బీజేపీకి తొలి ఆధ్మాత్మిక విజయం!

487

భూముల అమ్మకాలపై టీటీడీ వెనుకడుగు
కన్నా సారథ్యంలో కమలదళానికి తొలి విజయం
ఫలించిన కమలం సమరం
(మార్తి సుబ్రహ్మణ్యం)

శాసనసభలో సంఖ్యాబలం లేకపోయినా.. చిత్తశుద్ధి ఉంటే చాలు. ఎలాండి  సమస్యలయినా పోరాడి  పరిష్కరించవచ్చని  ఏపీలో భారతీయ జనతా పార్టీ నిరూపించింది. ఏపీలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా లేని బీజేపీ.. టీటీడీ భూములు అమ్మేందుకు చేసిన ప్రయత్నాలకు  నిరసనగా ప్రారంభించిన పోరాటానికి..  తొలుత  ప్రభుత్వం, తర్వాత టీటీడీ పాలకమండలి వెనక్కితగ్గాల్సి వచ్చింది. ఈ పరిణామం రాజకీయంగా భాజపాలో ఆత్మస్ధ్యైర్యం నింపింది. ప్రధాన ప్రతిపక్షం చేయాల్సిన పోరాటాన్ని తాము చేసి..  అందులో విజయం సాధించడం ద్వారా, ప్రజల్లో తమ పార్టీపై నమ్మకం పెంచగలిగారు. సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో, తొలి ఆధ్మాతిక విజయం సాధించిన తీరు ఆ పార్టీ శ్రేణులలో సహజంగానే సమరోత్సాహం నింపింది.  రాష్ట్రంలోని పలు సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిపై శరపరంపరగా లేఖాస్త్రాలు సంధిస్తున్న కన్నా లేఖలకు, ఇప్పటివరకూ జగన్ నుంచి సమాధానం రాలేదు. అయితే, అత్యంత సున్నితమైన టీటీడీ వ్యవహారాన్ని కన్నా ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో, జగన్ సర్కారు చివరకు దిగిరాక తప్పలేదు.

ఆకాశానికంటిన ఆగ్రహజ్వాల..

నిరర్థక ఆస్తులుగా మారిన టీటీడీ భూములను అమ్మాలని, గత టీటీపీ ప్రభుత్వంలో చదలవాడ కృష్ణమూర్తి చైర్మన్‌గా ఉన్నప్పుడు సబ్ కమిటీ చేసిన సిఫార్సులను, ప్రస్తుత టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి సారథ్యంలోని కమిటీ దుమ్ముదులిపింది. పాత పాలక మండలి పేరుతో, దానిని అమలుచేసేందుకు చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. దేశవ్యాప్తంగా వెంకన్న భక్తులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సహా బీజేపీ నేతలంతా,  ఈ అంశంపై పోరాడుతున్న ఏపీ బీజేపీకి బాసటగా నిలిచారు. కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో, ఏపీ బీజేపీ నేతలంతా ఉపవాసదీక్షలు చేశారు. టీటీడీ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ బీజేపీ అగ్రనేతలు జీవీఎల్ నరసింహారావు, సత్యకుమార్ వంటి నేతలు కూడా ఉపవాసదీక్షలు చేశారు. అటు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు కూడా, భూముల అమ్మే ప్రయత్నాలను ఖండించారు. చివరకు వామపక్షాలు కూడా ఈ చర్యను నిరసించాయి. జనసేన, కాంగ్రెస్ కూడా ఈ చర్యను ఖండించగా, జనసేన కూడా బీజేపీ పిలుపు మేరకు ఉపవాస దీక్ష నిర్వహించింది.

