స్వాములోరు.. మాట్లాడారోచ్!

530

టీటీడీ భూముల అమ్మకాలపై పెదవి విప్పిన స్వరూప
అమ్మకాలు మంచిది పద్ధతి కాదని సుద్దులు
సీఎం, మంత్రి, ఈఓతో చర్చించారట
రిషికేష్ స్థలంపై స్వామి కన్నేశారన్న బ్రాహ్మణ సంఘ నేత శ్రీధర్
సదావర్తిపై హడావిడి చేసిన పార్టీ ప్రభుత్వమేనా ఇది?
అమ్మకాలు దేవుడికి ద్రోహం చేయడమేనన్న ఎంపి రఘురామకృష్ణంరాజు
అమ్మకాలపై అడ్డం తిరిగిన బోర్డు సభ్యుడు
తిరుగుబాటలో టీటీడీ నిర్ణయాలు
బోర్డు ప్రక్షాళనకు ఐవైఆర్ కృష్ణారావు డిమాండ్
రెండుసార్లు రెండురకాలుగా మాట్లాడిన  వైవి సుబ్బారెడ్డి
కొత్త మలుపు తిరిగిన  భూముల అమ్మకాల వ్యవహారం
(మార్తి సుబ్రహ్మణ్యం)

జగద్గురువు, జగన్గురువు, ఆదిశంకర అంశ అయిన విశాఖ పీఠాథిపతి శ్రీమాన్ స్వరూపానందుల వారు ప్రభుత్వంలో జరుగుతున్న ధార్మిక వివాద అంశాలపై మొట్టమొదటి సారిగా పెదవి విప్పారు. హిందూ ఆలయాలలో జరుగుతున్న అమ్మకాల వ్యవహారంపై తొలిసారి గళం విప్పారు. వివాదాస్పదంగా మారిన టీటీడీ భూముల అమ్మకాలు మంచిది కాదని, తన తపోశక్తితో సీఎంను చేసిన శిష్యపరమాణువయిన జగన్‌కు సుద్దులు చెప్పారట. వివాదాలకు తావు లేని నిర్ణయాలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలు గాయపడకుండా చూసుకోవాలని హితవు పలికారట.

చూశారా? స్వామివారికి హిందూమతం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉందో? అది ఉండబట్టే కదా.. టీటీడీ భూముల అమ్మకాలపై సీఎం, టీటీడీ చైర్మన్, ఈఓ, మంత్రితో మాట్లాడింది? అది అర్ధం చేసుకోకుండా.. నోరుంది కదా అని, స్వామివారిపై ఏదిపడితే అది మాట్లాడి, ఇష్టం వచ్చినట్లు బురద చల్లుతారా?  టీటీడీలో అంత జరుగుతుంటే ఎందుకు నోరు మెదపరని ప్రశ్నించి, సీఎం శిష్యుడికి ఇబ్బంది వస్తుందనే స్వామి వారు నోరు మెదపడం లేదని నానా మాటలు మాట్లాడతారా? పైగా.. స్వామివారు రిషికేష్‌లో ఉన్న టీటీడీ భూములకు టెండరు పెట్టారని, అసలు దేవుడి భూముల అమ్మకాల ముచ్చట్లకు పీఠమే కుట్ర కేంద్రమని శ్రీధర్‌శర్మ లాంటి బ్రాహ్మణ సంఘ నేతలు ఇష్టం వచ్చినట్లు నోరు పారేసుకుంటారా?  రిషికేష్‌లోని 40 సెంట్ల విలువైన స్థలాన్ని స్వామికి కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపిస్తారా? ఎవరెన్ని ఆరోపించినా, ఎవరెంత దూషించినా స్వరూపానందున వాటిని శంకరాచార్య మాదిరిగా చిరునవ్వుతో స్వీకరించి, చివరాఖరకు సర్కారుతో మాట్లాడారా? లేదా? తన శక్తేమిటో చూపారా ? లేదా?.. అదీ స్వరూపానందుల వారి మహత్యం! అయినా సరే.. భూములు అమ్మేది అమ్మేదేనని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు చెప్పారనుకోండి. అది వేరే విషయం!! స్వామి వారు చెప్పారా? లేదా? అన్నదే ముఖ్యం. వింటే స్వామి వారి మహత్యం. లేకపోతే సర్కారు మూర్ఖత్వం. అంతేగా?! అంతేగా?!

