విపక్షంలో స్వపక్షమా.. స్వపక్షంలో విపక్ష మా? స్వామీ?!

489

టీటీడీపై జగన్‌కు సుబ్రమణ్యస్వామి వత్తాసు
క్రిస్టియన్ సీఎం అయితే ఏంటని ప్రశ్న
సొంత పార్టీ సీఎంలపైనే విమర్శలు
వైసీపీకి ఆయుధంగా మారిన స్వామి వ్యాఖ్యలు
మీ సంగతేమిటని బీజేపీపై  వెల్లంపల్లి ఎదురుదాడి
స్వామిపై మరో బీజేపీ నేత ఓ.వి రమణ విసుర్లు
309 తీర్మానం గురించి స్వామికి తెలియదా అని ఎదురుదాడి
వాడి వేడిగా వెంకన్న భూముల వేలం వ్యవహారం
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఒకవైపు టీటీడీ భూముల అమ్మకాలు, రాష్ట్రంలో వాయువేగంతో జరుగుతున్న మతమార్పిళ్లపై ఏపీ కమదళాలు సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రైస్తవీకరణ పెరిగిందని కమలనాధులు, హిందూ సంస్థలు కత్తులు నూరుతున్నాయి. శ్రీవారి భూముల అమ్మకాలపై, కమలదళం కన్నెర్రతోనే సర్కారు హడావిడిగా ఉత్తర్వు జారీ చేసింది. దానితో.. హిందూ దేవాలయ ఆస్తుల పరిరక్షణ, మతమార్పిళ్లకు వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతున్న.. భారతీయ జనతా పార్టీ ఉత్సాహంపై, బీజేపీ ఎంపి సుబ్రమణ్యస్వామి నీళ్లు చల్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తాము ఏ జగన్ సర్కారుపైనయితే పోరాడుతున్నామో, అదే జగన్‌కు సమర్ధిస్తూ స్వామి చేసిన వ్యాఖ్యలు కమలదళాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాయి. ఫలితంగా.. ఇంతకూ స్వామి స్వపక్షమా? లేక విపక్షమా? రెండూ కాక స్వపక్షంలో విపక్షమా? అన్న గందరగోళానికి తెరలేచింది. అయితే పలువురు సీనియర్ నాయకులు మాత్రం ఆయన మాటలు పట్టించుకోవలసిన పనిలేదని, ఆయన అస్త్రం ఎవరిపై ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఒక్కో సారి ఆయనే తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు.ఇది కూడా చదవండి.. స్వాములోరు.. మాట్లాడారోచ్!

సమరానికి సిద్ధమవుతున్న సమయంలో..

టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారంపై పోరాటాన్ని పదునెక్కించిన బీజేపీకి, మిత్రపక్షమైన జనసేన దన్నుగా నిలిచింది. అటు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కూడా సంఘీభావం ప్రకటించారు. జగన్ ఏపీని క్రైస్తవరాజ్యంగా మార్చాలని చూస్తున్నారని విరుచుకుపడ్డారు. హిందూ, ధార్మిక సంస్థలు కూడా గళం కలిపాయి. ఈ క్రమంలో జగన్ ప్రభుత్వాన్ని అదే బీజేపీ ఎంపి సుబ్రమణ్యస్వామి ప్రస్తుతించి, సొంత పార్టీ సీఎంను ముద్దాయిగా నిలబెట్టిన వైనం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు జగన్‌ను సమర్ధిస్తూ, మరోవైపు చంద్రబాబును విమర్శించి, ఆయనకు కొందరు బీజేపీ బాసటగా నిలవడాన్ని స్వామి తప్పుపట్టారు.

స్వామికి కోపమొచ్చింది..

 ‘భూముల అమ్మకం దుష్ప్రచారం వెనుక చంద్రబాబు ఉన్నారు. అప్పుడు వేలం వేయాలని నిర్ణయించింది బాబు ప్రభుత్వమే. ఆ కమిటీలో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి కూడా ఉన్నారు. అప్పుడు బీజేపీ నుంచి మాణిక్యాలరావు మంత్రిగా ఉన్నారు. కానీ ఇప్పుడు మాటమార్చి జగన్‌పై నిందలు వేస్తున్నారు. బాబు కుట్రలకు కొందరు బీజేపీ నేతలు వత్తాసు పలకడం దురదృష్టకరం. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్‌నాధ్, బద్రీనాధ్ దేవాలయాలతో సహా అన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని, అన్ని దేవాలయాలకు ముఖ్యమంత్రినే చైర్మన్‌గా వేసుకుంది. ఏపీ నేతలు ఉత్తరాఖండ్‌కు వెళ్లి ఉపవాసదీక్షలు చేయాలి’ అని చురకలు అంటించారు.