దిగివచ్చిన జగన్ సర్కార్…

దీనితో జగన్ సర్కారు 888 జిఓతో ఈ వివాదానికి తెరదించింది. తాజాగా గురువారం భేటీ అయిన టీటీడీ బోర్డు కూడా.. టీటీడీ భూములు అమ్మకూడదని, టీటీడీ ఆస్తులు, కానుకలు కూడా అమ్మకూడదని నిర్ణయించింది. నిరుపయోగంగా ఉన్న భూములు కబ్జా కాకుండా కమిటీ వేయాలని తీర్మానించింది. తొలుత ఈ వివాదంపై స్పందించిన చైర్మన్ సుబ్బారెడ్డి..ఈ నిర్ణయంతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని వాదించారు. తర్వాత ప్రభుత్వమే రంగంలోకి దిగి కొత్త జీఓ విడుదల చేసింది. అసలు టీటీడీ పాలకవర్గమే కొత్త తీర్మానం చేయాల్సి ఉండగా, ప్రభుత్వం ఎలా ఉత్తర్వు ఇస్తుందన్న ప్రశ్నలు సచివాలయ అధికార వర్గాలనుంచి వినిపించాయి. ఇది కూడా చదవండి.. టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది?

కమలంలో సమరోత్సాహం..

టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారంపై పోరాటం ప్రారంభించిన బీజేపీపై, తొలుత  వైసీపీ ఎదురుదాడి చేసింది. పాత సర్కారు ఆ నిర్ణయం తీసుకున్న సమయంలో బీజేపీ నేత మంత్రిగా, మరో నేత బోర్డు సభ్యుడిగా ఉన్న విషయాన్ని తెరపైకి తెచ్చి, భాజపాను ఇరుకున పెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఆ వ్యూహం పెద్దగా ఫలించలేదు. తర్వాత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, నూజివీడు వద్ద ఆలయ భూమి కబ్జా చేశారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ చేసిన ఆరోపణలో కూడా పసలేకపోవడంతో, ఆ వ్యూహం కూడా తుస్సుమంది. చివరకు మహారాష్ట్రలో గతంలో బీజేపీ సర్కారు, ఉత్తరాఖండ్‌లో బీజేపీ ప్రభుత్వాలు.. దేవాలయాలను స్వాధీనం చేసుకున్న వైనాన్ని తెరపైకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.  అయినా  ప్రజలు, టీటీడీ భూముల అంశం నుంచి దృష్టి మరల్చలేదు. ఈ విషయంలో కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని ఏపీ  బీజేపీ సీరియస్‌గా పోరాడింది. నాయకులు ఎక్కడికక్కడ దీక్షలు చేసి, సర్కారుపై ఒత్తిడి పెంచడంతో జగన్ ప్రభుత్వం దిగిరావడం అనివార్యమయింది. ఇది కూడా చదవండి.. వెంకన్న భూములు సరే…బంగారమూ తెగనమ్మేస్తారా స్వామీ?

ఫలించిన కన్నా వ్యూహం..

ఈ పరిణామం రాష్ట్ర బీజేపీ నేతల్లో సమరోత్సాహం నింపింది. టీ డీపీ ప్రధాన ప్రతిపక్షమైనప్పటికీ, టీటీడీ భూముల వ్యవహారంలో బీజేపీనే చివరివరకూ సీరియస్‌గా నిలబడింది. వైసీపీ ఎన్ని మైండ్‌గేములు ఆడినా, తిప్పికొట్టి చివరకు అనుకున్నది సాధించింది. ఇదే ఉత్సాహంతో రాష్ట్రంలోని మరికొన్ని దేవాయాల భూముల అమ్మకాలపై జరుగుతున్న ప్రయత్నాలు అడ్డుకోనుంది. అసలు ఈ వ్యవహారాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్లి, చర్చనీయాశంగా చేయడంలో, కన్నా లక్ష్మీనారాయణ వ్యూహం ఫలించింది. జాతీయ మీడియాలో మాత్రమే కాకుండా, పార్టీ జాతీయ నాయకుల దృష్టికి సైతం ఈ విషయాన్ని తీసుకువెళ్లారు. జీవీఎల్, సత్యకుమార్ వంటి జాతీయ నేతలు కూడా దీక్షలు నిర్వహించారు. ప్రతిరోజూ జరిగే వీడియో కాన్ఫరెన్సులో,  కన్నా లక్ష్మీనారాయణ తమ పోరాట తీరును వివరించడం ద్వారా, వారి మద్దతు పొందగలిగారు. అయితే.. టీటీడీ భూముల వ్యవహారంలో ఈసారి.. హిందూ సంస్థలు, నేతలు రంగంలోకి దిగకుండానే, రాజకీయ పార్టీగా ఒక్క బీజేపీనే ఈ సమస్యకు పరిష్కారం చూపించడం విశేషం. ఇదికూడా చదవండి.. స్వాములోరు.. మాట్లాడారోచ్!