తిరుగుబాటలో  వైసీపీ ఎంపి రఘురామకృష్ణంరాజు

టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని వైసీపీ నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపైన ఆయన చేసిన వ్యాఖ్యలు, వాడిన పదజాలం వైసీపీలోని హిందువుల మనోభావాలకు అద్దం పట్టినట్లు కనిపిస్తోంది. ‘ఆస్తుల అమ్మకం భగవంతుడికి టీటీడీ బోర్డు చేస్తున్న ద్రోహంగానే భావించాలి. దాతలు ఇచ్చిన భూములను బోర్డు రక్షించే ప్రయత్నించాలి తప్ప అమ్మకూడదు. టీటీడీకి భూములను విరాళంగా ఇచ్చిన భక్తుల మనోభావాలను బోర్డు దెబ్బతీస్తోంది. గత సర్కారు చేసిన తప్పులను సరిచేయాలే గానీ, అదే తప్పు చేస్తే ఎలా’ అని కడిగిపారేయడం అటు వైసీపీలో కూడా కలకలం రేపింది. ఈ వ్యవహారాన్ని తాను సీఎం దృష్టికి తీసుకువెళతానన్నారు.

బోర్డు సభ్యుడి తిరుగుబాటు..

స్వపక్షం-విపక్షాల నుంచి విమర్శలు ఎదురవుతున్న నేపథ్యంలో.. చివరకు బోర్డు సభ్యుడు కూడా భూముల అమ్మకాలను వ్యతిరేకించి, తిరుగుబాటు చేయడం సంచలనం సృష్టించింది. ఆస్తుల అమ్మకాలను నిలిపివేయాలని బోర్డు ప్రత్యేక ఆహ్వానితుడు, ఎంపి రాకేష్ సిన్హా డిమాండ్ చేశారు. ఆ మేరకు ఆయన బోర్డుకు లేఖ రాశారు. శ్రీవారికి విరాళంగా ఆస్తులను ఇచ్చినందున, భక్తుల మనోభావాలతో ముడిపడిన ఈ అంశంపై ముందుకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. అంటే..  చివరకు బోర్డు సభ్యులు కూడా ఈ నిర్ణయాన్ని సమర్ధించడం లేదన్న విషయం, బోర్డు  సభ్యుడైన రాకేష్ సిన్హా లేఖతో స్పష్టమయింది.

స్వామి వారు రిషికేష్ భూములపై కన్నేశారా?

 

