అవును.. కమలం పువ్వు నవ్వింది!

290

జగన్మోహనపాలన జనరంజకమే
వైసీపీతో బీజేపీ సంబంధాలు బ్రహ్మాండమట
మోదీ-జగన్ కలసే పనిచేస్తున్నారు
‘వారణాసి’ కితాబు.. జగన్‌కు మతాబు
మరి జగనన్న సర్కారుపై కమలదళం కేకలెందుకు?
మత మార్పిళ్ల ఆరోపణలన్నీ ఉత్తిదేనా?
కమలదళాన్ని ఖంగుతినింపించిన ‘రామ’బాణం
రాంమాధవ్ వ్యాఖ్యలతో వైసీపీ కళకళ.. కమలం వెలవెల
పదినెలలకే పదాలు మార్చిన రాంమాధవ్
తర్వాత మసిపూసిమారేడు కాయ చేశారని వివరణ
(మార్తి సుబ్రహ్మణ్యం)

‘రాష్ట్రంలో ప్రజల పరిస్థితి పొయ్యి నుంచి పెనంలో పడినట్టయింది. జగన్‌ను గెలిపించి తప్పుచేశామని ప్రజలు బాధపడుతున్నారు. టీడీపీ మాదిరిగానే వైసీపీ ప్రభుత్వం కూడా అవినీతి, బంధుప్రీతితో పాలన సాగిస్తోంది.
‘రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలన అవినీతిమయం. ఏం అభివృద్ధి సాధించారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు?  చంద్రబాబు సర్కారు దారిలోనే జగన్ నడుస్తున్నారు’
‘జగన్ ప్రభుత్వంలో ఇసుక, లిక్కర్ కుంభకోణం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఇసుక పాలసీ వల్ల వేలాదిమంది కూలీలు రోడ్డునపడ్డారు. వైసీపీ నేతలు మా పార్టీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. మా పార్టీకి చెందిన వారి రేషన్‌షాపులు తొలగిస్తున్నారు’
‘రాష్ట్రంలో మత మార్పిళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మతమార్పిళ్లు జరుగుతున్నాయి.  దేవతా విగ్రహాలు కూల్చిన వారిని పోలీసులే రక్షిస్తున్నారు’
‘దేవాలయ భూముల అమ్మకాలతో, జగన్ సర్కారు దేవుడిని వ్యాపారవస్తువు చేసింది. మా ఆందోళనతోనే ప్రభుత్వం, టీటీడీ భూముల అమ్మకాల నిలిపివేత జీఓ ఇచ్చింది’
– ఇవన్నీ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ.. అధికార వైసీపీపై చేసిన ఆరోపణలనుకుంటే కచ్చితంగా తప్పులో కాలేసినట్లే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఏపీ నాయకత్వం,  సీఎం జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వంపై గత ఏడాది నుంచి నిన్నటి వరకూ సంధించిన ఆరోపణాస్త్రాలు.

గల్లీలో ఇలా.. ఢిల్లీలో అలా..

అయితే.. వారణాసి రాంమాధవ్.. అదేనండీ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. పదహారణాల తెలుగాయన. ఆయన మాత్రం.. ఇప్పటిదాకా ఏపీ బీజేపీ నేతలు ఏకగళంతో, ఏ సీఎం జగన్మోహన్‌రెడ్డి పాలనకయితే వ్యతిరేకంగా కత్తులు నూరుతున్నారో.. అదే జగన్మోహన్‌రెడ్డి ఏడాది పాలన అద్భుతం- అపురూపం- అనిర్వచనీయం- అనన్యసామాన్యమని ఆకాశానికెత్తేస్తున్నారు. అసలు వైసీపీతో మాకు కొట్లాట పంచాయతీలేమీ లేవన్నారు. మోదీ-జగన్ అపూర్వ సహోదరులని తేల్చేశారు. అదేంటి? మరి గల్లీ నేతలు తమ రాష్ట్ర పాలకుడిని రావణుడంటుంటే, ఢిల్లీ నేత మాత్రం రాముడంటారేమిటని బుర్రగోక్కుంటున్నారా? మరి ఇంతోటి దానికి ఉపవాస దీక్షలు, ఉద్యమాలు, బాధితుల కోసం భిక్షాటనలు, అరెస్టులు, గవర్నర్‌కు ఫిర్యాదులు ఏమిటని అర్ధం కాక గుటకలు మింగుతున్నారా? మరదే.. బీజేపీ అంటే! రాష్ట్ర నాయకులు ఒకటి చెబితే, ఢిల్లీ నేతలు ఇంకోటి చెబుతారు. ఇద్దరూ కలసి ఏదీ చెప్పరు. ఈలోగా ఎవరి మాట నిజమని.. ఉన్న ఆ పది మంది కార్యకర్తలు చొక్కాలు చించుకోవాల్సిందే. ఇలాంటి చిత్ర విచిత్రమే ఇది.. చదవండి.

