సీఎం రిలీఫ్‌ఫండ్ లెక్కలు చెప్పరేం?

132

కేంద్రనిధులపై శ్వేతపత్రం ఇచ్చే ధైర్యం లేదా?
మీరు మాత్రం షరతులు పెట్టవచ్చా?
చెప్పిన వరుడిని చేసుకుంటేనే కల్యాణలక్ష్మి ఇస్తారా?
కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఫైర్

హైదరాబాద్: కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధికి పారిశ్రామికవేత్తలు, ఉద్యోగులు, ప్రైవేటు సంస్ధలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు ఇచ్చిన విరాళాలను బయటపెట్టడానికి టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని బీజేపీ ఎమ్మెల్సీ, నగర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు ప్రశ్నించారు. సీఎంకు ఇచ్చిన చెక్కులు దాతలకు తాను సూచించిన కంపెనీల ద్వారా సామాగ్రి ఇవ్వమని చెప్పడం ద్వారా, తన మనషుల కంపెనీలకు లబ్థి చేకూరుస్తున్నార్నన ఆరోపణలున్నాయన్నారు. అందువల్ల ప్రైవేటు కంపెనీలు, వ్యక్తులు, సంస్థలు ఇచ్చిన సామాగ్రి, వాటి విలువను కూడా ప్రభుత్వం బయటపెట్టాలన్నారు.  ప్రభుత్వానికి దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టాలని ఆయన సవాల్ చేశారు. లాక్‌డౌన్ నాటి నుంచి ఇప్పటివరకూ ఇప్పటివరకూ కేంద్రం ఇచ్చిన నిధులపై, శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మేకల సారంగపాణిని అభినందించారు.

బీజేపీ నగర నాయకుడు మేకల సారంగపాణి, యువనేత మేకల హర్షకిరణ్ ఆధ్వర్యంలో.. పేదలు, పారిశుద్ధ్య కార్మికులు, పార్టీ పేద కార్యకర్తలకు తార్నాకలో నిత్యావసర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన రామచందర్‌రావు మాట్లాడుతూ, ఒక్క బీజేపీ కార్యక ర్తలే దేశవ్యాప్తంగా రెండువేల కోట్ల రూపాయలు ప్రధాని నిధికి విరాళంగా ఇచ్చారని, అలాగే బీజేపీ నేతలు ఎక్కడిక క్కడ పేదలు, వలస కూలీలను ఆదుకుంటున్నారని చెప్పారు. కరోనా దెబ్బతో ఆర్ధికంగా దెబ్బతిన్న పరిశ్రమలతోపాటు, వివిధ వర్గాలను ఆదుకునేందుకు మోదీ ప్రభుత్వం 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించిందని గుర్తు చేశారు. ప్రపంచంలో ఇంత పెద్ద భారీ ప్యాకేజీ ఇచ్చిన దేశాలు లేవన్నారు. దానిని కూడా కేసీఆర్, ఆయన మంత్రులు విమర్శించడం సరకాదన్నారు. ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వమనడం వెనుకు కేసీఆర్ స్వార్ధం ఏమిటో బయటపడుతుందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం షరతులను వ్యతిరేకిస్తున్న కేసీఆర్, రైతుబంధు పథకానికి ఆంక్షలు ఎందుకు పెడుతున్నారని ప్రశ్నించారు. రేపు తాము చెప్పిన వరుడిని పెళ్లిచేసుకుంటేనే కల్యాణలక్ష్మి పథకం వర్తింపచేస్తానని షరతు విధించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదని ఎద్దేవా చేశారు.

నగరనాయకుడు సారంగపాణి మాట్లాడుతూ, కేసీఆర్ ఇప్పటివరకూ చేసిన అప్పులతో, మరో 80 ఏళ్లు తెలంగాణ ఆర్ధిక పరిస్థితి కోలుకోలేదన్నారు. సమైక్యరాష్ట్రంలో 16 మంది ముఖ్యమంత్రులు కలసి 69వేల కోట్ల అప్పులు చేస్తే, సొంత రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ 1,80,239 కోట్ల అప్పులు చేసి, ప్రజలపై అప్పుల భారం మోపారని విమర్శించారు. ఇవి చాలక ఇంకా అప్పులు చేస్తు, ప్రజలను బిచ్చగాళ్లను చేసే ప్రయత్నాలను బిజెపి అడ్డుకుంటుందని హెచ్చరించారు. కేసీఆర్ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్లే కరోనా కేసులలో తెలంగాణ మహారాష్ట్రతో పోటీపడుతోందని, పరీక్షలు చేయకపోవడమే దానికి కారణమన్నారు.

సికింద్రాబాద్ బీజేపీ ఇన్చార్జి పి.రవిప్రసాద్‌గౌడ్ మాట్లాడుతూ, మోదీ ప్యాకేజీ గురించి కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలన్నారు. కేంద్ర ప్యాకేజీని విమర్శిస్తున్న కేసీఆర్ ప్రభుత్వంపై ఎదురుదాడి చేసి, వాస్తవాలు వివరించాలని కార్యకర్తలను కోరారు. కరోనా కాలంలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పేదలు, కార్యకర్తలకు సొంత నిధులతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తున్న మేకల సారంగపాణి, ఆయన తనయుడు హర్షకిరణ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో కనకట్ల హరి, వేణుయాదవ్, యు.మల్లేష్, పోచయ్యయాదవ్, వెంకటేష్‌గౌడ్, ఆకుల శ్రీనివాస్, శారదామల్లేష్, తార్నాక డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్‌గౌడ్, శ్రీనివాసాచారి, వర్మ తదితరులు పాల్గొన్నారు.