బురద చల్లి… సారీ చెబితే సరిపోతుందా?

515

కోర్టులకు బురద పూసి కడుక్కోమంటారా?
వైసీపీ కార్యకర్తలంతా అక్షరాలు తెలియని అజ్ఞానులట
సారీతో సరిపెట్టి వదిలేయాలంటున్న  వైసీపీ మహానేత
(మార్తి సుబ్రహ్మణ్యం)

మేం బురద పూస్తాం.. మీరు కడుక్కోండని టన్నుల కొద్దీ బురద పోశారు. ఆ మకిలి మామూలు మనుషుల మీదనో, రాజకీయ నాయకుల మీదనో కాదు. న్యాయవ్యవస్థపైన.  దానితో.. తీర్పులిచ్చే న్యాయాధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అనుమానపు చూపులు చూసే ప్రమాదం తెచ్చి పెట్టింది. కోర్టులకే కళంకం ఆపాదించిన  ఆ కుట్రదారులను పోలీసులకు బదులు..  కోర్టు తనంతట తానే కనిపెట్టి బోనెక్కించింది. ఇది కూడా చదవండి.. హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా?

తిడితే సారీ చెబుతారు.. వదిలేస్తే సరి!

అయితే.. కోర్టులకు ఆశ్రిత, పార్టీ పక్షపాతం ఆపాదిస్తూ, కులంపేరుతో కుళ్లుబుద్ధితో వెగటు వ్యాఖ్యలు చేసిన సదరు మహానుభావులంతా అమాయకులట. అక్షరజ్ఞానం లేని నిరక్షరాస్యులట. అందుకే ఈ ఒక్కసారీ ఆ మూకను ఒగ్గేయాలట. ఇదీ కోర్టులపై కుట్రబుద్ధితో సోషల్‌మీడియాలో వ్యాఖ్యలు చేసిన, వైసీపీ చిరంజీవుల పక్షాన వకాల్తా పుచ్చుకున్న ఆ పార్టీ నేతల విచిత్ర వాదన.

కోర్టులే లేకపోతే…

ఏపీ సీఎం జగన్ సర్కారు ఇటీవలి కాలంలో తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను కొట్టివేస్తూ, హైకోర్టు ఒకేరోజు మూడు తీర్పులు వెలువరించింది. దానిపై సగటు ప్రజలలో కోర్టులపై మరింత గౌరవం పెరిగింది. ప్రభుత్వాలు నియంతృత్వంగా వ్యవహరిస్తే కొరడా ఝళిపించి.. బాధితులను, న్యాయాన్ని కాపాడేందుకు కోర్టులు ఉన్నాయన్న భరోసా నింపింది. ఒకవేళ కోర్టులు లేకపోతే తమకు దిక్కెవరని, ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టేదెలా అన్న ఆలోచనకు ఈ నిర్ణయం ప్రాణం పోసింది. ఇది కూడా చదవండి.. జగన్ సర్కారుకు కోర్టు ఝలక్!

కోర్టులకూ కులం అంటకడతారా..?

కానీ, ప్రభుత్వ నిర్ణయాలు, ఆ మేరకు చేసిన వాదనాలోపం వల్ల.. కోర్టులో సర్కారు నిర్ణయాలేవీ అమలుకాకుండా నిలిచిపోయాయి. ఇదంతా కోర్టులే కావాలని చేస్తున్నాయని, అభివృద్ధిని అడ్డుకుంటున్నాయన్న అడ్డదారి చర్చకు వైసీపీ సోషల్‌మీడియా ద్వారా తెరలేపింది. తీర్పులిచ్చిన న్యాయాధికారులకు పార్టీ, కులం రంగు అంటకట్టే బరితెగింపు చర్యలకు కాలుదువ్వింది.  న్యాయస్థానాన్ని ఒక రాజకీయ పార్టీ కార్యాలయంగా అభివర్ణించింది. ఢిల్లీలో ఉన్న పెద్ద తలలు, ఏపీలోని రాజకీయ పార్టీని కాపాడుతున్నాయని ఆరోపించింది. ఆ మేరకు వైసీపీ సోషల్ మీడియాలో క్రియాశీలకంగా వ్యవహరించే కార్యకర్తలు, కోర్టులపై రెచ్చిపోతూ చేసిన వ్యాఖ్యలు, పోస్టింగులపై అప్రమత్తమయి, చర్యల కొరడా ఝళిపించాల్సిన పోలీసుశాఖ సుఖనిద్ర పోయింది. దానితో కోర్టే రంగంలోకి దిగి తనను తాను కాపాడుకునేందుకు, తన ప్రతిష్ఠ తానే నిలబెట్టుకునేందుకు అడుగులు వేసింది. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన వారిని గుర్తించి, వారికి నోటీసులు పంపింది. ఇదీ.. కోర్టులకు వ్యతిరేకంగా వైసీపీ సోషల్‌మీడియా విప్లవకారులు చేసిన తుంటరి చేష్ట. దాని పర్యవసాన కథ! ఇది కూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

కొట్టి సారీ చెప్పినట్లు.. తిట్టికూడా సారీ చెప్పవచ్చట!

కానీ, చర్చల పేరిట రచ్చ చేసే చానెళ్లలో ఈ అంశంపై చర్చలు జరుగుతున్నాయి. గతంలో కోర్టు తీర్పులపై చర్చించాలన్నా, కథనాలు రాయాలన్న మీడియా భయపడేది. తీర్పు వరకూ పరిమితమయ్యేది. ఎడిటర్లు కూడా కోర్టుకు వ్యతిరేకంగా కథనాలు రాస్తే, దాన్ని చెత్తబుట్టలో విసిరేసేవారు. కోర్టుంటే భయం-గౌరవమే దానికి కారణం! ఇప్పుడు ఎవరి పార్టీ మీడియా వారికి ఉన్నందున, చానెళ్లలో తీర్పులపై చర్చలు జరిపే ధైర్యం చేస్తున్నాయి. ఆ ప్రకారం,  ఒక చానెల్‌లో జరిగిన చర్చలో పాల్గొన్న ఓ వైసీపేయుడు.. సోషల్‌మీడియాలో పోస్టింగులు పెట్టిన తమ పార్టీ వారంతా నిరక్షరాస్యులు కాబట్టి, వారి అజ్ఞానాన్ని పెద్ద మనసుతో క్షమించి విడిచిపెట్టాలని కోరతామని సెలవివ్వడం విభ్రమ కలిగించింది. కోర్టులను తిట్టిపోసిన సదరు సోషల్‌మీడియా విప్లవకారులు, చదువుకోని చిరంజీవులు కాబట్టి.. వారు చెప్పే క్షమాపణలు మహదానందంతో అందుకుని, వారిని విడిచిపెట్టమన్నది ఆయన గారి వాదన. తెల్లవాడు దేశం విడిచిపోతూ మనకు విడిచిపెట్టిన ‘సారీ’ అనే పదం, ఇలాంటివాటికీ ఉపయోగించుకోవచ్చని సదరు వైసీపేయుడు నిరూపించాడు. ఇది కూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు!

రేపు మరొకరూ ఇదే చేసి..  సారీ చెబితే…?

సరే.. ఆ మహానేత వాదన ప్రకారం.. కోర్టులపై కావలసినంత బురద పూసి, ఆనక క్షమించమన్న సోషల్‌మీడియా  వైసీపీ విప్లవకారులను కోర్టు కరుణించి, నాలుగు అక్షింతలు వేసి వదిలేసిందనుకుందాం. తర్వాత అదే కోర్టు భవిష్యత్తులో.. మరొక పార్టీకో, మరో వ్యక్తికో, ఇంకో సంస్థకో వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చినప్పుడు… అప్పుడు వారు కూడా సోషల్‌మీడియా విప్లవకారులను పుట్టించి, కోర్టులపై చేతనయింత బురద వేయించి, ఇప్పటిమాదిరిగా కోర్టు సచ్చీలతను ప్రశ్నార్ధకం చేసేలా వెర్రి మొర్రి వ్యాఖ్యలు చేయించారనుకోండి. అప్పుడు కూడా వారిని పుట్టించిన సోషల్‌మీడియా తలిదండ్రులు.. తమ పిల్లకాకులు చదువులేని కుంకలు కాబట్టి, వారు చెప్పే సారీని స్వీకరించి మునుపటి వైసీపీ సోషల్‌మీడియా విప్లవకారులను వదిలేసినట్టే, తమ కుర్ర కుంకలనూ వదిలేయమని ప్రార్ధిసే, అప్పుడు వారిని కూడా కోర్టు విడిచిపెట్టాలా? అన్నది బుద్ధిజీవుల ప్రశ్న. ఇలా కోర్టులపై ఎవరికి కోపం వస్తే వారు.. సోషల్‌మీడియా విప్లవమూర్తులుగా మారి తిరుగుబాటు చేసి, ఆనక సారీ చెబితే కోర్టుల విశ్వసనీయత, గౌరవ ప్రతిష్ఠలు ఏం అవుతాయి? తప్పు చేసిన వారికి శిక్షలు ఉండాల్సిందే. శిక్షలు మార్పు కోసమే కదా? ఇది కూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర?