వారణాసి వారి మాటలకు అర్ధాలు వేరులే..

జగన్ అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లో ఆయన పాలనపై విరుచుకుపడి, ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడిందని, అవినీతి-బంధుప్రీతిపాలన సాగుతోందని విరుచుకుపడిన  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వారణాసి రాంమాధవ్ ఇప్పుడు అదే జగన్‌ను, ఆయన పాలనను ప్రశంసలతో ముంచెత్తడం కమలదళాలను అయోమయానికి గురిచేసింది.  సీఎం జగన్మోహన్‌రెడ్డి, ఏపీని అభివృద్ధిపథంలోకి తీసుకువెళ్లేందుకు ధృడసంకల్పంతో పనిచేస్తున్నారని కితాబు ఇచ్చారు. మోదీ-జగన్‌కు సత్సంబంధాలున్నాయి. కేంద్రరాష్ట్రాల మధ్య ఎలాంటి ఒడిదుడుకులు లేవన్నారు.   ‘అక్కడక్కడా కొన్ని వివాదాలున్నా అవి పెద్దవేం కాదు. అన్నిటికీ సీఎం జగన్‌ను తప్పుపట్టడం సరికాదు. దేవాలయాల  ఆస్తుల విషయంలో పీఠాథిపతుల కమిటీ ద్వారా, నిర్ణయం తీసుకుంటామని సీఎం నిర్ణయించడం సంతోషకరం. మోదీ తీసుకుంటున్న అన్ని మంచి నిర్ణయాలను జగన్ పార్టీ మద్దతునివ్వడాన్ని స్వాగతిస్తున్నాం. పార్లమెంటులో నిర్ణయాలకు వైసీపీ నుంచి మద్దతు లభిస్తోంది. ఏపీ ప్రజల అభివృద్ధి కోసం మోదీ-జగన్ కలసి పనిచేస్తున్నార ని’ రాంమాధవ్.. సీఎం జగన్మోహన్‌రెడ్డిని ప్రస్తుతించారు. ఆయనకు ఏడాది పాలనా శుభాకాంక్షలు కూడా చెప్పారు.

నాడు ‘వారణాసి’ వారు జగన్‌పై సంధించిన ‘రామ’బాణాలివే..

జగన్ ఏడాది పాలన సందర్భంగా ఆయనను ప్రశంసలతో ముంచెత్తిన ఇదే తమ పార్టీ నేత రాంమాధవ్,  పది నెలల క్రితం ఏం మాట్లాడారన్న విషయాన్ని కమలదళాలు గుర్తు చేస్తున్నాయి. అప్పుడు జగన్ పాలనపై విమర్శల బాణం వేసిన ఆయన, ఇప్పుడు పూలబాణం వేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. దీనితో ఆయనకు ఉన్న ప్రత్యేక గుర్తింపు, సాధారణ రాజకీయనేతగా వ్యవహరించరన్న ప్రతిష్ఠ  చెరిగిపోయిందంటున్నారు.

పదినెలల క్రితం ఆయన ఏమన్నారంటే.. ‘అధికారంలోకి వచ్చిన కొద్ది గంటల్లోనే  జగన్ ప్రభుత్వం తప్పటడుగులు వేస్తోంది. దాని వైఖరి వల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతోంది. ఏపీ ప్రజలు భయపడేరోజులు వచ్చినట్లు ఆందోళన కలుగుతోంది. నెలరోజులయింది.  తాము తప్పుచేశామా అని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. ప్రజల పరిస్థితి పెనం నుంచి పొయ్యిలో పడినట్టయింది. అధికారం చేపట్టిన నెలరోజుల్లోనే చూస్తున్నాం ముఖఘ్యమంత్రి గారి వీరంగం. ప్రజలు ైవె సీపీ కంటే టీడీపీ పాలనే బాగుందనుకునే  పరిస్థితి తెచ్చారు.  టీడీపీ బంధుప్రీతి,అవినీతికి మారుపేరయింది. ఇప్పుడు వైసీపీ కూడా అలాగే తయారవుతోంది. కేవలం 2 నెలల్లో జగన్ ఒక విఫల సీఎంగా పేరు తెచ్చుకున్నారు. ఆయన చెప్పే నీతిమాటలకు, చేతలకు ఎక్కడా పొంతన లేదు. వైఎస్ ఎప్పుడూ జగన్‌లా ప్రవర్తించలేదు. పోలీసు పాలన చేయలేదు. గ్రామవాలంటీర్ల ద్వారా గ్రామాల్లో అరాచకాలు జరిగే ప్రమాదం ఉంద’ని 2019 జులైన, తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పార్టీ సభ్యత్వ కార్యక్రమంలో రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.

