కేసీఆర్ సర్కారుకు కాలం చెల్లింది

270

గడీల్లో కూర్చుని మోదీపై విమర్శలా?
ప్రచారంతో పాలన ఎక్కువకాలం సాగదు
బీజేపీ నగర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మేకల ఫైర్

హైదరాబాద్: ప్రచారంతో పాలన సాగిస్తున్న కేసీఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లిందని బీజేపీ నగర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రామచందర్‌రావు, నగర బీజేపీ నేత మేకల సారంగపాణి ధ్వజమెత్తారు. కేవలం ప్రచారం, ప్రతిపక్షాలు-మీడియాను బెదిరిస్తూ పాలనను పడకేయించిన కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను, బీజేపీ కార్యకర్తలు ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు.
మేకల సారంగపాణి, ఆయన తనయుడైన మేకల హర్షకిరణ్ ఆధ్వర్యాన సికింద్రాబాద్ నియోజకవర్గం మెట్టుగూడ డివిజన్‌లో పేదలు, బీజేపీ కార్యకర్తలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన రామచందర్‌రావు టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలను తూర్పారపట్టారు. కరోనా కట్టడిపై మోదీ తీసుకుంటున్న చర్యలను యావత్ ప్రపంచం మెచ్చుకుంటుంటే, కేసీఆర్ మాత్రం గడీల్లో కూర్చుని  మోదీ విధానాలను విమర్శించడం, ఆయన నియంతృత్వానికి నిదర్శనమని దుయ్యబట్టారు. వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో కేసీఆర్ ప్రభుత్వం విఫలమయిందన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం-పత్రికాస్వామ్యం లేదని విరుచుకుపడ్డారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తన సొంత ఖర్చుతో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో మోదీ కిట్లు పంపిణీ చేశారని, అదే స్ఫూర్తితో మేకల సారంగపాణి-హర్షకిరణ్ కిట్లు అందించడం అభినందనీయమన్నారు.
మేకల సారంగపాణి మాట్లాడుతూ, రామచందర్‌రావు ఆధ్వర్యంలో నగరంలో బీజేపీ నేతలు లాక్‌డౌన్ సమయంలో పేదలను ఆదుకుంటున్నారని చెప్పారు. తాము కూడా కిషన్‌రెడ్డి స్ఫూర్తితోనే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నగర నేతలు గౌతంరావు, రామకృష్ణ, పి.రవిప్రసాద్‌గౌడ్, కనకట్ల హరి, భాస్కర్‌ముదిరాజ్, కన్నాభిరామ్ తదితరులు పాల్గొన్నారు.
వికలాంగులకు చేయూత..

కాగా శ్రీనివాసనగర్‌కాలనీలో ప్రముఖ సంఘసేవకుడు, వికలాంగుల సహాయకేంద్ర వ్యవస్థాపకుడు వీఆర్ శ్రీనివాస్, పలువురు వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేకల సారంగపాణి మాట్లాడుతూ, వికలాంగులకు సేవలందిస్తున్న విఆర్ శ్రీనివాస్ వల్ల, నగరంలో ఎంతోమంది వికలాంగులు లబ్థిపొందారన్నారు. నియోజకవర్గంలో వికలాంగులకు తాము మరింత సహకారం అందిస్తామని హమీ ఇచ్చారు. మోదీ ప్రభుత్వం వికలాంగులకు అనేక సౌకర్యాలు కల్పించిందని, వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మేలక హర్షకిరణ్ వికలాంగులకు మోదీ కిట్లు అందించారు. కాగా వికలాంగులకు నిత్యావసర వస్తువులు అందించిన మేకల సారంగపాణికి, వీఆర్ శ్రీనివాస్ కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పటికే తాము లాక్‌డౌన్ కాలంలో,  అనేకమంది వికలాంగులకు పలువురు దాతల సౌజన్యంతో నిత్యావసర వస్తువులు అందించామని చెప్పారు.