ఇది బీజేపీ సాధించిన విజయం: ఓవి రమణ

భూముల అమ్మకాలపై టీటీడీ దిగిరావడం సంతోషకరమేనని, ఇది బీజేపీ సాధించిన విజయమని టీటీడీ మాజీ సభ్యుడు, బీజేపీ రాష్ట్ర నేత ఓవి రమణ వ్యాఖ్యానించారు. అయితే తప్పును అంగీకరించాల్సిన మంత్రులు, వైసీపీ నేతలు బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణపై విమర్శలు చేయడం ద్వారా, సమస్యను పక్కదారి మళ్లించాలని చూశారని విమర్శించారు. తమ పార్టీ ఆందోళన చేయకపోతే ఈ తీర్మానం విషయం ఎవరికీ తెలిసేది కాదన్నారు. బోర్డు భక్తుల మనోభావాలను గుర్తించి, గౌరవించాల్సి ఉంటుందన్నారు. భక్తుల మనోభావాలకు వ్యతిరే కంగా, గత టీటీడీ బోర్డు తీసుకున్న అన్ని నిర్ణయాలను రద్దు చేయాలన్నారు.అలాగే పింక్ డైమండ్ మాయంపై రమణదీక్షితులు, ఎంపి విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలపై, బోర్డు కోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు. దీనిపై గత పాలకవర్గం కోర్టులో డబ్బు కూడా జమచేసింది కాబట్టి, స్వామికి సంబంధించిన ఈ వ్యవహారంలో నిజానిజాలు తేల్చడానికి, కోర్టును ఆశ్రయించాలని డిమాండ్ చేశారు.

పింక్ డైమండ్‌ను తేల్చాల్సిందే..

స్వామివారికి అసలు పింక్ డైమండ్ ఉందా? లేదా అన్న వాస్తవాన్ని టీటీడీ బోర్డు భక్తులకు వెల్లడించాల్సిందేనని రమణ డిమాండ్ చేశారు. దీనిపై ఉన్న అనుమానాలకు బోర్డు తెరదించాలన్నారు. ఒకవేళ విజయసాయిరెడ్డి ఆరోపించినట్లు అది చంద్రబాబు నివాసంలో ఉంటే,  బోర్డు కచ్చితంగా స్వాధీనం చేసుకోవాలన్నారు. అసలు పింక్ డైమండ్ అనేది లేకపోతే, అలాంటి ఆరోపణలు చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిపై, పరువునష్టం దావా కొనసాగించాల్సిందేనని వ్యాఖ్యానించారు.

‘స్వామి వారి పింక్ డైమండ్ పోయిందని, అది చంద్ర బాబు ఇంట్లో ఉందన్న వారిపై పాత బోర్డు పరువునష్టం దావా వేసింది. 2 కోట్లు డిపాజిట్ కూడా చేసిందని విన్నాం.  అయితే, అధికారులు మాత్రం అసలు స్వామివారికి పింక్ డైమండ్ లేదని చెప్పడం వల్ల ఎవరు నిజాలు చెబుతున్నారన్నది అర్ధం కావడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరువునష్టం దావాను ఉపసంహరించుకున్నట్లు చెబుతున్నారు. కాబట్టి ఆరోపించిన వారిపై పరువునష్టం దావాను కొనసాగిస్తే, ఒకవేళ వారి వద్ద ఏమైనా ఆధారాలుంటే, ఆ ఆభరణం స్వామివారికి దక్కుతుంది. లేదా భక్తులను మోసం చేసినవారే శిక్షకు గురవుతారు. కాబట్టి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలోకి కమిటీ పింక్‌డైమండ్ పోయిందన్న ఆరోపణలపై దృష్టి సారించాల’ని రమణ డిమాండ్ చేశారు.