గాంధీజీ స్మరణ సాక్షిగా జగన్‌పై జంగ్

‘త్వరలో ఏపీలో విధ్వంసాలు జరగబోతున్నాయి. ఇసుక కోసం ఏపీలో ప్రజలు ధర్నాలు చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. రాష్ట్రంలో ప్రవేశపెట్టే కొత్త పథకాలు కుంభకోణాలకు దారితీసేలా ఉన్నాయి’ అని ఏలూరులో జరిగిన గాంధీజీ సంకల్పయాత్ర ముగింపు సందర్భంగా రాంమాధవ్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు.

సాక్షి అలా చేసిందని.. తర్వాత వివరణ

వైసీపీ అధికార మీడియా సాక్షిలో జగన్‌నుద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై గందరగోళం రేపడంతో రాంమాధవ్ మరుసటిరోజు వివరణ ఇచ్చారు. తాను అనేక విమర్శలు చేశానంటూ వాటి వివరాలు నోట్ రూపంలో వెల్లడించారు. దానిపై టీవీ5లో జరిగిన చర్చలో పాల్గొన్న ఆ పార్టీ నేత లంకా దినకర్.. సాక్షి చానెల్ రాంమాధవ్ పూర్తి ఇంటర్వ్యూను ప్రసారం చే యకుండా, జగన్ గురించి తనకు కావలసినవి మాత్రమే ప్రసారం చేసిందని దుయ్యబట్టారు. అంతే తప్ప జగన్ గురించి రాంమాధవ్ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని మాత్రం చెప్పకపోవడం గమనార్హం. రాజకీయ పార్టీకి అనుబంధంగా ఉన్న చానెల్ తమ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తుందన్న విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించకపోవడమే ఆశ్చర్యం. సాక్షి వైసీపీ అధికార మీడియా అని తెలిసిన సీనియర్ నేత రాంమాధవ్ తన ఇంటర్వ్యూలో జగన్ పొగిడితే, దాని పరిణామాలు ఎలా ఉంటాయో ఊహించుకోకపోవడమే ఆశ్చర్యమంటున్నారు.  సాక్షి చానెల్  రాంమాధవ్‌తో చేసిన ఇంటర్వ్యూలో .. సీఎం జగన్ పాలనపై చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. అది పీకల్లోతు సమస్యల్లో ఉన్న వైసీపీకి.. ఎడారిలో ఒయాసిస్సులా పరిణమించిందన్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

సర్కారుపై కమలం సమర సమయంలో..

‘వారణాసి’ వారి  ‘రామ’ బాణం.. వైసీపీ శిబిరంలో పువ్వులు పూయించగా, కమలం తోటను అయోమయంలో పడేసింది. రాంమాధవ్ సంధించిన జగన్మోహనాస్త్రం నుంచి, కమలదళాలు ఇంకా కోలుకున్నట్లు లేదు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలని, నిమ్మగడ్డ రమేష్‌ను తొలగించడాని వీల్లేదని ఏపీ బీజేపీ ఉద్యమం చేసింది. స్థానిక ఎన్నికల్లో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రోత్సాహంతోనే మతమార్పిళ్లు జరుగుతున్నాయని ధర్నాలు చేసింది.  ఆలయ ఆస్తులు కాపాడాలని ఆందోళన నిర్వహించింది. కౌన్సిల్ రద్దును ఖండించింది. విశాఖకు రాజధానిగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటోంది. తాజాగా ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్ట రమేష్ తొలగింపు వ్యవహారంలో.. బీజేపీ చీఫ్ నద్దా అనుమతితోనే మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్,  జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ వేసింది. సుమారు 65 కేసుల్లో రాష్ట్ర హైకోర్టు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులివ్వడం బట్టి, జగన్మోహన్‌రెడ్డి ప్రజావ్యతిరేక నిర్ణయాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్ధమవుతోందని బీజేపీ నేతలు చానెళ్ల చర్చల్లో విరుచుకుపడుతున్నారు.