జగన్‌కు కితాబు..

ఈ సందర్భంగా ఆయన జగన్‌ను ఆకాశానికెత్తారు. ‘భూముల అమ్మకాన్ని నిలిపివేస్తూ జగన్ మంచి నిర్ణయం తీసుకున్నారు. జగన్ మాట మీద నిలబడే నేత. మంచి నాయకుడే కాదు, మంచి వ్యక్తి కూడా. భూములపై ఒక క్రైస్తవ సీఎం సమాధానం చెప్పాలంటున్నారు. మరి ఓ హిందూ సీఎం ఏకంగా తన రాష్ట్రంలోని గుళ్లను స్వాధీనం చేసుకుని, తనకు తాను చైర్మన్‌గా ప్రకటించుకున్నారు.  అంటే హిందూత్వం పట్టాలు తప్పిందా’ అని సొంత పార్టీ సీఎంపై విమర్శనాస్త్రాలు సంధించారు.

స్వామి వ్యాఖ్యలతో  వెల్లంపల్లి విమర్శలకు దన్ను..

టీటీడీ భూముల అమ్మకాల వ్యవహారంలో హిందువుల ఆగ్రహానికి గురయి, ఆత్మరక్షణలో పడిన జగన్ సర్కారుకు.. బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు కొండంత ధైర్యమిచ్చాయి. దానితో మీడియా ముందుకొచ్చిన దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణు.. స్వామి ప్రస్తావించిన వ్యాఖ్యలనే ఉటంకించి బీజేపీని ఆత్మరక్షణలో నెట్టారు. ‘టీటీడీ ఆస్తులు అమ్మాలన్న తీర్మానంలో బీజేపీ సభ్యుడు భానుప్రకాష్‌రెడ్డి సంతకం చేశారు. జనసేన నేత హరిప్రసాద్ కూడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఇప్పుడు భానుప్రకాష్‌రెడ్డి ఎందుకు బయటకు రావడం లేదు? గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే కన్నా ఎందుకు మాట్లాడలేదు? ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ను కూడా ప్రభుత్వం కిందకు తీసుకున్నారు. మహారాష్ట్రలో మీ పార్టీ సీఎం గతంలో ఎన్ని దేవాలయాల భూములు అమ్మలేదు? దీనిపై కన్నా సమాధానం చెప్పాలి. దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోండి. మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయం చేయడం కాద’ని వెల్లంపల్లి, మల్లాది విష్ణు హెచ్చరించారు. ఆ రకంగా సుబ్రమణ్యస్వామి వ్యాఖ్యలు వారికి బీజేపీ నేతలపై దాడి చేయడానికి అక్కరకొచ్చాయి.

స్వామిపై సొంత పార్టీ నేత రమణ ఫైర్..

