మిడతలదండుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

157

మహారాష్ట్ర మీదుగా తెలంగాణ వైపు దూసుకువస్తున్న మిడతలదండుపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలో మిడతలదండుపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. మిడతల దండు రాష్ర్టానికి వస్తే చేపట్టాల్సిన చర్యలపై సీఎం అధికారులతో సమీక్షించనున్నారు. ఈ సమావేశానికి అధికారులు, శాస్ర్తవేత్తలు, నిపుణులు హాజరయ్యారు.

కొద్దిరోజులుగా పశ్చిమభారతానికే పరిమితమైన ఎడారి మిడతల దండు క్రమంగా దేశంలోని ఇతర ప్రాంతాలకు దూసుకొస్తున్నది. బుధవారం నాటికి మహారాష్ట్రలోని అమరావతి వరకు ఈ మిడతలు చేరుకున్నాయి. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో ఎగురుతూ వాటి దారిలో కనిపించే ప్రతీ చెట్టూ చేమను తినేసే ఈ మిడుతలను మహారాష్ట్ర ప్రభుత్వం నియంత్రించలేకపోతే రెండుమూడు రోజుల్లో మన రాష్ట్రంలోకి ప్రవేశించే ప్రమాదముంది.

ప్రస్తుతం 17 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఒక మిడతల గుంపు మహారాష్ట్రలోని అమరావతి సమీపంలోకి చేరుకుంది.

దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న నిజామాబాద్‌, కామారెడ్డి, అసిఫాబాద్‌, మంచిర్యాల, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలకు వీటితో ప్రమాదం పొంచి ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయశాఖ కమిషనర్‌ బీ జనార్దన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మిడతల దండు కనిపిస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఈ సమస్యపై బుధవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి సరిహద్దు జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులతో నిఘాబృందాలు, గ్రా మ కమిటీలను ఏర్పాటుచేసి మిడతల దండుతో కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ఒక మిడతల దండు రోజులో దాదాపు 35000 మందికి సరిపోయే ఆహారాన్ని తినేస్తాయని నిపుణులు చెప్తున్నారు