నార’ని ఐఏఎస్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసిన ఓ రిటైర్డ్ అధికారి  వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి.. ఐఏఎస్ సంఘం పనిచేస్తోందా? పడకేసిందా?

ఆమె మృతికి సర్కారుదే బాధ్యత: ఆనందసూర్య

రమామణి మృతికి జగన్ సర్కారుదే పరోక్ష బాధ్యత అని బ్రాహ్మణకార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆనందసూర్య స్పష్టం చేశారు.  పోస్టింగు ఇవ్వకుండా ఆమె చావుకు పరోక్ష కారణమయిందన్నారు.  వైఎస్, జగన్ అధికారంలో ఉన్నప్పుడు, ఆలిండియా సర్వీసు అధికారులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్ హయాంలో పనిచేసిన కొందరు అధికారులు ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత, 100 మంది అధికారులకు పోస్టింగులివ్వలేదని, డిజిపి, సీఎస్ కోర్టుముందు నిల్చున్నారని గుర్తుచేశారు.

By RJ

One thought on “పోస్టింగులు.. ఊస్టింగులతో.. చావే గతి!”
  1. […] అయితే, రమామణికి టీటీడీ జేఈఓగా వచ్చిన పోస్టింగుకు కూడా అడ్డుపడి, మరో మహిళను ఆ పోస్టులో నియమించారని కృష్ణమూర్తి మరో కొత్త విషయం వెల్లడించారు.‘రమామణి పనిచేస్తున్న వాణిజ్య శాఖ ఉన్నతాధికారి భార్య ఢిల్లీలో ఉంటారు. ఆమె కారు బిల్లులు కూడా రమామణిని చెల్లించాలని రమామణిపై ఆ ఐఏఎస్ ఒత్తిడి చేశారు. పేషీ ఖర్చులు కూడా అడిగారు. అందుకూ రమామణి ఒప్పుకోలేదు. ఏదైనా ఉంటే కాగితంపై ఇవ్వాలనేది. ఢిల్లీలోనే ఉంటున్న ఇద్దరు ఐఏఎస్‌ల భార్యల ఖర్చులకు డబ్బులు రమామణి ఎందుకు ఇవ్వాలి?  మధ్యలో ఆమె ట్రైనింగ్ కోసం ముస్సోరీ వెళ్లారు. అప్పుడు తన స్థానంలో ఒక తహశీల్దారు క్యాడర్ వ్యక్తిని ఆయన పేషీలో పెట్టుకున్నారు. ట్రైనింగ్ నుంచి తిరిగి వచ్చిన రమామణికి మాత్రం పోస్టింగు ఇవ్వలేదు. సీఎంఓలో ఉన్న ప్రవీణ్‌ప్రకాష్, ఆయన ఇద్దరూ గురుశిష్యులు. విశాఖలో ఉన్నప్పుడు కలిసే పనిచేశారు. అందుకే రమామణికి పోస్టింగు ఇవ్వకుండా అడ్డుపడ్డారు’ అని వ్యాఖ్యానించారు.ఇది కూడా చదవండి: పోస్టింగులు.. ఊస్టింగులతో.. చావే గతి! […]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner