హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా?

376

సోషల్‌మీడియా పోస్టింగులపై కోర్టు కొరడా
సుమోటోగా 49 మందికి నోటీసులు
కోర్టులతో జగన్ అండ్ కో కయ్యం మంచిదేనా?
(మార్తి సుబ్రహ్మణ్యం)

రాజకీయాల్లో ప్రత్యర్ధులపై ఎదురుదాడి.. మైండ్‌గేమ్ బ్రహ్మాండంగా పనికొస్తుంది. అసలు రాజకీయాల్లో కావలసినవి అవే. అవి ప్రత్యర్ధులను ఆత్మరక్షణలో పడేస్తాయి. ఒక్కోసారి దానివల్ల ఎవరో ఒకరు దారుణంగా నష్టపోవలసి వస్తుంది. చాలామంది నష్టపోయారు కూడా.  కానీ.. అదే ఎదురుదాడి, మైండ్‌గేమ్ కోర్టులను లక్ష్యంగా చేసుకుని సంధిస్తే అది బెడిసికొడుతుంది. తలబొప్పికట్టి నోరు, చేతులూ కాలితీరతాయి. రాజకీయాల్లో మాదిరిగా.. మేం బురద చల్లుతాం. మీరు కడుక్కోండంటే అది కోర్టుల విషయంలో పనికిరాదు. కోర్టు కన్నెర్ర చేస్తే ఎవరూ తట్టుకోలేరు. ప్రభుత్వాలు పనిచేయనప్పుడు, పాలకులు అచేతనావస్థలో ఉన్నప్పుడు.. కోర్టులు ఒక్కటే కాదు, రాజ్యాంగబద్ధ సంస్ధలేవయినా జోక్యం చేసుకుని, బాధితులకు బాసటగా నిలుస్తాయి. దానిని ప్రతిష్ఠగా తీసుకుని, ప్రతీకారంగా తమ భజనబృందాలు, పక్కవాయిద్యాల మేళ గాళ్లతో.. వాటిపైనా ఎదురుదాడి చూస్తే బోనెక్కక తప్పదు. పిడుగుకూ బియ్యానికీ ఒకే మంత్రం ఎప్పుడూ, ఏ వ్యవస్థకూ పనికిరాదు. కానీ.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సరిగ్గా జరుగుతోంది ఇదే. జగన్మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ పార్టీ-ప్రభుత్వం హైకోర్టుతో, కయ్యానికి కాలుదువ్వుతున్న వైనం విమర్శలకు దారితీస్తోంది.

తీర్పులపై సర్కారులో ఆత్మపరిశీలన ఏదీ..?

తప్పు చేయడం మానవ సహజం. దానిని సరిదిద్దుకోవడమే గొప్పతనం. తనకు సరిచేసుకునే అవకాశం లేనప్పుడు మరొకరు ఆ పనిచేస్తే, ఆత్మపరిశీలన చేసుకుని దిద్దుబాటుకు దిగడం పాలకుల లక్షణం. గతంలో చాలామంది పాలకులకు వ్యతిరేకంగా హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించాయి. ఆయా సందర్భాల్లో మరి సున్నిత అంశాలుంటే రాష్ట్రాలు సుప్రీంకోర్టుకు అపీలుకు వెళ్లేవి. అక్కడ కేసు తీవ్రత, సమర్పించిన ఆధారాలు, వాదనల ఆధారంగా ఒక్కోసారి అనుకూలంగా, మరొకసారి వ్యతిరేకంగా తీర్పులు వచ్చేవి. అసలు హైకోర్టులు ఇచ్చిన వ్యతిరేక తీర్పులనే అవమానంగా భావించి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి వంటి ముఖ్యమంత్రులెందరో తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లిపోయారు.

అక్కసుతో అడ్డగోలు ఎదురుదాడేమిటి?

అంతేతప్ప.. తమకు వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారనే అక్కసుతో, తీర్పులిచ్చిన న్యాయాధికారులపై తమ అనుచరులు, భజన బృందాలతో  బురద చల్లించే దిక్కుమాలిన చండాలపు చర్యలకు, ఎప్పుడూ దిగిన దాఖలాలు స్వతంత్ర భారతావనిలో కనిపించలేదు. కాకపోతే, కొన్ని రాష్ట్రాల్లో కొందరు న్యాయాధికారుల వ్యక్తిగత జీవితాలపై కరపత్రాలు విడుదల చేయడం ద్వారా, వారిని అప్రతిష్ఠపాలు చే సే ప్రయత్నాలు జరిగాయి తప్ప..ఏపీలో మాదిరిగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అక్కసుతో, సోషల్‌మీడియాను అడ్డు పెట్టుకుని వ్యక్తిత్వ హననం చేయడం.. దేశంలో ఎక్కడా, ఎప్పుడూ  జరగలేదని న్యాయవాదులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది కూడా చదవండి.. కోర్టు తీర్పులూ.. ఖాతరు చేయరా?

అక్కడా.. ఇక్కడా చేదు అనుభవాలే..

ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం గత కొంతకాలం నుంచీ పలువురు అధికారులు, అంశాలపై తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను ప్రశ్నిస్తూ.. బాధిత వర్గాలు  హైకోర్టులో సవాల్ చేస్తున్నాయి. విచిత్రంగా ప్రభుత్వం తీసుకున్న ఆయా నిర్ణయాలను ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించాయి. ప్రభుత్వ న్యాయవాదులు సరైన సాక్ష్యాలు, వాదనలు వినిపించని ఫలితంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కోర్టులో వీగిపోయాయి. పోతున్నాయి. అయితే అక్కడితో ఆగి, దానిపై సమీక్ష చేసుకుని దిద్దుబాటుకు దిగాల్సిన జగన్ సర్కారు, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకెళ్లింది. అక్కడ కూడా ఇప్పటివరకూ, జగన్ సర్కారుకు చేదు అనుభవమే ఎదురయింది.

రమేష్ నుంచి.. రంగుల వరకూ..

రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని రాష్ట్ర హైకోర్టు సమర్ధించింది.దానిని సవాలు చేస్తూ జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్ళగా,సుప్రీం కోర్టు కూడా హైకోర్టు తీర్పునే సమర్ధించింది… ఇక తెలుగు మీడియం, పంచాయితీలకు వైసీపీ రంగుల విషయంలో కూడా హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించకుండా.. దానికి మరికొన్ని సవరణలు చేసి ఇచ్చిన  ఉత్తర్వుపై కోర్టు కన్నెర్ర చేసింది. రంగుల విషయంలో సుప్రీంలో కూడా చుక్కెదురయింది. ఇలా ఒకటి కాదు.. సుమారు 60 సందర్భాల్లో కోర్టులు మొట్టికాయలు వేస్తున్నా, జగన్ సర్కారులో మార్పు రాకపోవడం సహజంగానే అన్ని వర్గాల్లోనూ ఆయన తీరు చర్చనీయాంశమయింది. ఈవిధంగా ఒక్క ఏడాదిలో 60 సందర్భాల్లో అక్షింతలు వేయించుకున్న దాఖలాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించవు. ఇది కూడా చదవండి.. 11నెలలు..55 అక్షింతలు!

సర్కారు చేయాల్సినవి.. కోర్టులు చేస్తున్నాయి మరి!

తాజాగా ఇంటలిజన్స్ మాజీ దళపతి ఏబీ వెంకటేశ్వరరావుపై, జగన్ సర్కారు వేసిన సస్పెన్షన్ వేటును హైకోర్టు కొట్టివేసింది. అదేరోజు వలస కార్మికులు, పంచాయితీలకు రంగులపై ఇచ్చిన జీఓను కొట్టివేస్తూ ఉత్తర్వులిచ్చింది. రెండురోజుల తర్వాత.. దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన విశాఖ ఎల్జీపాలిమర్స్ ఘటనలో, కంపెనీని సీజ్ చేసి, యాజమాన్యాన్ని దేశం విడిచివెళ్లకుండా పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకోవాలని.. వారిని లోపలికి అనుమతించవద్దని, లోపలకు వెళ్లేవారు చూసిన పరిశీలనను రికార్డు చేయాలని ఆదేశించింది. తరలించిన రసాయనాలకు ఎవరు అనుమతులు ఇచ్చారో  చెప్పాలని ఆదేశించడం సంచలనం సృష్టించింది.

నిజానికి ఎల్జీపాలిమర్స్ వ్యవహారంలో రాష్ట్రప్రభుత్వం చేయాల్సిన పని, ఇవ్వాల్సిన ఆదేశాలను కోర్టు ఇచ్చింది. ఇది ఒకరకంగా పాలకులకు నగుబాటు వ్యవహారమే. కంపెనీని అప్పుడే సీజ్ చేసి, పోలీసులు వారి పాస్‌పోర్టును స్వాధీనం చేసుకుని, రసాయనాల తరలింపునకు సంబంధించి అన్ని రికార్డులు చూసి, తరలించి ఉంటే హైకోర్టు అందులో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. జగన్ సర్కారు ఆ పనిచేయకపోగా, యాజమాన్య ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయినందున, అనేక అనుమానాలకు ప్రభుత్వ చర్యలే అవకాశం ఇచ్చాయి. హైకోర్టు తీర్పు దానిని సరిచేసింది. దీనిని హర్షించాల్సిందే.ఇదికూడా చదవండి.. ఏమిటీ నిర్ణయాలు? ఎందుకీ తొందర?

ఏబీ సస్పెన్షన్‌తో  ఏం సాధించారు?

ఇక ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ రాజకీయ ప్రతీకార చర్యలో భాగంగా జరిగిన నిర్ణయమన్నది బహిరంగ రహస్యం. ఎందుకంటే ఆయనపై నాడు వైసీపీ నేతలు వ్యక్తిగతంగా ఆరోపించి, ఫిర్యాదు కూడా చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడాదిపాటు, ఆయనకు పోస్టింగు, వేతనం ఇవ్వకుండా వెయిటింగ్‌లో ఉంచింది. మరి  ప్రభుత్వం.. ఆ ఏడాది కాలంలో ఆయనపై మోపిన అభియోగాలను, ఎందుకు నిరూపించలేకపోయిందన్న ప్రశ్న, సహజంగా సామాన్యుడికే వస్తుంది? ఎవరికైనా వస్తుంది. చట్టాలు తెలిసిన న్యాయాధికారులకు మాత్రం ఎందుకు రాదు? ఇదికూడా చదవండి.. జగన్ సర్కారుకు కోర్టు ఝలక్!

పోనీ, సస్పెన్షన్‌కు ప్రభుత్వం చూపిన కారణాలకు డాక్యుమెంట్లను ఏమైనా సాక్ష్యంగా చూపిందా అదీ లేదు. ఆయన కుమారుడి కంపెనీ, నాటి ప్రభుత్వం వల్ల ఏవిధంగా లబ్థి పొందింది? వాటి లావాదేవీల వివరాలు, ప్రభుత్వం నష్టపోయిన వైనానికి తగిన ఆధారాలు సమర్పించిందా అంటే అదీ లేదు. కోర్టుకు కావలసింది  సాక్ష్యాలు, ఆధారాలే అన్న కనీస సూత్రం కూడా సీఎస్ స్థాయి అధికారులు తెలుసుకోకుండా, పాలకులు ఇచ్చిన ఆదేశాలు పాటిస్తే, కోర్టులో ఎదురుదెబ్బలు తగలకుండా ఎలా ఉంటాయి? అలా తగలకూడదని ఎలా ఆశిస్తారు? తామిచ్చిన ఆదేశాలను, కోర్టులు కూడా ఖరారు చేయాలని ఏవిధంగా కోరుకుంటారు? ఒక వేళ అలా కోరుకుంటే అది రాజరికమే తప్ప, ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? ఇది కూడా చదవండి.. దేశ ద్రోహమా?.. దొండకాయనా?

పరిశుద్ధాత్మతో మారే అవకాశం ఉన్నా…

కానీ.. హైకోర్టు తీర్పులను సమీక్షించుకుని, జరిగిన తప్పులపై ఆత్మపరిశీలన చేసుకుని జీసస్ ప్రవచించిన పరిశుద్ధాత్మతో మారిన మనిషి కావలసిన ప్రభువులు, ఆయన సేవకులు.. అందుకు విరుద్ధంగా రోజువారీ రాజకీయాల మాదిరిగా తీర్పులిచ్చిన వారిపైనా, కోర్టులపైనా ఎదురుదాడి చేసి, మైండ్‌గేమ్ ఆడటం ఏమాత్రం హుందాతనం కాదు.  అది పాలకుల హోదాకు అలంకారం కాదు. తమకు వ్యతిరేకంగా ఉన్న వ్యవస్థలపై, తమ రాజకీయ ప్రత్యర్ధులపై వేసే  ‘పక్షపాతం-కులం ముద్ర’ వేయడం వల్ల, ప్రజల్లో న్యాయవ్యవస్థ అంటే నమ్మకం పోయే వ్యూహం అనుసరించడం ఖచ్చితంగా అమానుషం,  అనాగరికమే!

నాడు ఫిర్యాదు చేసిన గళాలే నేడు గుడ్లురుముతున్నాయ్..

కోర్టులు, రాజ్యాంగబద్ధ సంస్థలు తమకు అనుకూలంగా వ్యవహరించాలని పాలకులు కోరుకోవడం సహజం. అప్పుడు  వారి చర్యలు కూడా అందుకు అనుకూలంగా ఉండి తీరాలి. తాము ఏం చేసినా అవి ప్రశ్నించకూడదనుకోవడం నియంతృత్వమే అవుతుంది. గత అసెంబ్లీ ఎన్నికల ముందు, అధికార తెలుగుదేశం ప్రభుత్వంలో పనిచేసిన  సీఎస్, డీజీపీ, ఇంటలిజన్స్ ఏడీజీ, ఎస్పీలు, కలెక్టర్లకు వ్యతిరేకంగా ఇదే వైసీపీ కేంద్ర ఎన్నికల సంఘం, కోర్టులను ఆశ్రయించింది. అప్పుడు దాని ఫిర్యాదు మేరకు సీఎస్, ఇంటలిజన్స్ ఏడీజీ, ఎస్పీలను ఎన్నికల సంఘం తప్పించింది. ఆ సందర్భంలో ప్రజాస్వామ్యం బతికే ఉందని, ఇది ప్రజాస్వామ్య విజయమని ఇదే విపక్ష వైసీపీ వేనోళ్లా పొగిడి ంది. సీఎస్‌గా వచ్చిన ఎల్వీ సుబ్రమణ్యం అదే అధికారి గొప్పతనాన్ని కీర్తించింది. ఇప్పుడు అదే  వైసీపీ, అధికారంలోకి వచ్చిన తర్వాత తాము స్వాగతించిన సీఎస్ ఎల్వీనే అవమానకర రీతిలో సాగనంపింది.

పగ-ప్రతీకార పాలనయితే ఫలితాలు ఇవే..

ఇదే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను కోర్టులు ప్రశ్నిస్తే మాత్రం.. తమ అనుకూల బృందాలు, అభిమానులతో తీర్పులిచ్చిన న్యాయాధికారులు, న్యాయస్థానాలకు ఆవ్రతపక్షపాతం ఆపాదించి, బురదచల్లించడం సబబేనా? అప్పటి ఫలితాలు ఆనందంగా ఆస్వాదించిన వారు, ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఎందుకు స్వాగతించలేకపోతున్నార న్న ప్రశ్నకు పాలకుల వద్ద జవాబు దొర కదు. పగ-ప్రతీకారంతో పాలన సాగిత్తే, ఫలితాలు ఇలాగే ఉంటాయని గుర్తించే వయసు, అనుభవం పాలకులకు లేకపోవడమే  దీనికంతటికీ కారణం. వేస్తున్న అడుగుల్లో తప్పొప్పులను సరిదిద్ది, సక్రమమైన మార్గంలో నడిపించాల్సిన దిశానిర్దేశకులు, దూకుడు నిర్ణయాలకు కళ్లెం వేయాల్సిన అధికారులు.. పాలకుల పక్కన, చుట్టూ లేకపోవడం మరో కారణమని చెప్పకతప్పదు. ఇది కూడా చదవండి.. అబ్బా.. కోర్టులో జగన్ సర్కారుకు మరో దెబ్బ!

పోస్టింగుల దాడి జరిగితే పోలీసులేం చేస్తున్నట్లు?

ముఖ్యమంత్రి, మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎంపీలకు వ్యతిరేకంగా సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిని, పరాయి రాష్ట్రాల్లో ఉన్నా వేటాడి పట్టుకుని కేసులు పెడుతున్న పోలీసులు… ఉన్నత న్యాయస్థానానికి అప్రతిష్ఠ తెచ్చేలా పోస్టులు పెడుతున్న వారిని కూడా అంతే వేగంగా పట్టుకుని, ఎందుకు కేసులు పెట్టలేదన్నది న్యాయవాదులు సంధిస్తున్న ప్రశ్న.  చివరకు హైకోర్టే తనపై జరుగుతున్న మాటల దాడులపై, తనంతట తాను స్పందించి కేసులు పెడితే, ఇక పోలీసు వ్యవస్థపై ఎవరికి మాత్రం నమ్మకం ఉంటుంది? అంటే దీన్ని బట్టి.. అధికారపార్టీకి సంబంధించిన వ్యక్తులు ఏం చేసినా వారి మానానికి వారిని వదిలేసి, అదే అధికార పార్టీ నేతలిచ్చే ఫిర్యాదులపైనే పోలీసులు స్పందిస్తారని సంకేతం ఇవ్వడమే కదా? సోషల్‌మీడియా దుష్ప్రచారంపై, హైకోర్టు స్పందించకముందే పోలీసులు మేల్కొని, చర్యల కొరడా ఝళపిస్తే పోలీసు వ్యవస్థకు గౌరవమయినా దక్కేదన్నది జనాభిప్రాయం. కోర్టులకు వ్యతిరేకంగా పోస్టింగులు పెట్టిన వారంతా ైవె సీపీ అభిమానులు, ఆ పార్టీ సోషల్‌మీడియా వింగ్‌లో చురుకుగా పనిచేసేవారు కావడమే..  బహుశా పోలీసుల వెనకడుగుకు కారణంగా కనిపిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కోర్టులపై బురద చల్లి ఏం సాధిస్తారు?

ఇప్పుడు కోర్టు ఇచ్చిన తీర్పులకు వ్యతిరేకంగా బురద చల్లి, న్యాయస్థానం, న్యాయాధికారులపై సోషల్‌మీడియాలో నానా వ్యాఖ్యలు చేసిన వారు సాధించేదేమిటి?  దానివల్ల తమ అభిమాన నాయకుల మనసు గెలవడం తప్ప,  సమాజంలో వారికి మిగిలే గౌరవం ఏం ఉంటుంది? ఇది తమ అభిమాన హీరోల కొత్త సినిమా ప్రారంభం రోజు.. ప్రత్యర్ధి హీరో అభిమానులతో  రక్తాలు కారేలా కొట్టుకుని, జైల్లో కూర్చుని.. తమ హీరో కోసం పోరాడామన్న పాతరాతియుగపు అజ్ఞానపు వెర్రిచేష్టగా అనిపించదూ?

లాయర్లు, ఎంపీలు, నేతలు కూడా..

కోర్టులు, న్యాయమూర్తులకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిలో ఉడుకునెత్తుటి యువకులే కాదు. న్యాయవాదులు, ప్రజాప్రజానిధులు, నాయకులూ ఉండటం ఆశ్చర్యం. కోర్టు నోటీసులిచ్చిన జాబితాలోని పేర్లు చూస్తే, ఏ వర్గం వారిలో కోర్టులపై పీకల్లోతు కోపం ఉందన్నది అర్ధమవుతుంది. అలా అని వారి ఆవేశం బట్టి,  ఆయా వర్గాన్ని నిందించడం కూడా సరికాదు. డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి ఇవ్వడం మంచిదికాదని చీరాల వైసీపీ  నేత, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సెలవిచ్చారు. ఇలాంటి తీర్పులపై న్యాయస్థానాలపై నమ్మకం పోతోంది. అసలు అదొక పెట్టీకేసు. ఈ కేసును సీబీఐని అప్పగించడంతో రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇలా ప్రతి చిన్న కేసును సీబీఐకి అప్పగిస్తే, ప్రతి పోలీసుస్టేషన్ల వద్ద కేంద్రం సీబీఐ ఆఫీసు ఏర్పాటుచేయాల్సి ఉంటుంద’ని చేసిన ఘాటు వ్యాఖ్యలు కోర్టు తీర్పును అవమానించినట్లే ఉందని న్యాయవాదులు స్పష్టం చేస్తున్నారు.

కోర్టులతో ఘర్షణ మంచిదా?

తాజా పరిణామాల నేపథ్యంలో, పాలకులకు న్యాయవ్యవస్థతో ఘర్షణ మంచిదికాదన్న చర్చకు తెరలేచింది. కోర్టులతో పెట్టుకున్న ఏ పాలకులూ మనుగడ సాగించలేరు. ఎందుకంటే విపక్షాలొక్కటే కాదు, పాలకుల వల్ల దెబ్బతినే అన్ని వర్గాలూ ప్రత్యామ్నాయంగా కోర్టులనే శరణువేడుతుంటాయి. పిన్న వయసులోనే తండ్రికి మించిన అపూర్వ మెజారిటీతో గద్దెనెక్కి, మరెంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న పాలకులు.. చిరకాలం ప్రజల గుండెలో నిలిచిపోయేందుకు ఇలాంటి చర్యలు ఏమాత్రం అక్కరకు రావు. తండ్రి రాజన్నలా.. అనవసర ప్రతిష్ఠకు వెళ్లకుండా సీనియర్ల అనుభవాన్ని ఉపయోగించుకుని, ఉన్న తక్కువ సమయాన్ని ఎక్కువగా ప్రజాసేవకు వెచ్చిస్తే.. ప్రజలిచ్చిన అద్భుత విజయాన్ని, విజయవంతంగా కొనసాగించవచ్చు. లేదంటే అభిమానం అనేది మంచులాంటిది. అది కరిగిపోవడానికి అట్టేకాలం పట్టదు!

6 COMMENTS

 1. […] మేం బురద పూస్తాం.. మీరు కడుక్కోండని టన్నుల కొద్దీ బురద పోశారు. ఆ మకిలి మామూలు మనుషుల మీదనో, రాజకీయ నాయకుల మీదనో కాదు. న్యాయవ్యవస్థపైన.  దానితో.. తీర్పులిచ్చే న్యాయాధికారుల వ్యక్తిగత ప్రతిష్ఠ, గౌరవం దెబ్బతినే పరిస్థితి వచ్చింది. అనుమానపు చూపులు చూసే ప్రమాదం తెచ్చి పెట్టింది. కోర్టులకే కళంకం ఆపాదించిన  ఆ కుట్రదారులను పోలీసులకు బదులు..  కోర్టు తనంతట తానే కనిపెట్టి బోనెక్కించింది. ఇది కూడా చదవండి.. హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా? […]

 2. […] ఆరకంగా సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్న వారిపైనా, తీర్పులిచ్చే న్యాయమూర్తలపైనా ఎదురుదాడి చేయడం మంచి పద్ధతికాదని హితవు పలికారు. న్యాయవ్యవస్థను ఎదిరించే పద్ధతి మానుకోవాలంటూ ఉండవల్లి చెప్పిన అనేక ఉదాహరణలు తమ అధినేతకు కనువిప్పు కావాలని, వైసీపీ వర్గాలు కూడా సూచిస్తున్నాయి. ‘వివి గిరి సైతం రాష్ట్రపతిగా ఉన్నప్పటికీ, నేరుగా సుప్రీంకోర్టుకు హాజరయి, న్యాయవ్యవస్థపై ఉన్న గౌరవం ప్రకటించారు. పివి నరసింహారావు కూడా తాను ఎప్పడంటే అప్పుడు కోర్టుకు హాజరవుతానని ఒక చిన్న న్యాయవాదిని పెట్టి కోర్టును అభ్యర్ధిస్తే, అప్పటివరకూ జైలుకు పంపించాలనుకున్న  కోర్టు, ఆయనకు బెయిల్ ఇచ్చింది. ప్రజల్లో క్రేజ్ ఉన్న వంగవీటి రంగా కూడా, కోర్టులో సగం తల దించి జడ్జి ముందు నిల్చున్నారు. అదే త ల ఎగరేసి ఉంటే, సాయంత్రం వరకూ వెయిట్ చేయించేవాళ్లు. కోర్టులతో పెట్టుకోవడం ఎందుకూ? వాళ్లూ మనుషులే కదా? జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్న జడ్జిలపై పెడుతున్న పోస్టింగులు చూస్తే కోర్టులు ఊరుకుంటాయా? జడ్జిలకు కోపం రాదూ? ఒకాయనేమో అలాంటి వారిని మేం కాపాడతామంటారు. అంటే ఏంటి..  మేమే ఇవ్వన్నీ చేయిస్తున్నామనుకోవాలనా?’ అని ఉండవల్లి సీఎం జగన్ వ్యవహారశైలిని ఆక్షేపించారు. కోర్టులకు సంబంధించి జగన్ అనుసరిస్తున్న వైఖరిని చాలామంది నేతలు తప్పుపడుతున్నా, దానిని జగన్ ముందు వ్యక్తీకరించలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ సమయంలో ఉండవల్లి చేసిన వ్యాఖ్యలు వారి అభిప్రాయాలను బలపరిచినట్టయింది.ఇది కూడా చదవండి: హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా? […]

 3. […] తాజా పరిణామాల నేపథ్యంలో జగన్మోహన్‌రెడ్డి ఏకపక్షంగా తీసుకుంటున్న, అనేక నిర్ణయాలను హైకోర్టు తప్పుపట్టినట్టయింది. ఇప్పటికే 65 కేసుల్లో హైకోర్టు జగన్మోహన్‌రెడ్డి సర్కారుకు వ్యతిరేకంగా తీర్పులు, వ్యాఖ్యలు చేసింది. అయినా, ఆయన సర్కారు న్యాయవ్యవస్థను ఢీకొట్టాలన్న ధోరణిలోనే వెళుతుండటాన్ని, సొంత పార్టీ నేతలు కూడా స్వాగతించలేకపోతున్నారు. అసలు జగన్ తొలుత ఎస్‌ఈసీ గురించి మాట్లాడకుండా మరొకరితో మాట్లాడిస్తే బాగుండేదని కొందరు, రాజ్యాంగబద్ధ సంస్థలతో శత్రుత్వం కొనితెచ్చుకోవటం ఎందుకని మరికొందరు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.ఇది కూడా చదవండి.. హవ్వ.. కోర్టు తీర్పులపైనా ఎదురుదాడా? […]

 4. Today, I went to the beach front with my kids.
  I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put
  the shell to her ear and screamed. There was a hermit crab inside and it
  pinched her ear. She never wants to go back!
  LoL I know this is totally off topic but I had to tell someone!