టిటిడి భూముల వ్యవహారం సుఖాంతం

579

స్వరూపానంద జోక్యంతో వేలం విరమణ
హిందూ ధర్మ పరిరక్షనే శారదా పీఠం లక్ష్యం
కరప: తిరుమల తిరుపతి దేవస్థానం చెన్నైలోని భూములకు సంబంధించి తీసుకున్న నిర్ణయంలో కొందరు వ్యక్తులు శారదాపీఠాన్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని, ఇలాంటి కుట్రలు మానుకోవాలని రాష్ట్రీయ బ్రాహ్మణ ఫ్రoట్ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి డి హెచ్ వి సాంబశివరావు హితవుపలికారు. దేశ వ్యాప్తంగా హిందూ ధర్మ పరిరక్షణకు, మతమార్పిడిల నిరోధానికి శారదా పీఠం కట్టుబడి ఉందన్నారు. మంగళవారం కరప లోని ఫ్రంట్ కార్యాలయంలో సారదాపీఠం భక్తులతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పడికే టీటీడీ తీసుకున్న నిర్ణయంపై పునరాలోచన చేయాలని శారదా పీఠాధిపతులు స్వరూపానంద, స్వాత్మానందేంద్ర ముఖ్యమంత్రి జగన్ తో, టీటీడీ చైర్మన్ తో చర్చించడం జరిగింది అన్నారు. దీంతో భూముల వేలం నిర్ణయాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది అన్నారు.హిందూ ధర్మం, టిటిడి పట్ల పీఠానికి ఉన్న చిత్తశుద్దికి ఇదే నిదర్శనం అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్న కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మతమార్పిడులు అధికంగా జరుగుతున్న సమయంలో జగద్గురువులు స్వరూపానంద పాదయాత్రలు చేస్తూ ప్రాణాలకు తెగించి, బెదిరింపు లను సైతం లెక్కచేయకుండా హిందూ ధర్మాన్ని నిలబెట్టారని సాంబశివరావు కొనియాడారు. ఎవరైనా దురుద్దేశంతో, లేదా రాజకీయ కారణాలతో శారదాపీఠాన్ని తప్పుగా విమర్శిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. హిందూ ధర్మ పరి రక్షణకు పాటుపడుతున్న ఏకైక పీఠం శారదా పీఠమని వెల్లడించారు. హిందూధర్మ పరిరక్షణ, హిందూ దేవాలయాల ఆస్తుల పరిరక్షణ, జీర్ణోద్ధారణ కు చెందిన ఆలయాల పునరుద్ధరణ, అర్చకులకు సహకారం వంటి కార్యక్రమాలలో శారదా పీఠాధిపతులు ఎప్పుడూ ముందుంటారన్నారు. నాడు స్వరూపానంద ధార్మిక యాత్రలు చేయగా, నేడు ఆయన సూచనల మేరకు స్వాత్మానందేంద్ర హిందూ ధర్మ ప్రచార యాత్ర చేపట్టారని తెలిపారు. కరోనా కారణంగా ఈ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడ్డ విషయం ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. శారదా పీఠం పై తప్పుడు ప్రచారం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో శారదాపీఠం భక్తులు చాగంటిపాటి అబ్బు, పెద్దింటి గోపాలకృష్ణ, విలపర్తి సత్య కృష్ణ, ఎం ప్రసాద్, జిల్లెళ్ల ప్రసాద్, కే సుబ్రహ్మణ్యం, పాపారావు, తదితరులు పాల్గొన్నారు.