ఢిల్లీ నేతలు కేంద్ర పార్టీ కంట్రోల్‌లో లేరా?..


ఈ విధంగా ఓవైపు తాము జగన్మోహన్‌రెడ్డి సర్కారుతో పోరాడుతున్న సమయంలో, తమ పార్టీకే చెందిన రాంమాధవ్.. తమ పోరాటాన్ని అవమానించేలా, ఉద్యమాలపై నీళ్లు చల్లేలా సీఎంను ఆకాశానికెత్తడంపై కమల దళాలు కారాలు మిరియాలు నూరుతున్నారు. మరికొందరు నాయకులు మాత్రం తాము ఎవరి ఆదేశాలు అమలుచేయాలో, ఎవరిని అనుసరించాలో అర్ధం కావడం లేదని తలపట్టుకుంటున్నారు. ‘కేంద్ర నాయకత్వానికి జగన్ ప్రభుత్వంపై అలాంటి సానుకూల వైఖరి ఉన్నప్పుడు మాతో ఈ ధర్నాలు, ఆందోళనలు, విమర్శలు చేయించడం ఎందుకు? మోదీ-జగన్ కలసి పనిచేస్తున్నప్పుడు మేం జగన్ సర్కారుపై విమర్శలు చేస్తుంటే, వద్దని ఎందుకు చెప్పలేదు? దీనివల్ల మా పార్టీ తమను తప్పుదోవపట్టిస్తోందని క్యాడర్ ఫీలవదా? ఇక భవిష్యత్తులో మా రాష్ట్ర పార్టీ, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయాలని  ఇచ్చే పిలుపును పాటించాలా? వద్దా? అన్న గందరగోళం క్యాడర్‌కు రాదా? రాజధానిపై ఒక నాయకుడు తాను చెప్పిందే ఫైనల్ అంటారు. మరొక నాయకుడేమో నేను పార్టీని అడిగే చెబుతున్నా. రాజధాని అంగుళం కూడా కదలదంటారు. ఇందులో ఎవరి మాటలు నిజమని నమ్మాలి? ఈవిధంగా ఎవరికి తోచినట్లు మాట్లాడుతున్న  నాయకులను నియంత్రించకపోతే ఇక కేంద్ర నాయకత్వం ఉండి ఏం చేస్తున్నట్లు’ అని ఓ సీనియర్ నేత అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, రాంమాధవ్‌తోపాటు రాష్ట్రానికి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు కలవగా, రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాత్రం ఇప్పటిదాకా సీఎంను కలవకపోవడం ప్రస్తావనార్హం.


జీవీఎల్ రూటే సెపరేటు..


ఎన్నికల సంఘం కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌ను తిరిగి నియమించాలన్న హైకోర్టు ఆదేశంపై, మరో బీజేపీ జాతీయ నేత, ఎంపి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్య పార్టీ శ్రేణులను విస్మయపరిచింది. ‘నిమ్మగడ్డ స్థానిక ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా, తొలగించిన తర్వాత టీడీపీకి అనుకూలంగా వ్యవహరింనట్లు కనిపించింది. నిమ్మగడ్డ రమేష్ కూడా ఏపార్టీకి అనుబంధం లేకుండా, నిష్పక్షికంగా ఎలా పనిచేయాలన్న దానిపై ఆయన కూడా గుర్తించాలి. ఎన్నికల వాయిదా ముందు వరకూ ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్లు అనుమానాలు, ఆరోపణలు వచ్చాయి. మేం ఇచ్చిన ఫిర్యాదులు పట్టించుకోలేదు. తర్వాత టీడీపీకి అనుకూలంగా మాట్లాడుతన్నారన్న అనుమానాలు, ఆధారాలు వచ్చాయి. అందువల్ల నిమ్మగడ్డ భవిష్యత్తులో అన్ని పార్టీలకూ అతీతంగా వ్యవహరిస్తే మంచిద’ని వ్యాఖ్యానించడం ద్వారా.. ఆయన నిమ్మగడ్డను విమర్శించారా? సమర్ధించారా?  అన్న సందేహం వ్యక్తమవుతోంది.