టీటీడీ భూముల వివాదంపై పెదవి విప్పిన స్వామివారి రెండవ కోణాన్ని.. ఏపీ బ్రాహ్మ చైతన్యవేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ బయటపెట్టేలా చేసిన ఆరోపణ హిందూవర్గాల్లో సంచలనం సృష్టిస్తోంది. అసలు టీటీడీ భూముల అమ్మకాల ఆలోచనకు  స్వామివారి పీఠంలోనే పురుడుపోసుకుందని, రిషికేష్‌లోని 40 సెంట్ల టీటీడీ భూమిని, స్వరూపా పీఠానికి కట్టబెట్టే కుట్రకు బీజం పడిందని చేసిన ఆరోపణ చర్చనీయాంశమయింది. ప్రముఖ నటి కాంచన 2010లో స్వామివారి తన సొంత  భూములను, అప్పటి ఈఓ ఐవైఆర్ కృష్ణారావు చేతుల మీదగా ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ భూములను కూడా అమ్మకానికి పెట్టడంపై, ఐవైఆర్ కృష్ణారావు నోరు విప్పాలని డిమాండ్ చేయడం ఆసక్తికరంగా మారింది. గత ప్రభుత్వాలలో టీటీడీ అంశాలపై నానా యాగీ చేసిన స్వరూపానందస్వామి.. ఇప్పుడు తిరుమల లడ్లను స్వీటుషాపుల్లో మాదిరిగా అమ్మకాలకు పెట్టే ప్రయత్నం చేస్తుంటే, ఎందుకు నోరు మెదపడం లేదని శ్రీధర్ నిలదీయడం స్వామివారికి ఇబ్బందికర వ్యవహారమే. ‘సీఎం జగన్‌గానీ, టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గానీ, వారి కుటుంబసభ్యులు గానీ  తమ కోట్ల సంపాదనలో ఒక్క సెంటయినా స్వామివారికి ఇచ్చారా? ఇవ్వకపోగా, భక్తులిచ్చిన భూములను అమ్మే సాహసం చేస్తే.. వెంకన్నకు ఏడుకొండలెందుకు? రెండుకొండలు చాలన్న వారికి పడి శిక్షనే పడుతుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని పెద్ద దేవాలయాల భూములను కూడా అమ్ముకోవాలన్న ప్రభుత్వ ప్రయత్నాలను, కచ్చితంగా అడ్డుకుని తీరతామని శ్రీధర్‌శర్మ చేసిన ెహ చ్చరిక ఇప్పుడు కలకలం రేపుతోంది.

అమ్మకాలపై పెదవి విప్పిన ఐవైఆర్..

టీటీడీ భూముల అమ్మకాలపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, టీటీడీ మాజీ ఈఓ ఐవైఆర్ కృష్ణారావు పెదవి విప్పారు. తిరుమల లడ్ల బహిరంగ అమ్మకం, భూముల అమ్మకాలు అర్ధం లేని చర్యలని విమర్శించారు. దాతలు ఇచ్చిన భూములను అమ్మడం సరికాదని, ఆలయాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు, నేడు సీఎంఓ నుంచే టీటీడీ కార్యకలాపాలు నడుస్తున్నాయని ఆరోపించారు. ధార్మిక  పరిషత్ ఏర్పాటుచేసి, బోర్డును ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు.

విమర్శల వానలోనే లడ్ల అమ్మకాలు

బహిరంగ మార్కెట్‌లో స్వామి వారి లడ్ల అమ్మకాలపై.. వివాదం, నిరసనలు, ఆందోళన తీవ్రమవుతున్నా టీటీడీ దానిని ఖాతరు చేయలేదు. తాను తీసుకున్న నిర్ణయం మేరకు.. లక్షల సంఖ్యలో లడ్లను రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు తరలించింది. పైగా తెలంగాణ, తమిళనాడుకూ వాటిని పంపించేందుకు సిద్ధమవుతోంది. అంటే పాలకమండలి ఎవరి అభ్యంతరాలను ఖాతరు చేసే యోచనలో లేదని, తాను అనుకున్నదే అమలుచేసితీరాలన్న పట్టుదలతో ఉన్నట్లు తాజా చర్య స్పష్టం చేస్తోంది.

అమ్మకాలపై రెడ్డిగారి మాటలకు అర్ధాలు వేరులే..

 

భూముల అమ్మకాలపై వస్తున్న ఆరోపణలకు సంబంధించి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు గందరగోళం సృష్టించాయి.దానితో ఆయన ఎవరేమనుకున్నా ముందుకే వెళ్లాలనుకుంటున్నారా? లేక భూముల అమ్మకాలపై వెనకడుగు వేస్తున్నారా? అన్న సందేహాలకు ఆస్కారమిచ్చినట్టయింది. తొలుత తమకు నిందలు కొత్తేమీ కాదని, వాటిని తట్టుకునే శక్తి ఉందన్నారు. టీటీడీలో నిరుపయోగంగా ఉన్న భూములను అమ్మడం కొత్తేమీ కాదని, ఆస్తులను కాపాడేందుకే సమీక్ష జరిపామన్నారు. మళ్లీ తర్వాత.. భూముల అమ్మకాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, అధికారుల బృందాన్ని పంపించి, అక్కడి మార్కెట్ విలువ, రోడ్‌మ్యాప్ తయారుచేయాలని మాత్రమే నిర్ణయించామన్నారు.  ధార్మిక పెద్దలు, నిపుణుల సలహాలు తీసుకుంటామని, భూములు కబ్జా కాకూడదనే మా లక్ష్యమ’ని చెప్పారు. కాగా గతంలో టీటీడీ, సదావర్తిభూముల అమ్మకాలను వ్యతిరేంచిన సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు తానే చైర్మన్‌గా ఉంటూ,  అమ్మకానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో పాత వీడియో రూపంలో వైరల్ కావడం, ఆయనకు ఇరకాటంగా పరిణమించింది.‘మంచు’ మనసూ కరిగింది..

