జగన్ ప్రభుత్వం రద్దు కాదు!

689

* ప్రభుత్వం పని ప్రభుత్వం చేస్తున్నది.
*హై కోర్ట్ పని హై కోర్ట్ చేస్తున్నది
*రెండింటికీ మధ్య ఘర్షణ లేదు.
*జీవోలు జారీ చేయడం ప్రభుత్వం పని.
*అవి రాజ్యాంగ బద్ధంగా ఉన్నాయో..లేవో చూడడం హైకోర్టు పని.
*కొట్టివేతలు 60 అయితే ఏంటి…360 అయితే ఏంటి…
*పస లేని పిచ్చి విశ్లేషణలు….!
*జనానికి పట్టని ప్రతిపక్షాలు…
*అందుకే…ప్రతిపక్షపోషిస్తున్న విశ్లేషకులు..!
(భోగాది వేంకట రాయుడు)
విజయవాడ:
ఒక నెల రోజులుగా సోషల్ మీడియా , యూ ట్యూబ్ వేదికలపై కొందరు అత్యుత్సాహవంతులు బాగా ప్రచారం చేస్తున్న అంశం ఒకటి ఆసక్తికరంగా ఉంది.
జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని చెప్పే హక్కు హైకోర్టుకు ఉన్నదనేది ఆ వ్యాఖ్యల, విశ్లేషణల, సారాంశం. ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 60 వరకు హై కోర్ట్ కొట్టివేసిందనేది ఈ విశ్లేషణలకు ప్రాతిపదిక. హై కోర్టు రెండు భుజాలపై రెండు ఏ కే 47 తుపాకులు పెట్టి జగన్ ప్రభుత్వాన్ని కాల్చేయాలనే తాపత్రయం ఈ వ్యాఖ్యలు..
విశ్లేషణల్లో బాగా ఎక్కువగా కనపడుతున్నది. అందుకే, ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసేహక్కు హై కోర్ట్ కు ఉన్నదంటూ విశ్లేషణలు గుప్పిస్తున్నారు.
దేశానికి స్వాతంత్యం వచ్చిన ఈ 72,73 సంవత్సరాల్లో….ఏ ఒక్క రాష్ట్రంలో కూడా…ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని…ఆ రాష్ట్ర హైకోర్టు ఎవరికీ ఇంతవరకూ సిఫారసు చేయలేదు.
మాటవరుసకు….కేవలం వాదనకోసం… జగన్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయమని హై కోర్టు కేంద్రానికి సిఫారసు చేసిందనే అనుకుందాం. తరువాత వచ్చే వారు….జారీ చేసే జీవోలు రాజ్యాంగబద్ధంగా ఉంటాయని ఎవరైనా హామీ ఇవ్వగలరా? అప్పుడు కూడా ఆ ప్రభుత్వాన్ని రద్దు చేయమని హై కోర్టు సిఫారసు చేస్తుందా? ఎవరికి చేస్తుంది? ఇలా హై కోర్ట్ ఎన్ని సార్లు సిఫారసు చేస్తుంది?
ఇప్పుడు ఆంధ్రాలో ఉన్నది …. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం.
మన శాసనసభలో 175 స్థానాలు ఉన్నాయి. మెజారిటీ కి 88 స్థానాలు చాలు. మన రాజ్యాంగం ప్రకారం…88 స్థానాలు తెచ్చుకున్న పార్టీ…175 స్థానాలూ తెచ్చుకున్నట్టే.
మెజార్టీకి ఒకటి, రెండు స్థానాలు తెచ్చుకున్న పార్టీ…సున్నా స్థానాలు తెచ్చుకున్నట్టే.పాలనలో గానీ…ప్రభుత్వ నిర్ణయాలలో గానీ ప్రతిపక్షానికి దమ్మిడీ ప్రమేయం ఉండదు.
అందువల్లనే..జగన్ ప్రభుత్వం…తనను ఎన్నుకున్న ఓటర్లను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటూ ఉండి ఉండవచ్చు. తనను అధికారంలో కూర్చోబెట్టడానికి ఎవరు కారకులో…ముఖ్యమంత్రి జగన్ కు తెలుసు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు…ఓటర్లలో 50 శాతానికి తక్కువ కాకుండా ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని తీసుకుంటూ ఉండి ఉండవచ్చు. ఆ నిర్ణయాలు..
వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేసిన వారికి గానీ; తెలుగు దేశం పార్టీకి అనుకూలంగా ఓటు వేసినవారికి గానీ రుచించక పోవచ్చు. దీనిని తప్పు పట్టలేము కూడా. ప్రభుత్వం జారీ చేసే జీవోలలో రాజ్యాంగబద్ధత లేదని భావించిన సందర్భాలలో…హై కోర్ట్ ను వారు ఆశ్రయించడం సహజమే. ఆయా పిటిషన్లను హై కోర్ట్ తన విచక్షణా పరిధిలో పరిశీలించి తీర్పులు ఇస్తుంది. ఈ తీర్పులపై సుప్రీమ్ లో అప్పీల్ చేసే హక్కు…అందరికీ ఉన్నట్టే…రాష్ట్ర ప్రభుత్వానికీ ఉంటుంది.
ఈ మొత్తం ప్రక్రియ అంతా రాజ్యాంగ బద్దం. ఈ ప్రక్రియలో…”రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు…” అనే దృక్పధమే కరెక్ట్ కాదు. 65 కాదు.365 అయినా…ప్రభుత్వాన్ని బర్త్రఫ్ చేయాలని సిఫారసు చేసే బాధ్యత హై కోర్ట్ ది కాదు.
అయితే….రాష్ట్రం లోని ప్రతిపక్షాలు…నిస్సహాయులై పోయి…ఇక హై కోర్ట్ పై భారం వేసినట్టు కనపడుతోంది. హై కోర్టే ఏదో చేయడం ఖాయమన్న భావనను విస్తృతంగా ప్రజాబాహుళ్యంలో వ్యాపింపచేయడానికి ప్రతిపక్షాలు, వాటి అనుకూల గొంతులు రేయింబవళ్లు శ్రమిస్తున్నట్టు కనపడుతున్నది. హై కోర్ట్ భుజాలపై పెట్టిన తుపాకులు పేలవు. ఎందుకంటే….ఈ తుపాకులు పెట్టవలసింది….హై కోర్ట్ భుజాలపై కాదు కాబట్టి.దాని విధులు అది చేసుకుంటూ పోతున్నది. ప్రభుత్వం…దాని పని అది చేసుకుంటూ పోతుంది.
హై కోర్ట్ ఇచ్చే తీర్పు ఏ వర్గానికి అనుకూలంగా ఉంటే…ఆ వర్గం వాళ్ళు చంకలు గుడ్డుకోవడం సహజం. ఏ వర్గమైనా… చివరకు విజయం సాధించవలసింది ప్రజా క్షేత్రం లోనే.

-భోగాది వెంకట రాయుడు