వలస కూలీలను కేంద్రమే ఆదుకుంటోంది

221

 85 శాతం నిధులు కేంద్రానివే
కేంద్ర నిధులకు లెక్కలు చెప్పండి
అన్నీ తీసుకుంటూ ఇవ్వలేదంటారా?
కేసీఆర్ సర్కారుపై బీజేపీ నేత సారంగపాణి, రవిప్రసాద్‌గౌడ్ ఆగ్రహం
రైల్వేస్టేషన్‌లో వలస కూలీలకు ఆహారం సరఫరా

హైదరాబాద్: లాక్‌డౌన్‌లో చిక్కుకున్న వలస కూలీలను కేంద్రప్రభుత్వమే 85 శాతం నిధులు ఖర్చు పెట్టి, వారి ప్రాంతాలకు పంపిస్తోందని బీజేపీ నేతలు స్పష్టం చేశారు. దీనిపై ఎక్కడికయినా చర్చకు సిద్ధమేనని సవాల్ చేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 15 శాతమేనని, దానిని కూడా గ్రాంటు రూపంలో తీసుకుని, ఏమీ ఇవ్వడం లేదనడంపై బీజేపీ నాయకులు మేకల సారంగపాణి, పి.రవిప్రసాద్‌గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లాక్‌డౌన్ ప్రకటించిన తర్వాత, కేంద్రం ఇచ్చిన నిధులపై కేసీఆర్ ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. వలస కూలీలలను ప్రత్యేక రైళ్లలో తరలిస్తున్న సందర్భంగా, బీజేపీ యువ నేత మేకల హర్షకిరణ్ నేతృత్వంలో.. వందలమంది వలస కూలీలకు చపాతి, రొట్టె, మంచినీటి బాటిళ్లను సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో అందించారు. దానికోసం ఏర్పాటుచేసిన వాహనాన్ని మేకల సారంగపాణి-రవిప్రసాద్‌గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు.


ఈ సందర్భంగా సారంగపాణి మాట్లాడుతూ, వలస కార్మికుల విషయంలో నరేంద్రమోదీ చూపిన ప్రత్యేక శ్రద్ధ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చొరవ  కారణంగానే లక్షలాది మంది స్వగ్రామాలకు చేరగలుగుతున్నారని చెప్పారు. బీజేపీ కార్యకర్తలు ఒక్కోరు వందరూపాయల చొప్పున ఇచ్చిన విరాళాల ద్వారా పోగయిన రెండువేల కోట్లలో, వెయ్యి కోట్లు కేవలం వలస కూలీలకే వెచ్చించారని గుర్తు చేశారు. రాష్ట్రానికి నయాపైసా కూడా ఇవ్వలేదన్న మంత్రి కేటీఆర్ ఆరోపణలో నిజం లేదన్నారు. దమ్ముంటే కేంద్రం ఇచ్చిన నిధులపై శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. విపక్షాలను విమర్శిస్తున్న కేసీఆర్, తాను రాష్ట్రానికి ఏం చేశారో ఆలోచించుకోవాలన్నారు.

సికింద్రాబాద్ బీజేపీ ఇన్చార్జి రవిప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ, దూరప్రాంతాలకు వెళుతున్న వలసకూలీలకు ఆహారం అందించడం గొప్ప విషయమని అభినందించారు. కరోనా కాలంలో బాధితులకు సాయం అందివ్వడంలో బీజేపీ ముందుందని చెప్పారు. యువనేత మేకల హర్షకిరణ్  మాట్లాడుతూ, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్ఫూర్తితోనే తాము వలస కూలీలకు ఆహారం అందించామని చెప్పారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్న సేవా కార్యక్రమాలు యువతకు ప్రేరణనిస్తున్నాయన్నారు. తన మిత్రులు సాయిదత్తు, హనుమంతు చేయూతతో, ఈ భారీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. కనకట్ల హరి, శ్రీకాంత్, శ్రావణ్, చారి తదితరులు పాల్గొన్నారు.