భూములు అమ్మాలన్న నిర్ణయాన్ని జగన్‌ను గట్టిగా బలపరిచే, మంచు మోహన్‌బాబు కుటుంబం కూడా తప్పుపట్టింది. టీటీడీ భూములు అమ్మమని దేవుడేమైనా చెప్పాడా? అని ఘాటుగా నిలదీసింది. జగన్ సర్కారు నిర్ణయాలను సమర్థించే మోహన్‌బాబు కుటుంబానికి తిరుమలతో అనుబంధం ఉంది. తాజా నిర్ణయాన్ని హీరో మంచు మనోజ్ వ్యతిరేకించారు. ‘కొండపైన ఉన్న వడ్డీకాసుల వాడి ఆస్తులు అమ్మకానికి వచ్చాయంటే, గోవిందా గోవిందా అని అరిచిన ఈ నోరు కొంచెం తడబడింది. భూములు ఎందుకు అమ్ముతున్నారో బోర్డు వివరణ ఇవ్వాలి. ఇంతపెద్ద కొండ మాకు అండగా ఉంది అని, చూస్తూ మురిసిపోయే తిరుపతి వాడిని కాబట్టి అడుగుతున్నాన’ని ట్వీట్ చేశారు.

1 COMMENT

  1. […] ఒకవైపు టీటీడీ భూముల అమ్మకాలు, రాష్ట్రంలో వాయువేగంతో జరుగుతున్న మతమార్పిళ్లపై ఏపీ కమదళాలు సర్కారుపై సమరశంఖం పూరిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే క్రైస్తవీకరణ పెరిగిందని కమలనాధులు, హిందూ సంస్థలు కత్తులు నూరుతున్నాయి. శ్రీవారి భూముల అమ్మకాలపై, కమలదళం కన్నెర్రతోనే సర్కారు హడావిడిగా ఉత్తర్వు జారీ చేసింది. దానితో.. హిందూ దేవాలయ ఆస్తుల పరిరక్షణ, మతమార్పిళ్లకు వ్యతిరేక ఉద్యమాలకు సిద్ధమవుతున్న.. భారతీయ జనతా పార్టీ ఉత్సాహంపై, బీజేపీ ఎంపి సుబ్రమణ్యస్వామి నీళ్లు చల్లడం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు తాము ఏ జగన్ సర్కారుపైనయితే పోరాడుతున్నామో, అదే జగన్‌కు సమర్ధిస్తూ స్వామి చేసిన వ్యాఖ్యలు కమలదళాన్ని ఆత్మరక్షణలోకి నెట్టాయి. ఫలితంగా.. ఇంతకూ స్వామి స్వపక్షమా? లేక విపక్షమా? రెండూ కాక స్వపక్షంలో విపక్షమా? అన్న గందరగోళానికి తెరలేచింది. అయితే పలువురు సీనియర్ నాయకులు మాత్రం ఆయన మాటలు పట్టించుకోవలసిన పనిలేదని, ఆయన అస్త్రం ఎవరిపై ఎప్పుడు ఎలా తిరుగుతుందో ఒక్కో సారి ఆయనే తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు.ఇది కూడా చదవండి.. స్వాములోరు.. మాట్లాడారోచ్! […]