తెలుగు రాష్ట్రాల్లోనే కులం తెగులు..

అసలు వచ్చిన జడ్జి ఏ అంశాల్లో నిష్ణాతుడు, గతంలో ఆయన ఇచ్చిన తీర్పులేమిటి? జిల్లా జడ్జిగా ఎలాంటి విశిష్ట తీర్పులిచ్చారు? ఆయన సీనియర్‌గా పనిచేసిన న్యాయవాది గొప్పతనమేమిటి? ఆయన ఏ రంగంలో ప్రతిభావంతుడు అని ఆరా తీస్తుంటారు. చర్చ చేస్తుంటారు. కానీ..  ఏ కులం, ఏ ప్రాంతానికి చెందిన వాడని శోధించి.. దాని ప్రకారం ఆయన ఎవరి మనిషి అయి ఉంటారే తీర్పు లాంటి అంచనాకు వచ్చి, మళ్లీ దానిపై పనిలేని చర్చలు జరిపే అవలక్షణం, స్థాయి తక్కువ వ్యవహారం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కనిపిస్తుంటుంది. గతంలో చంచల్‌గూడ జైల్లో.. ఇప్పటి సీఎం జగన్మోహన్‌రెడ్డి సహచరుడిగా ఉన్న  గాలి జనార్దన్‌రెడ్డికి..  బెయిల్ కోసం ఒక జడ్జి గడ్డితిని జైలుపాలయ్యారు. ఇంకా అలాంటి సంఘటనలు కొన్ని కనిపించినప్పటికీ.. న్యాయవ్యవస్థ ఇంకా గౌరవ ంగా బతుకుతున్నదంటే, ఇలాంటి తీర్పులు ధైర్యంగా ఇస్తున్నందుకే. ఆ ధైరాన్ని అలా బతికించాల్సిన అవసరం అందరిపైనా ఉంది. ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

కొరడా ఝళిపించాల్సిందే: యామిని

కోర్టుల ప్రతిష్ఠను దెబ్బతీసే ముష్కరమూకలపై చర్యల కొరడా ఝళిపించాల్సిందేనని బీజేపీ నేత యామినీ శర్మ స్పష్టం చేశారు. గతంలో తనపై వైసీపీ సోషల్‌మీడియా పెయిడ్‌బ్యాచ్ దుష్ప్రచారం చేసిందని గుర్తు చేశారు. ‘తనకు నచ్చని వ్యవస్థలు, వ్యతిరేకించే పార్టీలు ఈ గడ్డపై ఉండకూడదన్న నియంతృత్వంతో వాటి హననానికి పాల్పడుతున్న వారికి కోర్టులే గుణపాఠం చెప్పాలి. భావవ్యక్తీరకణకు కేంద్రం కావలసిన సోషల్‌మీడియా, వ్యక్తులు-వ్యవస్థలపై బురద చ ల్లడం క్షంతవ్యం కాదు. కోర్టులపై వ్యతిరేక కామెంట్లు చేసి, రాజకీయమర క అంటించిన వారికి కఠిన శిక్షలు పడితేనే మిగిలిన వారు దారికొస్తారు. ఈ హెచ్చరిక సంకేతం పంపడం రాష్ట్రంలో ఇప్పుడు చాలా అవసరం’ అని యామిని వ్యాఖ్యానించారు.