టీటీడీ  భూముల వ్యవహారంలో జగన్ సర్కారుకు బాసటగా నిలిచిన బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి తీరును.. అదే పార్టీకి చెందిన రాష్ట్ర నేత, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓ.వి.రమణ ఎండగట్టారు. శ్రీవారిపై అపార భక్తి విశ్వాసాలున్న సుబ్రమణ్యస్వామి, తమిళనాడు వాడయిఉండీ  ఆనాడు వేయికాళ్లమండపం కూల్చివేస్తే ఎందుకు మాట్లాడలేదు? గొల్లమండపం కూల్చాలన్న ప్రయత్నాన్ని యాదవులు అడ్డుకున్నప్పుడు ఎందుకు అండగా రాలేదని నిలదీశారు. ‘‘ కోర్టులలో పిల్స్ వేసి ప్రచారం పొందడంలో దిట్ట అయిన సుబ్రమణ్యస్వామి.. టీడీపీ ప్రభుత్వంలో టీటీడీలో జరుగుతున్న అక్రమాలు, పింక్ డైమండ్, తవ్వకాలపై చాలా మాట్లాడారు. సుప్రీంకోర్టులో కేసు వేశారు. మరి ఇప్పుడు ఆయన చాలా మంచివాడు, నిజాయితీపరుడని క్లీన్‌చిట్ ఇస్తున్న జగన్ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అలాంటప్పుడు గతంలో తాను వేసిన పిటిషన్‌లోని అంశాలపై, సీబీఐ విచారణ కోరాలని జగన్‌కు ఎందుకు చెప్పడం లేదు? నిజంగా విచారణ జరిపి, అందులో చంద్రబాబు దోషి అయితే ఆయనను జైల్లో వేయించవచ్చు కదా? ఉత్తరాఖండ్, మహారాష్ట్రలో ఆలయ విధానాల గురించి ఇప్పుడు మాట్లాడుతున్న స్వామి.. వాటిని అప్పుడు రాజ్యసభలో ఎందుకు ప్రస్తావించలేదు? ప్రధానితో ఎందుకు మాట్లాడలేదు? టీటీడీ భూముల అమ్మకాల తీర్మానం చేసినప్పుడు బీజేపీ మంత్రి ఉన్నారంటున్న స్వామి, అప్పుడెందుకు ఆయనతో మాట్లాడి, వాటిని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు? కొందరు బీజేపీ నేతలు బాబుతో కుమ్మక్కయారంటున్నారు. గాలిలో బాణాలు వేయడం కాదు. వాళ్లెవరో చెప్పాలి. దొంగదీక్షలని సొంత పార్టీ వారినే విమర్శించడం మంచిదికాదు. కన్నా లక్ష్మీనారాయణ దీక్షలు చేసినందుకే ప్రభుత్వం దిగివచ్చింది. సొంత పార్టీ వారిని విమర్శించడమే బీజేపీ సిద్ధాంతమా ప్రజలు ప్రశ్నిస్తున్నారు’’ అన్నారు.

88 జీఓ సరే.. 309 తీర్మానం సంగతేమిటి స్వామీ?

888 జీఓ ఇచ్చిన జగన్ ప్రభుత్వాన్ని స్వామి అభినందించడం ఆశ్చర్యంగా ఉందరి రమణ వ్యాఖ్యానించారు.  ‘అసలు 309 తీర్మానం గురించి జీఓలో ఎక్కడా ప్రస్తావించని విషయాన్ని పెద్ద లాయర్ అయిన స్వామి తెలుసుకోలేకపోవడమే విచిత్రం. పైస్థాయి అధికారికి, కింది స్ధాయి అధికారి ఎక్కడైనా ఆదేశాలిస్తారా అని సీనియర్ అడ్వకేట్ అయిన స్వామి చెప్పాలి. ప్రభుత్వ నిధులతో ముస్లిం, క్రైస్తవ మత పెద్దలకు వేతనాలివ్వడాన్ని స్వామి స్వాగతిస్తున్నారో లేదా చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న మత మార్పిళ్లను జగన్ ప్రభుత్వం మాదిరిగా స్వామి కూడా ప్రోత్సహిస్తున్నారా? లేక అసలు ఆ విషయం ఆయనకు తెలియదా’ అని రమణ ప్రశ్నల వర్షం సంధించారు.ఇది కూడా చదవండి.. టీటీడీ జీఓ సర్కారు ఎలా ఇచ్చింది?

దీక్షితులు గారూ.. సీఎంను డిమాండ్ చేయరేం?

ఇక  శ్రీవారి ఆస్తులు, నగలపై జాతీయ స్థాయి ఆడిట్ జరగాలని రమణ దీక్షితులు.. సుబ్రమణ్యస్వామినుద్దేశించి చేసిన ట్వీట్‌పైనా, రమణ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఎన్నికల ముందు శ్రీవారి పింక్‌డైమండ్ పోయిందని చెప్పిన ఆయన, దానిపై ఇప్పుడు విచారణకు ఎందుకు డిమాండ్ చేయడం లేదు? అసలెందుకు ఆ ప్రస్తావన చేయడం లేదు? అయినా నేషనల్ ఆడిట్ చేయాలని జగన్‌ను గానీ, ఈఓను గానీ డిమాండ్ చేయకుండా, స్వామికి ట్వీట్ చేయడం ఏమట’ని ప్రశ్నించారు. రమణదీక్షితులు పనిచేసేది ప్రభుత్వం కిందా? లేక సుబ్రమణ్యస్వామి వద్దనా? అన్నారు.

2 COMMENTS